Jump to content

charithraka thappidhalu


Shankara_Sastry

Recommended Posts

1987లో ఎన్టీఆర్ టిటిడిలో మిరాసీ వ్యవస్థను రద్దు చేయడం కోసం మొత్తం అన్ని ఆలయాల్లో వారసత్వ వ్యవస్థను రద్దు చేశారు. దీని వల్ల అర్చకులకే కాక వివిధ వర్గాలకు అన్యాయం జరిగింది. కాగడా పట్టే వారు, ఇతర సేవలు చేసే మంగలి, మాదిగ కులాల వారికి కూడా ఈనాములు రాకుండా పోయాయి. దీనితో చిన్న మందిరాల్లో అర్చక వ్యవస్థ దెబ్బతింది. దీనిపై చిలుకూరి బాలాజీ మందిరం ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ ప్రచారం ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఎన్టీఆర్ కూడా తాను తీసుకున్న నిర్ణయం వల్ల చిన్న అర్చకులను దెబ్బతీశామని గ్రహించాడు. కాని రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకునేలోపు ఆయన ప్రభుత్వం కుప్పకూలి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్న మందిరాల్లో అర్చక వ్యవస్థను పునరుద్ధరిస్తూ చట్టాన్ని సవరించారు. కాని దానికి సంబంధించిన నిబంధనలను రూపకల్పన చేయలేదు. అప్పుడు ఐవి సుబ్బారావు దేవాదాయ విభాగం సెక్రటరీగా ఉన్నారు.

సిఎస్ గా ఉన్నప్పుడే ఈ విషయం నా దృష్టికి వస్తే నేను ఈ విషయం చేపట్టాను. చొరవ తీసుకుని నిబంధనలను రూపొందించి సిఎంకు పంపించాను. కాని చాలా రోజులు సిఎం దాన్ని ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. చేద్దాం.. చూద్దాం. అనేవారు. ఈ లోపు నేను పదవీ విరమణ చేసి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ అయ్యాను. 
తర్వాత దాన్ని మళ్లీ సిఎంకు గుర్తు చేయడం ప్రారంభించాను. దాదాపు నాలుగైదు నెలల తర్వాత ఆయన ఫైలును అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు పంపించారు. నేను అడ్వకేట్ జనరల్‌కు కూడా చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ గారితోపాటు కలిశాను. చిన్న ఆలయాల పరిరక్షణ హిందూమత పరిరక్షణలో వారి తండ్రి సౌందరరాజన్‌గారు కుమారులు రంగరాజన్, మురళిగారి నిబద్ధత ఎనలేనిది. నిబద్ధతే కాదు విషయ పరిజ్ఞానం కూడా అమోఘం. వారి నాన్నగారు చట్టంకోరలతో ఆలయాలు అనే శీర్షికన 1987 చట్ట సవరణ పర్యవసానాలను వివరిస్తూ విపులంగా పుస్తకం వ్రాశారు. విషయం వివరించాను. చిన్న మందిరాలను మనం కాపాడాల్సిన అవసరం ఉన్నదని, దీని వల్ల అన్యమతాల ప్రచారానికి ఆస్కారం ఉండదని చెప్పాను. చిన్న ఆలయాల వ్యవస్థలో అర్చకుల్లో కేవలం బ్రాహ్మణులే కాక ఇతర వర్గాలు కూడా ఉన్నారని, బోయలు, ముదిరాజ్‌లు, వీరశైవులు, చాత్తాద వైష్ణవులు తదితరులు కూడా అర్చకులుగా పనిచేస్తున్నారని చెప్పాను. అయినా సరిగా అర్చకత్వం చేస్తున్న వారికే ఇవ్వాలని, దానికొక పరీక్ష పెట్టి అర్హులైన వారికే మళ్లీ అర్చకత్వాన్ని కల్పించాలని సూచించాను. 
నేను చెప్పినవన్నీ విన్న అడ్వకేట్ జనరల్ అయిదారు నెలలు ఏమీ మాట్లాడలేదు. చివరకు ఆయన కూడా నేను చెప్పింది అంగీకరించి ముఖ్యమంత్రికి పంపడంతో ఆయన సంతకం పెట్టారు. ఈ నిర్ణయం పై అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ప్రిలిమనరీ నోటిఫికేషన్ కూడా జారీ అయింది.

