Jump to content

బాపుకు బాష్పాంజలి - 1


Mama77

Recommended Posts

bapu1411498781.jpg
 

బాపుగారు నిష్క్రమించిన రోజు నేను గుజరాత్‌లోని ద్వారకలో వున్నాను. సాయంత్రం 5.15కు వరప్రసాద్‌ నుండి 'బాపుగారిని దేవుడు పిలిచాడు. 10 నిమిషాల క్రితం వెళ్లిపోయారు' అని మెసేజ్‌ వచ్చింది. ఇంకో అరగంటకు టీవీల్లో స్క్రోలింగ్‌ వచ్చినట్టుంది. అందరూ ఫోన్‌ చేయసాగారు. బాపు, రమణ కుటుంబసభ్యులు బయటవారికి పెద్దగా తెలియరు కాబట్టి, నాకు తెలిసిన బాపురమణల అభిమానులందరూ నాకే ఫోన్‌ చేయసాగారు. ఆ ఫోన్లు అలా వరసగా వారం రోజులపాటు వస్తూనే వున్నాయి -'బాపుగారు పోగానే మిమ్మల్నే తలచుకున్నామండీ' అంటూ! నేను గుజరాత్‌, రాజస్థాన్‌లలో తిరుగుతున్నాను. సిగ్నల్స్‌ సరిగ్గా అందటం లేదు. పైగా రోమింగ్‌. కానీ అందరితోనూ మాట్లాడాను. బాపురమణలంటే మధ్యతరగతికి ఆరాధ్యులు. ఇద్దరూ వెళ్లిపోయారంటే అనాథల్లా అయిపోయారు అభిమానులు. ఎవరితోనైనా దుఃఖం పంచుకోవాలి. నాకు తెలిసున్నవాళ్లందరూ నాతో మాట్లాడారు. బాపుగారి గురించి ఏమైనా రాయలేదేం? అంటూ యింకా అడుగుతున్నారు. నిజానికి కొసరు కొమ్మచ్చిలో 'అభిమాని ప్రస్థానం'లోనే రమణగారి గురించి రాస్తూనే బాపుగారితో నా పరిచయం గురించి కూడా చాలా రాశాను. 'చాలా చాప్టర్లు రాశారు. ఇలా అయితే ఆ పుస్తకం ఎవరూ కొనరేమో చూడండి' అని ఒక పాఠకుడు హెచ్చరించాడు. '277 పేజీల పుస్తకంలో 33 పేజీల మేటరది. అది చదివి పుస్తకంలో యింతకంటె ఏముంది అనుకుంటారా!? అయినా ఏమౌతుందో చూదాం' అని జవాబిచ్చాను. పుస్తకం విడుదలైన మూడు వారాలకే పునర్ముద్రణకు వచ్చింది. ఆ వ్యాసంలో నేను ప్రస్తావించని విషయాలతో యీ సీరీస్‌ రాస్తున్నాను.

 

 

బాపుగారి మృత్యువు ఆకస్మికం కాదు. గత ఆర్నెల్లుగా ఆయనకు సుస్తీగానే వుంది. తిండి బాగా తగ్గించేశారు, నీరసించారు, రోజులో చాలాసేపు నిద్రపోతూండేవారు. మంచానపట్టి ఎవరిచేతా చేయించుకునే అవసరం పడలేదు కానీ, ఆయన కదలికలు బాగా తగ్గిపోయాయి. ఒక్కో రోజు హుషారుగా వున్నా, మర్నాటికి డీలా పడేవారు. పని చేయలేకపోయేవారు. అది ఆయనను మరింత కృంగదీసింది. ఎన్నో ఏళ్లగా రోజుకి 16 గంటలు పనిచేసే అలవాటు ఆయనది. ఆయన నిస్సత్తువకు కారణం, జీవితేచ్ఛ నశించడం. రమణగారు పోయాక బెంగ పెట్టుకున్నారు. తర్వాత వారి భార్య కూడా కాలం చేశారు. ఇంట్లో పిల్లలున్నా, మానసికంగా ఒంటరి అయిపోయారు. రమణగారు పోయాక అందరూ శ్రీదేవి గారి గురించి వర్రీ అవడం కంటె బాపుగారి గురించే ఎక్కువ వర్రీ అయ్యారు - ఈయనేమై పోతాడో అని. చివరకు అదే నిజమైంది. భార్య పోతే భర్త బెంగపెట్టుకోవడం, భర్త పోతే భార్య బెంగపెట్టుకోవడం, తల్లిపోతే పిల్లలు బెంగపెట్టుకోవడం.. యిలాటివి చూస్తూ వుంటాం. కానీ యిద్దరు స్నేహితుల మధ్య యిలాటి బంధం నాకు తెలిసి ఎక్కడా, ఏ కథలోను, ఏ పురాణంలోను ప్రస్తావించబడలేదు. రమణ లేని లోకంలో వుండాలని లేదండి అని బాపుగారు తరచుగా అంటూ వుండడంతో అందరికీ భయంగానే వుంది. ఆ భయాలు నిజం చేస్తూ బాపు వెళ్లిపోయారు. 

 

 

ఎందుకలా? ఆయనేమీ, అజ్ఞాని కాడు, సహజమైన జననమరణాలను అర్థం చేసుకోలేని అమాయకుడు కాడు, పురాణాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను ఔపోసన పట్టి, సర్వదేవీదేవతా లక్షణాలను ఆకళింపు చేసుకుని గీతల్లో ప్రతిఫలింపచేసిన గీతాకారుడు. రమణగారి మరణాన్ని జీర్ణించుకోలేకపోవడం చిత్రంగా లేదా? బాపు పని రాక్షసుడు. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఉదాహరణకి ఎవరైనా ఏదైనా తైలం రాసుకుని పొద్దున్నే ఎండలో గంటసేపు నిలబడాలి అంటే తుచ తప్పకుండా చేసే వ్యక్తి. రమణగారైతే అలా చేస్తారనుకోను. బద్ధకించేస్తారు. ఆయన సినిమాలు తీస్తూ, రాస్తూ వున్నంత కాలం ఆరోగ్యంగానే వున్నారు. పని తగ్గి, స్థిమితపడినప్పుడే బిపి, సుగర్‌, కొలెస్ట్రాల్‌ మొదలయ్యాయి. ఇబ్బందుల్లో వున్నపుడు ధైర్యంతో ఎదుర్కొనే క్రమంలో అనారోగ్యాన్ని కూడా అదుపులో పెట్టారు. పరిస్థితులు చక్కబడి, తీరిక పెరిగేటప్పటికి శరీరంలో దాగివున్న అనారోగ్యం బయటకు వచ్చింది. నిస్త్రాణగా వుంటోంది అనేవారు కానీ మానసికంగా చురుగ్గా వుండేవారు. జోక్స్‌ వేసేవారు, ప్లాన్లు వేసేవారు, కొత్తకొత్త మాటలు పుట్టిస్తూ వుండేవారు, లైవ్లీగా వుండేవారు. చివరిలో మృత్యువు అనాయాసంగా వచ్చింది. అది ఆయనకు మేలు చేసిందేమో కానీ, ఇంకా రెండు, మూడేళ్లు చులాగ్గా లాగించేస్తారనుకుంటూన్న మనబోటి అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 

