Jump to content

Recommended Posts

Posted

ఏదైనా సమస్య వచ్చిన సమయంలో.. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది. వెలుగులోకి వచ్చిన సమస్యపై రాజకీయాలకు అతీతంగా చర్చలు జరపటం.. ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఏ విధంగా ప్రజల్ని రక్షించాలన్న అంశంపై నిర్మాణాత్మకంగా చర్చ జరిపితే ఎలా ఉంటుంది? కానీ.. అందుకు భిన్నంగా రాజకీయమే పరమావధిగా.. దూకుడు రాజకీయాలతో రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ తీయటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తే ఏమవుతుంది?

తాజాగా.. తెలంగాణ అసెంబ్లీ మాదిరే ఉంటుందని చెప్పాలి. కల్తీ పాల విషయంలో తెలంగాణ సర్కారు కూడా ఇదే తీరుతో వ్యవహరించటం గమనార్హం. ఆక్సిటోసిన్‌ను పాడి రైతులు వినియోగించటం.. పాలు ఎక్కువ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రమాదకరమైన ఈ మందును పశువులకు ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వటంపై టీ టీడీపీ చర్చ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు పాడి పరిశ్రమను సరిగా పట్టించుకోవటం లేదంటూ విమర్శించింది.

నిజానికి.. ఈ విషయంపై తెలంగాణ సర్కారు సీరియస్‌నెస్‌ ఉంటే.. అదేంటి అలా మాట్లాడతారు.. ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కాలేదు. కచ్ఛితంగా ఈ అంశంపై చర్యలు తీసుకుంటాం.. ఏమేం చేస్తే బాగుంటుందన్న దానిపై ఒక కమిటీని వేద్దామని అంటే ఎలా ఉండేది? మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఉంటుందా?

కానీ..జరిగిందేమిటి? కల్తీపాలపై టీటీడీపీ చర్చ లేవనెత్తిన వెంటనే.. ఏపీ సీఎం చంద్రబాబు హెరిటేజ్‌ పాలు గుర్తుకు వచ్చాయి. అంతలోనే మరో మంత్రి కల్పించుకొని కేరళలో హెరిటేజ్‌ పాలను నిషేధించారంటూ ఆ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవోల్ని చూపించారు. ఇంకేముంది? మండాల్సినంత మంట మండింది. అధికార.. ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటంతో అసలు చర్చ పక్కదారి పట్టింది.

ఇక్కడో విషయం ఉంది. పక్క రాష్ట్రంలో హెరిటేజ్‌ పాలు నిషేధించటం జరిగినప్పుడు.. ఆ విషయం తెలంగాణ సర్కారును తెలిసినప్పుడు.. ఇంతకాలం ఏం చేస్తున్నట్లు? మిగిలిన విషయాల మీద కాస్త సమయం చూసుకొని నిర్ణయం తీసుకోవచ్చు కానీ.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ నిత్యం వినియోగించే పాలలో కల్తీ భారీగా ఉంటే అది హెరిటేజ్‌ కానీ.. మరొకటి కానీ దానిపై నిషేధమో మరో చర్యో ఎందుకు తీసుకోలేదు?

ఈ ప్రశ్నకు అధికారపక్షం సమాధానం చెప్పదు. ఎంతసేపటికి తెలంగాణకు బూచిగా చంద్రబాబును చూపించటం.. ఆ పేరుమీద రాజకీయం చేయటం.. విమర్శలు.. ఆరోపణలు చేస్తూ పొలిటికల్‌ మైలేజీ రాబట్టుకోవాలని చూడటమే తప్ప.. తెలంగాణ వ్యాప్తంగా పాలపై తనిఖీలు నిర్వహిస్తామని.. లోపాలు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకని విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురారు? 

ఒకవేళ అలా చేస్తే తెలంగాణ అధికారపక్షానికి వచ్చే లాభం ఏమీ ఉండదేమో. అలా కాకుండా దానికి బాబు బూచిని జత చేస్తే కావాల్సినంత మసాలా. విపక్షాన్ని ఇరుకున పెట్టచ్చన్న వైఖరి కనిపిస్తుంది. నిజమే.. విపక్షాన్ని అధికారపక్షం ఇరుకున పెట్టచ్చు.. రాజకీయ మైలేజీ సాధించొచ్చు. కానీ.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాసంక్షేమం మాటేమిటి? ఆ మాటకు వస్తే.. ఇంత రాజకీయం చేస్తున్న వారింట్లోనూ నిత్యం పాలు తాగాల్సిందేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. రాజకీయం ముందు ఇవేమీ పట్టటం లేదే..? - 

×
×
  • Create New...