psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 యాంత్రిక జీవనశైలిలో నిత్యపూజ ఎలా చేయాలి? చాలామంది మనస్సులో ఉన్న అభిప్రాయం. పైకి చెప్పడానికి సందేహిస్తారు బాగుండదని. అందరికీ ప్రాతినిధ్యం వహించి సహృదయంతో ఆయన వచ్చి ఈ ప్రశ్న వేశారు. రోజూ తెల్లవారుఝామున నాలుగున్నరకు లేచే అలవాటుందనుకోండి. ఎప్పుడైనా తెల్లవారకట్ట మూడు గంటలకి విమానానికి వెళ్ళిపోవాలనుకోండి. ఆరోజున నాకు నాలుగున్నరకే అలవాటండీ విమానం ఎక్కడానికి ఇంకొక తేలికమార్గమేమైనా ఉంటుందా? నాకోసం ఉండడానికి అన్న ప్రశ్న ఉంటుందా? ఉండదు. నీకు విమానం ఎక్కి లక్ష్యం చేరాలనుకుంటే మూడు గంటలకు లేవడం ఒక్కటే మార్గం. అలా సమయం లేకపోవడం భగవదారాధనకి అన్నమాట ఉండదు. ఈశ్వరుడు కూడా అదేమాట అంటే? నేనూ చాలా హడావుడిగా ఉన్నానయ్యా, సూర్యచంద్రుల్ని ప్రకాశింపజేయాలి, నక్షత్రాలు క్రిందపడిపోకుండా ఆపాలి, భూమిని ఒకేవేగంతో తిప్పాలి, ఋతువులు ఏర్పడాలి, ఏ ఋతువుకి ఆఋతువులో ధర్మం వచ్చేటట్లు చూడాలి, ఇంతమంది ఊపిరి తీసుకునేటట్లు చూడాలి, నీ విషయం పట్టించుకోవడం కొంచెం కష్టం అంటే? కాబట్టి పూజ విషయంలో అలసత్వం అన్న మాటకి తావే లేదు. ప్రతిరోజూ అయిదు గంటలకి నిద్ర లేవగలిగితే భక్తితో కూడిన ఆరాధన చేయాలి అనే తాపత్రయం ఉంటే నాలుగింటికి లేవడమ్ పెద్ద కష్టమైన పనేం కాదు. ఆ గంట ఈశ్వరుడికోసం వినియోగించవచ్చు. శాస్త్రంలో ఒక మినహాయింపునిచ్చారు. ఎప్పుడిచ్చారు ఆ మినహాయింపు అంటే దేహమునకు అస్వస్థతగా వుండి, షోడశోపచారములు, శ్రీసూక్త పురుషసూక్తములు చెప్పి చేసే ఓపిక లేదు. అప్పుడు ఈశ్వరుడు నువ్వు చేసి తీరవలసిందే అనడు. లఘువు అయిపోతుంది. ఎలా? లక్ష్మీనారాయణాభ్యాం నమః - ఆవాహయామి - ఒక నమస్కారం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి; పాదయోః పాద్యం సమర్పయామి; ముచే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి; వస్త్ర ద్వయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి; చందనం సమర్పయామి; నైవేద్యం సమర్పయామి; నీరాజనం. అయిదు నిమిషాలు కూడా పట్టదు. మనస్సు నిలబడితే చాలు. మనసుతో భావన చేస్తే అందిపోతుంది ఈశ్వరుడికి. మనస్సు ప్రధానం. "భావనామాత్ర సంతుష్టాయై నమోనమః". నామాల దగ్గరికి వచ్చేసరికి రోజూ సహస్రం చేసే వారు నూటఎనిమిది చేద్దామనుకుంటే దానికీ ఓపికలేదు. అప్పుడు మన తరపున పార్వతీ దేవి అడిగింది పరమశివుణ్ణి- "కేనోపాయేన లఘునా" - శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!" పరమ భక్తితో చేతులు కైమోడ్చి రామ! రామ! రామ! అని మూడు మార్లు అను. సహస్రనామాలు చెప్పినట్లే. సంస్కృతంలో ఒక మర్యాద ఉంది. అక్షరాలను అంకెలలోకి తర్జుమా చేస్తారు. రా = 2; మ = 5 రామ రామ రామ 2x5 x 2x5 x 2x5 = 1000 వెయ్యినామాలతో పూజ చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తాడు. కానీ నేను ఏడింటికి లేచి ఇది చెప్పి వెళ్ళిపోతాను అంటే కాదు. నిజంగా ఓపిక లేకపోతే ఈశ్వరుడు ఎప్పుడూ మినహాయింపు ఇస్తాడు. ఈ మినహాయింపులన్నీ భగవంతుడి