ఎమ్మెల్సీ జనార్ధన్ ఈ నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీకి సరైన రాజకీయ ప్రయోజనం దక్కాలని అన్నారు. 
‘ఇంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు దక్కకూడదు? ఓఎస్ అలాగే చేద్దాం’ అన్నాను. 
బ్రాహ్మణ కార్పోరేషన్ తరఫున మండల స్థాయి అసోసియేషన్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాను. చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించారు. ఆయనకు మనం పూర్తిగా ఘనత దక్కేలా చూడాలని చెప్పాను. అర్చకులు ఉప్పొంగిపోయారు. చంద్రబాబు పేర అర్చనలు చేశారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగాయి. కొందరు ఒకడుగు ముందుకు వేసి గుళ్లలోనే చంద్రబాబు ఫోటోలుపెట్టారు. 
తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయం పెద్దగా ప్రచారం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఫేస్‌బుక్ లోనూ, వెబ్‌సైట్‌లోనూ చంద్రబాబు ఫోటో వేసి ఆయన అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించింది. ఒక చోట చంద్రబాబుకు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి ‘బ్రాహ్మణ బంధు’ అనే బిరుదు కూడా ప్రదానం చేశారు. 
కాని ఎవరో ఈలోపు చంద్రబాబు చెవులు కొరికారు.

దీని వల్ల మిరాసీ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించినట్లవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 
చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గారు. ‘కృష్ణారావు నన్ను తప్పుదోవ పట్టించారు. దీని పర్యవసానాలు ఉన్నాయి. నేను దీన్ని ముందుకు తీసుకెళ్లదలుచుకోలేదు’ అని చెప్పారు.. తిరుమలలో మిరాసీ వ్యవస్థను పునరుద్ధరించడానికి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని తర్వాత విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

కొన్ని విషయాలలో సమస్యను సవివరంగా అర్థం చేసుకోను చంద్రబాబు నాయుడు గారు సుముఖత చూపరు. అందుకు ఇది ఒక ఉదాహరణ. పునరుద్ధరించింది వారసత్వపు హక్కు మిరాసీ కాదు, మిరాసీ అంటే ఆదాయంలో భాగముంటుంది కాని అటువంటి ప్రతిపాదన ఈ రూల్సులో లేదు. కాని మూర్ఖంగా ఈ ప్రతిపాదనను ఆయన మనసులో ఏదో పెట్టుకుని వ్యతిరేకించాడు.
ఏమైతేనేం, ఫైనల్ నోటిఫికేషన్ మీద సంతకం పెట్టలేదు
ఫైనల్ నోటిఫికేషన్ మీద సంతకం పెట్టించేందుకు ఆయనను ఎంత కలుసుకోవాలని ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ లభించలేదు.

నాకు తెలుసు. మిరాసీ వ్యవస్థకూ చిన్న మందిరాల్లో అర్చక వ్యవస్థను కాపాడే నిర్ణయానికీ సంబంధం లేదని. కాని ఆయన కలిస్తే కదా నేను వివరించడానికి.. 
కేంద్రమంత్రి సుజనా చౌదరికి కూడా ఈవిషయం చెప్పాను. ‘సార్‌కు చెప్పండి ఇంతమంచి నిర్ణయాన్ని ఆపు చేయవద్దని, అర్హులైన వారికే ఇక్కడ మళ్లీ అర్చక వ్యవస్థలో భాగం ఉంటుంది. ఆదాయంలో వాటా ఉండదు..’ అని చెప్పాను. 
సుజనా చౌదరి.. ‘అలాగా నేను సిఎం గారికి చెబుతాను.’ అన్నారు. 
కాని అప్పటికే సుజనాచౌదరి గారి పాత్ర తగ్గుముఖం పట్టింది. చిన్న బాబు ప్రాధాన్యం పెరిగింది.
ఇలా కాదని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను కలుసుకోవాలని నిర్ణయించాను. 
బ్యూరో ఛీఫ్ మాధవ్ కు ఫోను చేశాను. 
‘సాయంత్రం రండి.. మా ఎండీగారు ఆఫీసులోనే ఉంటారు..’ అని చెప్పారు. సాయంత్రం నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. రాధాకృష్ణకు నేను జరిగింది చెప్పాను. ‘మిరాసీ వ్యవస్థకూ చిన్న మందిరాల్లో అర్చకుల ప్రయోజనాలను కాపాడడానికీ సంబంధం లేదన్నాను. టిటిడి మీద కోపంతో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల వారి కడుపు కొట్టినట్లయింది’ అని చెప్పాను. దీని వల్ల ఆలయాలు బాగుపడతాయని అన్య మత ప్రచారానికి ఆస్కారం తగ్గుతుందని చెప్పాను. రాధాకృష్ణ నేను చెప్పింది అంగీకరించారు. ‘మీరు సిఎంకు కలిసి చెప్పవచ్చు కదా’. అన్నారు. 
‘ఆయనను కలిసే అవకాశం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను.’ అన్నాను. 
‘సరే నేను చెబుతాను. మీరు మీ అభిప్రాయం వ్యాసం రూపంలో రాసివ్వండి. ఎడిట్ పేజీలో ప్రచురిస్తాను.’ అన్నారు. 
‘అర్చకత్వం- మిరాసీ దారు’ అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసం ఇలా ఉంది. 
‘హైందవ ధర్మ సంప్రదాయంలో ఆలయాలకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అర్చక వ్యవస్థ ఈ ఆలయ వ్యవస్థతో ముడిపడి ఉన్న వ్యవస్థ. అనాదిగా ఆలయాలనే తమ జీవితంలో ప్రధాన అంశంగా పరిగణించి నియమనిష్ఠలతో దైవకార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామాలలో ప్రజలకు ఒక స్నేహితుడు, దార్శనికుడు, మార్గదర్శిగా అర్చకులు తమ జీవితాన్ని గడిపేవారు. వారి సేవలకు సమాజమిచ్చిన ప్రతిఫలం వివిధ ఆలయాలలో వివిధ రూపాలలో ఉండేది. ప్రధానంగా సేవలకు ఇనాం రూపంలో కొంత భూమి దాని మీద ఫలసాయం వారికి వచ్చేది. ఈ ఇనాములు కేవలం అర్చకులకు మాత్రమే కాదు ధార్మికమైన కార్యమ్రాలు నిర్వహిస్తూ ఆలయాలలో మంగళవాయిద్యాలు ఆలపించే వారికి గుడిని శుభ్రంచేసే వారికి ఉన్నాయి. భక్తులు సంతోషంగా ఇచ్చిన దక్షిణ కూడా అర్చకులకు ఆదాయ రూపంలో చేకూరేది. 
అర్చకత్వంలో ఆయా దేవాలయాల పరిణతిని బట్టి వివిధ కులస్థులు ఉన్నారు.