 

 

బాపుగారి విషయంలో ఆయన చేసిన విపరీతమైన పని ఆయన శరీరాన్ని అరగదీసేసింది. అనేక గ్రాఫిక్స్‌ వున్న శ్రీరామరాజ్యం వంటి సినిమా ఆ వయసులో ఆయన కాబట్టి చేయగలిగారు. రమణ రాసిన స్క్రిప్టు, ఆయన ఆఖరి సినిమా అనుకుంటూ బాపు ఎంతో కష్టపడి దృశ్యకావ్యంగా తీర్చిదిద్దారు. దాని తర్వాత మరో సినిమా ఏదైనా వచ్చి వుంటే మళ్లీ పనిలో పడేవారేమో, కానీ అలా జరగలేదు. ఆయన పోయిన తర్వాత ఘననివాళులు అర్పించిన చిత్రప్రముఖు లెవ్వరూ ఆయనకి చిన్నదో, పెద్దదో ఏ సినిమా యివ్వలేదు. బాపుగారు తన ముత్యపుచిప్పలోకి ముడుచుకుపోయారు. రమణగారి తల్లి - కక్కిగారంటారు అందరూ - బాపు గురించి అనేవారట 'వాడు ఋషిరా, తపస్సు చేసుకున్నట్టు పని చేసుకుంటూ కూర్చుంటాడు' అని. ఆయన చుట్టూ వల్మీకం కట్టి, ప్రశాంతతకు, పనికి భంగం కలగకుండా చూసుకున్నది - ఆయన భార్య, అంతకంటె ఎక్కువగా రమణగారు. ఎల్‌ఐసి వారి ఎంబ్లమ్‌లోలా 'యోగక్షేమం వహామ్యహం' అన్నట్టు రమణ బయటి ఒత్తిళ్లనుండి బాపును కాపాడుతూనే వచ్చారు. ఆ చేతులు మాయమై పోవడంతో, ఆ గొడుగు ఎగిరిపోవడంతో బాపు ఎగ్జిబిషన్‌లో తప్పిపోయిన కుర్రాడిలా అయిపోయారు. 80 ఏళ్ల వయసున్న పెద్దమనిషి అలా అయిపోతాడా అనిపిస్తుంది కానీ జరిగింది అదే! బాపుగారే ముందు పోయి వుంటే రమణగారి పరిస్థితి ఎలా వుండేది అని వూహిస్తే... యిలా వుండేది కాదు అని నాకు అనిపిస్తుంది. ఇది వ్యక్తిగత అభిప్రాయం. వారిద్దరి మధ్య సమీకరణం దగ్గర్నుండి చూసినవారే సరైన సమాధానం వూహించగలరు. నేను వారిని ఎరిగినది గత 20 ఏళ్లుగా మాత్రమే! అయినా వారి జీవితాలు స్టడీ చేశాను కాబట్టి కొన్ని పరిశీలనలు చేస్తున్నాను. (సశేషం) 

 

 

 

- See more at: http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bapu-ku-bashpanjali-55904.html#sthash.oTeQMBVp.dpuf

Link to comment
Share on other sites

బాపుకు బాష్పాంజలి - 2

 

 

 

bapu1411552612.jpg

రమణగారితో పరిచయమైన చాలా రోజులకు గాని, బాపుగారితో ప్రత్యక్ష పరిచయం ఏర్పడలేదు. ''బొమ్మా-బొరుసూ'' పుస్తకం సంకలనం చేస్తూ ఫుట్‌నోట్స్‌లో వాడుకోవడానికి బాపుగారి వివరాలు సేకరిస్తే బాగుంటుందనిపించి, డైరక్టుగా యింటర్వ్యూ చేయడానికి ధైర్యం చాలక, 1995 ఏప్రిల్‌లో లిఖితపూర్వకంగా ప్రశ్నావళి పంపాను. వారం తిరక్కుండా జవాబులు రాసి పంపారు. వ్యక్తిగతమైన  ప్రశ్నల విభాగంలో 6 వ ప్రశ్నగా - ''మీరు ''సీతాకళ్యాణం'' ఎవార్డుకై విదేశాలు వెళ్లినపుడు రమణగారి కాళ్లకు నమస్కారం పెట్టారని చదివాను. నిజమేనా?'' అనీ, ''మీ రెండో అబ్బాయి పేరు వెంకటరమణ, అది మీ మావగారి పేరా? రమణగారి పేరా?'' అనీ అడిగాను. బాపు-రమణలు స్నేహితులు కాబట్టి యిద్దరూ ఒకరితో ఒకరు సమానస్థాయిలో వ్యవహరించుకుంటారని అనుకుంటాం. కానీ ఒకరి కాళ్లకు మరొకరు దణ్ణం పెట్టడం లేదా పిల్లలకు పేరు పెట్టడం విడ్డూరంగా తోస్తుంది. అందుకే ఆ ప్రశ్న. దానికి సమాధానంగా బాపు - 'గౌరవం చూపడంలో ఆశ్చర్యం ఏవుంది? కాళ్లు పట్టుకుని లాగెయ్యలేదు కదా!' అని చెప్తూ 'మా అబ్బాయి పేరు రమణగారి పేరే పెట్టుకున్నాము' అని క్లారిఫై చేశారు. రమణ అంటే బాపుకి ఎప్పుడూ మహాగౌరవం. వాళ్లల్లో వాళ్లు ఎంతైనా వాదించుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు కానీ రమణ మీద బాపు యీగ వాలనివ్వరు. ఆయన ఏం చేసినా కరెక్టే అనేవారు. బాపుని విమర్శిస్తూ రమణగారి దగ్గర మాట్లాడినా ఫర్వాలేదు, ఆయన వింటారు, కానీ రమణగారిని బాపుగారి దగ్గర విమర్శిస్తే అస్సలు ఒప్పుకోరు. 

బాపుగారు చాలా ఎమోషనల్‌. ఆగ్రహానుగ్రహాలు చాలా తీవ్రంగా వ్యక్తపరుస్తారు. ఆయనకి నేనంటే అమిత యిష్టం. నన్ను ఆప్తమిత్రుడిగా భావించేవారు.

 

నిజానికి నేను బాపుగారికి చేసిన సహాయం ఏమీ లేదు, ఆయన బొమ్మలు సేకరించి పెట్టడం కానీ, మరోటి గానీ ఏమీ చేయలేదు. నేను రమణగారి కోసం చేసినదానికే బాపుకి నేనంటే గౌరవం, వాత్సల్యం కలిగాయి. రమణకు ఏదైనా మంచి చేస్తే తనకు చేసినట్లే ఆయన భావన. కొసరు కొమ్మచ్చిలో నా 'అభిమాని ప్రస్థానం' చదివి ''రమణగారి గురించి మీ విశ్లేషణ అత్యద్భుతంగా వుంది. రమణగారన్నట్లు తను చాలా అదృష్టవంతుడు. మీ, వరప్రసాద్‌ గార్ల స్నేహం దొరకడం మాకు దేవుడిచ్చిన వరం.'' అని రాశారు. ఇలాటి మాటలకు మించిన ఎవార్డు వేరే వుంటుందా? ఇదేదో సభావేదికపై మెచ్చుకోలుకి చెప్పిన మాటలు కావు. వ్యక్తిగతంగా రాసిన ఉత్తరాలు. రచనలు కానీ, వ్యక్తులు కానీ నచ్చితే  విపరీతంగా నచ్చేస్తారు. బాపుగారికి, రమణగారికి పి జి ఉడ్‌హవుస్‌ అంటే ప్రాణం. నాకూ చాలా యిష్టం. ''రచన''లో ప్రచురించబడిన నా ఉడ్‌హవుస్‌ తరహా హాస్యకథలు ''అచలపతి కథలు''కు లోగో బాపుగారే వేసిపెట్టారు. పుస్తకరూపంలో తెచ్చినపుడు దాన్నే ముఖచిత్రంగా వాడుకున్నాను. ''హాసం'' ప్రారంభించినపుడు ''బాపురమణీయం'' అనే శీర్షిక ద్వారా వారి గురించి కబుర్లు చెపుతూనే, ''ఉడ్‌హవుస్‌ కార్నర్‌'' అనే పేరుతో మరో శీర్షిక నడుపుతూ దానిలో ఉడ్‌హవుస్‌ కథల స్వేచ్ఛానువాదాలు రాసేవాణ్ని. అవి బాపుగారికి విపరీతంగా నచ్చాయి. ''మీ పిజిడబ్ల్యు అనువాదం అద్భుతంగా వుంది. రమణగారిది తరువాత అంత చక్కటి అనువాదం నేను చదవలేదు.' అని కితాబు యిచ్చారు. 

 

 

నేను మేనేజింగ్‌ ఎడిటర్‌గా ''హాసం'' పత్రిక తొలి సంచిక అక్టోబరు 2001లో వెలువడింది. బాపుగారికి తెగ నచ్చేసింది. కనబడిన అందరికీ చదవమని చెప్పేవారు. ఆ వూపు చూసి 'హిందూస్తానీ, కర్ణాటక సంగీతకారులతో మీ అనుభవాలు రాసి పంపండి.'' అని కోరాను. డిసెంబరులో ఆరుపేజీల వ్యాసం రాసి పంపుతూ ఫుట్‌నోట్‌లో 'మీరడిగినట్లు నా అనుభవాలు కొన్ని రాశాను. ఫ్యాక్ట్‌ చెడకుండా మీ 'ఇనిమిటబుల్‌ స్టయిల్‌'లో మీ వీలు కొద్దీ తిరగరాయచ్చు...' అని వెసులుబాటు యిచ్చారు. నేను దాన్ని వుపయోగించుకోలేదు. వ్యాసాన్ని యథాతథంగానే వాడుకున్నాం. బాపు రాసినది మనం తిరగరాయగలమా? కానీ రాయండి అని ఆయనే అనడం ఆయన అభిమానానికి నిదర్శనం. ఇలాటివి మాత్రమే చెప్పి ఆయన నాపై ప్రదర్శించిన కోపతాపాల గురించి చెప్పకపోతే అసంపూర్ణంగానే వుంటుంది. ఆ సందర్భం గురించి తర్వాత చెప్తాను. ప్రస్తుతం బాపుగారిలో వున్న పసిబాలుణ్ని గురించి చెపుతున్నా.  'రోదా' (ఇంగ్లీషు స్పెల్లింగ్‌లో రోడిన్‌ అని వుంటుంది) అనే ఫ్రెంచ్‌ శిల్పి చెక్కిన శిల్పాలు పారిస్‌లో అతని కోసం ప్రత్యేకంగా కట్టిన మ్యూజియంలో మాత్రమే ప్రదర్శనకు పెట్టారు. ''థింకర్‌'' అనే ప్రఖ్యాత శిల్పాన్ని ఆ మ్యూజియం ఆవరణలో పెట్టారు. 1984లో అనుకుంటా, ప్రపంచ కళాప్రియుల కోరికపై ఆయన శిల్పాలు కొన్నిటిని ప్రపంచమంతా అనేక నగరాలకు తీసుకెళ్లారు. ఇండియాలో కలకత్తాను మాత్రమే ఎంచుకున్నారు. నేను ఆ ప్రదర్శన చూసి ముగ్ధుణ్నయిపోయాను. ఓ సారి బాపుగారితో మాటల్లో చెపితే 'ఆ ప్రదర్శన చూసినందుకు మీ కాళ్లకు దణ్ణం పెట్టాలి' అన్నారాయన. మీరైనా నేనైనా అయితే 'అది చూడడం మీ అదృష్టం' అని వూరుకునేవాళ్లం. విఎకె రంగారావుగారి నోట అలాటి కాంప్లిమెంటు వస్తే 'అసలు నీకేం అర్థమౌతుందని వెళ్లావు నాయనా అంటూ యీయన మనల్ని వెక్కిరిస్తున్నాడ్రా' అనుకుంటాం. కానీ బాపు సిన్సియర్‌గానే అంటారు. 

 

 