దగ్గరనుంచే నేర్చుకున్నారు. స్నానానికి ఓపిక లేదు. విభూతి తీసుకొని చల్లుకుంటే స్నానం అయిపోయినట్లే. లేచి విభూతి చల్లుకోవడానికి ఓపిక లేదు. పళ్ళెంమీద చెయ్యి వేస్తే కొడుకు చేస్తాడు పూజ. గోవిందా! అంటే చాలు. "గోవిందేతి సదాస్నానం" - గోవిందనామానికున్న గొప్పతనమంతా అక్కడుంది. గోవిందా అని ఒకమాట అను. స్నానం అయిపోయినట్లే. ఎప్పుడు? స్నానం చేయడానికి ఆరోగ్యం అనుమతించకపోతే. కాబట్టి నిజంగా సమయం లేకపోతే లఘువుగా పూజ చెయ్యి. లఘువుగా శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!"అని ఒక్క పువ్వు వెయ్యి. సహస్రనామాలతో పూజచేసి బయలుదేరినట్లే. కానీ సాధ్యమైనంత వరకు పూజయందు మాత్రం అన్నింటికీ మినహాయింపులు పుచ్చేసుకుని పూజని ఎగ్గొట్టడానికి ఎన్ని మార్గాలుంటాయి అన్న ఆలోచన మాత్రం చేయకూడదు. పూజ అంటే కృతజ్ఞత చెప్పడం. అన్నివేళలా మినహాయింపు కోరకూడదు. అవసరమైనప్పుడు వాడుకుంటే ఈశ్వరుడు కోప్పడడు. అసలు 64 ఉపచారాలు చేయాలి రోజూ. చతుష్షష్ట్యుపచారాఢ్యా - చేయలేక పోతే షోడశోపచారాలు చేయాలి. అదీ చేయలేకపోతే పంచోపచారాలు చేయాలి. పంచసంఖ్యోపచారిణీ - గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఇవ్వాలి. ఇవి కూడా ఇవ్వననడం మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు. రోజూ ఖాళీలేదండీ తక్కువ పూజ చేస్తాం మార్గం ఉందా? వారంలో సెలవున్న రోజైనా పూజ ఎలా పెంచుకోవచ్చు అన్న ప్రశ్న అడగలేదు. సమయంలేని రోజు తగ్గిస్తావు. ఉన్నరోజు ఉంటుంది కదా! ఆరోజు టివి ఎందుకు చూస్తావు? గంట పూజకి పెంచాలిగా! అప్పుడు పెంచడం కూడా నేర్చుకోవాలిగా. అప్పుడు షోడశోపచారములు చేసి, పూజకు ముందు పనులు కూడా నువ్వే చేసుకొని పరమప్రీతితో మిగిలిన వెయ్యి నామాలు చెప్పుకొని మనసునిండా రమించి ఆరురోజులు ఐదు ఉపచారాలు లఘువుగా చేసినా పట్టించుకోడు. పరిపూర్ణమైన అనుగ్రహాన్ని వర్షిస్తాడు.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 నిత్యపూజలో తప్పకుండా చేయవలసిన ఉపచారాలు ఏమిటి? ప్రధానంగా 64 ఉపచారాలు చేయాలి. ప్రతిరోజూ కష్టం అంటే షోడశోపచారములు చేయాలి. ఈ పదహారు ఉపచారాలు ఎలా ఉంటాయి అంటే మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారనుకోండి. మీ ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ అలా ఉండాలి. అది యాంత్రికంగా చేసేది కాదు. ఉమా మహేశ్వరులను రోజూ పూజ చేస్తారనుకోండి. ఆవాహయామి - అక్కడే ఉందిగా విగ్రహం. క్రొత్తగా రమ్మనడమేమిటి? కాదు. స్వామీ! రండి కూర్చొండి. మీ మంటపంలోకి ఆయన ఎక్కుతున్నారు అన్న భావన. ఆసనం సమర్పయామి - సింహాసనంలో కూర్చోండి. ఈ ఉపచారాలు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది మనస్సులో ఎదురుగా పరమేశ్వరునికే ఇస్తున్నానన్న భావన చేత పారవశ్యాన్ని పొందారు. అంతసంతోషాన్ని పొంది చిట్టచివర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పి పీటమీదనుంచి లేచి బయటికి వచ్చారు. మనిషి పుట్టుకనుంచి శరీరం విడిచి పెట్టడం వరకు పదహారు