ప్రధానంగా బ్రాహ్మణులు ఈ అర్చకత్వాన్ని నిర్వహించగా చాలా ఆలయాలలో తంబల్ల కులస్థులు, లింగాయతులు, చాత్తాద వైష్ణవులు, బలిజలు, బోయలు అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు. చిన్న దేవాలయాలలో బ్రాహ్మణేతరులు దాదాపు 30శాతం అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ఇతర ధార్మిక ఉద్యోగులను కలుపుకుంటే ఇది 40 శాతం వరకు ఉంటుంది. అర్చకులకు పారితోషికం ఇచ్చే విధానం తిరుమల తిరుపతిలో ఇంకొక ప్రత్యేక విధానంగా ఏర్పడింది. దీని ప్రకారం అర్చకులకు దేవాలయానికి వచ్చే ఆదాయంలో వాటాలు ఏర్పడ్డాయి. ఈ విధానాన్నే మిరా‍సీ విధానం అంటారు. మిరాసీ అనే పదం అర్థం సందర్భాన్ని బట్టి మారుతుంది. తమిళనాడులో భూస్వామ్య విధానంలో మిరాసీలు జమీందారుల లాగా భూమి యజమానులు. భూమి నుంచి వచ్చే ఆదాయంలో వీరికి వాటా ఉంటుంది. తిరుమల ఆలయంలో వారసత్వంతో కూడిన ఆదాయంలో వాటా విధానాన్ని మిరాసీగా పరిగణిస్తారు. తిరుమల ఆలయం ఆదాయం గణనీయంగా పెరగడంతో వీరి ఆదాయము అదేవిధంగా పెరిగింది.

ముఖ్యంగా నాలుగు కుటుంబాలు పెద్దింటి, గొల్లపల్లి, తిరుపతమ్మ, పైడిపల్లి కుటుంబాలు వంతుల ప్రకారం స్వామివారి ఆలయంలో అర్చకత్వం నిర్వహించేవారు. ఈ మిరాసీ విధానం తిరుమల ఆలయం ప్రత్యేకత. ఈ విధమైన వాటా విధానం మిగిలిన ఆలయాలలో లేదు. 
తిరుమలలో ఆలయ ఆదాయాలు పెరగడంతో ఈ కుటుంబాల వారు గుమాస్తా అర్చకులను పెట్టుకొని వారితో స్వామివారి కైంకర్యాలు తమ పర్యవేక్షణలో చేయించడం మొదలెట్టారు. కొంత క్రమశిక్షణా రాహిత్యం కనిపించడంతో ఎన్‌.టి.రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధానాన్ని మార్చడానికి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం తిరుమలకు పరిమితమై ఉన్నట్లైతే ఇది చాలా అవసరమైన శుభపరిణామంగా మిగిలిపోయేది. కానీ ఆదాయంలో వాటాలతోపాటు చిన్న ఆలయాలకు ఉన్న సేవల ఇనాంను, ఆనువంశిక వారసత్వాన్ని రద్దు చేయడంతో ఈ సంస్కరణ చిన్న ఆలయాల నిర్వహణ మనుగడను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ అంశాన్ని ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు అంగీకరించి చిన్న ఆలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలకు విధివిధాన రూపకల్పనకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికనుగుణంగా 2007 లో దేవాదాయ చట్టాన్ని సవరించి 1987 చట్టంలో మార్పులు తెచ్చే నాటికి అర్చకత్వంలో ఉన్న కుటుంబాలకు అర్చకత్వంలో కొనసాగే హక్కును గుర్తించడం జరిగింది. అర్చకులకు వచ్చే ఆదాయాన్ని దేవాలయ శాఖ ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా ఏర్పరచవలసి ఉంటుంది. అంతకు పూర్వమున్న ఆదాయ విధానాలను ఈ చట్టం గుర్తించలేదు.

