Jump to content

Recommended Posts

Posted

నందమూరి వాకిట్లో నిమ్మకూరు చిచ్చు!
తండ్రి శత్రువులు బాలయ్యకు మిత్రులా?
అప్పట్లో ఎన్టీఆర్‌ను వ్యతిరేకించిన తోడల్లుడి కుమారుడు
పార్టీ జెండా దిమ్మెను ట్రాక్ట్‌ర్‌తో ధ్వంసం చేసిన వెంకటరత్నం
నిమ్మకూరులో అడుగు పెట్టేది లేదని ఎన్టీఆర్ భీష్మ ప్రతిజ్ఞ
కన్నుమూసే వరకు అడుగు పెట్టని ఆత్మాభిమాన రాముడు
వెంకటరత్నం ఇంటికి బాలకృష్ణ
ఆయన కుమారుడి ఇంట్లోనే రెండుసార్లు బస.

విజయవాడ, ఏప్రిల్ 22 : ఎన్టీఆర్.. ఈ మూడు అక్షరాలు తెలియని తెలుగు వారుండరు. సినిమాల్లో నటించినా, రాజకీయాల్లో రాణించినా ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికీ కృష్ణా జిల్లా నిమ్మకూరు పేరు చెబితే నందమూరి తారక రామారావు కుటుంబమే గుర్తుకు వస్తుంది. నిమ్మకూరు.. నందమూరి.. ఈ రెండు పదాలకు విడదీయరాని అనుబంధం ఉంది. రాజ్యానికి రాజు అయినా నేను నిమ్మకూరు బిడ్డనేనని ఎన్టీఆర్ ఎన్నోమార్లు చెప్పుకొన్నారు. ఎన్టీఆర్‌కు నిమ్మకూరు అంటే పంచ ప్రాణాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓ సంచలనమైతే.. నిమ్మకూరు గ్రామం ఉన్న గుడివాడ నియోజక వర్గం నుంచి గెలుపొందిన ఎన్టీఆర్‌కు పట్టరాని ఆనందం ఉండేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక వినూత్న పథకాలను ఆయన తన గ్రామంలో కూడా అమలు చేశారు.

తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం, బాలికల రెసిడెన్షియల్ స్కూల్, ఆసుపత్రి, జూనియర్ కాలేజీ, మహిళల ఉపాధి కేంద్రం వంటి ఎన్నో కార్యక్రమాలకు 1983-87 మధ్య కాలంలో ఆయనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. 1987 ఆగస్టులో వివిధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రిగా నిమ్మకూరు వచ్చేందుకు పర్యటన ఖరారైంది. ఎన్టీఆర్ మరుసటి రోజు వస్తారనగా ముందు రోజు నిమ్మకూరులో జరిగిన ఘటన ఆయన మనసును కలచివేసింది. ఆ గ్రామానికి ఆయనను దూరం చేసింది. ఇక నిమ్మకూరు రానని ఎన్టీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. పట్టుదలకు మారు పేరైన ఎన్టీఆర్ కన్నుమూసే వరకూ నిమ్మకూరువైపు కన్నెత్తి చూడలేదు. ఆ ఘటన ఏమిటో తెలుసా? ఎన్టీఆర్ తోడల్లుడు నందమూరి చంద్రం కుమారుడు వెంకటరత్నం పార్టీ జెండా దిమ్మెను కూలగొట్టడమే.

ఎన్టీఆర్‌తో ఆవిష్కరించేందుకు సిద్ధం చేసిన జెండా దిమ్మెను ట్రాక్టర్‌తో ఢీ కొట్టి పడగొట్టడంతోపాటు పక్కనే ఉన్న ఆస్పత్రి గోడను కూడా వెంకట రత్నం ట్రాక్టర్‌తో కూలగొట్టాడు. ఈ ఘటన గురించి అధికారులు ముందు రోజు రాత్రి ఎన్టీఆర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తన బంధువే అయిన వెంకటరత్నం వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందారు. గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వెంకటరత్నం వ్యవహార శైలి ఆయనను కలచి వేసింది. ఇక నిమ్మకూరు రానని భీష్మించారు. మాటకు కట్టుబడిన ఎన్టీఆర్ ఇక అప్పటి నుంచీ నిమ్మకూరు వైపు కన్నెత్తి చూడలేదు. వెంకటరత్నం కుటుంబం వైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కన్నెత్తి చూడలేదు.