'ఇవాళ మీ ఫలానా కార్టూన్‌ బాగా వచ్చిందండి, 'మీరు కొత్తగా వేసిన దుర్గాబాయమ్మ బొమ్మ అద్భుతంగా కుదిరిందండి, దానిలో ఆవిడ దృఢచిత్తం, దీనుల పట్ల వాత్సల్యం రెండూ గోచరిస్తున్నాయి' అని చెప్తే 'చాలా థాంక్సండీ, యూ మేడ్‌ మై డే' అనేవారు. ఇంత గొప్పగా బొమ్మలేసే ఆయనకు అది బాగా వచ్చిందని తెలియదా? మనం బాగుందంటే మాత్రం మనకు థాంక్స్‌ ఎందుకు చెప్పడం? అదే అడిగితే 'ఇలా ఎవరు చెప్తారండి? చెప్పినా సిన్సియర్‌గా చెప్పారో, మెచ్చికోలుకు చెప్పారో తెలియదు కదా' అనేవారు అమాయకంగా. ఓ సారి ఉషాకిరణ్‌ గెస్ట్‌హౌస్‌లో ఆయన దిగితే రిసెప్షన్‌ వద్దకు వెళ్లి 'ఫలానా ఎమ్బీయస్‌ ప్రసాద్‌ వచ్చాడని చెప్పండి, రమ్మంటే వెళతా' అన్నాను. అతను వెళ్లి చెప్పగానే బాపుగారు బయటకు స్వయంగా వచ్చి 'మీరు నేరుగా రూములోకి వచ్చేయకుండా రిసెప్షన్‌లో అడగడమేమిటి' అంటూ కోప్పడ్డారు. 'అదేమిటండి, మీ వీలూ, సాలూ చూడాలి కదా, వేరే ఎవరైనా వుంటే వెయిట్‌ చేయాలికదా' అంటే వినరే! మొహం కందగడ్డలా చేసుకుని 'ఇలా ఎప్పుడూ చేయకండి, నాకున్న ఫ్రెండ్సే తక్కువ. వాళ్లలో మీరొకరు. ఇలా ఫార్మాలిటీస్‌ పెట్టుకోకండి' అంటూ చివాట్లు వేశారు. ఎంత అభిమానం వుంటే మాత్రం మరీ అంత చనువు తీసుకోగలమా? అది లౌకిక వ్యవహారం కాదు కదా! కానీ బాపుకి అది పట్టదు. అసలాయన లౌక్యం కాదు కదా, లౌకిక వ్యవహారాలే తెలియవు. మరి అలాటాయన యిన్ని మహత్కార్యాలు ఎలా చేయగలిగాడు? సినిమాలు ఎలా తీయగలిగాడు? అంటే అవన్నీ రమణగారు చూసుకున్నారు. రమణగారున్నంతకాలం బాపు కేరాఫ్‌ రమణగానే వున్నారంటే అతిశయోక్తి కాదు. అలా ఎందుకు జరిగింది? బాపుది ఆర్థికంగా మెరుగైన కుటుంబం. రమణ కంటె ఎక్కువ చదువుకున్నారు. చదువు పూర్తయ్యేవరకు తండ్రి బతికే వున్నారు. రమణ బాల్యమంతా కష్టాలమయం. చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ, మానేస్తూ ఒక విధమైన అరాచకంగా జీవితం గడిపిన మనిషి. ఆయన యీయనకు చుక్కాని కావడమేమిటి? (సశేషం) 

 

Link to comment
Share on other sites

బాపుకు బాష్పాంజలి - 3

 

 

 

Ramana%20leading%20Bapu1411584029.jpg
 

బాపు, రమణ హైస్కూలు రోజుల నుండే స్నేహితులు. ఇద్దరూ కలిసి తిరిగేవారు, సినిమాలు చూసేవారు. కానీ రమణ కష్టాలు రమణవే, నిరుద్యోగంతో బాధపడుతూ, జీవితం తినిపిస్తున్న ఢక్కామొక్కీలు తింటూ, కాలం నెట్టుకొస్తున్న యువకుడు. బాపు తండ్రి చాటు బిడ్డ, బుద్ధిగా చదువుకునే బుద్ధిమంతుడు. రమణతో కలిసి తిరిగి చెడిపోతాడేమోనని బాపు తండ్రి బెంబేలు పడేవారు. రమణను మందలిస్తూ వుండేవారు. ఈ పరిస్థితుల్లో ఆయన పోయారు, కొద్దిరోజులకే బాపు అన్నగారు కూడా పోయారు. ఒక్కసారిగా బాపు యింటికి పెద్ద అయిపోయాడు. ఆ సమయంలో రమణలో హఠాత్తుగా పెద్దరికం ముందుకు వచ్చింది. వ్యవహారదక్షత వెలికి వచ్చింది. బాపు కుటుంబానికి పెద్దకొడుకై పోయి, ఆ యింటి వ్యవహారాలు చక్కదిద్దసాగారు. బాపు తల్లి ఆయన మాటకు విలువ యిచ్చేది. జీవితం నేర్పిన లోకజ్ఞానం, నలుగురితో మాట్లాడే నైపుణ్యం, ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా చేయడం - యీ గుణాలతో రమణ తక్కిన అందరికీ మార్గనిర్దేశనం చేయగలిగారు. 

 

 

అంతే బాపు, రమణ చొక్కా అంచు పట్టుకుని వెనక నడిచారు. కోతికొమ్మచ్చి సీరీస్‌ ముఖచిత్రాలన్నిటిలోనూ బాపు దీన్నే ప్రదర్శించారు చూడండి.  రమణ మార్గదర్శకత్వంలో నడుస్తున్నట్లే తనను తాను చూపుకున్నారు బాపు. సినీరమణీయం తయారుచేసే టైములో రమణగారి యింటికి వెళ్లి వాళ్ల ఆల్బమ్‌లు వెతికాను. ఒక ఫోటో దొరికింది. రమణ చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి ముందుకు చూస్తున్నారు, వెనక్కాల బాపు కూడా నిలబడి అటే చూస్తున్నారు. కెమెరా యాంగిల్‌ కారణంగా రమణ పొడుగ్గా, లీడర్‌లా కనబడుతున్నారు. నాకు చాలా బాగా నచ్చి, ఆ పుస్తకంలో వాడాను. 'ముందు రమణ, వెనుక బాపు' అని కాప్షన్‌ పెట్టాను. రమణగారు వద్దన్నారు. 'మీరే కదా సినిమాల్లోకి ముందు వెళ్లినది, తర్వాతే బాపు' అని చెప్పబోయాను. 'అది నిజమే కదా, యీ కాప్షన్‌ వలన వేరే అర్థం వస్తుంది, వద్దు, సింపుల్‌గా రమణ, బాపు అని పెట్టేయండి.' అన్నారు రమణ. అలాగే చేశాను. ఆ ఫోటోలో రమణ హీరోయిక్‌గా, ఏమొచ్చినా తట్టుకుంటాం అన్నట్టు నిలబడి వుంటారు. బాపు బేలగా ఏమీ వుండరు. రమణ చూసేవైపే చూస్తూ వుంటారంతే. ఆయన శక్తి ఆయనకుంది. కానీ అంతా రమణ గైడెన్సులోనే అనే భావం స్ఫురిస్తుంది. 

 

 

అసలు ''సాక్షి'' మొదలుపెట్టినపుడు దర్శకత్వం ఎవరు చేయాలన్నది నిశ్చయించుకోలేదట. ఇలస్ట్రేటర్‌గా బాపు ఫ్రేమింగ్‌ అద్భుతంగా వుంటుంది కాబట్టి బాపు డైరక్టు చేస్తే మంచిది అనే సూచన సీతారాముడుగారు చేస్తే అప్పుడు అందరూ ఆమోదించారట. ఆ వైనమంతా ''కొసరు కొమ్మచ్చి''లో సీతారాముడుగారు రాశారు. బాపు డైరక్షన్‌ మీద దృష్టి కేంద్రీకరిస్తే రమణే ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణావ్యవహారాలు అన్నీ చూసుకునేవారు. వాళ్ల ఫిలిం కంపెనీ సంగతులే కాదు, యింటి వ్యవహారాలలో కూడా రమణదే అజమాయిషీ. ఆయనను బాపు పెద్దన్నగారిలా చూస్తే బాపుగారి భార్య తమ్ముళ్లా చూసేది. ఇంట్లో ఏం కావలసివచ్చినా ఆయనకే చెప్పేదని రమణగారమ్మాయి ''కొసరు కొమ్మచ్చి''లో రాశారు. రెండు కుటుంబాలలో పిల్లలకు, పెద్దలకు, అతిథులకు ఎవరికి ఏం కావలసి వచ్చినా, ఏ ఫంక్షన్‌ చేయాలన్నా అన్నిటికీ కేరాఫ్‌ రమణే. దాంతో బాపుకి లోకం తీరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం పడలేదు. బొమ్మలేసుకోవడం, సినిమాలు డైరక్టు చేసుకోవడం. అంతే..! 

 

వాళ్లు తీసిన సినిమాల్లో యిద్దరికీ భాగస్వామ్యం వున్నా, బాపుకి దేనికి ఎంత డబ్బు వచ్చిందన్న విషయంపై పూర్తి అవగాహన లేదు. 'నామీదే నర్రోయ్‌' అంటూ తన సినిమాలపై తనే వేసుకున్న సెటైర్లలో ''కృష్ణావతారం'' ఫ్లాప్‌ అని వేసుకున్నారు. ''కాదు, హిట్టయింది, అతనికి తెలియదు'' అంటారు రమణ. సరిగ్గా చెప్పాలంటే రిస్కంటే భయపడని ఎంటర్‌ప్రెనార్‌ రమణ. రిస్కులు తీసుకోకుండా సజావుగా నడిచిపోతే చాలనుకునే ఉద్యోగి స్వభావం బాపుది. నిర్మాతగా బాపు తీసుకున్న రిస్కులు రమణతో కలిసి తీసుకున్నవే. సినిమా జయాపజయాల మాట ఎలా వున్నా చిత్రకారుడిగా ఆయనకు ఆదాయం నిరంతరంగా వస్తూనే వుంది. అందుకే ఒడిదుడుకులు లేకుండా గడిచిపోయింది. ఆర్థికంగా స్థిరపడ్డాక కూడా రమణ రిస్కులు తీసుకుని యిబ్బందుల్లో పడ్డారు. నిర్వహణకనే కాదు, అనేక విషయాలలో బాపు రమణపై ఎమోషనల్‌గా ఆధారపడ్డారు. ఆయన ప్రపంచాన్నంతా రమణ ద్వారానే చూసేవారు. మనం  బాపుగారితో డైరక్టుగా అన్నీ చెప్పనక్కరలేదు. రమణగారితో చెపితే చాలు, అది ఆయనకు చేరిపోతుంది. ఇద్దరికీ ఫ్రెండ్స్‌ కామన్‌. బాపురమణలు ఎవర్నీ దగ్గరకు రానీయరని, వాళ్లిద్దరే కలిసి తిరుగుతారు తప్ప ఎవరైనా దగ్గరకి వస్తే కరుస్తారని చెప్పుకునేది అబద్ధం. వాళ్లకి అన్ని రంగాలలో, అన్ని స్థాయిలలో స్నేహితులున్నారు. ప్రభుత్వోద్యోగులు, వ్యాపారస్తులు, కళాకారులు.. యిలా చాలామంది వున్నారు. వీళ్లంతా వందిమాగధులు కారు. 

 

 

నేను రమణ గారింటికి వెళ్లిన కొత్తలో వరాను అడిగాను - ''మీ నాన్నగారి సినిమా రిలీజయ్యాక బాగుందో బాగోలేదో మీకెలా తెలుస్తుంది? మద్రాసులో వుంటారు కదా'' అని. ''నాన్నగారి స్నేహితులు అన్ని వూళ్లల్లో వున్నారు కదండీ, వాళ్లే ఫోన్‌ చేసి చెప్పేస్తారు.'' అన్నాడతను. సినిమాల గురించి, తన రచనల గురించి నిరంతరం రమణ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూనే వుంటారు. ''ఈ వారం కోతికొమ్మచ్చి గురించి ఫలానావాళ్లు యిలా విమర్శించారండీ'' అని రమణ ఫోన్‌ చేసి నాకు చెప్పేవారు. ఇలాటి స్నేహాలు మేన్‌టేన్‌ చేయడం వలనే వాళ్లెప్పుడూ పొగడ్తల అగడ్తలో పడలేదు. మనందరికీ ఎంతమంది స్నేహితులున్నా, అత్యంత సన్నిహితులు కొందరే వుంటారు కదా. అలాగే వాళ్లకు క్లోజ్‌ సర్కిల్‌ ఒకటి వుంది. అలాగే మితభాషిత్వం. అవతలివాళ్లతో స్నేహం కుదిరితే ఎంతైనా మాట్లాడతారు. ఊరికే ముఖస్తుతి కబుర్లు చెపుతూ వుంటే మాట తప్పించేస్తారు. రమణ పోయిన తర్వాత యీ స్నేహితులంతా ఏమయ్యారు, బాపుతో మాట్లాడుతూ ఆయన్ని యాక్టివ్‌గా వుంచవచ్చు కదాన్న సందేహం వస్తుంది. (సశేషం) 

 

 

Link to comment
Share on other sites

బాపుకు బాష్పాంజలి - 4

 

 

 

 

bapu1412002427.jpg

జరిగిందేమిటంటే బాపుగారికి మూడ్‌ స్వింగ్‌ ఎక్కువ. ఫోన్‌లో మాట్లాడడం తక్కువ. ఏదైనా పని వుంటే తప్ప ఫోన్‌ చేయరు. చేసినా అవసరమైనంత వరకే మాట్లాడతారు. రమణగారైతే పనేమీ లేకపోయినా వూరికే ఫోన్‌ చేసి 'ఎలా వున్నారండీ?' అంటూ కబుర్లు చెప్తారు. పైగా ఆయన లోకవ్యవహారం తెలిసిన మనిషి. అందువలన అందరూ రమణగారితోనే ఫ్రీగా మాట్లాడేవారు. బాపు వలన కావలసిన పనికి కూడా రమణగారికే పురమాయించేవారు. ఒక్కోప్పుడు రమణగారికి చికాకేసేది - 'నేనేమైనా అతనికి సెక్రటరీనా? ఏదైనా బొమ్మ కావలిస్తే అతనికే డైరక్టుగా ఉత్తరం రాయండి. నచ్చితే వేస్తాడు, లేకపోతే కుదరదని చెప్తాడు. మధ్యలో నాకెందుకు చెప్పడం?' అనేవారు. '..అంటే ఆయనకు ఎంతివ్వాలో కనుక్కుని చెప్తారని... కొన్నిటికి డబ్బు యిస్తానంటే బాపుకి కోపం వచ్చి తిడతారట కదా..' అంటూ నసిగేవారు యివతలివాళ్లు. బాపుకి డబ్బు అక్కరలేదన్న ప్రచారం ఒకటి బాగా వుండేది. అందువలన బతిమాలి బొమ్మ వేయించుకున్నవాళ్లు కూడా డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఎగ్గొట్టేవారు. ఈయన రొక్కించి అడగలేకపోయేవారు. కొన్ని వాటికి ఆయన డబ్బు పుచ్చుకోని సందర్భాలూ వున్నాయి. అంతమాత్రం చేత మనం ఆఫర్‌ చేయకుండా వుండకూడదు కదా! స్వీకరించాలో లేదో ఆయనకు వదిలేయాలి. 'బొమ్మలేయడం బాపుకి వృత్తి కదా. దానికి డబ్బు పుచ్చుకోకపోతే అతనికి మాత్రం ఆదాయం ఎలా?' అని రమణ తనకు ఫోన్‌ చేసిన వారితో వాదించేవారు. 