ఈనాడు చర్చిస్తున్న అర్చకత్వం మార్గదర్శకాలు, నిబంధనలు చట్ట సవరణను అనుసరించి చేస్తున్న నిబంధనలు మాత్రమే. చట్టమే ఆదాయపరమైన అంశాలను మినహాయిస్తూ వారసత్వాన్నే గుర్తించినప్పుడు ఈ నిబంధనల ద్వారా మిరాసీ వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుంది అనడం పనికట్టుకొని వక్రీకరించి దుష్ప్రచారం చేయడమే. 
వారసత్వం, మిరాసీ రెండు ప్రత్యేకమైన అంశాలు. ఆలయ అర్చన వ్యవస్థలో వారసత్వానికి వ్యతిరేకమని ఎవరైనా చెపితే అది వేరే అంశం. కానీ ఈ నిబంధనల ద్వారా మిరాసీ వ్యవస్థ వస్తుంది అని ప్రచారం చేయడం కేవలం వాస్తవాలను దురుద్దేశంతో వక్రీకరించడం మాత్రమే.

ఇక ఈనాడు ఈ మార్గదర్శకాలను నిబంధనలను ఆమోదించడం ద్వారా దీని ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎంతవరకు ఉంటుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం. 2007లో దేవాదాయ చట్టానికి వచ్చిన సవరణను పరిశీలించి 2010లో టిటిడి ఆలయం అక్కడి అర్చకులకు వారసత్వ విధానాన్ని అమలుచేసింది. బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అర్చకులు ఈ అంశాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించి వారి వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.

ఈనాడు ఈ నిబంధనల ద్వారా చిన్న దేవాలయాలకు అమలుపరిచే విధానాన్ని 2010 లోనే టిటిడి అమలు చేసింది. ఈ నిబంధనలు ప్రభుత్వం ఆమోదించడం ద్వారా టిటిడిలో పరిణామాలుంటాయని చెప్పడం పూర్తిగా వాస్తవాలను వక్రీకరించడమే. 
ఇక రెండవది ధార్మిక ఉద్యోగులలో వారసత్వ అంశం. ధార్మిక ఉద్యోగులు అనే పదాన్ని వాడటంలో ఉద్దేశం ఈ చట్ట సవరణ ఒక్క అర్చకులదేకాదు ఆలయ మతపరమైన బాధ్యతలు నిర్వహించే అందరికీ వర్తిస్తుంది. తిరుమల ఆలయంలో ఉదయాన్నే కాగడా బట్టి దారిచూపే సన్నిధి గొల్ల, మంగళవాయిద్యాలు వాయించేవారు, ఆలయ ప్రాంతాన్ని శుభ్రంచేసేవారు. అందరు ధార్మిక ఉద్యోగుల క్రిందకే వస్తారు. అర్చకుల సమావేశాలలో నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటాను. ‘సమాజం కోరుకున్నంత కాలమే ఈ అర్చకత్వాన్ని మీరు ఆనువంశికంగా నిర్వహించగలరు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా మీ పిల్లలను లౌకికవిద్య వైపు మళ్ళించండి’ అని సలహా ఇస్తుంటాను. చాలామంది నుంచి దీనికివచ్చే సమాధానం ఒకటే. ‘మాకు రోజూ తారసపడే సమీప సమాజం మమ్ములనే అర్చకత్వం నిర్వహించవలసిందిగా కాంక్షిస్తున్నది. ఇది మాకు తరతరాలుగా వచ్చిన వారసత్వ విధి. దీని నుంచి మేము వైదొలగదల్చుకోలేదు. ఎన్నికష్టనష్టాలైనా భరించి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం.’ అని.

