Jump to content

Recommended Posts

Posted

మంత్రులు- ఎంపీల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్థంతో కాంగ్రెస్‌ పార్టీ – ప్రభుత్వ ప్రతిష్ఠ ఇప్పటికే దెబ్బతింది. ముఖ్యమంత్రి- మంత్రుల మధ్య కూడా దూరం పెరుగుతోంది. దానిపై మీడియాలో వస్తున్న కథనాలు కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. దానికితోడు.. సంక్షేమ పథకాలలో కోత విధిస్తున్న వైనం బడుగు బలహీన వర్గాల్లో తిరుగుబాటుకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. రోశయ్య ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం సాకుతో తమ జీవితాలలో చీకటి నింపే ప్రయత్నం చేస్తోందన్న భావన బడుగు వర్గాల్లో బలంగా నాటుకుపోతోంది.
    వైఎస్‌ పథకాలన్నీ రద్దు చేస్తారన్న ప్రచారం, భయాందోళన క్షేత్రస్ధాయి వరకూ విస్తరించింది. ఇది పార్టీపై పేదల్లో వ్యతిరేక భావన స్థిరపడేందుకు దారితీస్తోంది. మరోవైపు.. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య అగాథం అంతకంతకూ పెరిగిపోతోంది. వైఎస్‌ మృతి చెందిన తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారుతోందని, రోశయ్య ఎవరినీ నియంత్రించలేకపోతున్నారన్న అభిప్రాయం సామాన్య, మధ్య తరగతి ప్రజానీకంలో స్థిరపడుతోంది. ఈ పరిణామాలన్నీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని, కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే.. టీడీపీ అధికారం లోకి రావడం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతోంది.
    ఈ నేపథ్యంలో ముగ్గురిపై బహిష్కరణ వేటు వేస్తే మొత్తం పార్టీనే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. గతంలో టీడీ పీ సీనియర్లు మాధవరెడ్డి, వేణుగోపాలచారి వంటి సీనియర్లపై వేటు వేసే ప్రయత్నం నుంచే ఆ పార్టీలో తిరుగుబాటు భావన మొదలయి, టీడీపీ రెండుగా చీలడానికి కారణమయిన వైనాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అయినప్పటికీ, దేశంలో యుపిఏ హవా సాగుతున్నప్పటికీ, స్థానిక రాజకీయ వాతావరణానికి అనుగుణంగానే వ్యవహరించక తప్పదని, ఎమ్మెల్యేల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రమాదమంటున్నారు. అదీగాక.. మరి కొద్దిరోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే.. దాని ప్రభావం మొత్తం అభ్యర్థుల విజయావకాశాలనే దెబ్బ తీస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇన్ని కారణాల దృష్ట్యా.. గళం విప్పిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజు నోటీసులిచ్చి సరిపెట్టవచ్చని చెబుతున్నారు

×
×
  • Create New...