Jump to content

Recommended Posts

Posted

ఈ వెలుగుల కోసమే... మా పోరాటం!

జై ఆంధ్ర, విశాఖ ఉక్కు, సమైక్యాంధ్ర... ఇలా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నో ఉద్యమాలు... కానీ దేశంలోనే మరెక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానికోసం అమరావతి మహిళా రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం మాత్రం చరిత్రాత్మకం.

 

అమరావతి ఆడపడుచులు

vasu61124-1a.jpg

జై ఆంధ్ర, విశాఖ ఉక్కు, సమైక్యాంధ్ర... ఇలా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నో ఉద్యమాలు... కానీ దేశంలోనే మరెక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానికోసం అమరావతి మహిళా రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం మాత్రం చరిత్రాత్మకం. ఇన్నాళ్లూ తమకు అన్నం పెట్టిన భూమి... అమరావతిగా మారి ఆంధ్రుల అభివృద్ధికి వేదికవ్వాలనే సంకల్పంతో... అంత వరకూ గడప దాటని ఆడవాళ్లు... లాఠీదెబ్బలు తిన్నారు... రక్తం చిందించారు... కర్కశ ఖాకీ బూట్లు   కడుపులో తన్నుతోంటే ఎత్తిన జెండా దించకుండా నిర్బంధాల్ని ఛేదించి 1631 రోజులు అలుపెరగని ఉద్యమం చేశారు. అధికార అహంకన్నా... అతివల ఆత్మాభిమానం గొప్పదని నిరూపించారు. వాళ్ల ఆశలు, ఆకాంక్షలు పండే ఈ రోజున... ఆ ఉద్యమకారిణుల్లో కొందరి గొంతుకలివి..!

vasu61124-1b.jpg

vasu61124-1c.jpg
vasu61124-1d.jpg

vasu61124-1l.jpg


పడకగదుల్లోకీ వచ్చేవారు...
- బండ్లమూడి జ్యోతి, దొండపాడు

vasu61124-1e.jpg

మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనుకున్నాం కానీ... తిండికే దిక్కు లేకుండా పోతుందని ఊహించలేదు. కౌలు రాదు... అప్పులు చేసి నెట్టుకొచ్చాం. మా పరిస్థితేంటని అప్పటి ముఖ్యమంత్రిని నిలదీద్దామంటే కశ్మీరు సరిహద్దుల్లోనూ అంత సైన్యం ఉండదేమో! అంతమంది పోలీసులు ఊళ్లల్లోనే ఉండేవారు. చెట్లు మొత్తం కొట్టేసేవారు. ఆయన ముఖం కూడా కనిపించకుండా పరదాలు కట్టేసేవారు. పగలూరాత్రీ అని లేకుండా పోలీసులు ఇళ్లల్లోకీ, పడకగదుల్లోకీ వచ్చేవారు. డ్రోన్లను ఎగురేస్తుంటే ఆడవాళ్లం స్నానం చేయడానికీ భయపడ్డాం. శిబిరాల్లో ఉన్నప్పుడు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగేవాళ్లం కాదు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్లు సహా ఎన్ని అనారోగ్యాలకు గురయ్యామో! భూములిచ్చిన పాపానికి అయిదేళ్లు నరకమే చూశాం.


ప్రశ్నిస్తే... ఈడ్చుకెళ్లారు
- కె. గోవిందమ్మ, తుళ్లూరు

vasu61124-1f.jpg

రాజధాని కోసం పదెకరాల భూమి ఇచ్చాం. అంతవరకూ దానిపై వచ్చే కౌలే మా జీవనాధారం. రాజధాని తరలింపుతో రోడ్డెక్కక తప్పలేదు. ఈ పోరాటంలో నామీద 12 అక్రమ కేసులు పెట్టారు. నెలలో నాలుగైదు సార్లు కోర్టు చుట్టూనే తిరగాల్సి వచ్చేది. కొవిడ్‌ సమయంలో... ఆర్థిక ఇబ్బందులెన్నో! ఉదయం తీసుకెళ్లి సాయంత్రం వరకూ పోలీసు స్టేషన్‌లోనే ఉంచేవారు. ఈ అరెస్టులూ, కోర్టుల చుట్టూ తిరగడం అవమానంగా అనిపించేది. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌-5జోన్‌ ఏర్పాటు చేస్తున్నందుకు శాంతియుత నిరసన చేస్తున్నాం. అక్కడున్న వారిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే ప్రశ్నించాను. కోపంతో అప్పటి డీఎస్పీ ‘ఏంటే... ఎక్కువ చేస్తున్నావ్‌’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు, ఈడ్చుకెళ్లారు. వైసీపీ మూకలు మాపై రాళ్లు, పెట్రోలు బాటిళ్లు, చెప్పులు విసురుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. ఎంతోమంది ఆడవాళ్లు బెంగపెట్టుకుని, మానసిక క్షోభతో చనిపోయారు. కొత్త ప్రభుత్వంతో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.