మరి అర్చకత్వం వారసత్వంగా కొనసాగాలా లేదా అన్నది ఈ సమీప సమాజం నిర్ణయించాలా లేక ఇంకెవరైనా నిర్ణయించాలా అన్నది సమాజ నిర్ణయానికే వదిలేయడం సబబు. సమాజం కాంక్షించినంతకాలం కొద్ది మంది ఈ అంశాన్నినిర్ణయించి నిర్దేశించలేరు’. 
ఈ వ్యాసమైతే ప్రచురించారు కాని చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదు. చిన్న మందిరాల్లో అర్చకులు యథాప్రకారం దీన స్థితిలో కొనసాగాల్సిందే. ‘బ్రాహ్మణ బంధు’ పేరిట బిరుదును స్వీకరించి సత్కారం పొందిన ఆయనకు ఇప్పుడేమి బిరుదు ఇవ్వాలి?

సమాంతరంగా మరి రెండు అంశాలు కూడా ముఖ్యమంత్రిగారితో సంబంధాలు దెబ్బతినడానికి కారణమైనాయి. మొదటి ఆరునెలలు ఎటువంటి ఇబ్బందులు లేవు. అక్టోబర్‌లో బ్రాహ్మణ సహకార సంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిగారు వచ్చారు. ఆరోజు వచ్చిన శ్రీకాకుళం అరుంధతి సంఘం సభ్యులతో చాలాసేపు సంభాషించారు. రెండు గంటల సమయం కేటాయించారు. సభలో చాలా భావోద్వేగంతో బ్రాహ్మణులపై ఆయనకున్న గౌరవాన్ని తెలుపుతూ మాట్లాడారు. రాజకీయంగా వారికి తగిన ప్రాధాన్యాన్ని ఇస్తానని ఈ విషయంలో కృష్ణారావుగారి సూచనలు తీసుకుంటానని తెలిపారు. కాని డిసెంబరుకల్లా ప్రయోజకులు కాని ఆరుగురిని ఎటువంటి సూచనలేకుండా బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్లుగా నియమించారు. ఒక్కమాటైనా చెప్పలేదు.
తెలుగుదేశం పార్టీలో ఈ సామాజిక వర్గం ప్రాధాన్యం చాలా తక్కువ. సమర్ధత గల వ్యక్తులు ఈ సామాజిక వర్గం నుంచి ఈ పార్టీలో లేరు. ఉన్నా హర్షించే స్థితి ఆ పార్టీలో లేదు. డిసెంబరులో వాళ్ళు వచ్చి బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి నా కష్టాలు మొదలైయ్యాయని చెప్పాలి.

అవగాహనారాహిత్యంతో లబ్ధిదారుల ఎంపికలో తమకు అధికారం ఉండాలని పట్టుపట్టారు.తెలుగుదేశంలో వారు ఏర్పర్చుకున్న ఒక వ్యవస్థ చివరకు ఆ పార్టీనే ముంచివేస్తుందనడంలో సందేహం లేదు. పార్టీలో మొత్తం నిర్ణయం అంతా ఒక కోర్ గ్రూప్ తీసుకుంటుంది. అందులో ఉన్న వారంతా వారి సామాజిక వర్గానికి చెందినవారే.

ఆశ్చర్యకరమైనదేమంటే వారి పిఎస్ లు కూడా అదే సామాజిక వర్గం నుంచే. కనుక వారు ప్రతి దాన్నీ అనుమానిస్తుంటారు. ప్రతిదానికీ భయపడుతుంటారు. అనవసరమైన గూఢచర్యం చేస్తుంటారు. ఎక్కడ ఏమవుతుందో నన్న అనుమానంతో పార్టీ నడుస్తుంది. వారు నా కార్పొరేషన్‌లో వేలు పెట్టడం ప్రారంభించారు. ఒక రోజు బాపట్లలో నియోజకవర్గ సమన్వయ కర్తలకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాను. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని పిలిచాం. ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ అయితే. ఎమ్మెల్యే వైసీపీకి చెందిన కోన రఘు. 
ఉదయం పదిన్నర గంటలకు సమావేశం ప్రారంభమైనా రఘు రాలేదు. నేను ఫోన్ చేశాను. ‘ఏమయ్యా సమావేశానికి రాలేదు’ అని అడిగాను. 
‘నాకు సరిగ్గా ఆహ్వానం లేదు’.. అని అన్నారు. 
‘సరిగా ఆహ్వానం అందలేదు.. అని అంటే?’ అని అడిగాను. 
‘మీరు ఫోన్ చేయలేదు. మీ ఎండి ఫోన్ చేసి ఫలానా చోట మీటింగ్ జరగుతున్నది. అని సమాచారం మాత్రం ఇచ్చాడు. కాని ప్రాపర్‌గా ఆహ్వానించలేదు.’ అన్నారు. 
‘ఏమయ్యా, మా ఉద్దేశం లో తప్పేమీ లేదు. రాతపూర్వకంగా చేశారా, ఫోన్ చేసి చెప్పారా అన్నది ముఖ్యం కాదు. మీరు వస్తే బాగుంటుంది’ అని అన్నాను. 
‘నాకు మరో అరగంట సమయం పడుతుంది సార్’ అన్నాడు. ‘సరే రండి’ అని చెప్పాను.చెప్పిన సమయానికి ఆయన మీటింగ్ కు వచ్చారు. 
ఈ లోపు జనార్దన్ ఫోన్ చేశాడు. ‘ఏం సార్ మీరు కోన రఘును పిలిచారట కదా’ అని అడిగాడు.
‘స్థానిక ఎమ్మెల్యే కదా. పిలవడం మన ధర్మం’ అన్నాను. 
‘అదెట్లా నండీ. వేరే పార్టీ వాళ్లను ఎలా పిలుస్తారు?’ అని అడిగాడు.
‘ఇందులో తప్పేముంది. ఇది మానవవనరులకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ కార్యకలాపాల్లో స్థానిక ఎమ్మెల్యేని పిలవడం పరిపాటి కదా..’ అన్నాను. 
‘అట్లాగా ‘అని జనార్దన్ ఫోన్ పెట్టాడు. అలా ఉంటుంది వారి అనుమానం.

