Jump to content

Recommended Posts

Posted
9yerrabelli2.jpg
 
 

చిత్తశుద్ధితో కృషి చేశా.. అధినేతను ఒప్పించా
టీఆర్ఎస్ వాళ్ల ఆరోపణలతో చాలా బాధేసేది
టీఆర్ఎస్‌ది గాలివాటం గెలుపే
కేసీఆర్ అప్పుడే మాటలు మారుస్తున్నారు
వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ అదృశ్యం
పార్టీలో నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు
2019 నాటికి మాదే అధికారం
'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. వచ్చే ఎన్నికలలో (2019) తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో తన మనోభావాలను ఇలా వెల్లడించారు...

కొత్త రాష్ట్రం అనుభూతి ఎలా ఉంది?
తెలంగాణ సాధించుకున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నామన్న బాధకన్నా 60ఏళ్ల కల నెరవేరిందన్న సంతోషమే ఎక్కువ. తక్కువ మంది ఉన్నా మా తెలంగాణ నేతలందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామన్న ఫీలింగ్ ఉంది. అయితే ఉమ్మడి అసెంబ్లీలో ఏదైనా చర్చ జరిగితే చాలా బాగుండేది. ఇప్పుడు జనం తక్కువైనందువల్ల ఏదో జడ్పీ మీటింగ్‌లో కూర్చున్నట్లు అనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మిత్రులకు అధికారం రావడంపై మీ స్పందన...
మా మిత్రులంతా మంత్రులయ్యారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఉమావంటి వాళ్లకు పదవులు వచ్చాయి. మేమిక్కడ అధికారంలోకి రాలేదన్న బాధ ఉన్నా తెలంగాణ వచ్చిన సంతోషం ఉంది.

కేసీఆర్ పాలన ఎలా ఉంటుందనుకుంటున్నారు?
దాటవేసే ధోరణి చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేద్దామన్న చిత్తశుద్ధి లేకుండా, ఎలా అడ్డు వేయాలా అని ఆలోచిస్తున్నారు. అన్నిరకాల రైతు రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. కానీ కేవలం పంట రుణాలే అంటున్నారు. మేము ఇంగ్లిష్ మేనిఫెస్టో చూపించి అన్ని రుణాలూ రద్దు చేయాలని అడిగితే.. ఆయన తెలుగు మేనిఫెస్టో చూపుతున్నారు. మేం పంట రుణాలే అన్నామని తొండి చేస్తున్నారు. అయినా ప్రభుత్వాన్ని వదలం. అన్ని రుణాలూ రద్దు చేసేదాకా వెంటపడతాం.

అలా చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో మీ నాయకుడికి ఇబ్బందేమో?
నాయకుడితో ఈ అంశం మాట్లాడాం. ఆయన క్లారిటీతో ఉన్నారు. రైతులకు సంబంధించి గోల్డ్‌లోన్ల నుంచి రూ.2 లక్షల లోపు అన్నీ మాఫీ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ఈ విషయం ఆయనే నాకు స్వయంగా చెప్పారు.

అక్కడ రూ.2లక్షలు.. ఇక్కడ లక్ష అంటే అదో పంచాయితీ ఏమో?
లక్ష చేసినా.. ఇక్కడి రైతులు ఆనందంగానే ఉంటారు. అయితే ఆ లక్ష మీదనే క్లారిటీ ఇవ్వటం లేదు కదా.. లోటు బడ్జెట్ ఉన్నా అక్కడ రుణమాఫీని చెప్పిన విధంగా అమలు చేయాలని మా నాయకుడు ఆలోచిస్తుంటే మిగులు బడ్జెట్ ఉన్న ఇక్కడ లక్ష రుణమాఫీకే వంద కొర్రీలు పెడుతున్నారు. అన్నివిషయాల్లోనూ కేసీఆర్ తప్పించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఆయన, ఇప్పుడు అలా అనలేదని అసెంబ్లీలో చెబుతున్నారు.

పోలవరంపై ఏమిటి?
అసలు పోలవరానికి బాధ్యత కాంగ్రెస్, టీఆర్ఎస్‌లదే. ముంపు మండలాలు తెలంగాణలోనే ఉంటే బాగుండునన్నది మా భావన. చంద్రబాబు కూడా దీనిపై తటస్థంగా ఉన్నారు. అసలు యూపీఏ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నా ఏం మాట్లాడలేదు. తర్వాత సోనియా దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పారు. అప్పటికే ఏడు మండలాలను ఆంధ్రలో కలపాలని నిర్ణయించారు. మరి అప్పుడు మాట్లాడకుండా బంద్‌కు పిలుపునివ్వడం అంతా నటనే.

మరి 2019 పరిస్థితి ఏమిటి?
కచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్‌కు కేడర్ లేదు.. కాంగ్రెస్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీల మధ్యే పోటీ ఉంటుంది.

