Jump to content

Recommended Posts

Posted

sriramanavami-1.gif

భద్రాచలం : శ్రీరామ నవమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మధ్యాహ్నం భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ వైభవం కమనీయంగా జరిగింది. మధ్యాహ్నం సరిగ్గా 12.10 గంటలకు అభిజిత్ లగ్నంలో అర్చకస్వాములు శ్రీరామచంద్రుడు, సీతమ్మతల్లికి జీలకర్ర, బెల్లం పెట్టించి కల్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం మూడు సూత్రాలతో కూడి మంగళసూత్రాన్ని వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా తిలకిస్తుండగా సీతమ్మవారికి శ్రీరాముని ద్వారా సూత్రధారణ చేయించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా అందజేస్తున్న ముత్యాల తలంబ్రాలను నూతన వధూవరులకు పోయించారు.

అంతకు ముందు రక్ష, మోక్ష బంధనాలు ధరింపజేసి 24 అంగుళాల పొడవు ఉన్న 12 దర్బలతో అల్లిన ఒక తాడును వధువు సీతాదేవి నడుముకు కట్టి కల్యాణ రాముడి కుడిచేతికి, సీతాదేవి ఎడమచేతికి రక్షా సూత్రాలను అర్చకస్వాములు ధరింపజేశారు. అనంతరం బంగారు యజ్ఞోపవీతం ధరింపజేసి వైష్ణవులకు తాంబూలం తదితర సత్కారాలు నిర్వహించి కన్యావరణం జరిపించారు. శ్రీరామునికి భక్త రామదాసు చేయించిన బంగారు పచ్చల పతకం, సీతాదేవికి చేయించిన చింతాకుపతకం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి సీతారాముల విగ్రహాలను కల్యాణ మండపం మిథిలా స్టేడియానికి వేదపండితులు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ కమిషనర్ వీరభద్రయ్య స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయం ప్రధాన అర్చకస్వామి పుణ్యాహవచనం చేసి సీతారాముల కల్యాణానికి వినియోగించే పూజా ద్రవ్యాలను ప్రక్షాళన చేశారు.

'చూచువారికి చూడముచ్చట' అన్నట్లు శ్రీ సీతారామచంద్రుల కల్యాణ వైభవాన్ని కళ్ళారా తిలకించిన వారి ఆనందానికి అవధులు లేవు. సీతారాముల కల్యాణం ప్రత్యక్షంగా చూసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం సంప్రాప్తిస్తుందన్నది భక్తులు నమ్మకం. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు శుక్రవారం నాటికే భద్రాచలం వీధులు కిటకిటలాడిపోయాయి. రామనామోచ్ఛారణతో భద్రాద్రి మారుమోగుతోంది.

×
×
  • Create New...