రెండోరోజు కోన రఘు తన హోటల్‌లో కోఆర్డినేటర్స్‌కు గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చింది. ‘మమ్మల్ని ఆయన భోజనానికి పిలిచారు వెళ్లాలా సార్..’ అని సమన్వయ కర్తలు అడిగారు. ‘అది మీ ఇష్టం. నేను నా వ్యక్తిగత స్థాయిలో వెళుతున్నా. అది కూడా ఆయన తన ప్రైవేట్ హోదాలో పిలుస్తున్నారు’ అన్నాను. 
సాయంత్రానికి అందరూ విందుకు హాజరయ్యారు. అక్కడ బ్రాహ్మణుల సమస్యలు కొద్ది సేపు చర్చించుకున్న తర్వాత అంతా భోజనాలు చేసి తిరిగి వెళ్లారు. జిల్లా సమన్వయ కర్తకు చౌదరి పిఎస్ కుమార్ చౌదరి ఫోన్ చేసి ‘ఏం మీ చైర్మన్ అందర్నీ కోన రఘు పార్టీకి తీసుకెళ్లాడట?’ అని అడిగాడు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. 
అడిగింది ఎవరు?.. ‘ఒక పిఎస్. దానికి మేము స్పందించాలా.. పట్టించుకోకు. ఇగ్నోర్ దట్ ఫెలో..’ అని నేను చెప్పాను.

బ్రాహ్మణుల సంక్షేమం కోసం అందర్నీ కలుపుకుని పోయి, అనేక పథకాలు ప్రవేశపెట్టి, అందరి అభిప్రాయంతో ప్రజాస్వామికంగా పనిచేయాలని నేను భావిస్తుంటే తెలుగుదేశం పార్టీలో మాత్రం నాపై అనుమానాలు వ్యక్తం చేయడం, నాపై నిఘా పెట్టడం బాధ కలిగించింది. 
బహుశా వారు నన్ను తీసేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారేమోననిపించింది. 
నేను ఒకే కేంద్ర కార్యాలయం పెట్టి జిల్లాల్లో సమన్వయకర్తలను నియమించాలని అనుకున్నాను. ప్రతి జిల్లాలో కార్యాలయం పెడితే వాటికే ఎక్కువ ఖర్చవుతుందని అనుకున్నాను. ‘మీ పార్టీ నుంచి మీలో ఎవరినైనా పెట్టండి’ అని ముందు తెలుగుదేశం వాళ్లకే చెప్పాను. 13 జిల్లాలకు 13 మంది సమన్వయ కర్తలు తెలుగుదేశం పార్టీ నియమించిన వారే. 
‘కార్పొరేషన్ సమావేశాలకు వైసీపీ వాళ్లు వస్తున్నారు’ అన్నది నాపై ఫిర్యాదు. స్థానికంగా సమావేశాలు నిర్వహించేది వాళ్లు నియమించిన సమన్వయకర్తలే. ‘వారెవర్ని పిలుస్తున్నారో నాకు తెలియదు. అంటే సీరియస్‌గా వారి పార్టీలో ఏదో లోపం ఉన్నదన్నమాట’ అని నేను అన్నాను.

