Jump to content

Happy birthday Rajanala - king of villains.


Recommended Posts

Posted

ఎన్టీయార్‌, అక్కినేని నాగేశ్వర్రావు, కాంతారావు.. హీరోలు ఎంత వారైనా సరే ఈయన లేకుంటే ఆ సినిమా చప్పనే. ముష్టి యుద్ధాలనుంచి కత్తి తిప్పడం వరకూ ఆయన సిద్ధహస్తుడు. రాజు వెనకాలో, రాణి తమ్ముడుగానో, యువరాణి బావగానో తెరపై రాజనాల కనిపిస్తే చాలు అప్పట్లో జనాలు భయపడేవారట.ఏం మోసం చేస్తాడో, ఎవరిని చంపుతాడో అని ప్రేక్షకులు టెన్షన్‌తో సినిమా చివరి వరకు తెగ ఆసక్తిగా చూసేవారు.

 

bmbmb.jpg

వెండితెరపైన ఈయన మంచివాడిగా కనిపించేదాని కంటే మాయావి, మోసగాడు, జిత్తులమారి, మేక వన్నెపులిగా కనిపిస్తేనే ప్రేక్షకుల కడుపు నిండుతుంది. ఈ వెండితెర విలన్‌ నిజజీవితంలో గొప్ప ఆశావాది. కళాప్రేమికుడు. మంచి మనసున్నవాడు.

images?q=tbn:ANd9GcS5m6s9w_QJAmvr_MFAYYE

రాజనాల గురించి కొన్ని జ్ఞాపకాలురాజనాలను రాజ్‌ అని కొందరు పిలుచుకునేవారు. రాజనాల పూర్తిపేరు రాజనాల కాళేశ్వరరావు. రాజనాల కల్లయ్య అంటూ చాలామంది పిలిచేవారు.

అయితే ఆయన ఇంటిపేరే సొంతపేరు అయ్యింది. అదే తెరపేరు అయ్యింది. నెల్లూరి జిల్లాలోని కావలిలో జన్మించాడు రాజనాల. 1948 సమయంలో నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. తన స్నేహితుడి సాయంతో మద్రాసు వెళ్లి అక్కడ ‘ప్రతిజ్ఞ’ అనే చిత్రంతో నెగటివ్‌ షేడ్‌ ఉండే పాత్రలో నటించాడు. ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలో చెలరేగిపోయాడు. సినిమా ఏదైనా తన కళ్లతో, తన యుద్ధ విన్యాసాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాడు. క్రూరమైన చూపు, ఆ వికటాట్టహాసం నవ్వు గురించి ఎంత చెప్పినా తక్కువ. సినిమాల్లో హీరో పాత్రకు ఏమాత్రం వన్నెతగ్గని ప్రతినాయకుడు రాజనాల!

🌳నట జీవితం ఆద్యంతం ఆసక్తిదాయకం
కావలిలో ప్రాథమిక విద్యనభ్యసించిన రాజనాల 5వ తరగతిలో ఉండగా జబ్బున పడ్డారు. జబ్బు నయం అయినా.. స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దనే చదువుకుని 8వ తరగతిలో మళ్లీ స్కూల్లో చేరారు. స్కూల్‌ ఫైనల్‌ అయినా తర్వాత ఇంటర్మీడియట్‌ చదువుతూ మధ్యలో ఆపేసిన రాజనాల సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు హాజరై 1944లో రెవెన్యూ శాఖలో గుమస్తాగా చేరారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే.. నాటకాల పట్ల ఉండే ఆసక్తితో రంగస్థలంపై తరచూ నాటకాలు వేస్తుండేవారు. అలా నాటకాలు వేస్తున్న తరుణంలో ఆయన సహచర నటుడు లక్ష్మీ కుమార్‌ రెడ్డితో మంచి స్నేహం ఏర్పడింది. నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ పేరుతో సంస్థను స్థాపించిన ఈ ఇద్దరు అప్పట్లో ఆత్రేయ రాసిన నాటకాలను రంగస్థలంపై వేయడం రివాజు. రాజనాల, లక్ష్మీ కుమార్‌ రెడ్డి కలసి అలా ఆత్రేయ నాటకం 'ఎవరు దొంగ' వేస్తూ ఉండేవాళ్లు.