 

 

చెప్పవచ్చేదేమిటంటే - అందరూ రమణగారితో మాట్లాడేవారు, అవన్నీ రమణ బాపుగారికి చేరవేసేవారు. మనం చెప్పినదానికి బాపు కస్సుమన్నా, బుస్సుమన్నా, సంతోషించినా రమణగారి ద్వారా ఫిల్టరయ్యి మనకు చేరేది. రమణ పోవడంతో బాపు ప్రపంచపు కిటికీ మూసుకు పోయినట్టయింది. ఆయనతో డైరక్టుగా మాట్లాడేవారు ముందునుండీ పెద్దగా లేరు, యిప్పుడు యింకా తగ్గిపోయారు. ఆయన ఏకాకి అయిపోయారు. నేను యీ ప్రమాదాన్ని అప్పుడే వూహించాను. రమణగారు పోగానే బాపుగారితో యీ విషయాలన్నీ నేరుగా చెప్పాను. ''దీనికి పరిష్కారం మీరు హైదరాబాదుకి షిఫ్ట్‌ అయిపోండి. నాబోటిగాళ్లం పది రోజులకో, పదిహేను రోజులకో ఓ సారి వచ్చి ఓ గంటసేపు కబుర్లు చెప్పి పోతూ వుంటాం. వంతుల వారీగా వస్తూంటాం కాబట్టి, రోజుకి రెండు మూడు గంటలపాటు లోకాభిరామాయణంతో సరిపోతుంది. ఆ డోస్‌ చాలు, తక్కిన టైములో మీరు ఎలాగూ ఏదో పని చేసుకుంటూ వుంటారు.'' అన్నాను. ఆయన ఆలోచిస్తామన్నారు కానీ, దాన్ని అమలు చేయలేదు. చేసి వుంటే యింకో రెండేళ్లు కచ్చితంగా బతికేవారని చెప్తాను. చిన్నప్పటినుండి వారు మద్రాసువాసులే. కూతురు, చిన్నకొడుకు, తమ్ముడు.. అందరూ అక్కడే వున్నారు. తరలిరావడం అంటే బృహత్ప్రయత్నం. రమణగారు బతికి వుండగా దానికి పూనుకుని వుంటే బాపుగారు ఆయన వెనక్కాలే వచ్చేసి వుండేవారు. రమణగారు జీవించి వుండగా యీ విషయమై ఆలోచించి వదిలిపెట్టేశారు. ప్రాక్టికల్‌ ప్రాబ్లెమ్స్‌ ఏవో వుండి వుండవచ్చు. 

 

 

బాపుగారు జీనియస్‌. బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే ఆయన అనేకవాటికి రమణగారిపై ఆధారపడ్డారన్నది నికార్సయిన నిజం. దానివలన ఆయన మరింత ప్రకాశించారన్నది కూడా వాస్తవమే. మనందరికీ తలిదండ్రులు, ఉంటే పెద్దన్నయ్యలు, గురువులు ఎవరో వుంటూనే వుంటారు. క్రమేపీ వాళ్లు లేకపోయినా మనం సొంతంగా నిలదొక్కుకునే థకు ఎమోషనల్‌గా చేరుకుంటాం. కానీ బాపు అంతటి మహానుభావుడు ఆ థకు చేరుకోలేదు. రమణగారు పోయాక 'ఇక్కడ యింకేం చేస్తాం? వెళ్లిపోతే సరి' అనే ఫీలింగు తెచ్చేసుకున్నారు. ఎవరైనా ఏదైనా చేద్దామని ప్రతిపాదించినా 'బ్రహ్మ లేడుగా' అనేవారు. రమణగారు ఏదైనా గాలిలోంచి బ్రహ్మలా సృష్టిస్తే తాను దానికి మెరుగులు దిద్దగలనని, ఆయన రాయకపోతే తను మాత్రం ఏం చేయగలనని బాపు అభిప్రాయం. అందుచేత రమణగారికి ఏదైనా ఐడియా వచ్చేదాకా ఓపిక పట్టేవారు. ఇద్దరికి నచ్చాక స్క్రిప్టు తయారయ్యాక యిక బాపు దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్లిపోయి రమణగారినే అబ్బురపరిచేవారు. అందుకే వాళ్లిద్దరి మధ్య పరస్పరగౌరవం అలా నిలిచిపోయింది. ''మీకు పద్మ అవార్డులు రాకపోవడం అన్యాయమండి, కనీసం పద్మభూషణ్‌ నుండైనా మొదలుపెట్టాలి'' అని రమణగారితో అంటే 'నాకు రాకపోయినా ఫర్వాలేదండి, నేను రచయితను మాత్రమే. బాపుకి తప్పకుండా రావాలి. అతను చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేరు.'' అనేవారాయన. తెలుగుభాష వున్నంతకాలం రమణ రచనలు వుంటాని చెపితే అది కొంచెం అతిశయోక్తిగా తోస్తుంది కానీ తెలుగు లిపి వున్నంతకాలం బాపు సజీవంగా వుంటాడని చెపితే మాత్రం ఎవరూ ఖండించలేరు. గుండ్రటి అక్షరాలలో తెలుగు రాయడం వెయ్యేళ్లుగా వస్తున్నా ఒక్క బాపు వచ్చి, వంకర టింకరగా రాసి, దాన్నే ఫ్యాషన్‌ చేసి పడేశారు. ఇప్పటికి హెడింగ్‌ పెట్టాలంటే బాపు స్క్రిప్టే వాడుతున్నాం. 