చావుని పలకరించి వచ్చా...
- కంభంపాటి శిరీష, రాయపూడి

vasu61124-1g.jpg

నేనో సామాన్య టీచర్‌ని. నా కెరియర్‌ కూడా స్కూల్లోనే ముగిసిపోతుందని అనుకున్నా. కానీ అమరావతి రైతు ఉద్యమంతో మరో మలుపు తిరిగింది. ఉద్యోగానికి రిజైన్‌ చేసి... దళితుల ప్రతినిధిగా మారి ఈ పోరాటమే శ్వాసగా చేసుకున్నా. నాపై 32 కేసులు పెట్టారు. ఉద్యమం 600వ రోజున నన్ను పోలీసులు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. చంద్రబాబునాయుడు అరెస్ట్‌ అవ్వడానికంటే ముందు ఆయన్ని కలుద్దామని వెళితే, పోలీసులు బూటుకాలితో పొట్టలో తన్నారు. పక్కటెముకలు విరగ్గొట్టారు. రక్తపు వాంతులు అయ్యాయి. చావుని పలకరించి వచ్చాను. ఇవన్నీ చూసి మావారికి హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. రెండు స్టంట్లు వేశారు. మరోపక్క బాబు పదోతరగతి. మానసికంగా, శారీరకంగా చెప్పలేనంత హింస, ఒత్తిడి. ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఉన్నవి అమ్ముకుని, నగలు తాకట్టుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించేవరకూ ఉద్యమం ఆపకూడదనే అనుకున్నాం. అనుకున్నది సాధించాం.


మాస్క్‌ పెట్టుకోలేదనీ కేసు పెట్టారు...
- కె. వరలక్ష్మి, మందడం

vasu61124-1h.jpg

మధ్యతరగతి కుటుంబం మాది. ఇంట్లో వంట, గుడిలో దేవుడి సేవ... ఇదే నాకు తెలుసు. అలాంటిది నామీద 27 కేసులు పెట్టారు. భూములిచ్చి, ఎదురు అవమానాలు భరించాం. వయసుతో సంబంధం లేకుండా మా ఫొటోలను మార్ఫింగ్‌లు చేసి సామాజిక మాధ్యమాల్లో చెడు రాతలు రాశారు. పెళ్లికెళ్లినా, పేరంటానికెళ్లినా వెంటాడేవారు. సీఆర్‌డీఏ ఆఫీసుకెళ్లి మా భూముల కౌలు అడిగినందుకో కేసు, మాస్క్‌ పెట్టుకోలేదని మరో కేసు...ఇలా ఎన్నో పెట్టారు. లాఠీ దెబ్బలు తిన్నా. భూములిచ్చి మాకెందుకీ పరిస్థితి అని ఏడవని రోజంటూ ఉండేది కాదు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపించింది.


ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతోంది
- సువర్ణ కమల, తుళ్లూరు

vasu61124-1m.jpg

మాకున్న దాంట్లోనే హాయిగా బతికేవాళ్లం. రాష్ట్రం కోసమనీ, పిల్లల భవిష్యత్తు బాగుంటుందనీ భూమిని త్యాగం చేశాం. అమరావతి నిర్మాణ పనులు చూసి అసలిది మా తుళ్లూరేనా...  అని సంబరపడ్డాం. అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. రాజధాని మార్పు ఆలోచనతో మేం రోడ్డెక్కక తప్పలేదు. తొలిరోజు నుంచీ ఉద్యమంలో ఉన్నా. ఎండలో ఎండాం, వానల్లో నానాం. ఎటుచూసినా పోలీసులే. మా ఇంటికి మేం వెళ్లాలన్నా ఆధార్‌కార్డు చూపించాల్సిందే. ఒక్కోసారి మేం దేశ సరిహద్దుల్లో ఉన్నామా అనిపించేది. రాజధానిలో కంకర, మట్టి, ఇనుము... అన్నీ ఎత్తుకుపోయారు. అవి చూస్తుంటే గుండె తరుక్కుపోయేది. దాంతో గడపగడపకీ తిరిగి ‘అమరావతినీ అభివృద్ధినీ గెలిపించండి’ అని అడిగాం. జనంలో మార్పు వచ్చింది. ఎట్టకేలకు దేవుడు మా మొర ఆలకించాడు. అమరావతి ప్రశాంతంగా నిద్రపోతుందిప్పుడు.