అలా ఓసారి ఈ నాటకాన్ని చూసేందుకు వచ్చిన కలెక్టర్‌ ఆ నాటకంలో రాజనాల ప్రభుత్వంపై పదునైన డైలాగులు చెప్పడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత మరోసారి ప్రగతి అనే నాటకాన్ని కూడా చూసిన కలెక్టర్‌ రాజనాలను 3 నెలలు సస్పెండ్‌ చేసారు. ఈ లోపున రాజనాల స్నేహితుడు లక్ష్మీ కుమార్‌ రెడ్డి చెన్నై‌ వెళ్లి అక్కడ హెచ్‌. ఎం. రెడ్డి సినిమాల ఆఫీసులో చేరారు. అంతకు ముందు నిర్దోషి సినిమాని తీసిన హెచ్‌.ఎం.రెడ్డి ఈసారి కొత్తవాళ్లతో ప్రతిజ్ఞ అనే సినిమా తీయాలని సంకల్పించడం.. అక్కడే ఉన్న లక్ష్మీ కుమార్‌ రెడ్డి ద్వారా సమాచారం తెలుసుకున్న రాజనాల కూడా ప్రయత్నించి ఆ సినిమాలో విలన్‌ పాత్ర వేయడం.. ఆయన జీవితంలో ఓ మలుపు. ఈ సినిమాలో తాను హీరోగా వేస్తానని రాజనాల పట్టు పట్టారు. అయితే, కాంతారావుని హీరోగా తీసుకుని రాజనాలను విలన్‌ పాత్రకి ఒప్పించారు. 

🌳అదే ఆయన రికార్డు
ఆ రోజుల్లో తమిళ సినిమాల్లో యంజీఆర్‌ లాంటి బడా హీరోలకు పెద్ద విలన్‌ నంబియార్‌. ఈ సుప్రసిద్ధ విలన్‌ తర్వాతనే ఏ విలన్లయినా.    అయితే రాజనాల గురించి చెబితే.. ఒక్కమాటలో ‘తెలుగు సినీ నంబియార్‌’! జానపద బ్రహ్మ శ్రీ విఠలాచార్య సినిమా తీశారు అంటే అందులో ఎంజీయార్‌, టి.ఎస్‌. కాంతారావుగారితో పాటు నంబియార్‌ లాంటి రాజనాలగారు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. మాయలమరాఠీ, మంత్రాల ఘనాపాటి రాజనాలగారికి, కాంతారావుగారికి కత్తియుద్ధాలు, మంత్రతంత్రాలు ఉండితీరవలసిందే. లేకపోతే దానికి విఠలాచార్య గారి ట్రేడ్‌ మార్క్‌ లేనట్లే! చివర్లో కాంతారావు పాత్ర గెలవడం రాజనాల పాత్ర నీరుగారిపోవడం సామాన్యమే. దాన్నే ఆంగ్లంలో ‘పొయెటిక్‌ జస్టిస్‌‘ అంటారు.

రాజనాల విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రాలలోని విలన్‌లను మేకప్‌ చేయించుకుని, హావభావాలు ప్రదర్శించడం, ముఖ్యంగా చైనా దేశపు వారిలో వస్త్రధారణ తనదైన స్వంత బాణీలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు. వారు ఓ చలన చిత్రంలో స్వంతంగా ఒక పాటకూడా పాడారు. 1960ల్లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించాడు. ఇలా హాలీవుడ్‌లో నటించిన తొలి తెలుగువాడు ‘రాజనాల’ కావటం విశేషం.

🌳కన్నఊరినీ, పేదరికాన్ని మర్చిపోలేదు
పాతికేళ్లపాటు ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా తెలుగు, తమిళ చిత్రపరిశ్రమను ఏలాడు రాజనాల. ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. అయినా సరే రాజనాల తన సొంత ఊరును, తను బాల్యంలో అనుభవించిన పేదరికాన్ని మరువలేదు. ఓసారి కావలి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఓ సన్మానసభ ఉంది. దాన్ని అభిమానులు ఏర్పాటు చేశారు. కావలిలోనే గ్రామదేవత శ్రీ శాంభవిమాత ఆలయం ఉంది. ఆమె పార్వతీరూపం అని నమ్మకం ప్రజలకు. ఆ ఆలయం ఎదురుగా ఒక దిగుడుబావి ఉండేది. గ్రామంలో అన్ని బావులలో నీరు ఇంకిపోయినా ఆ బావిలో నీరు ఎల్లవేళలా ఉండటం మహాత్మ్యంగా విశేషంగా భావించేవారు అక్కడి భక్తావళి. రాజనాల ఆసభలో ఇలా అన్నారు- ‘నేను చిన్నప్పుడు ఈ బావిలోని నీటిని బిందెలో దింపి భుజంపై పెట్టుకుని మోసుకుని ఇంటికి తీసుకుపోయేవాడిని. ఆ రోజులను ఎప్పుడూ నేను మరిచిపోలేదు. మరిచిపోను’’ అన్నారు. అంతకాదు. వారు శాంభవిమాతకు ఆరోజుల్లోనే ఎంతో విలువైన వెండిపళ్లేన్ని కానుకగా సమర్పించి తన భక్తిప్రపత్తులు మరో మారు ప్రదర్శించారు. ఆలయంలోని బావితవ్వకానికి శ్రీ కసవరాజు వంశీయులు సాయంచేసినట్లు!