తెలంగాణలో టీడీపీకి ఓట్లు వేయడమేంటని తెలంగాణవాదులు అనుకుంటున్నారు... దీనిపై మీరేమంటారు?
అటువంటిదేమీ లేదు. అసలు టీడీపీ కరడుగట్టిన సమైక్యవాద పార్టీ. అయితే తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆవేదనతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. తీర్మానం కూడా చేశారు. ఎవరెంత ఒత్తిడి చేసినా దానికి కట్టుబడి ఉన్నారు. అయితే వీటన్నింటినీ మేం సరిగా ప్రచారం చేసుకోలేకపోయాం. బిల్లు సమయంలో చంద్రబాబుతోపాటు నేనూ ఢిల్లీ వెళ్లాను. ఆయన అడిగింది సమన్యాయం చేయమని.. సీమాంధ్రుల కోరికలు తీర్చాలని.. అందులో తప్పేముంది.

నమ్మకంలేక ప్రచారం చేసుకోలేకపోయారా?
కాదు. టీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరించింది. దాన్ని మేం ఎదుర్కోలేకపోయాం. పైగా ఆ సమయంలో చాలామంది నేతలు పార్టీని వీడారు. పోచారం శ్రీనివాసరెడ్డి, నగేష్ , కడియం శ్రీహరి, దేవయ్య, మహేందర్‌రెడ్డి వీరంతా వెళ్లిపోయారు.

మీరూ వెళ్లిపోతారని వార్తలు వచ్చాయి కదా?
అటువంటిదేమీ లేదు. తొందరగా తెలంగాణ కమిటీ వేయమని గట్టిగా అడిగాను. ఆలస్యం అవుతుండడంతో బాగా అలిగాను. నా బాధ అందరికీ చెప్పాను. దానివల్ల ఆ వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి, పార్టీలోకి రమ్మన్నారు. అహ్మద్ పటేల్ కూడా ఫోన్‌చేశారు. టీఆర్ఎస్‌నుంచి కేసీఆర్ కుటుంబసభ్యులే మాట్లాడారు.

మీకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండేదికదా?
ఉండేది.. కానీ, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ ప్రకటించాక ఆ ఆలోచన వదులుకున్నా. బీసీ ముఖ్యమంత్రిపై నాకు అభ్యంతరం లేదు కానీ, అధ్యక్షుడిగానైనా నాకు అవకాశం ఇవ్వొచ్చుకదా. నాకు టీడీపీ అంటే సొంతపార్టీ అన్న ఫీలింగ్ ఉంటుంది. 1982లో టీడీపీ లోకి వచ్చా. జెండారూపకల్పన నుంచి నాకు తెలుసు.

రేషన్ డీలర్ల మాఫియా అంటుంటారు అదేంటి?
హరీశ్ వాళ్లకు నా కుటుంబం గురించి పూర్తిగా తెలియదు. మా నాన్నగారు వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. అమ్మ తరఫు ఆస్తులు, నాన్న తరఫు ఆస్తులు అన్నీ కలిపి సుమారు ఓ వెయ్యి ఎకరాలుండేవి. ప్రస్తుతం వందెకరాలు మిగిలింది. అయితే నేను రేషన్ డీలర్‌గా ఉండి అక్రమాలకు పాల్పడ్డానని వారు ఆరోపిస్తుంటారు. డీలర్ల అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేయాలంటే డీలర్‌షిప్ ఉండాలని.. డీలర్లంతా కలిసి నాపేరుమీద ఓ డీలర్ షిప్ రాశారు. దానిపై వీళ్లు ఆరోపణలు చేస్తుంటారు.

మీకు, కేసీఆర్‌తో బంధుత్వం ఉందా?
ఆయన భార్య తరఫు బంధుత్వం ఉంది. హరీశ్‌రావుకు, నాకు వ్యక్తిగతంగా గొడవ ఏమీలేదు.. కానీ ఆయన రెచ్చగొడతారు. దాంతో నేనూ గట్టిగానే స్పందిస్తాను.

కేసీఆర్ ఇంటికి భోజనానికి ఎప్పుడైనా వెళ్లారా?
ఆయన మంత్రిగా ఉన్న సమయంలో వెళ్లా. తర్వాత ఢిల్లీలో ఓసారి ఎర్రన్నాయుడు, కేసీఆర్ ముగ్గురం కలిశాం. తర్వాత జయశంకర్ గారి ఇంటి దగ్గర డిన్నర్‌కి వెళ్లాం. జయశంకర్, మానాన్న కలిసి చదువుకున్నారు. చిన్నప్పుడు నేను చదువు మీద దృష్టి పెట్టకుండా వేట అంటూ తిరుగుతుండడంతో నన్ను జయశంకర్ ఇంటిదగ్గర ఓ నెలపాటు వదిలేసి వచ్చారు. అక్కడ కూడా ఇలానే ఉండేవాడిని. అయినా సరే, నాకు చదువు మీద శ్రద్ధ కలగలేదు. ఇంటర్మీడియట్‌తో ఆపేశాను.

కుటుంబం సంగతి ఏమిటి?
నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు. వాడికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. నా ఎన్నికలకు కూడా వాడు రాలేదు. అల్లుడు మాత్రం రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే చంద్రబాబు స్ఫూర్తితోనే ఆయన వచ్చాడు తప్ప నేనేమీ ప్రోత్సహించలేదు.

