JANASENA Posted January 23, 2017 Report Posted January 23, 2017 చైనా సరుకు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చౌక ఉత్పత్తులే. నాణ్యత సంగతి పక్కన పెడితే సామాన్యులు కొనేందుకు అవకాశం లేని ఎన్నో రకాల వస్తువులు చైనా పుణ్యమా అని వారి ముంగిటవచ్చి వాలుతున్నాయి. ఓవైపు చౌక ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌ను ముంచెత్తుతున్న డ్రాగన్ కంట్రీ మరోవైపు ఎవరూ ఊహించని వస్తువుల్ని తయారు చేస్తూ కొత్త పోటీకి తెరతీస్తోంది. ప్రస్తుతం చైనా రూపొందించనున్న కంప్యూటర్‌ను చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. సూపర్ కంప్యూటర్ అంటేనే అమ్మో అనే వారు చైనా తయారుచేస్తోన్న సూపర్ సూపర్ కంప్యూటర్‌ను చూసి నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. ఈ కంప్యూటర్ రూపకల్పన పూర్తయితే మాత్రం అగ్రరాజ్యాలు సైతం ఉలిక్కిపడాల్సిందే. సూపర్ కంప్యూటర్ అంటే మానవుల వల్లకాలేని అతి క్లిష్టమైన గణిత సమస్యల్ని మనం లెక్కపెట్టడానికి కూడా వీలులేని సమయంలో పూర్తి చేసేస్తుంటాయి. వ్యక్తిగతంగా ఉపయోగించే కంప్యూటర్‌కు సూపర్ కంప్యూటర్‌కు ఉన్న తేడా వాటి వేగం, పరిమాణమే. కంప్యూటర్ అంటేనే అద్భుతం. అందులో సూపర్ కంప్యూటర్ అంటే పరమాద్భుతం. అలాంటిది చైనా రూపొందించేందుకు సిద్ధమవుతున్న ఎక్సా స్కేల్ కంప్యూటర్ ను ఏమనాలో తెలియని పరిస్థితి . ప్రస్తుతానికి అయితే సూపర్సూపర్ కంప్యూటర్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందిస్తున్న కంప్యూటర్ ప్రస్తుతానికైతే ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. కానీ ఈ కంప్యూటర్ గురించిన వివరాలు తెలుసుకుంటే మాత్రం కళ్లప్పగించి చూస్తుండిపోవాల్సిందే. మన భాషలో చెప్పుకోవాలంటే చైనా ఎక్సా స్కేల్ కంప్యూటర్ వీటికి తాతలాంటిదే. ఈ ఎక్సే స్కేల్ కంప్యూటర్ ద్వారా ఒక సెకనులో ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంత మొత్తం వస్తుందో అంత లెక్కింపు చేయగలదట. ఒకటి పక్కన 18 సున్నాలంటే బిలియన్ బిలియన్లు. అంటే క్వింటిలియన్ లెక్కలను క్షణకాలంలో పూర్తి చేయడమంటే మాటలు కాదు.. కలలో కూడా సాధ్యం కాదని అనుకుంటాం కాని ఈ సూపర్ సూపర్ కంప్యూటర్‌కు మాత్రం ఇలాంటివి చిటికెలో పని . ఇలాంటి కంప్యూటర్ కు సంబధించి పనులు దాదాపుగా పూర్తయినట్టు చెబుతోంది చైనా. మరికొన్ని నెలల్లో ఈ అద్భుతం వాస్తవ రూపం దాల్చనున్నట్టు చెబుతోంది. అన్నీ అనుకున్నట్టు సవ్యంగా జరిగితే మాత్రం ప్రపంచంలోనే అతి వేగవంతమైన కంప్యూటర్ ఇదే కానుంది. చైనాలో ఉన్న నేషనల్ సూపర్ కంప్యూటర్ సెంటర్ చెప్పిన దాని ప్రకారం అనుకున్న సమయం కన్నాముందే సూపర్ కంప్యూటర్ నమూనా సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సూపర్సూపర్ కంప్యూటర్‌ను 2018కల్లా సిద్ధం చేయాలనుకున్నారు కాని, ఈ ఏడాదిలోనే సిద్ధం అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం నమూనా కంప్యూటర్ ను పూర్తిస్థాయి కంప్యూటర్‌గా అభివృద్ది చేయడానికి మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రకారం పనులు సాగితే 2020 నాటికల్లా ఎక్సా స్కేల్ కంప్యూటర్ అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా వద్ద ఉన్న తొలి పెటాఫ్లాప్ సూపర్ కంప్యూటర్ తియాన్1 కన్నా ఎక్సాస్కేల్ సామర్ధ్యం 200 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు . తియాన్ 1 కంప్యూటర్ ను 2010లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా భావించేవారు ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటర్ ఆ రికార్డును కనుమరుగు చేయనుంది. 