Jump to content

Jairam Ramesh About Trs...


Recommended Posts

Posted

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సంకుచిత పార్టీగా కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ అభివర్ణించారు. అలాంటి పార్టీకి అండగా ఎలా ఉంటారని తెలంగాణ జేఏసీ నేతలను ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన జేఏసీ నేతలను లేక్‌వ్యూ అతిథి గృహానికి పిలుచుకున్నారు. వారితో సుమారు గంటకు పైగా సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ తీరుపై ఈ సందర్భంగా జైరాం నిశిత విమర్శలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంపై చర్చించారు. కాంగ్రెస్‌తో జేఏసీ కలసి రావాలని నేతలను కోరారు. తెలంగాణ ఇచ్చినందుకు జైరాంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకమని జేఏసీ నేతలకు జైరాం స్పష్టం చేశారు.
 
కానీ అధిష్టానం సూచనలను అమలు చేయక తప్పలేదన్నారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలోనూ కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్ అండగా ఉంది. తెలంగాణ ఇవ్వడానికి సీమాంధ్రలో పార్టీపరంగా ఆత్మహత్య చేసుకున్నాం. 15-20 ఏళ్లు అక్కడిక పార్టీ ఉండదు. తిరుపతికి పోతే నాకు నిరసన తెలియజేశారు. కాకినాడలో అయితే ఎవరో ప్రత్యేక దేశమే అడిగారు’’ అన్నారు. దీనికి జేఏసీ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించారు.
 
 ‘‘తెలంగాణ ప్రజలది 60 ఏళ్ల పోరాటం. వేలమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నరు. తెలంగాణ-సీమాంధ్ర ప్రజల మధ్య ఏనాడూ భావ సారూప్యత లేదు. సమానత్వం లేదు. తెలంగాణ ప్రజల పట్ల నిరంతరం చిన్నచూపు, వివక్షే. నీళ్లు, నిధులు, నియామకాల్లో తేడాలు చూపడమే గాక కనీసం సాటి మనుషులుగా కూడా చూడలేదు. తెలంగాణ సమాజమే ద్వితీయ శ్రేణికి దిగజారింది. అందుకే పోరాటాలు జరిగాయి. వీటిపై మీకు అవగాహన లేనట్టుంది’’ అన్నారు. దాంతో జైరాం సర్దుకుని, తెలంగాణను తక్కువ చేసి చూడటం తన ఉద్దేశం కాదన్నారు. ‘‘తెలంగాణ పునర్నిర్మాణంలో మీకేం వస్తుందనేది నా ప్రశ్న. భావి కార్యాచరణ, రాజకీయ నిర్ణయంలో భాగస్వామ్యం తదితరాల్లో మీకందే ఫలాలేమిటని నేనడుగుతున్నా’ అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని ఇప్పటిదాకా రెండే సామాజిక వర్గాలు పాలించాయని, ఇప్పటిదాకా వెనుకబడ్డ వర్గాలకు ఇకపై రాజకీయ అవకాశాలతో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఫలాలు అందుతాయని జేఏసీ నేతలు బదులిచ్చారు. కానీ టీఆర్‌ఎస్‌కు అధికారం వస్తే అదెలా సాధ్యమని జైరాం ప్రశ్నించారు. ‘‘మరోసారి దొరల పాలన వస్తుందంతే. కాంగ్రెస్, బీజేపీలకున్న జాతీయ దృక్పథం, అవగాహన టీఆర్‌ఎస్‌కెలా ఉంటాయి? టీఆర్‌ఎస్ ఎదిగితే తెలంగాణలో అరాచకత్వం, విధ్వంసం చూడాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్ వంటి పార్టీలు రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను చీల్చే సంకుచిత (నారో) ఆలోచనలు చేయగలవు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేల తీరు చూస్తున్నాం కదా. టీఆర్‌ఎస్ కూడా మరో ఆమ్ ఆద్మీ పార్టీలా కూలిపోక తప్పదు’’ అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు జేఏసీ వంటి సంఘాలు కాంగ్రెస్‌తో కలిసి రావాలని కోరారు.
 
 ‘‘టీఆర్‌ఎస్ మాతో కలిసి వస్తదో, రాదో. దామోదరం సంజీవయ్య వంటివారు జాతీయ నేతలుగా కాంగ్రెస్‌లోనే ఎదిగారు. అన్ని సామాజిక వర్గాల ఎదుగుదలకు కాంగ్రెస్‌ను మించిన రాజకీయ వేదిక దేశంలోనే లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పెరిగితే పెద్ద సంక్షోభం తప్పదు’’ అని జైరాం మరోసారి హెచ్చరించారు. దొరలపై తిరగబడి, వారిని గ్రామాల నుండి తరిమికొట్టిన చరిత్ర తెలంగాణదని జేఏసీ నేతలన్నారు. ఉద్యమంలో కూడా ఇప్పటిదాకా వారితో చాలా అవమానాలు భరించామని టీఆర్‌ఎస్, కేసీఆర్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మాది ఒక లక్ష్యం కోసం రాజకీయేతర సంఘాలతో ఏర్పాటైన ఉమ్మడి వేదిక. కాంగ్రెస్‌తో కలిసి రావడంపై చర్చించి నిర్ణయం చెబుతాం’ అని జైరాంకు చెప్పారు.
 
 తెలంగాణ, సీమాంధ్రకు ఉమ్మడి జేఏసీ
 
 తెలంగాణ సాధన పోరాటం ముగిసినందున ఇక రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన సమయం వచ్చిందని జైరాం అభిప్రాయపడ్డారు. ‘ఇరు ప్రాంతాలను ఒప్పించి అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కే ఉంది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి కోసం పనిచేసుకునే అవకాశం మా పార్టీలోనే ఉంటుంది. ప్రాంతాలుగా భౌగోళికంగా విడిపోయినా ప్రజలుగా కలిసి అభివృద్ధి కావాలి. రెండు రాష్ట్రాల్లో ఉన్నా మనమొక్కటేననే నినాదంతో సాగాలి. మతతత్వ శక్తులు చొరబడి, పెరిగిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది’ అన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధి కోసం తెలంగాణ, సీమాంధ్ర జేఏసీలతో ఉమ్మడి జేఏసీని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. ‘సీమాంధ్రలో నాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నేనిప్పుడు అక్కడి నుంచే ఎంపీగా ఉన్నాను. అది కూడా రెండేళ్లలో పూర్తవుతుంది. మరోసారి అక్కడి నుంచి గెలిచే అవకాశాల్లేవు’ అని జైరాం చెప్పగా తెలంగాణ నుంచి గెలిపించుకుంటామని జేఏసీ నేతలు భరోసా ఇచ్చారు. ఉమ్మడి జేఏసీ సంబంధిత ఏర్పాట్లను తన తదుపరి పర్యటన నాటికి చూడాలని పక్కనే ఉన్న ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజును జైరాం కోరారు. హైదరాబాద్‌ను తెలంగాణకే ఇవ్వడం, భద్రాచలంలోని ముంపు గ్రామాలు తదితరాలపై చర్చ జరిగింది. రసమయి బాలకిషన్‌తో జైరాం పాటలు పాడించుకుని విన్నారు. ఆయన్ను జూనియర్ గద్దర్ అంటూ కొనియాడారు. జేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, నేతలు దేవీప్రసాద్, సి.విఠల్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, రఘు, వి.శ్రీనివాస్‌గౌడ్, కె.రవీందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు జైరాంతో భేటీలో పాల్గొన్నారు.

×
×
  • Create New...