సంస్కారాలు. చంద్రుడికి పదహారు కళలు. పూజలో పదహారు ఉపచారాలు. పదహారు చేయడానికి సమయం లేకపోతే కనీసంలో కనీసం అయిదు చేయాలి. గంధపుష్పధూపదీపనైవేద్యాలు. "పంచసంఖ్యోపచారిణీ". అనంతకోటి సుఖాలు మనం అనుభవిస్తున్నాము అంటే అయిదు ఇంద్రియాలలోనుంచే. ఈ అయిదు ఇంద్రియాలు పరమేశ్వరుడిచ్చాడు. విచ్చలవిడిగా వాడుకున్నావు. నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు. నిద్రలో మళ్ళీ ఈ ఇంద్రియాలకీ శక్తినిచ్చాడు. నిద్రలేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి. అందుకే పూజ ప్రాతఃకాలంలో. దీపంతో పూజ ప్రారంభం. ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు. సాత్త్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్త్విక పదార్థాలని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నావు. స్పర్శను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చల్లటి చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. చెవులతో ఎన్నో విని మురిసిపోతున్నావు. వీటికి కృతజ్ఞత చెప్తూ పువ్వులతో ఉపచారం చేస్తున్నావు. అన్నింటికన్నా పెద్ద గౌరవం ప్రసాదానికి ఇస్తారు. ప్రసాదం ఇచ్చినప్పుడు వెంటనే కళ్ళద్దుకొని నోట్లో వేసుకోవాలి. పువ్వులకొరకే తుమ్మెదలు ధ్వని చేస్తాయి. పువ్వు కనపడితే ధ్వని ఆపి మకరందం త్రాగుతుంది. ఆ నామములు చెప్పడం చేత మనస్సు వికసనాన్ని పొందాలి. అందుకే వినేటటువంటి చెవులు ఇచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. అనంతమైన సుఖాలు అనుభవించడాని ఈ అయిదు ఇంద్రియాలే కారణం. ఈ అయిదు ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్లీ శక్తినిచ్చినందుకు ఈశ్వరా! ముందు నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంలాగా. ప్రొద్దున పూజ చేసి ఇంద్రియాలను వాడుకోవడం మొదలుపెడతాడు. అంటే ఈ శరీరాన్ని ప్రసాదంగా వాడుకుంటున్నావు. ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడౌతాడు. ఎవడు పూజ చేయడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు. మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్లే మీరుకూడా పూజనీయులౌతారు. లోకంచేత గౌరవింపబడే శీలవంతులౌతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకని పూజలో అయిదు ఉపచారాలు. ఆయనకి లేక కాదు. మనయొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి ఈ పంచోపచారాలు చేస్తాం.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 వ్రతాలలో పూజించినటువంటి వినాయకుడు హరిద్రా గణపతి. "తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్" - విఘ్నాలన్నీ తొలగించుకోవడం కోసమని తొలుతగా గణపతిని పసుపు ముద్దలో అర్చిస్తూ ఉంటాం. ఈ గణపతిని అర్చించే సమయంలో కొంతమంది పసుపు ముద్ద రూపంలో అర్చించగా మరికొంతమంది వక్క రూపంలో కూడా అర్చిస్తూ ఉంటారు. ఏమైతేనేం? గణపతిని అర్చించిన తర్వాత ఆ గణపతి పసుపు ముద్దను "గచ్ఛగచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర" అంటూ ఆయనను పంపించివేశారు. అంతటి మహాశక్తి ఈ పసుపుముద్దలో వచ్చింది, కేంద్రీకృతమైంది, మనలను అనుగ్రహించింది, తిరిగి విశ్వంలోఉండే చైతన్యభాగంలో లీనమైంది అనుకున్నప్పటికీ ఆ పసుపు ముద్దలో ఇంకా చైతన్య స్వరూపం మిగిలే ఉంటుంది. కనుక సంపూర్ణమైన గౌరవంతో ఆ పసుపు ముద్దను ఇల్లాలి చేతికి అప్పగించాలి. ఇల్లాలు ఆ పసుపుముద్దను ముఖంపైన అలదుకోవచ్చును. లేదా ఆ పసుపుముద్దను తీసుకువెళ్ళి తులసికోటలో పెట్టవచ్చు. రోజూ నీళ్ళు పోస్తూ వుంటే కోటలో కలిసిపోతుంది.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 ఓషధులు అమృతం వంటివి. పూలు పూచే చెట్లు శ్రేష్ఠమైనవి. పూలతో పూజించేవారికి మంచి మనస్సు కలుగుతుంది. అందుకే పూలను ’సుమనస్సులు’ అంటారు. పూలతో పూజించే మానవుల కోర్కెలను దేవతలు మంచి మనస్సుతో తీరుస్తారు. అందుకే వారికి ’సుమనస్కులు’ అని పేరు వచ్చింది. పూలవాసనలతో దేవతలు, వాటి దర్శనంతో యక్షులూ, వాటి అనుభవంతో పాములూ, ఆ మూడు పద్ధతులతో మానవులూ ప్రీతి పొందుతారు. పూల పూజలతో దేవతలు వెంటనే భక్తుల కోర్కెలు తీరుస్తారు. ధూపం వలన భక్తుడు పుష్టినీ, ఆయువునూ పొందుతాడు. దీపం వెలిగించటమంటే వెలుగును ప్రసాదించడం. దీపారాధన వల్ల భక్తుడు హృదయం పరమాత్మ ధర్మాలను చూచే స్వభావం కలది అవుతుంది. బాటలోని చావడిలో, దేవాలయం మీదా, కొండమీదా దీపం పెట్టిన వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆవునేయితో దీపం వెలిగించి దానం చేస్తే జ్యోతిర్లోకసిద్ధీ, కులప్రకాశం, మహాజ్ఞాన వికాసం కలుగుతాయి. దేవతలకు మొదట నైవేద్యం ఇచ్చి తరువాత భక్తుడు భుజించాలి. లేకఫోతే బుద్ధిహీనుడూ, రాక్షసుడూ కావడం తథ్యం. నివేదనతో అర్పించే వ్యక్తికి గృహదేవతలు సకల శుభాలు కలిగిస్తారు. నహుషుడు ధూపదీప దానాదులు చేయడం వల్లనే ఇంద్రపదవి పొందాడు. బ్రహ్మసభకు సొంత ఇంటికి వెళ్ళినట్లు వెళ్ళాడు. దానాలన్నిటిలో దీపదానం శ్రేష్ఠమైనది.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 పుణ్యం సంపాదించుకుందాం అనే లక్ష్యంతో పుణ్య క్షేత్రాలకి వెళితే పుణ్యం రావడం కొంచెం సందేహాస్పదమే అని చెప్పుకోవాలి. పుణ్యం సంపాదించుకోవడం కోసం పుణ్యవంతమైన పనులను మనం ఆచరించాలి. అవి ఇష్టాపూర్త కర్మలు, దాన కర్మలు, జప కర్మలు, ఇటువంటి వాటిని అన్నింటినీ సంప్రదాయం సూచించింది. ఇష్టి అంటే యజ్ఞయాగాది హోమములు, పూర్త కర్మలు అంటే చెరువులు త్రవ్వించడం, దేవాలయాలు కట్టించడం, బడి నిర్మించడం, ఆసుపత్రి ఇలాంటివన్నీ కూడా పూర్త కర్మలు అని చెప్పబడ్డాయి. పరిహార క్రియలు సూచించి దానధర్మాలు చేయడం ద్వారా ఎదుటివారికి ఏ వస్తువు అవసరం ఉందో ఆ వస్తువులను వారికి అందించే కర్మను ఆచరించడం ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. ఉపవాసాదులు చేయడం, జపాలు చేయడం, ఇంకా నిష్ఠలు, సాధనలు ఆచరించడం వీటన్నింటి ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. తీర్థ క్షేత్రాలకు వెళితే యోగులు, మహానుభావులు, ఋషులు అనేకులు తమ తపశ్శక్తిని ధారపోసి