గర్భస్రావం అయ్యింది!
- వై.నాగమల్లీశ్వరి

vasu61124-1j.jpg

మా అమ్మాయి ఎంటెక్‌ చేసింది.. మెట్టినిల్లు జంగారెడ్డిగూడెం. గర్భిణిగా పరీక్షలు చేయించుకోవడానికి పుట్టింటికి వచ్చింది. వాళ్ల నాన్నని అన్యాయంగా పోలీసులు చొక్కా పట్టుకుంటే ఎందుకని అడిగినందుకు, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. బూటుకాలితో పొట్టలో బలంగా తన్నితే గర్భస్రావం అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్తే లోపల కణితిలా ఏర్పడిందన్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఈ సంఘటనని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గడపదాటి ఎరుగని నాపై 20 కేసులు పెట్టారు. అన్నం పెట్టే రైతుల్ని క్రిమినల్స్‌ అన్నారు. చుట్టాలు, వేడుకలు అన్నీ మర్చిపోయాం. టీవీలో వార్తలు తప్ప మరొకటి చూసేవాళ్లం కాదు. మా గోడు వినడానికి ఏ నాయకుడు వచ్చాడన్నా అర్ధరాత్రి కూడా పరుగులు పెట్టేవాళ్లం. విదేశాలకు వెళ్లాల్సిన మా మగపిల్లలపై గంజాయి కేసులు పెట్టేవారు. ఇంటిల్లిపాదికీ బీపీ, షుగర్లు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో మా పెద్దత్తగారు స్ట్రెచర్‌పై వచ్చి మరీ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.


నేలపైనే అన్నం...
- పోలు దుర్గ, అనంతవరం

vasu61124-1i.jpg

రాజధాని కోసం నేను పసుపు కుంకుమగా తెచ్చుకున్న నాలుగెకరాలూ ఇచ్చా. రాష్ట్ర భవిష్యత్తుకోసమే అని సరి పెట్టుకున్నాం. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని అనగానే మా గుండె చెరువయ్యింది. కౌలూ లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ దేవుడికే తెలుసు. మా అబ్బాయిని పై చదువుల కోసం అమెరికా పంపిద్దామని రుణం కోసం బ్యాంకుకి వెళ్లా. మేమిచ్చిన కాగితాలు చెల్లవన్నారు. మా బాధను బెజవాడ కనకదుర్గమ్మకైనా చెప్పుకొందామని వెళ్తుంటే, మహిళా దినోత్సవం రోజు మాపై లాఠీఛార్జి చేసి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. తినడానికి ప్లేట్లు కూడా ఇవ్వకపోతే నేలనే శుభ్రం చేసుకుని అన్నం వడ్డించుకుని తిన్నాం. అమరావతి నుంచి అరసవిల్లికి పాదయాత్ర చేస్తుంటే మమ్మల్ని రాళ్లతో కొట్టారు. ఎన్నో అవమానాల్నీ, నిర్బంధాల్నీ తట్టుకుని నిలబడ్డాం.


కుక్కలతో పోల్చారు!
- బి. ప్రియాంక, మందడం

vasu61124-1k.jpg

రోజూ ఉద్యోగానికి వెళ్లినట్లుగా మా బాబుని స్కూలుకి పంపి నేను ఉద్యమానికి వెళ్లేదాన్ని. తీర్పుల సమయంలో న్యాయమూర్తులు హైకోర్టుకి వెళ్లే దారిలో, మా బాధని గుర్తించమని దణ్ణాలు పెడితే మా ఫొటోలను కుక్కలుగా మార్చి ట్రోల్‌ చేశారు. మా మెడలో బంగారు తాళిని చూపించి వీళ్లు అసలు రైతు కుటుంబాల వాళ్లే కాదన్నారు. ఫొటోలకోసం ఉద్యమం చేస్తున్నామని ఎద్దేవా చేశారు. అన్ని అవమానాలూ తట్టుకుని నిలబడ్డాం. చివరికి ప్రభుత్వం మార్చడం ఒక్కటే మార్గమనిపించి... ‘మన బిడ్డలు వలస కూలీలుగా మిగిలిపోకూడదు. వారి భవిష్యత్తుకోసం ఓటేద్దాం’ అంటూ అవగాహన కలిగించాం. ఫలితం... మీకు తెలిసిందే. ఈ నాలుగున్నరేళ్లలో మాకు ఒక్క పండగా లేదు. చాలా ఏళ్ల తరవాత జూన్‌ నాలుగోతేదీ రాత్రి  ప్రశాంతంగా నిద్రపోయాం.


... ఇలా ఒకరా ఇద్దరా... అమరావతికి సుమారు 33 వేల ఎకరాలు భూములిచ్చిన 29 గ్రామాల మహిళలంతా ముక్తకంఠమై నినదించారు. ‘నమ్మకం నిలువునా శిథిలమైనప్పుడు శకలాలే సైన్యంగా యుద్ధం ప్రకటించు’ అని ఓ విప్లవకవి అన్నట్లుగా అపర కాళికల్లా పోరాడారు. ఉద్యమ కెరటాలై ఎగిసిపడ్డారు. దాడుల్నీ దౌర్జన్యాల్నీ విధ్వంసాల్నీ అవమానాల్నీ తట్టుకుని నిలిచారు. అనుకున్నది సాధించారు. ఉద్యమంలో భాగంగా రోజూ వెలిగించిన దీపాలు... నేడు రాజధానిలో వెలుగులీనుతుంటే వాటిని కళ్లనిండా నింపుకొని ‘అమరావతి అజరామరం’ అంటూ ఆనందంగా నినదిస్తోంది మహిళాలోకం!


Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...