Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినా తాము ఇలాగే రాస్తామని సాక్షి దినపత్రిక సమర్థించుకుంది. పత్రికకు యజమాని అంటూనే సాక్షి దినపత్రిక ఆ వ్యాఖ్యానం చేసింది. కాంగ్రెసుకు చెందిన జగన్ యజమానిగా ఉన్న సాక్షి దినపత్రికలో ప్రభుత్వ వార్తాకథనాలు రావడంపై సొంత పార్టీవారే గుర్రుమంటున్న సమయంలో సాక్షి టీవీ చానెల్ దినపత్రికపై ఓ ప్రత్యేక వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. సాక్షి దినపత్రిక పుట్టి రెండేళ్లయిన సందర్భంగా ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేస్తున్నట్లు చెప్పుకుంటూనే తనపై వస్తున్న విమర్శలకు ఆ ప్రత్యేక కథనం ద్వారా సాక్షి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పకనే చెప్పింది.

సాక్షి దిన పత్రికలో వస్తున్న వార్తాకథనాలు నచ్చడం, నచ్చకపోవడం వారి వారి వ్యక్తిగతాభిప్రాయమని చెప్పింది. ప్రజల పక్షపాతం తీసుకున్నందుననే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు ఆదరించారని, ఇప్పుడు వైయస్ జగన్ ను ఆదరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఒక పార్టీకి బాకాగా పత్రిక ఉండదని స్పష్టం చేసింది. ప్రజల పక్షాన నిలిచి ప్రజల ఆదరణ పొందామని చెప్పుకుంది. రాజకీయాల్లో ఉన్నవారికి సాక్షి నచ్చకపోవచ్చునని, ప్రజలతో మమేకమై, ప్రజల్లో ఒక్కరిగా తిరిగే వారికి ప్రజల ఆదరణ ఉంటుందని చెప్పుకుంది.

కడప జిల్లా ప్రజాపథం కార్యక్రమంలో రోశయ్య ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. మరోసారి అప్పటి జగన్ ప్రసంగాన్ని సాక్షి టీవీ చానెల్ ప్రసారం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు నష్టం చేసే విషయాలపై తాము రాశామని, ముఖ్యమంత్రి ఎవరన్నది ముఖ్యం కాదని, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేదే గీటురాయి అని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినా ఇలాగే ఉంటామని సాక్షి దినపత్రిక సమర్థించుకుంది. పసుపు పత్రికలకు, కొంత మంది రాజకీయ నాయకులకు పాక్షి ప్రజాపక్షపాతం గిట్టడం లేదని వ్యాఖ్యానించింది. కాంగ్రెసు పక్కన రాయాలని కొంత మంది అనుకుంటుండవచ్చు గానీ అది సాక్షి విధానం కాదని స్పష్టం చేసింది.

×
×
  • Create New...