ఆప్రాంతమంతా శక్తివంతం చేసి ఉంటారు కాబట్టి అర్చామూర్తి కూడా విశేష జపతపాదులతో, అభిషేకాలతో శక్తివంతమై ఉంటాడు కాబట్టి దర్శించడం ద్వారా మరికొంత పుణ్యం సముపార్జించుకొనవచ్చును. అయితే పూర్తిగా నిష్కామంతో నేను స్వామి దర్శనం కోసం వెళుతున్నాను, దానధర్మాలు చేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను - ఇటువంటి భావాలతో దర్శిస్తే తప్పకుండా పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రగా కాకుండా విహారయాత్రగా మలచుకుంటే మటుకు ఉన్నపుణ్యం కూడా కరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. పుణ్యం సముపార్జించుకోవాలి అంటే మటుకు సంప్రదాయం చూపించిన మార్గాలు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం, నియమబద్ధమైన జీవితం గడపడం, దాన క్రియలు ఆచరించడం, ఇలాంటివన్నీ చేస్తే తప్పకుండా మేలు కలుగుతుంది. పుణ్యం కలుగుతుంది, పుణ్యం అంటే ఆనందంగా జీవించడం. మంచి పనుల ద్వారా పుణ్యం సంపాదించుకుందాం. పుణ్య క్షేత్రానికి వెళితే పుణ్యం వస్తుంది కానీ అటువంటి నియమాలతో వెళ్ళాలి. విహారయాత్రగా భావించకూడదు.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 రామకోటిని పూర్తి చేశాను..ఉద్యాపన ఎలా చేయాలి? పూర్తి చేసిన రామకోటిని రామ నామ కోటి జపయజ్ఞం అని పిలవాలి. వ్రాసిన ఆ గ్రంథాలను ఒక పసుపు పచ్చని వస్త్రంలో మూటకట్టి శిరస్సుపైన పెట్టుకొని ఇంటిలో రామచంద్రమూర్తిని అర్చించి రామ ధ్యానం చేస్తూ కాలి నడకన భద్రాచలానికి చేరి అక్కడ రామకోటి గ్రంథాలన్నీ భద్రపరిచే విశాలమైన గదిని ఏర్పాటు చేసి ఉంచారు. అక్కడ ఈ గ్రంథాలను రామార్పణం అంటూ సమర్పించాలి. కాలినడకన వీలు కాని పక్షంలో ఇతర యాంత్రిక ఉపాయాలను, సాధనాలను వినియోగించి వాటిని భద్రాద్రి చేర్చవలసి ఉంటుంది. ఇది మొదటి విధానం. ఒకవేళ ధనం ఉండీ అవకాశం ఉన్న పక్షంలో మీ గ్రామంలో కూడా రామాలయం ఏర్పాటు చేసి ఆ రామాలయంలో రామకోటి స్తంభం అన్న పేరుతొ ఒక స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభములో ఈ గ్రంధములన్నీ నిక్షిప్తం చేసి రామ నామాంకితం గా ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసి పూర్ణాహుతి చేసి ఆ రామకోటి జపనామ సంకల్పం నుండి పరిపూర్ణంగా విడుదల కావచ్చును. ఉద్యాపన ఈవిధంగా కూడా చేసుకోవచ్చు. శక్తి ఉంటే యజ్ఞం చేసి స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభంలో ఈ గ్రంథాలను నిక్షిప్తం చేయండి. శక్తి లేని పక్షంలో భద్రాద్రికి చేర్చండి. అక్కడ కోటానుకోట్లమంది వ్రాసిన అసంఖ్యాక రామకోటి గ్రంథాలు రామార్పణం చేయబడి ఉన్నాయి.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 మరణించిన మనిషి పునర్జన్మ ఎత్తుతాడు కదా..