Jump to content

Recommended Posts

Posted

జంధ్యాల' అని పిలువబడే ఈ హాస్యబ్రహ్మ పూర్తి పేరు, శ్రీ జంధ్యాల వీరవెంకటదుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రి.

psr_retro_2.jpg

వీరు 1951 జనవరి, 14 న మకర సంక్రాంతి పర్వదినాన, నరసాపురంలో శ్రీ నారాయణమూర్తి, శ్రీమతి సూర్యకాంతం అనబడే దంపతులకు, జన్మించారు. విజయవాడలోని S.R.R&C.V.R కళాశాలనుండి commerce లో డిగ్రీ సంపాదించారు. చదువుకునే సమయంలోనే, వీరికి నటన మీద, నాటిక రచనల మీదా చాలా ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో, వీరు రచించి, నటించిన 'ఏక్ దిన్ కా సుల్తాన్' అనే నాటిక చాలా ప్రదర్శనల ద్వారా విశేష ప్రచారం పొందింది. జంధ్యాల నటించిన, ఆ నాటికను, గుంటూరులోని ఏకా దండయ్య పంతులు గారి హాల్లో, నేనూ చూసాను.

 

FB-IMG-1768674861527.jpg

చక్కని హావభావాలు, గంభీరమైన గాత్రం, modulation తో నన్ను మంత్ర ముగ్ధుడిని చేసిన నటులలో ఆయన కూడా ఒకరయ్యారు. నేను ఆనాటి నుండి, ఆయన అభిమానిని. 'గుండెలు మార్చబడును' అనే నాటిక కూడా విశేష ప్రాచుర్యం పొందింది. కొద్దిగా పొట్టిగా ఉండే వారు. ఆలోపాన్ని, తన నటన ద్వారా కప్పిపుచ్చుకునే వారు. పొట్టివాడైనా గట్టివాడు అని పేరు తెచ్చుకున్నారు. ఈనాటి, చాలా మంది ప్రముఖ నిర్మాతలు ఆ రోజుల్లో ఆయన classmates కావటం చేత, వారి సినీరంగప్రవేశం అతి సులభంగానే జరిగింది. మొదటి సారిగా, ఆయన కళాతపస్వి విశ్వనాధ్ గారి 'సిరి సిరి మువ్వ' ద్వారా సినీరంగ ప్రవేశం చేసారు. అందులోని సంభాషణలు పండిత పామరుల చేత ప్రశంసించబడ్డాయి. అంతకు ముందుగానే 'పుణ్యభూమీ కళ్ళు తెరు!' లో ఒక పాట వ్రాసారు. అయితే మాటల రచయితగా, మొదటి చిత్రం 'సిరిసిరి మువ్వ'.

 

Tv interview 

ఆ తర్వాత ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసి ఆ నాటి ప్రముఖనటులైన NTR, ANR, CHIRANJEEVI ల వేటగాడు, బుచ్చిబాబు, జకదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు ఎన్నిటికో రచయితగా పనిచేసారు. 'ముద్దమందారం' అనే సినిమా ద్వారా దర్శకుడిగా కూడా విజయాన్ని సాధించారు. అలా,60 చిత్రాలకు దర్శకత్వం వహించారు, ఆఖరి చిత్రం, 'విచిత్రం'! అయితే, వీరికి హాస్య రసమంటే విపరీతమైన అభిమానం. ఈ నాటి ప్రముఖ హాస్యనటులలో చాలామంది ఆయన ద్వారా పరిచయమయినవారే. అందులో ముఖ్యులు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, సుత్తివేలు, వీరభద్రరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం....ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితాకు అంతే ఉండదు. శ్రీవారికి ప్రేమలేఖ, అహనా పెళ్ళంటా... ఇలా ఒకటేమిటి అనేక హాస్యరస ప్రధాన సినిమాలకు మాటలు వ్రాసి దర్శకత్వం వహించారు. సునిశితమైన హాస్యం వీరి ప్రత్యేకత. 'శంకరాభరణం' లాంటి క్లాసిక్ కు సంభాషణలు వ్రాసారు. వీరు సంభాషణలు వ్రాసి, దర్శకత్వం వహించిన ఆనందభైరవి అనే చిత్రం అనేక బహుమతులు పొందింది. ఆరోగ్యకరమైన హాస్యానికి మరో పేరు జంధ్యాల. ద్వందార్ధాలు, వెకిలి హాస్యం వీరి సినిమాలలో ఎంత వెతికినా కనపడవు. Dialogue oriented కామెడీ వీరి ప్రత్యేకత. అనేక ఇతివృత్తాలను ఆధారంగా తీసుకొని వీరు అనేక సినిమా కథలు వ్రాసారు. అయితే, ఎక్కువగా హాస్యానికే పెద్ద పీట వేసారు. ఎక్కువగా దర్శకత్వం వహించింది కూడా హాస్యరస చిత్రాలకే!

