Jump to content

Anna Hazare Warns Central Govt.


Recommended Posts

Posted

న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచుకున్న వ్యక్తుల జాబితాను అత్యున్నత న్యాయ స్ధానం సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించడంపై సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైతే మళ్లీ దేశంలో లోక్‌పాల్‌పై ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు.

హజరే మాట్లాడుతూ "అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కి తీసుకువస్తామని ప్రధానమంత్రి మోడీ, ఆయన పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. ఇప్పటికి 150 రోజులు గడిచిపోయాయి. కానీ, ఇంతరవకు నిర్ధిష్టమైన చర్య తీసుకోలేదు." అని అన్నారు.

ఇప్పటి వరకు ఎనిమిది మంది పేర్లనే ప్రభుత్వం బయటపెట్టింది. మిగిలిన పేర్లను ఎప్పుడు వెల్లడిస్తారా? అని యావత్ దేశం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తోందని అన్నా హజారే పేర్కొన్నారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ మనీ తిరిగి రప్పిస్తే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రూ. 15 లక్షలు వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయవచ్చని అన్నారు.

నల్లధనం వెలికితీత అంశంపై ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ స్పందించారు. భారత రాజకీయ చరిత్రలో ఇదో శుభపరిణామమని ఆయన అన్నారు. అయితే ఈ క్రెడిట్ ఆర్థిక శాఖకు గానీ అటార్నీ జనరల్‌కు దానీ దక్కదని, సుప్రీంకోర్టుకే దక్కుతుందని ఆయన అన్నారు.

నల్లకుబేరుల జాబితాలోని పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించాలని ఆయన సూచించారు. ఈ కేసులో విచారణను ప్రభుత్వం లేదా అధికారవర్గం చేతుల్లో పెట్టుకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నల్లకుబేరుల జాబితాను బుధవారం ఉదయం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన విషయం తెలిసిందే. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తెప్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. కేవలం నల్ల కుబేరుల పేర్లను వెల్లడించడమే కాకుండా నల్లధనాన్ని భారత్‌కు తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో బిజెపికి అండగా నిలిచిన కార్పోరేట్ సంస్థలను రక్షించాలనే రహస్య ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, అయితే మళ్లీ ఆ అంశాన్ని కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకుని వెళ్లిందో తెలియడం లేదని ఆయన అన్నారు.

 

Black Money Case Timeline :

2009 ఏప్రిల్ 18: తేదీన పన్ను ఎగవేసి విదేశాల్లో నల్లధనం దాచిన భారతీయుల వివరాలు వెల్లడిస్తామని బిజెపి ఓ బుక్‌లెట్ విడుదల చేసింది.

2011 జనవరి 19: దాదాపు 89.16 బిలియన్ డాలర్ల మేర భారతీయుల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉందని, ఆ ధనాన్ని వెనక్కి తీసుకుని వచ్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

2011 జనవరి 19: నల్లధనంపై ఎంసి జోషీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిబిడిటీ కమిటీ కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది.

2012 జనవరి 27: నల్లకుబేరుల పేర్లు ఇచ్చిపుచ్చుకోవాలని జి20 దేశాలు తీర్మానించాయి. ఈ తీర్మానంపై సంతకాలు చేయాలని నిర్ణయించాయి.

2013 నవంబర్ 14: తమ పార్టీ అధికారంలోకి రాగానే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రజలకు హామీ ఇచ్చారు.

2014 ఫిబ్రవరి 1: నల్లధనాన్ని వెనక్కి తెచ్చే విషయంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకుంటామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.

2014 ఫిబ్రవరి 21: నరేంద్ర మోడీకి దాదాపు రూ.400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో వెల్లడించాలని ఆప్ నాయకులు బిజెపిని డిమాండ్ చేశారు.

2014 మార్చి 26: బ్లాక్ మనీని వెనక్కి తెచ్చేందుకు ప్రత్యేక రాయబారిని నియమిస్తామని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెసు ప్రకటించింది.

2014 ఏప్రిల్ 27: నల్లధనం దాచిన కుబేరుల జాబితా వివరాలను ఇచ్చిపుచ్చుకునే విషయంలో భారత్, స్విట్జర్లాండ్ దేశాలు అధ్యయనం చేయాలని నాటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు.

2014 ఏప్రిల్ 29: లిచెస్టన్ బ్యాంకులో నల్లధనం దాచిన 26 మంది వివరాలను భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది.

2014 జూన్ 2: విదేశాల్లో దాచిన బ్లాక్ మనీని రప్పించేందుకు రిటైర్డ్ జడ్జి ఎంబి షా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది.

2014 జులై 20: నల్లకుబేరుల జాబితా వివరాలను వెల్లడించాలని భారత్ చేసిన విజ్ఞప్తిపై స్విస్ బ్యాంకులు సానుకూలంగా ప్రతిస్పందించాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చెప్పారు.

2014 జులై 25: నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రకటించారు.

2014 అక్టోబర్ 18: నల్లకుబేరాల జాబితాలోని పేర్లను దాచిపెట్టేది లేదని జైట్లీ మరోసారి చెప్పారు. అయితే, సమగ్ర విచారణ తర్వాతనే పేర్లను వెల్లడిస్తామని చెప్పారు.

2014 అక్టోబర్ 26: ఒక కంపెనీ మినహా మొత్తం 8 మంది నల్లకుబేరుల వివరాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

2014 అక్టోబర్ 28: నల్లకుబేరాల పూర్తి జాబితాను సీల్డ్ కవర్‌లో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

2014 అక్టోబర్ 29: మొత్తం 627 పేర్లతో కూడిన నల్లకుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

×
×
  • Create New...