మరి మనం పెద్దలకు సమర్పించే పిండ ప్రదానాలు వారికి ఎలా చేరుతాయి? మరణించిన వ్యక్తి మళ్ళీ జీవిస్తాడు. "జంతూనాం నరజన్మ దుర్లభం" అంటాయి ప్రమాణ వాక్యాలు. ఎంతకాలానికి జన్మిస్తాడు? అనేది అతడు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పిండ ప్రదానాదికాలు మరణించిన ఒకవ్యక్తికి సంబంధించినవి కావు. మరణించిన వ్యక్తి, అతని తండ్రి, తండ్రికి తండ్రి, వారి భార్యలు, ఇతర బంధువులు, ఎంతోమందిని అందులో చూపిస్తాం. "ఆదౌపితా తథా మాతా సపత్నీ మాతరస్తథా" ఈవిధంగా మహాలయంలో 20వర్గాల వారిని మనం చూపిస్తాం. ఈ పితరులంతా జన్మించారో లేదో? అనే ధర్మ సందేహం లేకుండా ఉండడానికి పిండప్రదానం. పితరులు ఒక్కడే, మళ్ళీ ఒక్కడుగానే జన్మిస్తాడు కదా అనే సూక్షమైన కుశంకలు సంప్రదాయంలో లేవు. "నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై- మంత్రాలలో ఏమి చెప్తారు అంటే పితృ శబ్దము బహు వ్యాపకము. విశ్వమంతా వ్యాపించిన చైతన్యానికే పితృత్వ శక్తి ఉంది. ఇక్కడ ఒక వ్యక్తీ, ఒక రూపము అని కాదు. ఆ తండ్రి మరణించిన తర్వాత అనేక రూపాలు పొందవచ్చును. ఆ జీవించే రూపాలు వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. అందుకే నానారూపాలలో పితృ శబ్దాన్ని ప్రయోగించి పిండ ప్రదానాదికాల్ని ఏర్పాటు చేయాలి అని చెప్తాయి ధర్మశాస్త్రాలు.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 ఈ రెండింటిలో దేని ప్రశస్తి దానికున్నది. సంవత్సర కాలంలో మనం ఋతువుల ప్రకారం చూస్తే వసంత ఋతువు ప్రథమంగా వస్తున్నది. ఋతువుల ప్రకారం సంవత్సరారంభం చైత్రమాసంలో వచ్చే తొమ్మిదిరోజులు వసంత నవరాత్రులు చేస్తాం. మనకు శివపురాణం ప్రకారంగా, దేవీ పురాణం ప్రకారంగా ఉన్న విషయం ఏమిటంటే చైత్రశుద్ధ నవమి నాడు అమ్మవారు పార్వతీ దేవిగా అవతరించారు కనుక ఆ నవమికి పూర్వం వచ్చే తొమ్మిదిరోజులు కలుపుకొని వసంత నవరాత్రులు చేస్తూన్నాం. ఇది సంవత్సరారంభ విశేషం. ఆనాడు వసంత నవరాత్రులు చేయడం వల్ల సంవత్సరమంతా క్షేమంకరంగా ఉండడం ఒక ప్రశస్తి. శరన్నవరాత్రులు – ఈ శరన్నవరాత్రులలో “శాంభవీ శారదారాధ్యా” అని ప్రసిద్ధి. శరత్కాలంలో అమ్మవారిని ఆరాధించడం అనేది. శరత్ అనేటటువంటిది ఒక లెక్కలో చూస్తే సంవత్సర గణనానికి ఇది ఆరంభం. “పశ్యేమ శరదశ్శతం, జీవేవ శరదశ్శతం, నందామ శరదశ్శతం,” – అని వేదం చెప్తోంది. అంటే సంవత్సర గణన చేసేటప్పుడు శరత్తులతో లెక్కించారక్కడ. మరొక విశేషం ఏమిటి అంటే నక్షత్ర రీత్యా మనం పరిశీలిస్తే ఆశ్వయుజ మాసం అశ్వినీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చేటటువంటి మాసం. నక్షత్రాలలో మొదటిది అశ్వినీ నక్షత్రం. నక్షత్ర గణనంతో మొదలుపెట్టి చూస్తే ఆశ్వయుజం ఒక విధంగా ప్రథమ మాసం అవుతున్నది. అలా ఒక సంవత్సరాన్ని లెక్కించవచ్చు. ఆ కారణం చేత ఈ శరన్నవరాత్రులు చేసినట్లైతే ఇక్కడినుంచి సంవత్సరకాలమంతా క్షేమంకరంగా ఉండడమొకటి, అదేవిధంగ ఇప్పుడు రానున్న ఋతువులని యమదంష్ట్రికలు అని అంటారు. అంటే ప్రాణాపాయం మొదలైనవి కలిగించే వాతావరణం ఏర్పడతాయి. నరకబాధలకు అవకాశం ఉంటుంది. అమ్మవారిని ఆరాధించినప్పుడు అటువంటి బాధలు దుఃఖాలు తొలగుతాయి కనుక ఈ సమయంలో శరన్నవరాత్రుల ఆరాధన. ఇలా రెండు నవరాత్రులకీ ప్రాధాన్యమున్నది. దేనిగురించి చెప్తే అదే ప్రసిద్ధిగా కనపడుతూ ఉన్నది.
Recommended Posts