 

''ఇస్తే మీ యిద్దరికీ కలిపే యిస్తారండి. మేం అరటిక్కెట్టు గాళ్లమని మీరే అంటూంటారుగా, పద్మ ఒకరికి, భూషణ్‌ మరొకరికీ యిస్తారేమో' అని జోక్‌ చేసేవాణ్ని రమణగారితో. అర టిక్కెట్టు విషయమేమిటంటే - సాధారణంగా వాళ్లిద్దరికీ కలిపే సన్మానాలు చేసేవారు. ఇద్దరినీ కలిపే సభలకు పిలిచేవారు. తక్కిన సన్మానితులందరికీ పదేసి వేల చొప్పున పర్స్‌ యిస్తే బాపురమణలకు మాత్రం చెరో ఐదువేలు చేతిలో పెట్టేవారు. ఇద్దరూ విడివిడిగా ప్రతిభావంతులైనా ఇద్దరికి కలిపి ఒక టిక్కెట్టు కింద లెక్కేసి, సగం-సగం యిచ్చేవారు. చివరకు రమణగారికి ఏ పద్మ అవార్డూ రాలేదు. ఆయన పోయాక బాపుకి పద్మశ్రీ యిచ్చి సరిపెట్టారు. ఇప్పుడు చనిపోయాక ఏకంగా పద్మవిభూషణ్‌కు సిఫార్సు చేశారట. రమణగారు చేసిన ''ప్యాసా'' సినిమా (ఒక కవిని బతికుండగా యీసడించిన సమాజం అతను చనిపోయాడనుకుని ఆకాశానికి ఎత్తేస్తుంది. అతని సంతాపసభకు అతనే హాజరైతే యీడ్చి అవతల పారేస్తారు) సమీక్షకు బొమ్మ వేస్తూ ఒక కవి విగ్రహం వేశారు. దానికి చారెడు కళ్లుంటాయి. 'చచ్చినవాళ్ల కళ్లు చారెడు' అంటాం కదా! బాపు విషయంలో కూడా అదే నిజమైంది. ఈ రోజు పద్మవిభూషణ్‌ ప్రతిపాదిస్తున్న చంద్రబాబు పదేళ్లు ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన ముఖ్య భూమిక వహించిన ఎన్టీయార్‌ టిడిపి ప్రభుత్వం ఆరేళ్లు నడిచింది. అప్పుడు కనీసం పద్మశ్రీ కూడా యిప్పించలేదు. ఇప్పుడు ఏవేవో చెప్తున్నారు. ఏం చేసినా చూడడానికి వాళ్లు లేరు కదా. వాళ్లెప్పుడూ వీటి గురించి ఆశపడలేదు రాకపోతే నిరాశ పడలేదు, కానీ బాపుకి వస్తే బాగుండునని రమణ, రమణకు వస్తే బాగుండునని బాపు అనుకునేవారు. (సశేషం) 

 

- See more at: http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bapu-ku-bashpanjali-56042.html#sthash.rlVZqoxO.dpuf

Link to comment
Share on other sites

బాపుకు బాష్పాంజలి - 5

 

 

 

బాపు తను వేసిన బొమ్మలన్నీ రమణకు చూపించేవారు. రమణ తను రాసినదల్లా బాపుకి చూపించేవారు. సినిమాలైతే కలిసే తీశారు. ఈ సినిమా లేదా యీ సీను యింత బాగా ఎలా తీయగలిగారని బాపుని అడగండి, 'నాదేం లేదండి, ఆ ఘనతంతా రమణగారి స్క్రిప్టుదే' అనేస్తారు. ప్రతీ ప్రశ్నకూ అదే సమాధానం. వాళ్ల సినిమాల సంగీతం విషయంలో బాపుగారి భూమిక ఎక్కువని తెలుసు కాబట్టి ఆ విషయంపై సమాచారం తరచితరచి అడగగా తన సంగీతాభిరుచులపై ''హాసం''కు రాసి పంపారు. అంతా రమణే చేశాడని బాపు చెప్పినా, స్క్రిప్టు రాసి యివ్వడం, ఆ తర్వాత నిర్మాణవ్యవహారాలు చూడడం రమణ బాధ్యత. ఆ తర్వాత బాపుగారు సొంతం చేసుకునేవారు. డైరక్షనంతా బాపుగారిదే. దానిలో రమణ వేలు పెట్టేవారు కాదుట. తర్వాత సమీక్షించుకోవడాలు ఎలాగూ వుంటాయి. ''సాక్షి'' సినిమా మనందరికీ నచ్చినా బాపుగారికి నచ్చలేదు. ''రమణ స్క్రిప్టుకి న్యాయం చేయలేదు'' అని ఫీలయ్యేవారు. సినిమాలు బాగా ఆడినపుడు అది నా వలన ఆడింది అని, పోయినపుడు అవతల వాళ్ల వలన పోయింది అని వాళ్లిద్దరు ఎప్పుడూ అనుకోలేదు. ''కోతికొమ్మచ్చి'' నిండా 'మేం..' అనే కనబడుతుంది. అందుకే అది 'బాపురమణీయం' అయింది, ఒట్టి రమణగాథగా లేదు.

 

ఎవరు ప్రతిపాదించినా ఫైనల్‌గా వాళ్లవి ఉమ్మడి నిర్ణయాలే, వాటి ఫలితాలు కూడా ఉమ్మడిగా అనుభవించారు.  వాళ్లిద్దరి అభిరుచులు దాదాపు సమానమైనా, తేడాలు కూడా వున్నాయి. రమణగారికి ఏదైనా చదవమని సూచించినా, యిచ్చినా తన అభిప్రాయం చెప్పేవారు, బాపు అభిప్రాయం కూడా చెప్పేవారు. స్వాతిలో బహుమతి గెల్చుకున్న 'నాగాభరణం' అనే నా కథ బాపుగారికి చాలా చాలా నచ్చేసింది. చదువు అని రమణగారికి చెప్తే ఆయన తాత్సారం చేశారు. ఒకటికి రెండుసార్లు చెప్పి చదివించారు. అప్పుడు రమణగారికీ బాగా నచ్చింది. నాకు ఫోన్‌ చేసి యీ వివరాలు చెప్పారు. ఇలా నిరంతరం వాళ్లు ఒకరికొకరు అన్ని రకాల సమాచారాలూ ఫీడ్‌ చేసుకుంటూ వున్నారు. ఆ ఎడ్వాంటేజి తక్కిన చిత్రదర్శకులకు వుంటుందనుకోను. రమణగారు తను రాసినవన్నీ బాపుగారికి చూపించి అభిప్రాయం తీసుకునేవారు. వ్యక్తిగత విషయాల్లో బాపుగారిది కన్సర్వేటివ్‌ వ్యూ. సంకోచాలు ఎక్కువ. రమణగారికి ధైర్యం ఎక్కువ. ''రచన''కు 'శృంగార శాఖాచంక్రమణం' అని శృంగారం గురించి జోకులతో వ్యాసం రాశారు.

