gulananda swami Posted February 6, 2011 Report Posted February 6, 2011 [img]http://ap7am.com/backimages/cinemaphotos/thumbnail/s_p_balasubramaniam_baalu_5075.jpg[/img]బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విశేషణానికి ప్రముఖ గాయకుడు యస్.పి.బాల సుబ్రహ్మణ్యం సరిగ్గా సరిపోతాడు. ఓ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, వ్యాఖ్యాత, నిర్మాత... ఇలా బహు ముఖంగా ఆయన ప్రజ్ఞాపాటవాలు విస్తరించాయి. తెలుగు సినిమా నేపధ్య సంగీతానికి ఘంటసాలది ఒక ఒరవడి అయితే, బాలూది మరొక ఒరవడి. తెలుగు సినిమా పాట అనే నాణానికి ఒకరు బొమ్మ అయితే, మరొకరు బొరుసు. ఘంటసాల మరణానంతరం కొన్నాళ్లకు బాలూ రాజ్యమేలడం మొదలెట్టాడు. అటు యన్టీఆర్, ఏఎన్నార్, ఇటు కృష్ణ, శోభన్ బాబు, రాజబాబు, అల్లు రామలింగయ్య, చిరంజీవి....ఒకరేమిటి... అందరికీ బాలూయే పాడాలి. అందరికీ బాలూనే కావాలి. అంతగా ఒక సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు లేరు. ఏరోజు చూసినా బిజీనే. ఆయన కోసం అంతా వెయిటింగే. పొద్దున్న రికార్డింగ్ స్టూడియోకి బయలుదేరితే, రాత్రెప్పుడో ఇంటికి చేరేవాడు. ఒక్క తెలుగే కాదు, తమిళం, కన్నడ, హిందీ... ఇన్ని భాషల్లో పాడేవాడు. అటువంటి సమయంలో ఓ రోజు ఏకంగా 19 పాటలు పాడి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓసారి గాయని సుశీలతో కలిసి అమెరికా వెళ్లే టూర్ ఖరారైంది. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సంగీత దర్శకులందరికీ ముందే టూర్ గురించి చెప్పాడు. అయినా, చివర్లో హడావిడి అయిపోయింది. ఇక రేపు ప్రయాణమనగా ఈవేళ ఉదయం ఏడు గంటలకు పాడడం మొదలుపెట్టి, చివరి పాట పూర్తి చేసి, ఇంటికొచ్చేసరికి తెల్లవారుఝామున మూడైంది. మధ్యలో లంచ్ చేసే టైం కూడా లేకపోవడంతో టీ, బిస్కట్లతోనే సరిపెట్టుకున్నాడు. అలా ఆరోజు మొత్తం 19 పాటలు పాడాడు. విశేషమేమిటంటే, వాటిలో పది పాటలు సుశీల గారితోనే పాడాలి. ఇప్పట్లోలా అప్పుడు ట్రాక్ సిస్టం లేదు కదా! దాంతో ఆవిడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏమైతేనేం, అలా ఒకే రోజు 19 పాటలు పాడడం ఒక రికార్డే! అది బాలూకే చెల్లింది మరి!
Recommended Posts