ఎన్నో ఏళ్లుగా భారతీయులకు విదేశాల్లో మంచి పేరుంది. మనవాళ్ల కష్టపడే తత్వాన్ని, నిజాయతీని, మంచి నడవడికను, అంకితభావంతో పనిచేసే తీరును ప్రశంసిస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఐరోపా, అమెరికా లాంటి దేశాల్లో పలుచోట్ల కొంతమంది భారతీయుల వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ఉదంతాలూ కనిపిస్తున్నాయి. కొందరు ప్రవాస భారతీయుల అతిచేష్టలే మన పరువుకు భంగకరంగా మారుతున్నాయి.
ప్రవాస భారతీయుల్లో కొందరు తమ వేడుకలను జరుపుకొంటున్న తీరుపై పలు దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఎన్నారైలు చేస్తున్న హంగామా, భారీ వాహన ర్యాలీలు, సినిమా హాళ్లలో చేసే అల్లర్లు, ఆర్భాటాలు స్థానికుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయి. సాధారణంగా పాశ్చాత్య సమాజాలకు నిశ్శబ్దంగా నడుచుకోవడం అలవాటు. భారతీయ సమాజంలో ప్రతిదీ సామూహిక ఉత్సవ నేపథ్యంతో ఉండటంతో, తమ ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని బాహాటంగా అట్టహాసంగా ప్రదర్శించడం ఒక లక్షణంగా కనిపిస్తుంది. దీని వెనక సామాజిక, సాంస్కృతిక, మానసిక కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. ప్రవాస భారతీయుల్లో సైతం ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఇతర దేశాల్లోని భారతీయులు తమ అస్తిత్వ సూచికగా ఆయా వేడుకలను తమదైన సాంస్కృతిక శైలిలో నిర్వహిస్తున్న క్రమంలో సంగీత వాద్యాల మోతతో ఊరేగింపులను ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. విదేశీ గడ్డపై అస్తిత్వాన్ని ప్రదర్శించాలనే అంతర్గత వాంఛ, ప్రవాస భారతీయుల మధ్య తమదైన ప్రత్యేకతను చూపించుకోవాలన్న భావన దీనికి కొంతమేర కారణమవుతున్నాయి.
ప్రతిచోటా మరకలే
ఇటీవల లండన్ నగరంలో జరిగిన ఒక సంఘటన తాలూకు వీడియో వైరల్‌గా మారి ఆసియావాసులు, ముఖ్యంగా భారతీయుల అలవాట్ల తీరుతెన్నులను ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది. లండన్‌లోని ఒక ఏరియాలో కొంతమంది ఉమ్మి వేసిన ఎరుపురంగు మరకలు డస్ట్‌బిన్‌ల దగ్గర, బైపాస్ దారుల్లో గోడలు, మెట్ల దగ్గర కనిపించాయి. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. మన దేశంలో చాలామందికి పాన్, గుట్కా లాంటివి నమిలే అలవాటు ఉంది. దాన్ని విదేశాలకు వెళ్లిన తరవాత కూడా కొనసాగిస్తున్న వారివల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాశ్చాత్య ప్రజలు దీన్ని వ్యక్తుల అలవాటుగా కాకుండా ఒక దేశానికి ఆపాదిస్తూ, ఇదొక అవాంఛిత సాంస్కృతిక దిగుమతిగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా లండన్, బ్రెంట్ వంటి ప్రధాన నగరాలు మొదలుకుని చిన్న పట్టణాలదాకా ఈ సమస్య పెరిగిపోయిందని బ్రిటిషర్లు నిరసిస్తున్నారు. యూకేలో భారతీయులు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో ఎరుపు మరకలు విస్తృతంగా కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవలి ఒక నివేదికలో వెంబ్లీ స్టేడియంలోని ఆ మరకలను తొలగించడానికి 30 వేల పౌండ్లను అంటే సుమారు రూ.35 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆసియా వాసులను, భారతీయులను వారి నైపుణ్యాలు, శ్రామిక శక్తికి గౌరవం ఇచ్చి ఆహ్వానిస్తున్నా, వారిలో కొందరు ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఆమోదనీయం కాదంటున్నారు. మన దేశంలో సైతం కోల్‌కతా, ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, లఖ్‌నవూలాంటి ఏ నగరాన్ని తీసుకున్నా పరిస్థితి దారుణంగా ఉండటం శోచనీయం. కోల్‌కతాలో అద్భుత నిర్మాణంగా పేరొందిన హౌరా బ్రిడ్జి పాన్, గుట్కా మరకల కారణంగా ప్రమాదంలో పడిందని చెబుతున్నారు. హౌరా బ్రిడ్జిని పరిశీలించే ఇంజినీర్లు ఇటీవల ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నో ఉపద్రవాలను, ప్రకృతి విపత్తులను తట్టుకున్న హౌరా బ్రిడ్జి పాన్, గుట్కా మరకలతో నాశనమయ్యే పరిస్థితి దాపురించింది. పాన్, గుట్కాల్లో ఉండే రసాయనాలు బ్రిడ్జిలోని లోహ భాగాలు తుప్పు పట్టడానికి కారణమవుతున్నాయి. మరోవైపు భారతీయ రైల్వేల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రైల్వే బోగీలు పాన్, గుట్కా మరకలతో అపరిశుభ్రతతో కునారిల్లుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం, రైల్వేస్టేషన్‌లు, బోగీల్లోని మరకలను తొలగించడానికి ఏటా దాదాపు రూ.1200 కోట్లు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసే అలవాటు- అటు నగరాల సౌందర్యాన్ని దెబ్బతీస్తోంది. ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని, ప్రభుత్వ యంత్రాంగానికి అనవసర కష్టాన్ని కలిగిస్తుందనేది స్పష్టం.
మరేం చేద్దాం...?
ఇలాంటి విపరిణామాన్ని ఎదుర్కోవడానికి నగర పాలక సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నా, పౌరుల ప్రవర్తనలో మార్పు రావాలి. ఇప్పటికే ఆయా నగరాల కార్పొరేషన్లు సీసీటీవీల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి నియమాలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధిస్తున్నాయి. సామాజిక అవగాహన పెంచేందుకు కొన్ని ప్రాంతాల్లో ‘నో తూతూ క్యాంపెయిన్’ పేరిట చర్యలు చేపట్టారు. ఇవేవీ పూర్తిస్థాయి ఫలితాలు అందించలేకపోతున్నాయి. చట్టపరంగా ఇలాంటి చర్యలను ‘మైనర్ న్యూసెన్సు’గా గుర్తించారు. కానీ, దీనివల్ల తీవ్రమైన పర్యావరణ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. భవనాలు, నిర్మాణాలు, ప్రజారవాణా వ్యవస్థలు, ఇతర మౌలిక వసతులకు నష్టమూ వాటిల్లుతోంది. ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర దేశాల్లో మనకు భారతీయులుగానే గుర్తింపు ఉంటుందని, వ్యక్తులుగా మనం చేసే ప్రతి పనినీ భారత దేశానికే ఆపాదిస్తారన్న సున్నిత విషయాన్ని గుర్తుంచుకోవాలి. విదేశాలకు వెళ్తున్న భారతీయులు తమ వ్యక్తిగత ప్రతిభా సామర్థ్యాలు, నైపుణ్యాలతోనే అక్కడికి ఆహ్వానం అందుకున్నా, వారు తమ దేశానికి ప్రతినిధులమనే సంగతిని మరవద్దు. డాక్టర్లుగా, వ్యాపారులుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ తదితర వృత్తి నిపుణులుగానే కాకుండా, భారతీయ సంస్కృతికి రాయబారులుగా, భారతీయతకు ప్రతినిధులుగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలి.