Jump to content

Recommended Posts

Posted

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేలు మీద దీని తీవ్రత 5.4 గా నమోదైనట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. మధురవాడ, పీఎం పాలెం, మాధవధార, మురళీనగర్, విశాలాక్షి నగర్ తదితర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. అయితే నగరంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం అంతగా లేదని విశాఖపట్నానికి చెందిన సురేష్ తెలిపారు. తాను ఆఫీసు పనిమీద ఉదయమే బయటకు వచ్చేశానని, తల్లిదండ్రులు, స్నేహితులు చెబితే తప్ప అసలు విశాఖలో భూకంపం వచ్చినట్లే అనిపించలేదని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, కాళ్లకూరు, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పరిసరాల్లోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం కనిపించింది. కృష్ణాజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విజయవాడలోని బెంజి సర్కిల్ కృష్ణలంక, భవానీపురం తదితర ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు.

 

 

మొన్నీమధ్యనే నేపాల్‌ని తీవ్ర భూకంపం కుదిపేసిన విషయం విదితమే. 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకి 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ భూకంపం దాటికి భారతదేశంలోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మన దేశంలో 100 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపాన్ని మర్చిపోకముందే, మరో భూకంపం సంభవించింది.

తాజా భూకంపానికి కూడా కేంద్ర బిందువు నేపాల్‌లోనే వున్నట్లు తెలుస్తోంది. 7.4 తీవ్రతతో ఈ రోజు మధ్యాహ్నం 12.40 నిమిషాల సమయంలో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు భూ ప్రకంపనలతో కుదుపుకు గురయ్యాయి. ఢిల్లీ మెట్రో రైల్‌ని అదికారులు ఆపివేశారు.

నేపాల్‌తోపాటు, ఆప్ఘనిస్తాన్‌లోనూ భూ ప్రకంపనలు తీవ్రంగానే సంభవించాయి. మన దేశంలో అయితే, ఢిల్లీ, ఒరిస్సా, బీహార్‌, గుజరాత్‌, అస్సాం తదితర రాష్ట్రాల్లో భూ ప్రంకపనలు చోటు చేసుకున్నాయి. తొలుత 6.9గా లెక్క తేల్చినా, ఆ తర్వాత, భూకంపం తీవ్రతను 7.1గా అధికారికంగా నిర్ధారించారు. ఇప్పటి వరకూ భూకంపం కారణంగా ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

×
×
  • Create New...