2010 లో తియాన్ 1 సూపర్ కంప్యూటర్‌ను రూపొందించిన ఐదేళ్లకు తియాన్2 ను రూపొందించింది చైనా. ఇది కూడా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్ గా పేరొందింది. సూపర్ కంప్యూటర్ రీసెర్చ్ గ్రూప్500 ద్వైవార్షిక జాబితాలో వరుసగా ఆరోసారి చైనా.. కంప్యూటర్లు ప్రపంచంలో అతి వేగవంతమైన కంప్యూటర్లుగా చోటు దక్కించుకున్నాయి. ఇటీవలే చైనా సన్‌వే తైహులైట్ అనే సూపర్ కంప్యూటర్‌ను రూపొందించినట్టు ప్రకటించింది. దీని సామర్ద్యం 124.5 పెటాఫ్లాప్‌లు. వంద పెటాఫ్లాప్‌ల కన్నా అధికసామర్ధ్యం ఉన్న సూపర్ కంప్యూటర్ తయారు చేయడం అదే మొదటిసారి. ఈ కంప్యూటర్ సెకనుకు క్వాడ్రిలియన్ లెక్కల్ని పరిష్కరిస్తుంది. అంటే ఒకటి పక్కన 15 సున్నాలంతా మొత్తం అన్న మాట. పెటా అన్న పదాన్ని క్వాడ్రిలియన్ సంఖ్యను సూచించడానికి వాడుతారు. ప్రస్తుతం చైనా రూపొందిస్తున్న ఎక్సా స్కేల్ కంప్యూటర్ న తియాన్3 గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. తియాన్ 3 కంప్యూటర్ సెకనకు క్వింటిలియన్ సంఖ్యలో లెక్కింపు జరుపుతుంది. క్వింటిలియన్ అనే పదాన్ని భూమి ద్రవ్యరాశిని టన్నుల్లో లెక్కించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే మనిషి మెదడులో ఉన్న పరమాణువుల్ని లెక్కించేందుకు ఉపయోగిస్తారు. ఎక్సా స్కేల్ కంప్యూటర్ అమెరికా వద్ద కూడా తయారీలో ఉన్నట్టు తెలుస్తోంది . అయితే ఆ కంప్యూటర్ సిద్ధం కావడానికి 2023 వరకూ వేచి ఉండాల్సి ఉంటుందంటున్నారు . ఇంధనశాఖ అంచనాల ప్రకారం ఎక్సా స్కేల్ కంప్యూటింగ్ పథకం వల్ల పరిశోధనా రంగంలో విప్లవాత‌్మకమైన మార్పులు రానున్నాయి. సెకనుకు క్వింటిలియన్ పరిమాణంలో లెక్కింపు జరగటం వల్ల భారీ ఎత్తున పోగుపడిన సమాచారాన్ని వెంటవెంటనే విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది. విశ్వంలో చోటు చేసుకుంటున్న క్లిష్టమైన పరిణామాలను కచ్చితత్వంతో అంచనా వేస్తుంది . విశ్వంలో మూలాధారమైన శక్తులు వాటి ద్వారా చోటు చేసుకునే క్లిష్టమైన పరిణామాల వెనుక ఉన్న సంబంధాన్ని అంచనావేసే అవకాశం ఉంది. అలాగే ఎక్సా స్కేల్ కంప్యూటర్ ద్వారా అత్యంత నాణ్యమైన ఔషధాల తయారీ, ప్రాంతాలవారీగా వాతావరణం అంచనా, తయారీ రంగం, జీవఇంధనం, విద్యుత్ , జలం వినియోగం మధ్య ఉన్న సంబంధం వంటి మరెన్నో అంశాలను విశ్లేషించవచ్చు. ఇప్పటికే చైనాలో రెండు గొప్ప సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి . ప్రస్తుతం వీటన్నిటికన్నా అద్భుతమైన మూడోది సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా వీటిని అధిగమించే అవకాశం లేనట్టు చెబుతున్నారు .ప్రపంచంలోని పది గొప్ప సూపర్ కంప్యూటర్లలో అమెరికా వద్ద ఐదున్నాయి. అయితే ఇవన్నీ చైనా వద్ద ఉన్న రెండు సూపర్ కంప్యూటర్ల కన్న తక్కువ సామార్ధ్యం కల్గినవే. అయితే ఎక్సాస్కేల్ కంప్యూటర్‌తోనే గొప్ప ఆవిష్కరణ జరిగినట్టు భావించలేం. ఎందుకంటే ఆధునిక పరిజ్ఞానానికి హద్దులు లేవు కదా!! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.