 

 

బాపుగారు బొమ్మలేసి పెట్టారు కానీ 'ఎందుకయ్యా యివన్నీ పబ్లిగ్గా రాయడం' అని సణిగారు. అచ్చయ్యాక రమణ నన్నడిగారు - 'ఎలా ఫీలయ్యార'ని. 'మీ ప్రతిష్టకు లోటేమీ రాదు, జీవితవాస్తవాలు రాశారు, అందరి మనసుల్లో మెదిలేదే చెప్పారు' అన్నాను. ఆయన వూరడిల్లి బాపు అభిప్రాయం చెప్పారు. ఆ వ్యాసం చాలా ప్రసిద్ధి కెక్కింది.  ''కోతికొమ్మచ్చి'' రాసేటప్పుడు కూడా రమణరాసిన చాలా విషయాలకు బాపు అడ్డుపడుతూనే వున్నారు. 'ఎందుకయ్యా యివి..' అంటూ. ఈయన అయోమయంలో పడేవారు. అప్పటికీ కొన్ని రాశారు. 'ఫలానాది రాయవచ్చు కదండీ' అంటే 'బాపు వద్దంటున్నాడు..' అనేవారు రమణ. ''కొసరు కొమ్మచ్చి''లో సీతారాముడు గారు వాళ్ల వ్యక్తిగత విషయాలు రాస్తే వాటిని నేను బాక్స్‌ ఐటమ్స్‌గా వాడతానన్నాను. బాపు వద్దన్నారు. ముఖ్యంగా మద్యపానం గురించి ముచ్చట్లూ అవీ. రమణ ''కోతికొమ్మచ్చి''లోనే వాటి గురించి సరదాగా రాశారు. అవి చదివి సీతారాముడుగారితో ఆయన ఫ్రెండ్స్‌ 'వాళ్లు పక్కా తాగుబోతుల్లా వున్నారే' అని కామెంట్‌ చేశారట. 'కాదు సుమా, హెల్త్‌ డోస్‌లా తాగుతారు' అని సీతారాముడు రాస్తే బాపు దాని ప్రస్తావనే వద్దన్నారు. నేను చెప్పాను - 'మీరు వర్క్‌ స్పాట్‌లో ఎప్పుడూ తాగలేదు, తాగి షూటింగులు కాన్సిల్‌ చేయలేదు.

 

పార్టీలలో ఎవరితో ఘర్షణ పడలేదు. ఆఫీసులో తాగుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తితో మీరు భాగస్వామ్యం తెంపుకున్నారు. రమణగారు మద్యపానం గురించి జోకులేస్తూ ప్రస్తావించకపోతే గొడవే లేదు. ఆయన చెప్పారు కాబట్టి యీ సమాచారం కరక్టివ్‌గా వుంటుందండి' అన్నాను. అయినా బాపు ఒప్పుకోలేదు. అది ఒకటే కాదు, తన లైబ్రరీ గురించి గురించి రాయవద్దంటారు. ఈ పర్శనల్‌ ఐటమ్సన్నీ నేను డిటిపి చేసి పంపించాను. దాదాపు అన్నిటికీ పక్కన యింటూలు పెట్టేసి 'వ్యక్తిగత విషయాలు ప్రజలకు ఆసక్తికరంగా వుండవు కాబట్టి తీసేయండి' అంటూ పైన రాశారు. అలా అభ్యంతరం తెలుపుతూనే 'చివరి తీర్పు మీదే' అంటూ నాకు వదిలేశారు.  ఆ లెటరు కాపీ పెడుతున్నాను చూడండి. నా కిచ్చిన అధికారాన్ని వినియోగించుకుని రెండు, మూడు బిట్స్‌ తప్ప తక్కినవన్నీ పుస్తకంలో పెట్టేశాను.  బాపుకి అనవసర భయాలు, మొహమాటాలు ఎక్కువ. ''కోతికొమ్మచ్చి'' స్వాతిలో సీరియల్‌గా వస్తూండగా మొదటి 35 వారాల మెటీరియల్‌తో ''హాసం ప్రచురణలు'' తరఫున ''కోతికొమ్మచ్చి'' పుస్తకం తయారుచేయడం మొదలుపెట్టాను. సీరియల్‌లో వాడిన ఫోటోల కంటె ఎక్కువ ఫోటోలతో అందంగా తయారుచేయాలని నా తాపత్రయం.

 

సినిమా స్టిల్స్‌తో బాటు సందర్భానుసారంగా బాపురమణల పర్శనల్‌ ఫోటోలు, షూటింగ్‌ ఫోటోలు కూడా వాడాలని నా ఉద్దేశం. రమణగారికి నా జడ్జిమెంటుపై అచంచల విశ్వాసం కానీ బాపుగారికి అంత లేదు - అప్పట్లో! ''మా ఫోటోలు వద్దండి, పాఠకులు తిట్టుకుంటారు'' అనేవారు. ''మీ గురించి ఏ చిన్న సమాచారమైనా సరే, వాళ్లకు ఆసక్తి కలిగిస్తుందండి, వాళ్లకు ఎవర్షన్‌ రానంత మోతాదులో వుపయోగిస్తాను.'' అని చెప్తూ వచ్చాను. ''మీ పెద్దబ్బాయి వేణు ఫోటో పంపండి.'' అంటే ''అక్కరలేదు'' అన్నారు. ''రమణగారు తన కథలో మీ నాన్నగారే అతని రూపంలో మళ్లీ వచ్చి తనను ఆదుకున్నాడనీ, తన అప్పులన్నీ తీర్చేశాడనీ రాశారు. అంత పుణ్యాత్ముడు ఎలా వుంటాడో చూద్దామని పాఠకుడికి కుతూహలం వుంటుంది కదా'' అని వాదించాను. ఆయనలో తండ్రి కరిగాడు - ''అవునండీ, వాళ్ల మామ అంటే వాడికి అంత యిష్టం.'' అంటూ ఫోటో పంపారు. చివరిదాకా సణుగుతూనే వున్నారు - 'నా ఫోటోలు ఎక్కువై పోయాయి' అని. 'ఏదైనా యాడ్వర్స్‌ కామెంట్‌ వస్తే సెకండ్‌ ఎడిషన్‌లో తీసేస్తా' అని హామీ యిచ్చి అలాగే వేసేశా. పుస్తకం ప్రజాదరణ పొందింది. బాపుగారు కిమ్మనలేదు. ''ఇంకోతికొమ్మచ్చి'' వచ్చేసరికే ఏ అభ్యంతరమూ రాలేదు. ''మీరేం చేసినా పెర్‌ఫెక్ట్‌గానూ వుంటుంది, అందంగానూ వుంటుంది' అని కితాబు యిచ్చారు. బాపు వంటి పెర్‌ఫెక్షనిస్టు చేత అలా అనిపించుకోవడం కంటె జన్మకు ధన్యత వుంటుందా? (సశేషం) 

Link to comment
Share on other sites

×
×
  • Create New...