Jump to content

Recommended Posts

Posted

ఇంతకూ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు మీద అసలేం జరిగింది. ‘బిల్లును ఓడించడం’ అనే ప్రక్రియ అసెంబ్లీలో జరిగిందా? ‘బిల్లును ఓడించడం- లేదా నెగ్గించడం’ అనేది జరగవలసినది పార్లమెంటులో కదా? మరి అసెంబ్లీలో బిల్లును ఓడించి పంపాం.. అంటూ కొందరు నాయకులు ప్రల్లదనాలు పలుకుతున్నారేమిటి? అనే అనుమానాలు సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల మాటలు గమనించిన వారికి ఎవ్వరికైనా కలుగుతాయి.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ బిల్లు (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు) కేవలం పార్లమెంటుకు సంబంధించినది. గెలుపోటములు అనేవి అక్కడే డిసైడ్‌ కావాలి. ఆ బిల్లు మీద చర్చించి పంపండి అని మాత్రమే రాష్ట్ర అసెంబ్లీకి వచ్చింది. ఇక్కడ చర్చ మొదలై కొన్నాళ్లు సాగింది. అది సగంలో ఉండగానే.. వస్తుందనుకున్న అదనపు గడువు రాలేదు. ఈలోగా.. ‘అసలు ఈ బిల్లు తప్పులు తడకలుగా ఉన్నది.. దీని మీద చర్చించడమే కుదర్దు.. దీన్ని చర్చించడానికి మేం తిరస్కరిస్తున్నాం’ అని మాత్రమే ముఖ్యమంత్రి తీర్మానం పెట్టారు. సదరు తీర్మానం మాత్రమే నెగ్గింది. ఆ తీర్మానం నెగ్గడం అనేది తెలంగాణ బిల్లు ఓడిపోయినట్లు కాదు. ఈ విషయం అర్థం కావడానికి పెద్దగా రాజ్యాంగ నిపుణులు అయి ఉండవలసిన అవసరం లేదు. ఏదో నామమాత్రపు తార్కిక హేతుబద్ధ జ్ఞానం ఉంటే చాలు.

అయితే చర్చ పూర్తయిన తరువాత... తిరస్కరణ తీర్మానం నెగ్గి బిల్లు వెనక్కు పంపేశారు. అయితే కాంగ్రెస్‌ నాయకులు కొందరు అసెంబ్లీలో బిల్లును ఓడించి పంపాం.. అని ప్రజల వద్ద చెప్పుకుంటూ ఉండడం మనకు వార్తలో కనిపిస్తోంది. చివరికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా బిల్లును అసెంబ్లీలో ఓడించాం అని సెలవిచ్చారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు వంటి మంత్రులు కూడా బిల్లును ఓడించాం అంటూన్నారు. కేవలం ప్రజల్లో తామేదో యిరగదీశాం అనే భావన కలిగించడానికే నాయకులు ఇలా చెప్పుకుంటున్నారన్నమాట వాస్తవం. అయితే ఈ మాటలు మాత్రం ప్రజలను వంచించడమే అని పలువురు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ.. తెలంగాణను ఆపేస్తాం అనే సీమాంధ్ర నాయకుల వ్యాఖ్యానాల గురించి.. తెలంగాణ నాయకులు మాట్లాడుతూ.. ‘ఇది అక్కడి ప్రజలను ఆ నాయకులు వంచించడమే’ అని ఆరోపిస్తుండే వారు. ఆ మాటల్లో వంచన మోతాదు ఎంతో తెలియదు గానీ.. ఇప్పుడు చెబుతున్న మాటలు మాత్రం అచ్చమైన వంచన. ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు ఏదో ఒక తీర్మానం పెట్టడంతో మొత్తం తెలంగాణను అడ్డేసుకున్నట్లుగా చెబుతున్న మాటలు ప్రజల్ని మోసం చేయడానికే అని పలువురు భావిస్తున్నారు. అలా కానట్లయితే.. తమ ప్రయత్నం నిర్దిష్టమైనదని, చిత్తశుద్ధి ఉన్నదని వారు ఎలా నిరూపించుకుంటారో చూడాలి.
 

×
×
  • Create New...