southyx Posted November 7, 2022 Report Posted November 7, 2022 ‘ఎంప్లాయ్‌మెంట్ సర్వే’ ముసుగులో గ్రామ, వార్డు వాలంటీర్లు కొన్ని రోజులుగా ఇంటింటికీ వెళ్లి అడుగుతున్న ప్రశ్నలివి... మీ ఇంట్లో పట్టభద్రులు ఉన్నారా? వాళ్లేం చేస్తున్నారు? పట్టభద్రుల ఓటర్ల జాబితాలో వారు పేరు నమోదు చేసుకున్నారా? ఏ రాజకీయ పార్టీపై ఆసక్తి చూపిస్తున్నారు? (వైకాపా, తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్, సీపీఐ/సీపీఎం, ఇతర పార్టీలు, తెలియదు) ఎమ్మెల్సీ ఎన్నికలకు వాలంటీర్లను ప్రయోగించిన వైకాపా ఇంటింటికీ వెళ్లి వాలంటీర్ల ఆరా వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకేనంటూ ఎన్నికల సంఘానికి విపక్షాల ఫిర్యాదులు ఈనాడు, అమరావతి ‘ఎంప్లాయ్‌మెంట్ సర్వే’ ముసుగులో గ్రామ, వార్డు వాలంటీర్లు కొన్ని రోజులుగా ఇంటింటికీ వెళ్లి అడుగుతున్న ప్రశ్నలివి. పట్టభద్రులు ఏ రాజకీయ పార్టీపై ఆసక్తి చూపిస్తున్నారో వాలంటీర్లకు ఎందుకు? పట్టభద్రుల ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్నారా లేదా తెలుసుకోవాల్సిన అవసరం వారికేంటి? నిజంగా ఎంప్లాయ్‌మెంట్ సర్వేనే అయితే పట్టభద్రుల రాజకీయ ఆసక్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు? ఇది ఎన్నికల విధుల్లో వాలంటీర్లు భాగస్వామ్యమవటం కాదా? ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదు? రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు అందినప్పుడల్లా వాలంటీర్లకు ఓటరు నమోదు సహా ఏ విధమైన ఎన్నికల పనులనూ అప్పగించొద్దంటూ ఆదేశాలివ్వటమే తప్ప.. వాటి అమలును ఎందుకు పట్టించుకోవట్లేదు? వాటిని బేఖాతరు చేస్తున్న వాలంటీర్లను విధుల నుంచి ఎందుకు తొలగించట్లేదు? వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్న అధికారులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ‘వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి. వైకాపా అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలి’ అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టి మరీ చెబుతుంటే కనీసం వారికి నోటీసులైనా ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్న అధికారులు, ఆదేశాలిస్తున్న వైకాపా ప్రజాప్రతినిధులు మరింతగా చెలరేగిపోతున్నారు. నోటీసులైనా ఇవ్వరా? ‘కడప-అనంతపురం-కర్నూలు (పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల నియోజకవర్గ నుంచి వైకాపా అభ్యర్థిగా వి.రవీంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన్ను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి వాలంటీరు, సచివాలయ ఉద్యోగిపై ఉంది’ అంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్ తాజాగా పిలుపునిచ్చారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశాల్లోనూ ఇలాగే మాట్లాడారు. ఓటరు నమోదు సహా ఏ విధమైన ఎన్నికల పనులనూ వాలంటీర్లకు అప్పగించరాదని ఇప్పటికే నాలుగైదుసార్లు ఎన్నికల సంఘం ఆదేశించింది. వాటిని బేఖాతరు చేసి ఓ మంత్రి... పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని వాలంటీర్లకు చెబుతుంటే ఆమెకు కనీసం నోటీసిచ్చి సంజాయిషీ కోరకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి మేలు చేసేలా... శాసనమండలిలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ సాగుతోంది. గ్రామ, వార్డు వాలంటీర్లు కొన్ని రోజులుగా పట్టభద్రుల వివరాలు సేకరించటం, వారి పేరుతో ఓటరు నమోదు కోసం దరఖాస్తు నింపటం, దరఖాస్తులన్నీ సేకరించి సంబంధిత అధికారులకు ఇవ్వటం వంటివి చేస్తున్నారు. వైకాపాకు అనుకూలమైన వారి పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చి, ప్రతిపక్ష పార్టీలకు మద్దతిచ్చేవారి పేర్లు చేర్చకుండా చూసేందుకే వాలంటీర్లను వినియోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంప్లాయ్‌మెంట్ సర్వే పేరుతో వాలంటీర్లు నిర్వహిస్తున్న సర్వే ఎన్నికలను ప్రభావితం చేయటమేనని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, కె.