🌳అందరి అడ్డా రాజనాల తోట!
తన ఊరికి దగ్గర్లోనే ముసనూరు అనే ప్రాంతంలో ఆయనకు ఓ తోట ఉండేది. ఎంతో విశాలమైంది. విలువైనది. ఎన్టీయార్‌ లాంటి సినిమాస్టార్లు వచ్చినా తన తోటకు రాజనాలగారు ఆహ్వానించేవారు. చాలామంది ఆ తోటను విడిదిగా చేసుకునేవారు. ఆ తర్వాత కాలానుగుణంగా ఆ తోటను ఒక డాక్టర్‌ గారు కొనుగోలు చేశారు. నాలుగు దశాబ్దాలపాటు 400పైన చిత్రాల్లో నటించారు రాజనాలకు మధుమేహం వచ్చింది. అది రాజనాల గారి జీవితాన్ని మార్చివేసింది. నిమ్స్‌ వైద్యశాలలో ఇక చికిత్స ఏమీ చేయలేమని వైద్యులు ఆయన అనుమతితో ఒక కాలు తీసివేశారు. అయినా రాజనాల ఆశావాదం వీడలేదు. ఆయనను అప్పట్లో కలసిన జర్నలిస్టులు విచారం వెలిబుచ్చగా ఆయన నవ్వుతూ ఇలా అన్నారు- ‘‘ఒక కాలు పోతే బాధ ఎందుకండీ? ప్రపంచంలో రెండు కళ్లూ లేనివారు ఎందరో ఉన్నారు. వాళ్లతో పోలిస్తే, నాకు ఎలాగూ ఒక కాలు ఉంది. కనుక అదృష్టవంతుడిని కదండీ నేను’ అన్నారు ఆశాజీవి. విధి వికటించినా ఏ మాత్రంతొణకని, బెణకని.. భయపడని విలన్‌ ‘రాజనాల’.

🌳ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం
వద్దంటే డబ్బు చిత్రంలో వయసుకు మించిన వృద్ధుడి పాత్రలో కూడా రాజనాల మెప్పించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ కథానాయకుడు. ఎన్టీఆర్‌కు మామ పాత్రలో రాజనాల వేయడం వల్ల అప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఆయన్ను మామాజీ అని పిలవడం అలవాటు చేసుకున్నారు. 1958లో రామాంజనేయ యుద్ధం చిత్రంలో రాజనాల హనుమంతుడి పాత్ర వేసి మొప్పు పొందారు. అప్పటి నుంచి ఆయన హనుమాన్‌ భక్తుడిగా మారారు. కాంతారావుతో కలసి బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేవారు. అలాగే.. ఎన్టీఆర్తో కలసి పోలీస్‌ సంక్షేమ నిధి, దేశ రక్షణ నిధిలాంటి కార్యక్రమాల్లో రాజనాల పాల్గొనేవారు.

రాజనాల విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రాలలోని విలన్‌లను మేకప్‌ చేయించుకుని, హావభావాలు ప్రదర్శించడం, ముఖ్యంగా చైనా దేశపు వారిలో వస్త్రధారణ తనదైన స్వంత బాణీలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు. వారు ఓ చలన చిత్రంలో స్వంతంగా ఒక పాటకూడా పాడారు. 1960ల్లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనేహాలీవుడ్‌ చిత్రంలో నటించాడు. ఇలా హాలీవుడ్‌లో నటించిన తొలి తెలుగువాడు ‘రాజనాల’ కావటం విశేషం.

