Jump to content

Recommended Posts

Posted

విజయవాడ : టిక్కెట్ల కేటాయింపు తరువాత ప్రజారాజ్యం పార్టీలో నిరసన ధ్వనులు తారాస్థాయికి చేరుకున్నాయి. మార్పు, సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా రాజకీయ యవనిక మీద ఆరంగేట్రం చేసిన ప్రజారాజ్యం పార్టీలో సామాజి న్యాయం పత్తా లేకుండా పోయిందని ప్రముఖ వైద్యుడు, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు డాక్టర్ జి. సమరం విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీలో లోఫర్లు, డాఫర్లకు టిక్కెట్లిచ్చారని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మార్పు సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్న రాజ్యం వలసపక్షుల రణగొణ ధ్వనితో రచ్చకెక్కిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమర్థులు, ముందు నుంచీ పార్టీ కోసం అహర్నిశలు పాటుబడిన వారిని పక్కన పెట్టి అసమర్థులు, కొత్తగా పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కించారని ఆయన ఆరోపించారు. పిఆర్పీలో అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో ఉన్న వాతావరణం ప్రస్తుతం కొరవడిందని ఆయన విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీలో ఇటీవల తీసుకుంటున్న పలు నిర్ణయాలు మేధావి వర్గాలను ఆ పార్టీకి దూరం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా, ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడ నిరసన గళం ఎత్తుకున్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి శనివారంనాడు ఒక నిర్ణయం తీసుకుంటానని ఆమె పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆమె ఆశించి భంగపడ్డారు. నందిగామలో తమ కుటుంబానికి అన్ని వర్గాల నుంచీ ఎనలేని ఆదరణ ఉందని, సులువుగా సీటును గెలుచుకునే సత్తా తనకు ఉన్నప్పటికీ మరొకరికి కేటాయించడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రజారాజ్యం పార్టీలో తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల గతేమిటని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

మరో పక్కన టిక్కెట్ల కేటాయింపులో తమను పార్టీ అస్సలు పట్టించుకోలేదని, సరైన గుర్తింపునివ్వలేదంటూ చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు నిరసన గళం వినిపిస్తున్నారు. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు, కార్యకర్తలు శుక్రవారంనాడు సంజీవరెడ్డినగర్ లో సమావేశమైన వారంతా సాయంత్రం లోగా నిర్ణయం తీసుకుంటామని మీడియా ముందు స్పష్టం చేశారు. కాగా, తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన కర్నూలు జిల్లా దళిత నాయకుడు మసాల ఈరన్న ప్రజారాజ్యం పార్టీ ముందు మూడు రోజులుగా నిరశన దీక్ష చేస్తున్నారు. శుక్రవారంనాడు ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీనితో పరిస్థితి గందరగోళంగా మారింది.

×
×
  • Create New...