Jump to content

Rip Kinda Lakshman Bapuji


Recommended Posts

Posted

హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజీ(97)కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపూజీ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమానికి కొండ గుర్తు అయిన బాపూజీ మరణ వార్త తెలుసుకున్న తెలంగాణ పల్లెలు విషాదంలో మునిగి పోయాయి. ఉద్యమం కోసం అప్పట్లోనే పదవులను తృణప్రాయంగా భావించిన నిబద్ధతగల వ్యక్తి బాపూజీ. 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో బాపూజీ జన్మించారు.

1942 క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు 1969, ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో కొండా చురుగ్గా పాల్గొన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో 1967-69 వరకు మంత్రిగా పనిచేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్‌గానూ కొండా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన ఘనత బాపూజీకుంది. పేదల అభివృద్ధి, సామాజిక న్యాయకోసం జరిగిన ప్రతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికోసం కొండా ఎంతో కృషి చేశారు.

రజాకార్లకు వ్యతిరేకంగా అప్పటి నిజాం సర్కారుపై తిరగబడి బాంబులు వేసిన ధీరశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ. వయసు మీదపడ్డ కూడా ప్రస్తుతం జరుగుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గాంధేయ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఉద్యమకారులకు ఆయన సూచించేవారు. జీవితం చివరి దశలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ కోసం ఆయన దీక్ష కూడా చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నిస్వార్థమైన వ్యక్తి అని, ఉద్యమాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన సన్నిహితులు తెలిపారు.

రేపు ఉదయం 11 గంటలకు బాపూజీ అంత్యక్రియలు
హైదరాబాద్ : రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్‌బాపూజీ అంత్యక్రియలు జరగనున్నాయి. నెక్లెస్‌రోడ్డులోని జలదృశ్యంలో బాపూజీ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజల సందర్శనార్థ కోసం బాపూజీ భౌతిక కాయాన్ని రాంకోఠిలోని పద్మశాలి భవన్‌కు తరలించనున్నారు.

బాపూజీ మృతి ఉద్యమానికి తీరని లోటు : కేసీఆర్
న్యూఢిల్లీ : ప్రముఖ్య స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణవాది కొండా లక్ష్మణ్‌బాపూజీ మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూసి చనిపోవాలని బాపూజీ కలలు కన్నారని ఆయన తెలిపారు. ఆయన మృతికి కేసీఆర్ సంతాపం తెలిపారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, గీతారెడ్డి, సునీతాలకా్ష్మరెడ్డి, ఉత్తమ్‌కుమార్, ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, గాయని విమలక్క సంతాపం తెలిపారు.

కొండా లక్ష్మణ్‌బాపూజీ మృతికి సీఎం సంతాపం
హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం తెలిపారు. బాపూజీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, స్వాతంత్య్ర సమరయోధుడిగా బాపూజీ సేవలు మరువరానివని సీఎం కొనియాడారు.

తెలంగాణ సాధనే బాపూజీకి ఘనమైన నివాళి: ఈటెల
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాన్ని త్యాగం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 1969లోనే పదవులు గొప్ప కాదంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయుడన్నారు.


బాపూజీ మృతి రాష్ట్రానికి తీరని లోటు:బాబు
హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యులు కొండా లక్ష్మణ్‌బాపూజీ మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులకు బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాపూజీ మృతికి శాసనసభ సంతాపం
హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యులు కొండా లక్ష్మణ్‌బాపూజీకి శాసనసభ సంతాపం తెలిపింది. బాపూజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. దామోదర సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పని చేశారని స్పీకర్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. వందేమాతర ఉద్యమం, పౌరహక్కుల సంఘంలో చురుకుగా పనిచేశారని తెలిపారు. కానీ తెలంగాణ ఉద్యమకారుడు అని స్పీకర్ నోటి వెంట మాట రాలేదు. దీనికిపై తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు స్పీకర్‌ను తప్పుబట్టారు. బాపూజీ మృతిపై సభలో మాట్లాడేందుకు స్పీకర్ అంగీకరించలేదు.

×
×
  • Create New...