kingmakers Posted April 3, 2009 Report Posted April 3, 2009 ఇతర రాష్ట్రాల తెలుగు రక్తకణాలని మనం చాలా కాలంగా కోల్పోతూ వచ్చాం. తాజాగా 1956 అనబడే ఒక కొత్త అపసవ్య గీతల కూటమిలో ఆ రక్తకణాలు మరింత దూరమయ్యాయి. కొన్ని గీతలు అనవసరంగా విలీనమయ్యాయి. ఆ విలీనాన్ని రద్దు చేసి విడిపోవాలని కోరుతున్నాయి. అవే ఇప్పుడు భాషా సాంస్కృతిక రంగాలకు చెందిన కొత్త ప్రశ్నలను మన ముందు నిలిపాయి. 1956కి ముందు హైదరాబాద్ సంస్థానం ఆంధ్ర ప్రాంతానికి పరాయిదే. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఆ ప్రాంతాన్ని తెలుగు సోదరుల ఆవాసంగా గుర్తించలేదు. పాలకవర్గం పరాయివారనుకోవచ్చు. దానికి కొంత అర్థం ఉంది. కాని తొంభై శాతం తెలుగు ప్రజలను తెలుగు మాతృభాషీయులను గుర్తించ నిరాకరించే స్వభావం ఏర్పడిపోయింది. కాని నిజానికి గోలకొండ ప్రభువులు అదే హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన నైజాం రాజుల అధీనంలోనే ఈనాడు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతమంతా ఉండింది. వందా ఏభై ఏళ్ళ క్రితం అటునిటుగా కోస్తా ప్రాంతం పరాయి పాలకులకి ధారాదత్తమైంది. రాయలసీమ ఆంగ్లేయులకి దత్తుగా ఇవ్వబడింది. అందుకే ఈ ప్రాంతాల్లోనూ, ఇతర రాష్ట్రాల తెలుగు భాషలోనూ దేశీయం అనుకునే చాలా పర్షియన్, అరబిక్, ఉర్దూ మూల తెలుగు పదాలే ఎక్కువ వ్యవహారంలో ఉన్నాయి. అవి ముఖ్యమైన రెవెన్యూ, ఎక్సైజ్, పంటలు తదితర విభాగాలకు సంబంధించిన పదాలు. అవి ఈ నాటికీ ఆ ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయి. నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు వాడిన అనేక పదాల మూల రూపాలు హైదరాబాద్ సంస్థానంలో కనిపిస్తాయి. సుప్రసిద్ధ పాత్రికేయులు జి. కృష్ణ తదితర పండితులు ఈ విషయాన్ని పలుమార్లు నొక్కి చెప్పారు. కేవలం భాషే కాదు, సాంస్కృతకాంశాలు కూడా చాలా వరకూ కలగలసిపోయాయి. కాకతీయుల పూర్వ కాలం నుండి రాజకీయ అధికార కేంద్రంగా (విష్ణుకుండినులు, కాకతీయులు, రాచకొండ రెడ్డిరాజులు, గోలకొండ నైజాం రాజుల కింద) హైదరాబాద్ సంస్థానంలోని పలు ప్రాంతాల నుండి పరిపాలన జరిగిందని చరిత్ర పరిశోధకులు చెప్పారు. ఆయా రాజ్యాల రాజధానులూ ఇక్కడివే. అయినా హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలుగువారు తమ వారేననే తలంపు ఆంధ్ర ప్రాంత పెద్ద తలలకు రాలేదు. ఒకరిద్దరిలో వచ్చినా భాషా చరిత్ర జాతి సంస్కృతిలో వారి స్థానానికి నిరాకరణే మిగిలింది. ఈ నిరాదరణ దృక్పథం ఈ నాటికీ ఎంతో కొంత కొనసాగడం గమనించవచ్చు. అలాంటి ఒక వ్యవస్థీకృత అనవగాహన ఇప్పుడు ఇతర రాష్ట్రాలలోని తెలుగువారిపై కూడా అదే విధానంలో కొనసాగుతున్నది. ఈ దృక్పథంలో మార్పు ఎప్పుడు ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేం. కాని రాక తప్పదు. ఒకవేళ రాకపోతే జాతిగా, భాషగా, సంస్కృతిగా తెలుగు ప్రజలు తమ విశిష్టతని కోల్పోతారు. రాజకీయంగా కూడా దేశ స్థాయిలో గౌరవనీయమైన మనుగడ సందేహమే. అందుకే ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళు తెలుగువాళ్ళే. వారి మనోభావాలను, ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించడం ఒక్కటే దారి. ఆధిపత్య రాజకీయాల కళ్లజోడులోంచి మేధావులు ఇలాంటి విషయాలను చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు క్రీస్తు పూర్వం నుండి వందల సార్లు మారుతూనే ఉన్నాయి. అలా మారడం చారిత్రక అవసరం. ఆ మార్పుల్ని చూడలేనివారు మాత్రమే పిడివాదులు. ఇలాంటి పిడివాద పెడధోరణుల వల్ల సమస్య మరింత జటిలం అవుతుందే తప్ప తగ్గదు. తద్వారా తెలుగు ప్రజల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. సాంస్కృతిక భాషా రంగంలో పనిచేసే వాళ్లు ఈ దూరాన్ని తగ్గించాలి. ప్రాచీన భాషా విషయంగానో, మరో నీటి సమస్య కారణంగానో లేదా ఉద్యోగ సంబంధిగానో మహారాష్ట్ర లేదా తమిళ రాజకీయ\ ప్రభుత్వాలతో పేచీ వచ్చినంత మాత్రాన మనం అక్కడి తెలుగు ప్రజలను దూరం చేసుకుంటామా. వాళ్ళు మన సోదరులు కాకుండా పోతారా?! అలాగే కాకతీయుల కాలం నుండి హైదరాబాద్ సంస్థానం పరిపాలన కాలం వరకూ తెలుగు సాహిత్యం, భాషలు ఒకటిగానే మసిలాయి. ఈ కోణాలకు ఏనాడూ ఎలాంటి వైషమ్యాల మకిలి అంటలేదు. అందుకే ఇరు ప్రాంతాల ప్రజలకు ఒకరి పట్ల మరొకరికి అన్నదమ్ముల అనుబంధం, ఆత్మీయతలు సజీవంగా ఉన్నాయి. వీటికి అవరోధం కలిగించడం తెలుగు భాషా జాతి భావనల వ్యతిరేకులకే సాధ్యం. వ్యవస్థీకృత ఆధిపత్య నల్లధనం మూలిగే తెల్ల కాలర్ నేరస్థుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం. ఇదే ధోరణి ఏ వైపునున్నా అది ఒక ప్రమాద సూచే! ఇవాళ మనం రాష్ట్ర గీతలకావలి అమ్మలు, అక్కా చెల్లెళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. మగవాళ్ళు వృత్తి ఉద్యోగ సంబంధ పనుల్లో, సంపాదనలో తీరిక లేకుండా ఉంటారు. నిజానికి ఈ మహిళల ఆలోచనలేమిటి? వాళ్ళ సాంస్కృతిక అవసరాలేమిటి? వాటిని మనం తీర్చగలమా. మన తోబుట్టువులకిచ్చేదేమైనా ఉందా. ఆకాశంలో సగం అంటాం. కాని గీతలకావల ఉన్న సగం తెలుగు ఆకాశాన్ని మనం పూర్తిగా విస్మరించాం. ఎన్నడైనా ఓ పెద్దన్న వెళ్ళి వాళ్ళతో ఒక రక్షాబంధనం కట్టించుకున్నాడా. తల నిమిరి పుట్టింటి ప్రేమని పంచి ఇచ్చాడా. మనం ఇప్పుడు గీతల కోసం మార్పుల కోసం ఆరాటపడుతున్నాం. ఇది సహజమే. అనివార్యమే. 1969 నుండి ఇది వటవృక్షంగా పెరిగి పెద్దదైన ఆకాంక్షే. ఇప్పుడు ఇరువైపులా పెద్దన్నలు ప్రేమ బంధాలతో ముందుపడాలి. ఇద్దరూ కలసి భూగోళమ్మీద తెలుగు జాతి నివసించే ఆనవాళ్ళని వెతకాలి. వారిని ఆప్యాయంగా గుండెలకు అదుముకోవాలి. ఈ జంట కర్తవ్యం మనల్ని మానసికంగా ఒకటి చేస్తుంది. రాజకీయ భౌగోళిక చిత్రపటాలు కాదు, జాతి చిత్రపటం, సాంస్కృతిక చిత్రపటాలు తయారుచేసి ప్రతి పాన్ షాప్ లో నిలపాలి. నిజానికి అవి మన మానసిక ప్రపంచంలో ఒక భాగం కావాలి. అప్పుడు తెలుగునేల శ్వాసించే గాలిలో సమైక్యత వెల్లివిరుస్తుంది. అంతే కాని, హెచ్చుతగ్గుల, అనుమానపు దృక్కుల గీతల్లో దశాబ్దాలుగా ఆరని మంటలే ఆవిష్కృతమవుతాయి. అందుకే ఇప్పుడున్న సంకెళ్ళ గీతల్ని చెరిపి ఒక సాంస్కృతిక సరిహద్దుని రూపొందిద్దాం. భౌగోళికంగా ఒకటి రెండైనా ఫరవాలేదు. మేమంతా ఒక్కటే అని జనసామాన్యానికి పిలుపునిద్దాం. విద్యుత్ లాభాలు నిండిన మెదడులు చిమ్మే విషపూరిత వాయువులని అరికడదాం. సామాన్య ప్రజలు అందులో పడి కాలే ప్రమాదం నుండి కాపాడుదాం. ఇవాళ తెలంగాణ రాజకీయ అంశం కాదు. ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ. తెరపై ఆ యాసకి భాషకీ జరిగే అవమానాన్ని తెలుగు భాషీయులంతా ఎదిరించాలి కదా. మరి ఏ ఒక్క కమూ ఎందుకు ముందు పడలేదు. రాయలసీమ కక్షల్ని సినిమా పంచరంగులు కాసులు కోసం కక్కుర్తి పడితే తెలంగాణ రచయితలు ఖండించారు. కళింగాంధ్ర భాషను నీచపాత్రలకే అంటగట్టితే హెచ్చరించారు. మరి మహా పేరు పొందిన ఆంధ్ర భాషాభిమాన దురంధరులు తెర ముందు - వెనక ప్రబలిన ఆ ధోరణిని ఎందుకు నిందించలేదు. ఆ సినీ పెట్టుబడిదారులు చాలా మంది తమ ప్రాంతం వారైనందుకా? భాషాభిమానులు పెట్టుబడిదారీ సంస్కృతి వైపు ఉండి ఆ భావజాలం సృష్టించిన ఆలోచనల వైపు ఉంటారా? ప్రజా సంస్కృతికి విఘాతం కలిగించే ప్రాంతీయ దురభిమానం వైపే నిలుస్తారా? లేదా ప్రజాస్వామ్య దృక్పథంతో అడుగు వర్గాల ప్రజల భాషా సాంస్కృతిక రంగాలవైపా. క్షీణ సంస్కృతి దాడిని ఎదిరించి సమాజాన్ని రక్షించే వారిగా ఉంటారా? ఆధిపత్య వర్గం సృష్టించిన మాయా భాషా సాహిత్య చరిత్ర, సాంస్కృతిక రంగాల్ని ప్రశ్నించి తృణీకరించడం ఈ కాలంలో అంత సులభసాధ్యం కాదు చాల మందికి. కాని మేధావులు అలా కాదు. వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించాలి కూడా. అందుకే వారిని ఆలోచించాల్సిందిగా కోరక తప్పదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రాజ్యాలు నిర్మించారు కాబట్టే రాజ ధిక్కారం వారి సొంతం. కాకతీయల కాలంలోనే సమ్మక్క సారమ్మల పోరాటం జరిగింది. సముద్రాల వంటి వందలాది చెరువులు తవ్వి పంటపొలాలకు పచ్చ దుప్పట్లు కప్పారు. అందుకే అక్కడే భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు వచ్చాయి. అక్కడే ఆస్థాన సంస్కృతి కన్నా జన సంస్కృతీ సాహిత్యాల చరిత్రే ఎక్కువ. రాజభాషలు ఎన్ని ఉన్నా చక్కని ప్రజల తెలుగుభాష ఈనాటికీ జీవధాతువులలో కళకళలాడుతున్నది. ప్రధాన స్రవంతి చరిత్ర, సాహిత్య చరిత్రకారుల పాక్షిక ధోరణికి తెలంగాణ బలైందని రుజువైంది. ఇప్పుడు అలాంటి అలనాటి చరిత్ర, భాషా సాహిత్యాలతో తెలుగువారి ప్రాచీనతా మూలలను, విశిష్ట కోణాలనూ కలిపి సాంస్కృతిక చరిత్రని సమగ్రం చేసి జాతిని పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. అందుకే భౌగోళిక గీతలు చెరిగి మనసులో కల్పించబడిన సంకుచిత పరిధులు తొలగాలి. అపోహలు సమూలంగా నశించాలి. అప్పుడే రాష్ట్ర సరిహద్దుల గురించి కాకుండా విశాలమైన చిత్రపటం కోసం కృషి చేయాలి. ఆ చిత్రపటంలో జీవించే మనుషుల గురించి ఆలోచించాలి. మనం ఇప్పుడు ప్రపంచపటంలో ఎక్కడున్నా భాషా సంస్కృతుల చిత్రపటంలో భాగం కావాలి. మనుషులు ఎక్కడున్నా ఒక్కటే అయినట్లు, మనుషుల్లో కష్టజీవులంతా ఒకటే అయినట్లు, మనుషుల్లో వివక్షకు గురైన మానవులంతా ఒకటే అయినట్లు, మనుషుల్లో ప్రత్యేకంగా స్త్రీల బాధలు ఒకటైనట్లు, తెలుగువారు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా ఒకటి కావాలి. రాష్ట్ర భావన కన్నా భాషా భావన మానవుల్ని ఆలోచనాపరుల్ని చేస్తుంది. జాతి భావన శక్తిమంతులుగా తీర్చిదిద్దడానికి పనికొస్తుంది. సాంస్కృతిక భావన జాతిని ఐకమత్యంగా ఉంచుతుంది.
Recommended Posts