Jump to content

Recommended Posts

Posted

ప్రజారాజ్యం సామాజిక న్యాయం నినాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పార్టీకి ఓట్లు గుమ్మరిస్తుందని భావించిన ఈ నినాదం ఇప్పుడు పార్టీ నాయకుల మెడకు ఉచ్చుగా బిగుసుకుంది. దేశంలో మరే పార్టీ ఇవ్వనంతగా, బిసిలకు 104 టిక్కెట్లు ఇచ్చామని ప్రజారాజ్యం నాయకులు గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. కాని బిసిల పేరిట టిక్కెట్లు పొందినవారిలో అగ్రవర్ణాల వారే ఉన్నారని ఆరోపణలు రాగా, వాటికి బలం చేకూరుస్తూ మరికొన్ని పేర్లు బయటకు రావడం పార్టీ నాయకులకు మింగుడుపడడంలేదు. దీనికితోడు ఇంతకాలంగా బిసిలకు 104 సీట్లిచ్చామని చెప్పిన చిరంజీవి కూడా మాట మార్చి 100 సీట్లే ఇచ్చామని తాజాగా ప్రకటన చేశారు.

మరోవైపు ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ ప్రజారాజ్యం ప్రకటించిన బిసి అభ్యర్ధుల జాబితాలో 14 మంది బిసిలు కానివారు ఉన్నారని చేసిన ప్రకటన ఆ పార్టీని మరింత వివాదంలోకి నెట్టేసింది. బిసి అభ్యర్ధులుగా తమ పార్టీ ప్రకటించిన జాబితాలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని పార్టీ ఉపాధ్యక్షుడు టి దేవేందర్ గొడ్ ఒక ప్రకటనలో అంగీకరించారు. అయితే బిసిలకు వంద సీట్లు ఇస్తామని ప్రటించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మొండిచెయ్యి చూపించగా, ప్రజారాజ్యం 104 సీట్లు ఇచ్చిందని బిసి సంఘాలు ప్రశంసించడం గమనార్హం. ఇప్పుడు ప్రజారాజ్యం ప్రకటించిన బిసి అభ్యర్ధుల జాబితాలో అగ్రవర్ణాలవారు ఉన్నారని బయటపడడంతో నిన్నటిదాకా పొగిడిన సంఘాలు ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరోవైపు తాము బిసిలుగా భావించి టిక్కెట్లు ఇచ్చినవారిలో బిసిలు కానివారు ఎంతమంది ఉన్నారో తెలియక ప్రజారాజ్యం పార్టీ ఇరకాటంలో పడిపోయింది.

టిక్కెట్ ఆశించిన అభ్యర్ధులు తాము ఫలానా సామాజికవర్గం అని దరఖాస్తులలో పేర్కొన్న దానిని మాత్రమే ప్రమాణికంగా తీసుకుని టిక్కెట్లు ఇచ్చామని, వారు నిజంగా బిసిలా, కాదా , వారి దగ్గర ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయో, లేదో తమకు తెలియదని పార్టీ అగ్ర నాయకులు వాదిస్తున్నారు. దీనికితోడు పార్టీ బలహీనంగా ఉందని సర్వే నివేదికల్లో వెల్లడైన చోట్ల మాత్రమే లెక్కకోసం బిసిలకు టిక్కెట్లు ఇచ్చారని బిసి సంఘాలు చేస్తున్న ఆరోపణలకు ప్రజారాజ్యం నాయకులు జవాబివ్వలేక పోతున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు బలమైన అభ్యర్ధులున్న చోట ప్రజారాజ్యం బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టిందని పరకాల ప్రభాకర్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా మగళవారం నల్గొండ జిల్లా భువనగిరి అభ్యర్ధి వ్యవహరం పార్టీని మరింత ఆత్మరక్షణలోకి నెట్టేసింది.

తాను గెలిచే అభ్యర్ధిని కాదని తెలిసే, తన ప్రత్యర్ధితో కుమ్మక్కై, తనకు టిక్కెట్ ఇచ్చారని భువనగిరి లోక్ సభ నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి చంద్రమౌళి గౌడ్ చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, తెలుగుదేశం కుట్ర వుందని ఆరోపించి వారు చేతులు దులిపేసుకున్నా, ఈ ఉదంతం ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోంది.

×
×
  • Create New...