ఇదంతా గతం.. కానీ ప్రస్తుతం నందమూరి కుటుంబంలో చర్చకు, కలకలానికి దారి తీసిన ఘటన ఇటీవల జరిగింది. ఇటీవల రాజకీయాల్లోకి రావడంతోపాటు కృష్ణా జిల్లా రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెంకటరత్నం ఇంట్లో అడుగు పెట్టారు. వెంకటరత్నం కుమారుడు శివరామకృష్ణ ఇంట్లో బస చేశారు. ఈ ఘటన అన్నగారి కుటుంబంలో కలకలం రేపడమే కాకుండా తాజా చర్చకు దారి తీసింది.అంతేకాదు, నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠించిన తన తాత ఎన్టీఆర్, నాయనమ్మ బసవ తారకం విగ్రహాల వైపు కూడా బాలకృష్ణ కన్నెత్తి చూడలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠించిన కారణంగానే బాలకృష్ణ అటువైపు వెళ్లలేదన్న చర్చ జరుగుతోంది.

15 రోజుల కిందట కూడా మరోసారి ఆయన శివరామకృష్ణ ఇంట్లో బస చేశారు. ఇటీవల తన తల్లి స్వగ్రామమైన కొమరవోలు వచ్చిన బాలకృష్ణ అక్కడ తన మేనల్లుడి ఇంట్లో బస చేశారు. అక్కడి నుంచి నేరుగా నిమ్మకూరు వెళ్లారు. నందమూరి వంశస్తులు కోరడంతో తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసిన బాలకృష్ణ తిరిగి శివరామకృష్ణ ఇంటికి వెళ్లడం గ్రామంతోపాటు ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన, అప్పట్లో ఎన్టీఆర్‌ను వ్యతిరేకించిన వెంకటరత్నం ఇంటికి బాలకృష్ణ వెళ్లడం ఏమిటనేదే ప్రస్తుతం ఆ కుటుంబంలో చర్చ. ఎన్టీఆర్‌కు నిమ్మకూరులో సొంత ఇల్లు ఉన్నా.. బాలకృష్ణ ఆ ఇంటి వైపు కూడా వెళ్లలేదు.

శివరామకృష్ణ ఇంటికి వెళ్లడంపై బాలకృష్ణ సోదరులకు కొంతమంది గ్రామస్తులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ వ్యవహారం కృష్ణా జిల్లా టీడీపీ నేతల వద్దకు వెళ్లింది. ఆ జిల్లా నాయకులు ఈ వ్యవహారాన్ని పార్టీ అగ్రనేతల దృష్టికి కూడా తీసుకెళ్లారు. బాలకృష్ణ, హరికృష్ణ కుటుంబాల మధ్య పెరుగుతున్న అగాధానికి ఈ సంఘటనే ఉదాహరణ అని కొంతమంది టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా పెట్టడమే బాలకృష్ణ గేమ్‌ప్లాన్‌లో భాగమని కూడా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నిమ్మకూరు గ్రామంలోనూ, నందమూరి కుటుంబంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Posted

[img]https://lh6.googleusercontent.com/-hxpo_50IP4k/UWap2MOrjzI/AAAAAAAACaA/09YJyrcIXbY/s159/rebel4.gif[/img][img]https://lh6.googleusercontent.com/-hxpo_50IP4k/UWap2MOrjzI/AAAAAAAACaA/09YJyrcIXbY/s159/rebel4.gif[/img][img]https://lh6.googleusercontent.com/-hxpo_50IP4k/UWap2MOrjzI/AAAAAAAACaA/09YJyrcIXbY/s159/rebel4.gif[/img]

×
×
  • Create New...