kingmakers Posted April 15, 2009 Report Posted April 15, 2009 ఒక పక్క ఎండ మండుతుండగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలు దాటిన తరువాత కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోని మోతీ నగర్ డివిజన్ బాలాజీ స్వర్ణపురి (బిఎస్ పి) కాలనీలో ప్లానెట్ ఎం ఎదురుగా దాదాపు 200 మంది యువకులు, మహిళలు సమీకృతం అయ్యారు. మహిళలు మాటా మంతి సాగిస్తున్నారు. కాలనీ వాసులు తమ ఇళ్ళ కిటికీలు, బాల్కనీలలో నుంచి కింద సమీకృతమైన యువకులను గమనిస్తున్నారు. 'ఓపిక పట్టండి. జెపి గారు ఏ క్షణాన్నైనా ఇక్కడికి రాగలరు' అని మధ్యవయస్కురాలు లక్ష్మి నవ్వుతూ అన్నారు. యువకులు ఈలలు వేస్తున్నారు. యువతులు కూడా తక్కువ తినలేదు. లక్ష్మి కూడా ఈల వేశారు. మరి ఎందుకు వేయరు? ఈల లోక్ సత్తా పార్టీ ఎన్నికల గుర్తు కదా! రెండు నిమిషాల అనంతరం కొన్ని నాలుగు చక్రాల వాహనాలు వచ్చి ఆగాయి. 'ఇదిగో జెపి గారు వచ్చారు' అని ఎవరో అరిచారు. జనం ఒక్కసారిగా ఒక కారు వైపు కదిలారు. ఆ కారులో నుంచి ఒక పొడగరి, సన్నటి పెద్ద మనిషి తన అభిమానుల శుభాకాంక్షలు స్వీకరిస్తూ దిగారు. కొందరితో కరచాలనం చేసి, మరికొందరితో కలసి ఫోటోలు దిగిన తరువాత ఆయన ఆ సమీపంలో నిలచి ఉన్న ప్రచార రథంపైకి ఎక్కారు. ముడతలు పడని తెల్లటి షర్ట్, నల్ల ప్యాంటు ధరించిన లోక్ సత్తా పార్టీ (ఎల్ఎస్ పి) అధ్యక్షుడు, కూకట్ పల్లి శాసనసభ స్థానానికి అభ్యర్థి డాక్టర్ జయప్రకాశ్ నారాయణకు, సాంప్రదాయక నేతకు మధ్య దుస్తుల విషయంలో గాని, అలవాట్లలో గాని కొద్దిగా కూడా పోలిక ఉండదు. 'వోటు మాకు, అధికారం మీకు'. ఆయన అక్కడ చేరిన జనసమూహాన్ని ఉద్దేశించి అన్న తొలి పలుకులు అవి. అక్కడి జనం కొన్ని క్షణాలలోనే రెట్టింపయ్యారు. ఆయన మాటలకు వారంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు.' బుల్లెట్ కన్నాబ్యాలట్ మరింత శక్తిమంతమైనది. పోలింగ్ రోజును మరొక సెలవు దినంగా భావించకండి. బాగా ముందుగానే పోలింగ్ కేంద్రాలను సరి చూసుకుని మీ వోటు హక్కును వినియోగించుకోవడానికై ఆ రోజు అక్కడికి వెళ్ళవలసిందిగా వోటర్లను ముఖ్యంగా మహిళలకు, యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వోటు వేయకపోయినట్లయితే మీరు దేశాన్ని అంధకారంలోకి నెట్టుతున్నట్లే' అని ఆయన తన ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగుతుండగా అన్నారు. 'ప్రజలకు, రాజకీయ పార్టీలకు మధ్య పోటీ...' అని ఆయన తన వాహనంలో తన పక్కగా నిలబడిన 'ఎక్స్ ప్రెస్' విలేఖరితో అన్నారు. వాహనం వెంట జాగింగ్ చేస్తూ 'జెపి గారు, మేము గెలుస్తాము, మీకు వోటు వేసి' అని అన్న ఒక మధ్యవయస్కునితో కరచాలనం చేసేందుకు ఆయన తన మాటలన ఆపారు. కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ను కుదిపివేస్తున్న ప్రధాన సమస్యలు ఏమిటనే ప్రశ్నకు జెపి సమాధానం ఇస్తూ, 'ప్రస్తుతం కూకట్ పల్లిలో అతి పెద్ద సమస్య 'గూండారాజ్యం'. కబ్జాదారులు ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యం సాగిస్తున్నారు. మనం ముందు ఈ సమస్యను పరిష్కరించవలసి ఉంది. ఇది కేవలం ఎన్నికలు కావు. ఇది జాతి పరివర్తనానికి ఒక లక్ష్యం' అని పేర్కొన్నారు. శిక్షణ ద్వారా వైద్యుడై తరువాత ఐఎఎస్ టాపర్ అయిన జెపికి ఆంధ్ర ప్రదేశ్ లో గల పేరు ప్రఖ్యాతులు తక్కువేమీ కావు. ఆయన వివిధ హోదాలలో 16 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారు. భారతదేశ పురోగతికి లోపభూయిష్ట పాలన పెద్ద అవరోధంగా ఉందని విశ్వసించిన జెపి 1996లో ఐఎఎస్ నుంచి రాజీనామా చేసి, భావసారూప్యత గల సహచరులతో కలసి లోక్ సత్తాను స్థాపించారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి ఒక ఉద్యమంగా ఆయన 2006లో లోక్ సత్తా పార్టీ (ఎల్ఎస్ పి)ని ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు వోటర్లను ప్రలోభపెట్టడానికి ధన బలాన్ని, మద్యాన్ని ఉపయోగిస్తూ, ఎన్నికల వాగ్దానాలు చేస్తుంటే ఆందోళన చెందుతున్నారా అని ఆయనను విలేఖరి ప్రశ్నించారు. 'కపట రాజకీయ నాయకులు తమను ఇంతకాలం స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన జనం గ్రహించారు. ప్రజాస్వామ్యంలో సిసలైన స్టార్లు ప్రజలే. మద్యం లేదా ప్రలోభం ద్వారా తమకు ఇవ్వజూపుతున్న రూ. 500 తమను దోపిడీ చేసిన మొత్తంలో అణుమాత్రమేనని వారు ఇప్పుడు గ్రహించారు. మురికివాడలలో పేదలు పడుతున్న కష్టాలు చూస్తే నమ్మలేం. మౌన విప్లవం సంభవిస్తున్నది. ఎన్నికల ఫలితాల్లో ఇది విదితమవుతుంది' అని జెపి సమాధానం ఇచ్చారు. ఎల్ఎస్ పి అద్యక్షుడు అయిన కారణంగా జెపి ఇతర పార్టీల అధినేతలతో పోలిస్తే తీరికలేకుండా ప్రచారం సాగిస్తున్నారు. సినిమా స్టార్లు వంటి జనాకర్షక ప్రచారకులపై ఆయన ఆధారపడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 'నా పిల్లలు పెరిగి పెద్దవారవుతుండడాన్ని నేను చూడలేకపోయాను. నేను నా కుటుంబంతో తగినంత సమయం గడపలేకపోయాను. అయితే, ఈ లక్ష్యంతో పోలిస్తే నా శ్రమ, త్యాగాలు ఏమాత్రం లెక్కలోకి రావు. ఇప్పుడు చరిత్ర సృష్టి జరుగుతున్నది. వాస్తవానికి ఇది రెండవ స్వాతంత్ర్య పోరాటం' అని జెపి తన వాహనం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశిస్తుండగా అన్నారు. కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోని అక్షరాస్యులైన వోటర్లలో అధిక సంఖ్యాకులు జెపి పట్ల సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఒక వ్యాపార సంస్థను నడుపుకుంటున్న 35 సంవత్సరాల కె. రాజేష్ కుమార్ తాను ఎల్ఎస్ పికే వోటు వేయబోతున్నట్లు బాహాటంగా ప్రకటించారు. మరి జనం, ముఖ్యంగా మురికివాడల వాసుల సంగతేమిటి? మోతినగర్ లో కొబ్బరి కాయల వ్యాపారి 32 సంవత్సరాల రవి ఎవరికి వోటు వేయాలో తాను ఇంకా నిశ్చయించుకోలేదని చెప్పారు. 'ఇంత వరకు నేను పిజెఆర్ కు వోటు వేస్తుండేవాడిని' అని రవి చెప్పారు. 'నేను ఆయన కుమారునికి వోటు వేసి ఉండేవాడినే. కాని ఆయన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారం కోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాయకుడు (జెపి) కొన్ని మంచి విషయాలే మాట్లాడారు. చూద్దాం. ఎవరికి వోటు వేయాలో పోలింగ్ రోజే నిర్ణయించుకుంటాను' అని రవి చెప్పారు. ఇంతకుముందు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో కెపిహెచ్ బి, మోతీనగర్, మూసాపేట, బాలానగర్, ఫతేనగర్, బేగంపేట, పాత బోయినపల్లి (హష్మత్ పేటతో సహా) వంటి డివిజన్లు ఉన్నాయి. కూకట్ పల్లి గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద నివాస, వాణిజ్య ప్రాంతంగా పేరొందింది. ఈ నియోజకవర్గంలోని ఇతర అభ్యర్థులలో ఎం. సుదర్శన రావు (టిఆర్ఎస్ - మహా కూటమి), వి.నరసింగరావు (కాంగ్రెస్), ఎం. కాంతారావు (బిజెపి), కూన వెంకటేష్ గౌడ్ (పిఆర్పీ), కొమ్ము రాజేష్ (బిఎస్పీ) కూడా ఉన్నారు.
Recommended Posts