జంధ్యాల రచనలో వేగం, వాడి, వేడి ఉండేవి. ఒక సినిమాకు సంభాషణలను వ్రాయటానికి పదిరోజులు ఆయనకు చాలా ఎక్కువ సమయం! అలా, ఒక్క 1983లోనే ఏకబిగిన 80 సినిమాలకు సంభాషణలను వ్రాసారు. 82 ఏండ్ల తెలుగు సినిమాలలో అదో రికార్డ్. దానిని భవిష్యత్ లో కూడా ఎవ్వరూ ఛేదించలేరని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఆయన ప్రతిభకు తగ్గట్టుగానే ఆయనకు అవకాశాలు కూడా అలానే వచ్చాయి. అయన కళాత్మక సినిమాలకు (శంకరాభరణం) ఎంత  చక్కని సంభాషణలను వ్రాసారో, అదే విధంగా హాస్యరస సినిమాలకు కడుపుబ్బ నవ్వు పుట్టించే సంభాషణలను వ్రాసారు. జంధ్యాల సినిమాలలో మన మధ్య తిరిగే మనుషులే కనిపిస్తారు. ఒక సందర్భంలో నేను వారిని కలిసినప్పుడు, 'ముళ్ళపూడి వారి తర్వాత, సునిశితమైన హాస్యాన్ని వ్రాస్తున్నది, మీరే!' అని ప్రశంసా పూర్వకంగా చెబితే, అందుకు, జంధ్యాల ఏమన్నారంటే, 'ముళ్ళపూడి వారెక్కడా? నేనెక్కడా? వారు గండభేరుండ పక్షి అయితే, నేనొక 'అక్కుపక్షిని' అని. ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటేనే గొప్పతనం అని మళ్ళీ మరొకసారి గుర్తు చేసిన మహనీయుడు.

ఆయన ఛలోక్తులు మనల్ని కడుపుబ్బ నవ్విస్త్తాయి. కొన్ని సినిమాలలో నటించారు కూడా. వారికి , కళాప్రియులందరి లాగే, 'మాయాబజార్' సినిమా అంటే చాల ఇష్టం. ఆ సినిమాలోని పాటల పల్లవులు తీసుకొని, కొన్ని మాటలు తీసుకొని. వాటినే టైటిల్స్ గా పెట్టి చాలా సినిమాలు తీసిన సంగతి మన అందరికీ తెలుసు. ఆయనకు ఉన్న  మరో గొప్పవరం-చక్కని కంఠస్వరం. కొన్ని సినిమాలలో నటులకు తన గొంతును అరువిచ్చారు కూడా. మణిరత్నం నిర్మించిన 'ఇద్దరు' అనే సినిమాలో కరుణానిధి గారి పాత్రను ధరించిన ప్రకాష్ రాజ్ గారికి ఆయన అత్యద్భుతంగా డబ్బింగ్ చెప్పారు.

🌳"నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోటం ఒక రోగం"

అని 'నవ్వు' విలువ తెలిపిన మహామనీషి, ఆయన. అతిగా, నన్ను బాధ పెట్టే విషయమేమిటంటే, ఆయనకు, వివాహమైన, చాలా కాలానికి గాని, సంతానం కలుగ లేదు. ఒకేసారి కవలపిల్లలను భగవంతుడు వారికి ప్రసాదించారు. వారి నామకరణ మహోత్సవానికి, పంపిన, ఆహ్వాన పత్రికలోని మాటలు, నా గుండెలను పిండి వేసాయి.' ఈ పిల్లల వివాహ సమయానికి, నేను ఉంటానో,లేదో! వీరి 'బాల సారె' కు వచ్చి వీరిని దీవించండి!' అని.ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇద్దరి పిల్లలకు, సాహితి, సంపద అని అచ్చ తెలుగు పేర్లు ముచ్చటగా పెట్టి ఎంత మురిసిపోయారో! ఇక్కడ ఈ లోకంలో నవ్వించింది చాలు, మాలోకానికి రండి, మమ్మల్ని నవ్వించటానికి, అని భగవంతుని ఆజ్ఞను శిరసావహించి, ఆ ఆజ్ఞలోని ఆనందం వల్లనేమో 'గుండె' ఆగి పోయి,19 -06 -2001 న మనల్ని వీడి మరో లోక 'హాస్యబ్రహ్మ' కావటానికి వెళ్లిపోయారు!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...