Jump to content

Recommended Posts

Posted

 

Kalvakuntla Kavitha: కేటీఆర్ పేరెత్తకుండా తీవ్రంగా విరుచుకుపడిన కవిత.. కొత్త పార్టీపై స్పందన 

29-05-2025 Thu 12:23 | Telangana
Kalvakuntla Kavitha Criticizes KTR Indirectly on BRS Affairs
 

 

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజం
  • పార్టీని నడిపే సత్తా లేనివారు తనకు నీతులు చెబుతున్నారని ఘాటు వ్యాఖ్యలు
  • తాను అడ్డుగా ఉన్నాననే కొందరు తనను దూరం పెట్టాలని చూస్తున్నారని ఆరోపణ
  • కాంగ్రెస్ పార్టీతో 2013 తర్వాత తాను మాట్లాడలేదని కవిత స్పష్టీకరణ
  • తాను కూడా కేసీఆర్ లాగే మొండిదాన్నని, ఎవరికీ భయపడనని వ్యాఖ్య
  • వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలాగని ప్రశ్న
బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరోక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె, తాను చివరిసారిగా కాంగ్రెస్‌తో మాట్లాడింది 2013లోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు 101 శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

కేటీఆర్‌పై పరోక్ష విమర్శలు

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా, కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలా అని కవిత కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పార్టీని నడిపించే సత్తా లేనివారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. తాను లేఖ ఎందుకు రాశానని అంటున్నారని, గతంలో వంద లేఖలు రాశానని, వాటిని కేసీఆర్ చదివాక ప్రతిసారీ చించివేసేవారని గుర్తు చేసుకున్నారు. ఈసారి తన లేఖ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఒక నాయకుడికి నోటీసులు వస్తే లేని హడావుడి, మరో నాయకుడికి ఇస్తే ఎందుకని ఆమె నిలదీశారు. తనపై మద్యం కుంభకోణం విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని చెప్పారని కవిత గుర్తుచేశారు.

నన్ను అణగదొక్కాలని చూస్తున్నారు

తాను పార్టీకి అండగా ఉన్నప్పటికీ కొందరు తనను దూరం పెట్టాలని చూస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా కేసీఆర్ లాగే "తిక్కదాన్ని" అని, ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. తన ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతర్గత విషయాలపై తాను రాసిన లేఖను ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. పార్టీ చేయాల్సిన పనుల్లో సగం తానే చేస్తున్నానని, కడుపులో బిడ్డను పెట్టుకుని ఊరూరా తిరిగానని ఆమె అన్నారు.

పార్టీ ఫోరంపై అసంతృప్తి

పార్టీ ఫోరంలో మాట్లాడమని అంటున్నారని, ఫోరం లోపల ఏముందని, అందుకే బయట మాట్లాడుతున్నానని కవిత తెలిపారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, తాను ముందొకటి వెనుక మరొకటి మాట్లాడనని అన్నారు. వరంగల్ మీటింగ్ విజయవంతమైందని చెప్పుకునే వారిని చూసి జనం నవ్వుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. "లీకు వీరులను బయటపెట్టమంటే, గ్రీకు వీరుల్లా నాపై విరుచుకుపడుతున్నారు" అని కవిత వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌తో భేటీపై సస్పెన్స్

తాను కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది చెప్పనని, దానికి ఎలాంటి డెడ్‌లైన్ లేదని కవిత తెలిపారు. కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, ఉన్న పార్టీని కేసీఆర్ కాపాడుకుంటే చాలని సూచించారు. కొందరు తామే కేసీఆర్‌ను నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, ఆయనను నడిపించే వారు ఉన్నారా అని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని కవిత వ్యాఖ్యానించారు. పెయిడ్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వంలోనూ పని చేసేది లేదని స్పష్టం చేశారు.
Posted

Kavitha: సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారు... నాకు కేసీఆర్ మాత్రమే నాయకుడు: కవిత సంచలన వ్యాఖ్యలు 

29-05-2025 Thu 11:36 | Telangana
Kavitha Alleges Conspiracy by Own Party Leaders Says KCR Only Leader
 

 

  • కేసీఆర్‌కు నోటీసులిచ్చినా నేతలు స్పందించలేదని ఆవేదన
  • పార్టీలో కోవర్టులున్నారని, తన ఫీడ్‌బ్యాక్ లీక్ చేశారని ఆరోపణ
  • సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌పై పూర్తి విధేయతను ప్రకటించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు ఎదురైన అనుభవాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

నా ఫీడ్‌బ్యాక్‌ను లీక్ చేశారు

పార్టీలోని కొందరు నేతల ప్రవర్తనపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే కూడా నాయకులెవరూ స్పందించకపోతే ఎలా?" అని ఆమె ప్రశ్నించారు. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని, వారు తనకు నీతులు చెబుతున్నారని ఆరోపించారు. "నా మీద పడి ఏడిస్తే ఎలా?" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని, దాన్ని అరికట్టమని కోరితే, పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తనపైనే విమర్శలు చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు. "ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా?" అని ఆమె నిలదీశారు.

కుట్రపూరితంగా నన్ను ఓడించారు

గతంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను కూడా కవిత ప్రస్తావించారు. లిక్కర్ కేసు వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు తాను పదవికి రాజీనామా చేస్తానని చెప్పగా, కేసీఆర్ వద్దని వారించారని తెలిపారు. అంతేకాకుండా, తాను ఎంపీగా పోటీ చేసిన సమయంలో పార్టీలోనే కొందరు కుట్రపూరితంగా తనను ఓడించారని సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని కవిత స్పష్టం చేశారు. "కేసీఆర్‌ మాత్రమే నాకు నాయకుడు" అని ఆమె దృఢంగా ప్రకటించారు.

బీజేపీలో కలపాలని చూస్తున్నారు

బీఆర్ఎస్‌ను బీజేపీలో కలపాలని కొంతమంది చూస్తున్నారని కవిత ఆరోపించారు. బీజేపీలో విలీనం చేయవద్దని తాను జైల్లో ఉన్నప్పుడే చెప్పానని ఆమె తెలిపారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Posted

Kavitha Kalvakuntla: కొత్త పార్టీ వార్తలపై తీవ్రంగా స్పందించిన కవిత, పత్రికపై ఆగ్రహం 

28-05-2025 Wed 18:32 | Telangana
Kavitha Kalvakuntla Responds Angrily to New Party Rumors
 

 

  • కొత్త పార్టీ ఏర్పాటు వార్తలను ఖండించిన ఎమ్మెల్సీ కవిత
  • సోషల్ మీడియా కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత
  • తనను సంప్రదించకుండా వార్తలు రాశారని ఓ పత్రికపై ఫైర్
  • అది జర్నలిజమా లేక శాడిజమా అంటూ ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, ఒక దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. "కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా?" అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కవిత చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

కొంతకాలంగా తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. జాగృతికి అనుబంధ సంఘాలను వరుసగా ప్రకటించడం, సంస్థ కార్యకలాపాలను విస్తరించడం వంటి పరిణామాలతో ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్‌కు ఆమె ఒక లేఖ రాయడం, ఆ తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళే ముందు జాగృతి అనుబంధ సంఘాల బాధ్యులను ప్రకటించడం వంటివి ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి.

సామాజిక మాధ్యమాల్లో అయితే ఏకంగా పార్టీ పేరు కూడా ఖరారైందని, కేసీఆర్ పంపిన దూతలతో కవిత జరిపిన మంతనాలు విఫలమయ్యాయని కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన కవిత తన కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ కథనాలన్నింటినీ కవిత ఖండించారు. తనను సంప్రదించకుండా అవాస్తవాలు ప్రచురించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
Posted

 

Raja Singh: కవిత మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వాస్తవమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ 

29-05-2025 Thu 14:23 | Telangana
Raja Singh says Kavithas comments are true
 

 

  • ఆఫ్ ది రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్న రాజాసింగ్
  • పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో కలుస్తారని వ్యాఖ్య
  • అభ్యర్థుల ఎంపిక కూడా వారే నిర్ణయిస్తారని ఆరోపణ
  • గతంలోనూ ఇలాంటి కుమ్మక్కులతో పార్టీ నష్టపోయిందని ఆవేదన
  • సొంత నేతల వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని విమర్శ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆఫ్ ద రికార్డులో చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన సమర్థించారు. పెద్ద మొత్తంలో ప్యాకేజీ లభిస్తే బీజేపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీతోనూ కలిసిపోతారని ఆయన ఆరోపించారు.

రాజాసింగ్ మాట్లాడుతూ, "భారీ ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌తో కలిసిపోతారు. అంతేకాకుండా, బీజేపీ తరఫున ఎవరు, ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా వారే నిర్ణయిస్తారు. గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానివల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయింది" అని తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ కొందరు బీజేపీ నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారని, ఈ అంతర్గత కుమ్మక్కుల వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజాసింగ్ సూచించారు. "వాస్తవానికి మన పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇతర పార్టీల నాయకులతో మన సొంత పార్టీ నేతలు కుమ్మక్కు కావడం అందరికీ తెలిసిన విషయమే" అని ఆయన వ్యాఖ్యానించారు. 

 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...