ఎస్.లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌లు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు వైకాపా కార్యకర్తలేనట! వైకాపా కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు, మంత్రులే పలు సందర్భాల్లో స్వయంగా ప్రకటించారు. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో, అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరంతా బహిరంగంగానే వైకాపా అభ్యర్థుల తరఫున కార్యకర్తల్లా పనిచేశారని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశాయి. వైకాపాలో పనిచేసిన వారికి వాలంటీర్లుగా అవకాశం వైకాపాలో పనిచేసిన వారికి వాలంటీర్ల నియామకంలో అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాం. ఆ పనులు పూర్తయ్యాయి. -2019 ఆగస్టు 12న విశాఖలో నిర్వహించిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలివి. వైకాపా కుటుంబాలకే వాలంటీర్ పోస్టులిచ్చాం పార్టీ అంటేనే కార్యకర్తలు. అలాంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది? వాలంటీర్ పోస్టులు ఇచ్చింది వైకాపా కుటుంబాల వారికే కదా! -2021 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైకాపా సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత మాటలివి వాలంటీర్లు వైకాపా కార్యకర్తల్లాంటి వారు వాలంటీర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల్లాంటివారు. సర్పంచులు చెప్పిన వారినే వాలంటీర్లుగా పెట్టాం. వాలంటీర్లు ఎవరైనా తప్పు చేసినా, వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడినా విధుల నుంచి తొలగిస్తాం. మీరు వాళ్లను అదుపులో పెట్టుకుని ముందుకెళ్లండి. -2022 జూన్ 30న నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులో నిర్వహించిన వైకాపా జిల్లా స్థాయి ప్లీనరీలో పార్టీ సర్పంచులను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు సీఎం అప్పగించిన బాధ్యతనూ నెరవేర్చలేరా? ఎమ్మెల్సీ ఎన్నికలను జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మీకు ఓటర్ల నమోదు బాధ్యతలు అప్పగిస్తే ఎందుకు చేయట్లేదు? ఇప్పటి వరకు ఈ డివిజన్ పరిధిలో వాలంటీర్లు తెచ్చినవి 175 దరఖాస్తులే. డివిజన్ పరిధిలో 200 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోటి తెచ్చినా ఇంకా ఎక్కువే అయ్యేవి. -ఇటీవల విశాఖపట్నం 22వ డివిజన్‌లో వార్డు వాలంటీర్లతో సమావేశంలో వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ విజయనిర్మల ఆగ్రహం ఎన్నికలను ప్రభావితం చేయటమే - కింజరాపు అచ్చెన్నాయుడు, తెదేపా ఏపీ అధ్యక్షుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియను వైకాపా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని చేయిస్తోంది. పట్టభద్రులు ఏ రాజకీయ పార్టీపై ఆసక్తి చూపిస్తున్నారనే వివరాలను వాలంటీర్లు అడగటం ఎన్నికలను ప్రభావితం చేయటమే. వైకాపా అనుకూలుర ఓట్లు మాత్రమే జాబితాలో చేరేలా, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల పేర్లు జాబితాలో లేకుండా వాలంటీర్ల ద్వారా పని చేయిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. వాలంటీర్లకు వివరాలు ఇవ్వొద్దు - విఠపు బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను వినియోగించటం నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. విద్యావంతులు వారి వివరాలను వాలంటీర్లకు ఇవ్వొద్దు. ఫిర్యాదులను కలెక్టర్లకు పంపించి విచారణ జరిపిస్తాం - ముకేష్‌కుమార్ మీనా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వాలంటీర్లు ఎవరైనా ఎన్నికల విధుల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంప్లాయ్‌మెంట్ సర్వే పేరిట వాలంటీర్లు పట్టభద్రుల వివరాలు సేకరిస్తున్నారంటూ తాజాగా రెండు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించి విచారణ చేయిస్తాం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.