ఆ తర్వాత నియోజకవర్గం స్థాయిలో సమన్వయ కర్తలను నియమించాలని అనుకున్నాను. వారితో నియోజకవర్గ స్థాయి బ్రాహ్మణుల సమావేశాలను ఏర్పాటు చేయాలనుకున్నాం. అయితే ఇంత పెద్ద స్థాయిలో నియమించినప్పుడు పార్టీ వాళ్లను నియమిస్తే గొడవ రేగుతుందని నేను అలా కాకుండా టెలిఫోన్ ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించాం. దాదాపు 120 మందిని ఇలా నియమిస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు వైసీపీకి అనుకూలంగా ఉన్న వారు అని తేలింది. కొత్త పేటలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకోసం పనిచేసిన వ్యక్తిని సమన్వయకర్తగా నియమించారని ఫిర్యాదు వచ్చింది. ఆమెను రాజీనామా చేయమని కోరాను. చేయకపోతే నేను తీసేశాను. నాకు మళ్లీ తెలుగుదేశం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘వైసీపీ వాళ్లను నియమిస్తున్నారట కదా?’ అని. ‘నాకు తెలియదు. 120 మందిలో ఒకరిద్దరు ఉండొచ్చు. అంతేకాక నా దృష్టికి వచ్చిన ఒకర్ని తీసేశాను’ అని చెప్పాను.

అయినప్పటికీ వినకుండా అంతా వైసీపీ వాళ్లను నియమించారని ప్రచారం చేసి నాపై కక్ష కట్టారు. 
బ్రాహ్మణ కార్పోరేషన్ విజయవాడకు మారిపోయాక పూర్తి స్థాయి ఎండి అవసరమని భావించి ఏపీపిఎస్ సి సెక్రటరీ వై వెంకట శేష తల్ప సాయిని అడిగాను. సాయి ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేసి బార్క్ లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. భారత రెవిన్యూసర్వీసుకు ఎంపికయ్యారు. నాఅభ్యర్థన మేరకు సాయి బ్రాహ్మణ కార్పోషన్ కు ఎండిగా వచ్చేందుకు అంగీకరించారు. దానిపై ప్రతిపాదన పంపాను. అది ఆమోదించి ఆర్డరు ఇవ్వడం జరిగింది. కాని ప్రత్యామ్నాయం చూపినప్పటికీ ఏపీపీస్‌సి చైర్మన్ సాయిని రిలీవ్ చేయడానికి ఒప్పుకోలేదు. నేనే మార్చిలో చైర్మన్ వద్దకు వెళ్లి దాదాపు రెండు గంటలు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించాను. జూన్ దాకా రిలీవ్ చేయడం కష్టమన్నాడు. ‘తొందర లేదు. మీ పనులన్నీ అయ్యాక మే 15 వరకు రిలీవ్ చేసేలా చూడండి’ అని చెప్పి వచ్చాను. అట్లా ఒప్పించి వచ్చిన తర్వాత చైర్మన్ ప్రభుత్వానికి లేఖ రాసి సాయిని రిలీవ్ చేయడం కష్టమని చెప్పారు. దీనితో నేను చాలా బలంగా ప్రభుత్వానికి లేఖ రాశాను. ఈ వైఖరి సరైంది కాదని. ఏపీపీఎస్‌సి సెక్రటరీని బదిలీ చేసే జీవో కనుక అమలు చేయకపోతే ప్రభుత్వంలోనే కొందరు మిగతా వారికంటే పెద్దవారిమని భావిస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని గట్టిగా రాశాను. నేనున్నంతవరకూ చివరి నాలుగు నెలలూ ఎండి లేకుండానే కార్పోరేషన్‌ను నడిపాను. చివరకు జీఎంకే ఇన్‌ఛార్జిగా ఇచ్చారు. 
ఈ లోపు నేను ఐఎస్‌బిలో పనిచేస్తున్న ఒక ఐఐఎం ఫెలోను గుర్తించి అతడిని ఎండిగా నియమించమని కోరాను. మీరు నాకు ప్రభుత్వం నుంచి నాకు కావల్సిన అధికారిని ఇవ్వడం లేదు కనుక ఈయనను నియమించడం మంచిదని చెప్పాను. ఆయన తనకు లక్షా 50 వేలు ఇవ్వమని కోరారు. ప్రభుత్వం నుంచి ఎవర్ని నియమించినా కూడా అంతే ఇవ్వాల్సి ఉంటుంది. అతడికి మూడేళ్లు కాంట్రాక్టు ఇవ్వాలని ప్రతిపాదించాను.

కాని నా ప్రతిపాదనపై ఆర్థిక కార్యదర్శి కొరీలు వేశారు. బహుశా ఛీఫ్ సెక్రటరీయే సిఎం కోరిక మేరకు ఈ కొరీలు వేయించి ఉంటారని నా అనుమానం. ‘ఈ ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి?’ అని అడిగాడు. దానికి జవాబు కూడా రాసిపెట్టాను. ఈ లోపు నాకు వ్యతిరేకంగా ప్రచారం ఉధృతం అయి నన్ను తీసేశారు.

