Jump to content

Recommended Posts

Posted

తెలుగులో సాధారణంగా రొమాంటిక్ కామెడీ జెనర్ లో వచ్చే చిత్రాలు అరుదు. ఎందుకంటే పెద్ద హీరోలు చిత్రాలకు వారి బడ్జెట్ కి తగినట్లు గా భారీగా మాస్ మసాలాని నింపి వదులుతూంటారు. ఇక చిన్నచిత్రాలు సైతం అదే మాస్ రూట్ లో ప్రయాణించటమో లేక సింగిల్ లొకేషన్ లో నడిచిపోయేలా ఏ హర్రర్ చిత్రమో ప్లాన్ చేస్తారు. అటూ ఇటూ కానప్పుడు మరికొంత మంది రొమాంటిక్ చిత్రం పేరుతో బూతుని నింపి వదలటానికి ప్రయత్నిస్తూంటారు. అంతే తప్ప...నీటుగా వినసొంపైన పాటలతో,చక్కటి విట్ తో కూడిన డైలాగులతో,ఆహ్లాదం కలిగించే కెమెరా వర్క్ తో కూడిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు తీయరు. అయితే దర్శకుడుగా పరిచయం అవుతున్న సతీష్ కుమార్ తన తొలి చిత్రానికి ఇటువంటి జెనర్ ని ఎన్నుకుని ఎక్కడా అసభ్యత,హింస లేకుండా తనకున్న పరిధిలో హాయైన చిత్రం తీయటానికి ప్రయత్నం చేసారు. కథపరంగా చాలా చిన్నది...మాధవ్(విక్రాంత్), కావేరి(పల్లవి ఘోష్) అనే ఇద్దరి ప్రేమ కథ. వారి మనస్సులో దాగి ఉన్న ప్రేమని ఆవిష్కరింప చేసే అది చిన్న కథనం. మాధవ్...ఓ ఎన్నారై...ఇండియాలో ఓ పల్లెకు తన స్నేహితుడు పెళ్లికి వస్తాడు. అక్కడ ఆ పెళ్లికి వచ్చిన కావేరి అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. అది రెండు రోజుల్లోనే ఒన్ సైడ్ లవ్ గా మారుతుంది. అతని ప్రేమకు స్నేహితులు సాయం చేస్తారు. అయితే ఇక్కడో ట్విస్టు ..ఆమెకు హర్ష(నాని) అనే బోయ్ ప్రెండ్ ఆల్రెడీ ఉంటాడు. అతను అమెరికాలో ఉంటాడు. అతన్ని కాదని ఆమె మనస్సు...మాధవ్ వైపు ఎలా తిరిగింది..ఈ క్రమంలో ఏయే పరిణామ క్రమాలు జరిగాయి అనేది మిగతా కథ. రొమాంటిక్ కామెడీలకు స్క్రిప్టే ప్రాణం. ఆ విషయంలో కథా రచయిత అయిన దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తను అనుకున్న కథని ఎక్కడా తడబడకుండా తెరకెక్కించారు. కథలో మాస్ ఎలిమెంట్స్, ఫలానా సెంటర్స్ కి కిక్ ఎక్కిస్తాయి అంటూ అనవసరమైన ఎలిమెంట్స్ ఏమీ దూర్చకుండా నిజాయితీగా చేసారు. డైలాగులు సైతం ఫన్నీగా చేసారు. అలాగే హీరోయిన్ తండ్రి పాత్రను కొత్తగా అంటే ఆయన ఈ రోజుల్లో పాతకాలం పద్యాలు అవీ పాడతూ ఎంజాయ్ చేస్తూండటం వంటివి తమాషాగా చిత్రీకరించారు. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ మద్య సెకండాఫ్ లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరో వచ్చి ఫోన్ వంకతో అందరి ఎదురుగుండా హీరోయిన్ ని గిచ్చి వెళ్లే సీన్స్ బాగున్నాయి. ఇక దర్శకుడుగా సతీష్ కుమార్ కి తొలి చిత్రమైనా ..అనుభవమున్నవారిలా చిన్న చిన్న డిటేల్స్ సైతం బాగా డీల్ చేసారు. ఎక్కడా కొత్త దర్శకుడు చిత్రం అనిపించదు. అలాగే కెమెరామెన్ పనితనం సైతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పాటల్లో అతని ప్రతిభ కొట్టిచ్చినట్లు కనపడుతుంది. డైలాగ్స్ కూడా అక్కడక్కడా బాగానే నవ్వించాయి. ఇక మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమాకు సంగీతం ప్రాణం. ఆ విషయంలోనూ బాగా శ్రద్ద తీసుకున్నారు. పాటలు...చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎంకి వంటి పిల్ల లేదోయ్... అనే పాట చాలా బాగుంది. చిత్రీకరణ కూడా బాగా మంచి ఫీల్ తో ఉంది.అలాగే నీలాకాశం పాట, అడుగులు కలిసే, థీమ్ సాంగ్ కూడా బాగున్నాయి. రీరికార్డింగ్ ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నటీనటుల్లో హీరో,హీరోయిన్స్ కొత్తవాళ్లు అయినా బాగానే చేసారు. అయితే దర్శకుడు తెలివిగా ఎక్కువ నటనకు స్కోప్ ఉన్న సన్నివేశాలు వారికి ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే హీరోయిన్ తండ్రి వేసిన చలపతిరాజు కూడా బాగా చేసారు. ఇంకా సూర్య,నాని వంటి కొత్త నటులు తమ పరిధిలో బాగానే పండించారు. అంతా కొత్తవారితో ఆ మేరకు నటన రాబట్టుకున్న దర్శకుడు అభినందనీయుడనే చెప్పాలి. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి. ఫైనల్ గా ఈ చిత్రం ఓ సాయింత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దామనుకునేవారికి మంచి ఆప్షన్. హింస,అశ్లీలత లేదు కాబట్టి ఫ్యామిలీలు కూడా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. అయితే పెద్దగా పబ్లిసిటీ,థియోటర్స్ లేని ఈ చిత్రం ఏ మేరకు నిలబడుతుందనేది చూడాలి.

×
×
  • Create New...