Jump to content

Recommended Posts

Posted

S Jaishankar: ట్రంప్ మధ్యవర్తిత్వం కట్టుకథే.. తేల్చిచెప్పిన జైశంకర్ 

23-05-2025 Fri 09:37 | International
Jaishankar Rejects Trump Mediation Claims in India Pakistan Ceasefire
 

 

  • ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనను కొట్టిపారేసిన జైశంకర్
  • భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రత్యక్ష చర్చల ఫలితమే
  • మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టీకరణ
  • ఉగ్రవాదం ఆపితేనే పాక్‌తో చర్చలకు సిద్ధం
  • పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఆందోళన
  • పహల్గామ్ దాడి తర్వాత 'ఆపరేషన్ సిందూర్' సక్సెస్
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే సాధ్యమైందని, ఇందులో మరో దేశ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.

నెదర్లాండ్స్‌లో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఇది కేవలం భారత్, పాకిస్థాన్ దేశాలు నేరుగా పరిష్కరించుకోవాల్సిన విషయం" అని అన్నారు. సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదాన్ని అరికట్టే అంశానికి ప్రాధాన్యతనిస్తూ, పాకిస్థాన్‌తో చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉందని ఆయన పునరుద్ఘాటించారు. "మేము చర్చలకు ఎప్పుడూ సిద్ధమే, కానీ ఆ చర్చలు సీరియస్‌గా ఉండాలి, ఉగ్రవాదాన్ని ఆపే విషయంపై దృష్టి సారించాలి" అని జైశంకర్ వివరించారు.

గతంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ రెండు దక్షిణాసియా దేశాల మధ్య ‘వేల సంవత్సరాల సంఘర్షణ’లో శాంతి నెలకొల్పడానికి అమెరికా సహాయపడిందని పేర్కొన్నారు. అయితే, కశ్మీర్ సమస్యతో పాటు ఇతర ఉద్రిక్తతలు పూర్తిగా ద్వైపాక్షిక అంశాలని, వీటికి బయటి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ మొదటి నుంచీ స్పష్టం చేస్తూ వస్తోంది.

1947లో దేశ విభజన నాటి నుంచి భారత్-పాకిస్థాన్ సంబంధాల చారిత్రక సంక్లిష్టతలను కూడా జైశంకర్ ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గిరిజన మిలీషియాల ముసుగులో పాకిస్థాన్ సైనికులను కశ్మీర్‌లోకి పంపడంతోనే ఆ దేశ వైఖరి మొదలైందని, వీరిలో కొందరు యూనిఫాంలో, మరికొందరు సాధారణ దుస్తుల్లో ఉన్నారని తెలిపారు. చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్ తీవ్రవాద మార్గాన్ని అనుసరిస్తూ, సరిహద్దు ఆవలి నుంచి ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్‌పై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. 
Posted

Indigo Airlines: ప్రమాదంలో ఉన్నామని చెప్పినా ఇండిగో విమానానికి దారివ్వని పాకిస్థాన్! 

23-05-2025 Fri 08:08 | National
Indigo Flight Faces Turbulence Pakistan Refuses Airspace
 

 

  • ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం
  • వడగళ్ల వాన నుంచి తప్పించుకునేందుకు పాక్ గగనతలం కోరిన పైలట్
  • అనుమతి నిరాకరించిన లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో పాకిస్థాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ2142 విమానం 227 మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో, అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫానులో చిక్కుకుంది. దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు.

వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ తక్షణమే స్పందించాడు. సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ను సంప్రదించి, తుఫాను నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు. అయితే, పాకిస్థాన్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దీంతో పైలట్, ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించి, తీవ్రమైన కుదుపులను తట్టుకుంటూ విమానాన్ని నడిపారు.

సాయంత్రం 6:30 గంటల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర పరిస్థితిని వివరించిన అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానం ముందు భాగంలోని ముక్కు (నోస్) దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి. అయితే, విమానానికి మరమ్మతులు అవసరమవడంతో దానిని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’ (ఏవోజీ)గా ప్రకటించి, తాత్కాలికంగా సేవలకు దూరంగా ఉంచారు.

గతంలో పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాకిస్థాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసిన విషయం తెలిసిందే. అలాగే, భారత గగనతలంలోకి పాకిస్థానీ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Posted

Ahmed Sharif Chaudhry: "మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం".. భారత్‌ను హెచ్చరించిన పాక్ సైనిక ప్రతినిధి 

23-05-2025 Fri 08:07 | International
Ahmed Sharif Chaudhry Warns India on Water Sharing
 

 

  • సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక
  • ఉగ్రవాది హఫీజ్ సయీద్ వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన పాక్ సైనిక ప్రతినిధి
  • "మా నీళ్లు ఆపితే, మీ ఊపిరి ఆపుతాం" అంటూ వ్యాఖ్య
  • ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు ఒప్పందం నిలిపివేత అని భారత్ స్పష్టం
  • ఆక్రమిత కశ్మీర్‌ను ఖాళీ చేయడంపైనే చర్చలన్న భారత విదేశాంగ శాఖ
  • రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవన్న ప్రధాని మోదీ
సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్‌కు పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ గతంలో ఉపయోగించిన పదజాలాన్నే ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం. ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ, "మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మీ ఊపిరిని అడ్డుకుంటాం" అని చౌదరి భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా గతంలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం, ఏప్రిల్ 23న భారత్ సింధు జలాల ఒప్పందంలోని కొన్ని భాగాలను నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించినది.

ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా, శాశ్వతంగా ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని జైస్వాల్ పునరుద్ఘాటించారు. "నీరు, రక్తం కలిసి ప్రవహించవు" అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.

అంతకుముందు, రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్థాన్ "ప్రతి పైసా కోసం కష్టపడాల్సి వస్తుందని" హెచ్చరించారు. "భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాకిస్థాన్‌కు చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది" అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
Posted

Shehbaz Sharif: 1971 నాటి యుద్ధానికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పహల్గామ్ ఘటనపై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని 

23-05-2025 Fri 07:44 | National
Shehbaz Sharif Claims Revenge for 1971 War After Pahalgam Attack
 

 

  • పహల్గామ్ దాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసంబద్ధ వ్యాఖ్యలు
  • ఆపరేషన్ సిందూర్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం
  • పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తునకు సిద్ధమన్న షరీఫ్
  • భారత్ దర్యాప్తు ప్రతిపాదనను తిరస్కరించిందని ఆరోపణ
  • ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చేవని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను దురదృష్టకరమని చెబుతూనే, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971 యుద్ధంలో ఎదురైన ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధంగా మాట్లాడారు. ఇటీవల భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత ప్రమాదకరమైన మలుపు తీసుకునేదని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ముజఫరాబాద్‌లో మరణించిన వారి కుటుంబ సభ్యులను షెహబాజ్ షరీఫ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ "పహల్గామ్ ఘటన చాలా దురదృష్టకరం. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణమైనా తీవ్ర రూపు దాల్చే పరిస్థితులు నెలకొన్నాయి" అని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని తాము కోరినప్పటికీ, భారత్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని షరీఫ్ ఆరోపించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...