🌳వ్యక్తిగత జీవితం దుర్భరం
రాజనాల వ్యక్తిగత జీవితం దుర్భరంగా సాగింది. ప్రేమించి పెళ్లాడిన భార్య 1969లో చనిపోవడం ఆయన్ని ఎంతగానో కలచివేసింది. 1984లో పెద్ద కొడుకు కులవర్ధన్‌ చనిపోయారు. చిన్న కొడుకు అదృశ్యమైపోయాడు. చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసిన రాజనాల చరమాంకంలో ఆర్ధిక ఇబ్బందుల్లో మునిగిపోయారు. చెన్నైలో వెండితెర వైభవాన్ని అనుభవించిన ఆయన.. తన రెండో భార్య భూదేవి తోడుగా హైదరాబాద్‌ వచ్చి అమీర్‌పేటలోని సారథి స్టూడియో వెనుక రూబీ అపార్టుమెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సింగిల్‌ బెడ్‌ రూంలో తలదాచుకున్నారు. ఆనాటి వైభవ చిహ్నాలైన కార్లు, బంగళాలు అన్నిటినీ కోల్పోవడమే కాకుండా షుగర్‌ వ్యాధితో ఓ కాలును కూడా పోగొట్టుకుని జీవితంపై ఆశలు వదులుకున్నారు.

హైదరాబాద్‌ వచ్చిన తర్వాత చిన్న, చితకా వేషాలు వేస్తూ కాలక్షేపం చేసేవారు. షూటింగులకు రెండో భార్య భూదేవి తోడుగా వచ్చేది. రాజనాల, నాగభూషణం ఇద్దరినీ తీసుకుని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నంబర్‌ వన్' చిత్రంలో అవకాశం ఇచ్చి గౌరవించారు.

 

 

తెలుగు వీర లేవరా చిత్రం కోసం అరకు లోయ వెళ్లిన రాజనాలకు అక్కడ కాలికి గాయం అయింది. షుగర్‌ కూడా తోడవడం వల్ల ఓ కాలు తీసి వేయాల్సి వచ్చింది. జీవితంలో భీమాంజనేయం పేరుతో సొంతంగా ఓ సినిమా తీయాలనే కోరిక కూడా ఆయన తీర్చుకోలేకపోయారు. చివరికి అన్ని బాధల నుంచి విముక్తిగా 1998 మే 21న తనువు చాలించారు.

1200px-Sarathi_studios,_Ameerpet.jpg

 

  • Upvote 1
Posted

జెమినీ వాసన్ గారు 'ఆడబ్రతుకు' 1964 సినిమా కథ ఖరారు చేస్తూ తెలుగులో ఆయా పాత్రలకు నాయకుడు గా రామారావు గారినీ, రెండవ హీరో గా కాంతా రావుని, నాయిక గా దేవికను, ప్రతినాయకుడు గా రాజనాల ను బుక్ చేయమని తమ మేనేజర్ కి చెప్పారు. అందరూ అగ్రిమెంట్ అయ్యాక చివరిగా రాజనాల దగ్గరా వెళ్లి అయ్యా పలానా కథ అందులో మీది ప్రతినాయక వేషం అని కాల్షీట్స్ అడిగారట. మీరు రామా రావుకి ఎంత యిస్తున్నారు అని అడిగారట కాంతా రావుకు 7000, రామారావు కు, రంగారావుకి చెరి 10,000 అన్నారట. అయితే 14,000 ఇస్తే గానీ నేను ఈ వేషం వేయను అన్నారట రాజనాల. అదేమిటి అని మేనేజర్ తల పట్టుకోగా అయ్యా హీరో దగ్గర తన్నులు నాకే, హీరోయిన్ ఏమో నాయకునికి, పైగా మా చెడ్డ వాడు ఈ రాజనాల అంటూ ప్రేక్షకులు దగ్గర చీవాట్లు, శాపనార్తాలు కూడా నాకే.. అదే సినిమా రామారావు సినిమా అంటారు కానీ ఇందులో రాజనాల ఉన్నారు అంటారా ప్రేక్షకులు అసలు అన్నాడట. ఈ విషయాలు మేనేజర్ ద్వారా విన్న జెమినీ వాసన్, దర్శకుడు వేదాంతం రాఘవయ్య నవ్వాపుకోలేక ఈ పాత్రలో మీరు లేకపోతే సినిమా తేలిపోతుంది అలాగే కానివ్వండి అంటూ జెమినీ వాసన్ 14,000 చెక్ వ్రాసి ఇచ్చి పంపారట. అలా హీరో కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ కొన్ని చిత్రాలకు తీసుకున్న నటుల్లో రాజనాల గారు ఒకరు అప్పటిలో.

 

క్రౌర్యపు పాత్రలకు పెట్టింది పేరయిన రాజనాల కాళయ్య లేదా కాళేశ్వర రావు గారి జయంతి నేడు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...