Jump to content

Recommended Posts

Posted

సూపర్‌ ట్విస్ట్‌ ఏం కాదుగానీ, తెలంగాణ వాదులకి కాస్తంత చేదు వార్తే ఇది. రాజ్యసభలో ఈ రోజు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టబడ్తుందని అంచనా వేసినవారికి, ఈ రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కల్గించడంతోపాటు, ఆందోళన కూడా కల్గిస్తోంది. కొంపలేం మునిగిపోలేదు.. రేపు, ఎల్లుండి సమయం వుంది గనుక, ఆల్రెడీ లోక్‌సభలో బిల్లు పాస్‌ అయ్యింది గనుక, రాజ్యసభలో రేపు బిల్లు పెడితే, ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాదన్న నమ్మకం తెలంగాణ వాదుల్లో కన్పిస్తోందనుకోండి.. అది వేరే విషయం.
అయితే, రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా తాము ప్రతిపాదించిన సవరణలకు చోటు కల్పించాలని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేస్తుండడంతో కేంద్రం డైలమాలో పడింది. రాజ్యసభలో గనుక తెలంగాణ బిల్లుకు సవరణలు చేస్తే, అది మళ్ళీ లోక్‌సభకు రావాల్సి వుంటుంది. అలా లోక్‌సభకు ఇంకోసారి బిల్లు వచ్చే పరిస్థితే వుంటే, దానికి తగ్గ సమయం కల్పించగలిగినా.. లోక్‌సభలో పరిస్థితుల్ని తమ అదుపులోకి తీసుకురావడం కేంద్రానికి కత్తిమీద సామే.
పైగా, పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణ బిల్లును నిరసిస్తూ రాజీనామా చేస్తోన్న దరిమిలా, ఇంకోసారి లోక్‌సభకు తెలంగాణ బిల్లు వచ్చే పరిస్థితుల్ని కేంద్రం కోరుకోవడంలేదు. ‘మీ సవరణలకు తగ్గట్టుగా సీమాంధ్రకు న్యాయం చేస్తాం.. సవరణలు మాత్రం కోరొద్దు బిల్లులో..’ అని సాక్షాత్తూ ప్రధాని, బీజేపీ నేతల్ని వేడుకుంటున్నారట.
లోక్‌సభలో బేషరతుగా తెలంగాణ బిల్లుకి మద్దతిచ్చి, సీమాంధ్రలో వ్యతిరేకత ఎదుర్కొంటోన్న బీజేపీ, ఇప్పుడు తెలంగాణపై మెలిక పెడితే ఆ ప్రాంతంలో ప్రస్తుతం వున్న నమ్మకాన్ని కోల్పోతుందన్నది నిర్వివాదాంశం. అలాగని, సీమాంధ్ర సమస్యల పరిష్కారంపై కేంద్రాన్ని ఇరికించకపోతే.. భవిష్యత్తులో ఎప్పుడూ సీమాంధ్ర ప్రజల విశ్వాసం పొందలేమన్న భావన ఆ పార్టీలో కన్పిస్తోంది.
నిన్నటి లోక్‌సభ పరిణామాల్ని చూశాక, బీజేపీ కేంద్రాన్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. అలాగని మంకుపట్టు కొనసాగించేందుకూ అవకాశాలు తక్కువ. సరిగ్గా కేంద్రం ఇదే కోరుకుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తుంది.? ఎలాగూ సీమాంధ్రుల ఛీత్కారం ఎదుర్కొంటున్నాం గనుక, ఆ ఛీత్కారం కాస్త ఎక్కువైనా ఫర్లేదని కాంగ్రెస్‌తో ‘కుమ్మక్కు’కే బీజేపీ ‘సై’ అనేస్తుందా.? వేచి చూడాల్సిందే.
 

×
×
  • Create New...