ఆఖరుకు కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ సిఈఓ నా అల్లుడని ప్రచారం చేశారు. అతడితో నాకు సంబంధం లేదు. సరైన వ్యక్తి గురించి ఆరా తీస్తుంటే వచ్చిన ప్రతిపాదనను అనుసరించి నిర్ణయం తీసుకున్నాము. అందుకే వేమూరి ఆనంద సూర్య తో నాకెంత బంధుత్వం ఉన్నదో, ఈ సిఈఓతో కూడా అంతే సంబంధం ఉందని చెప్పాను. 
ఏదైనప్పటికీ వరుసగా నాకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు, నేను చేసిన ప్రతిపాదనలన్నీ ప్రభుత్వం పక్కన పెట్టడాలు, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలను గమనిస్తే నన్ను పంపించేందుకు వారు రంగం సిద్ధం చేస్తున్నారని గ్రహించగలిగాను. నేను అనుకున్న విధంగానే జరిగింది. 
నన్ను తొలగించిన తర్వాత బ్రాహ్మణ వర్గాల మనోభావం దెబ్బతినకుండా, తాను బ్రాహ్మణ వ్యతిరేకిగా ముద్రపడకుండా ఉండేందుకు చంద్రబాబునాయుడు కొన్ని పనులు చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఎన్నో రోజులకు విశ్వనాథ్‌ను పిలిచి సన్మానం చేయడం, ప్రముఖ వాగ్గేయకారుడు, దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహావిష్కరణలో పాల్గొనడం, నన్ను దూషించిన బ్రాహ్మణులకు పదవులు ఇవ్వడం మొదలైనవి జరిగాయి.

కొద్ది రోజుల క్రితం జరిగిన విషయం ఇక్కడ ఒకటి చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత ఒక రోజు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సిఎంను కలుసుకునేందుకు వచ్చారు. అప్పటికి ఆయన వృద్దాప్యంలో ఉన్నారు. బాగా కష్టపడుతూ వచ్చినట్లు కనిపించింది. ఆ అపాయింట్‌మెంట్ నేనే ఏర్పాటు చేశాను.
సిఎంను ఆయన ఒకటే కోరిక కోరారు. ‘జీవితంలో అన్నీ సాధించాను. సంగీతంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. నాకు భారతరత్న పొందాలని ఉన్నది. నేను చనిపోయే లోపు ఆ అత్యున్నత పురస్కారం అందుకుంటే హాయిగా మరణిస్తాను’ అని చెప్పారు. 
సిఎం ‘సరే’ అని అన్నారు. కాని బాలమురళి వెళ్లాక ఆయన చెప్పిన దాన్ని మరిచిపోయారు. కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని లేఖ పంపించారు. 
నిజానికి బాలమురళీ కృష్ణ భారతరత్నకు అన్ని విధాల అర్హుడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాగ్గేయకారుడు ఆయన. ఎం. ఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లాఖాన్, లతామంగేష్కర్, పండిత్ రవిశంకర్, భీమ్‌సేన్ జోషీ తదితర ప్రముఖులకు భారతరత్న పురస్కారాలు అందాయి. బాలమురళీ కృష్ణ ఎందులో తక్కువ. కాని కుల రాజకీయాల్లో చిక్కుకుపోయిన వ్యవస్థలో ఆయన గురించి చెప్పేవారెవ్వరు? తెలుగువాడు కావడమే ఆయన దురదృష్టమా?
‘బాలమురళి కాంస్య విగ్రహం పెట్టాను. పదిలక్షల రూపాయలు కేటాయించాను. మొత్తం బ్రాహ్మణ జాతి అంతా తనకు రుణపడి ఉండాలి’ అన్నది చంద్రబాబు అభిప్రాయం. అది ఆయన స్థాయి. బతికున్న వ్యక్తికి భారతరత్న సిఫారసు చేసేందుకు ముందుకు రాని చేతులు, ఆయన పేరును పోనివ్వకుండా చేసిన చేతులు ఈ రోజు ఆయన జయంతి సమావేశంలో విగ్రహానికి దండ ఎలా వేయగలిగాయి?

Link to comment
Share on other sites

1 minute ago, Idassamed said:

Matter in a few lines please and thank you.

 

2 minutes ago, solman said:

inta sodhi evadu chadvutadu.. simple gaa sinle line lo cheppu @3$%

TDP govt or CBN... konchem chesi edho dheshanni uddhirinchinattu build up isthunnaru. vallu chesina manchi kanna... chesina chedu ekkuva undhi ani kavi bhavam..

  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, Shankara_Sastry said:

 

TDP govt or CBN... konchem chesi edho dheshanni uddhirinchinattu build up isthunnaru. vallu chesina manchi kanna... chesina chedu ekkuva undhi ani kavi bhavam..

manchidi ayite.. veyaku nee vote 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...