ప్రజలకు మీరంటే చాలా అభిమానమని చెబుతుంటారు... ఎందుకలా?
రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. దానికోసం ఓ ట్రస్ట్ పెట్టాను. 70 గ్రామాల్లో మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నా. 2 రూపాయలకే వాటరు టిన్ను అందజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలకు నా కుమారుడు కూడా సహాయపడతాడు. నియోజకవర్గంలో రాజకీయం చేయను. అందువల్లే ప్రజలకు నేనంటే నమ్మకం.

చంద్రబాబు సూచనలు తీసుకుంటూ ఉంటారా?
కచ్చితంగా... మా నాయకుడి సలహాలు సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు సూచనలు చాలా బాగుంటాయి. ఉదాహరణకు నేను చేవెళ్ల సీటు అడిగా.. దానికి ఆయన ఒప్పుకోలేదు. పాలకుర్తిలో పోటీ చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. చేవెళ్ల వస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. దీనివల్ల నేను పాలకుర్తిలో గెలిచాను. అంత టీఆర్ఎస్ గాలిలోనూ నేను వరంగల్ జిల్లాలో గెలవడంతో అందరూ నన్ను హీరోలా చూస్తున్నారు.

ఏపీలో అధికారంలోకి రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?
చాలా ఇబ్బంది ఎదురయ్యేది. అక్కడ అధికారంలోకి రాకున్నా.. కేంద్రంలో అధికారంలోకి రాకున్నా చాలా ఇబ్బంది ఎదురయ్యేది. ఇప్పుడు మన నేత ముఖ్యమంత్రి అయ్యారు అన్న ఆనందం ఉంది.

రాజకీయాల్లో మీకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులేమిటి?
గడచిన ఐదేళ్లు చాలా అవమానాలుపడ్డా. నేను తెలంగాణకు చిత్తశుద్ధితో పనిచేశా. బాబుగారిని కూడా ఒప్పించా. ఇన్ని చేసినా.. టీఆర్ఎస్ వాళ్లు నన్ను తెలంగాణ ద్రోహి అని విమర్శలు చేయడంతో చాలా బాధ కలిగింది. ఆ అల్లరి అంతా టీఆర్ఎస్ నేతలే చేశారు. తెలంగాణ ఉద్యమానికి కాపాడుకోవడానికి కోట్లు ఖర్చుపెట్టాను.

పార్టీలో మీకు లభించిన గుర్తింపుపై ఏమంటారు?
నాకు సరైన గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది.. 1985లో నాకు ఇవ్వాల్సిన టికెట్‌ను బీజేపీకి ఇచ్చేశారు. నాకు మంత్రి కావాలని ఉండేది గానీ అవలేకపోయాను. పీఏసీ చైర్మన్ అవ్వాలనుకున్నా కాలేకపోయా. కుల సమీకరణాలవల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టీడీఎల్పీ లీడర్ చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది.

మీ ఆశయమేమిటి?
తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే నా జీవితాశయం.

కేసీఆర్ జనాల్ని మోసం చేస్తున్నారనే నమ్మకానికి వచ్చారా?
అవును. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని అనలేదంటున్నాడు. రైతు రుణాలపై కొర్రీలు పెడుతున్నారు. బ్యాంకర్ల మీటింగ్‌లో రుణమాఫీ కేవలం 2013-14కే అని చెప్పారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. ఆయన మాటలు, చేష్టలకు ప్రజలే ఎదురుతిరుగుతారు. రుణమాఫీలో వెనక్కి వెళితే వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీని అడ్డుకుంటాం. మాటల గారడీతో నడిపిద్దామనుకుంటున్నాడు. అది కుదరదు.

మీ ఇంట్లో పనిమనుషులే మీకు ఓటు వేయలేదట నిజమేనా?
అవును వెయ్యలేదు. మా ఇంట్లో పనిచేసే సమ్మయ్యకు 80 ఏళ్లు. పనిచేయకపోయినా మా ఇంట్లోనే ఉంటారు. అలాంటి పెద్దవయస్సువాళ్లు మా ఇంట్లో నలుగురుంటారు. వారెవరూ టీడీపీకి ఓటు వేయలేదు. ఎందుకని అడిగితే 'నా మనవడికి ఉద్యోగమొస్తుందని ఆ పార్టీకి వేశాను' అని చెప్పారు. అంతలా జనాల్ని కేసీఆర్ నమ్మించారు.

తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు ఉందా?
టీడీపీకి కేడర్ ఉంది. గ్రామాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీలకు లేని కేడర్ టీడీపీకి ఉంది. అయితే ఈసారి ఓటింగ్ దెబ్బతింది. లీడర్లు కూడా కొంతమంది వేరే పార్టీలకు వెళ్లడం వల్ల ఇబ్బంది వచ్చింది. కేడర్ ఎప్పటికీ పోదు. నేను లేకపోయినా కేడర్ ఉంటుంది. టీఆర్ఎస్‌కు కేడర్ లేదు. వారి గెలుపు ఓ పొంగు వంటిది.
మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ సెలవు

 
×
×
  • Create New...