JANASENA Posted January 25, 2017 Report Posted January 25, 2017 సచిన్‌లోని సాంకేతికత.. గంగూలీలోని దూకుడు.. ద్రవిడ్‌లోని నిలకడ.. లక్ష్మణ్‌లోని సొగసు.. సెహ్వాగ్‌లోని ఎటాకింగ్.. కుంబ్లేలోని స్థిత ప్రజ్ఞత.. ఈ లక్షణాలన్నీ మేళవించి పోతపోసిన మూర్తిమత్వం (పర్సనాలిటీ) టీమిండియా యంగ్ టర్క్ విరాట్‌కోహ్లీ సొంతం. విధ్వంసాన్నీ కళాత్మాకంగా మార్చివేయడం అతడికే చెల్లింది. వచ్చింది ఓపెనింగైనా.. వన్‌డౌనైనా పరుగుల ప్రళయం సృష్టించి గెలుపు లాంఛనం పూర్తిచేసే దాకా క్రీజులో నిలవడం అతడి బ్యాటింగ్ శైలి. టీమిండియా రథ సారథి విరాట్ కోహ్లీ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈనాడు.నెట్ ప్రత్యేక కథనం. క్రికెట్ ఇష్టం కాదు! టీ20, వన్డే, టెస్ట్.. ఫార్మాటేదైనా పరుగుల వరద పారించే కోహ్లీకి క్రికెట్ అంటే ఇష్టం కాదు.. పిచ్చి. తనను నమ్ముకున్న దిల్లీ జట్టును (రంజీలో) ఓటమి నుంచి గట్టెక్కించేందుకు ఒకటిన్నర రోజులు క్రీజులో నిలబడి కన్నతండ్రి అంత్యక్రియలకు ఆలస్యంగా వెళ్లేంత మమకారం.. అభిరుచి అతడిది. అందుకే తనిప్పుడు ‘టీమిండియాకు వెన్నెముక’. అతడి ఆట కన్నుల పండువ ఐపీఎల్-2016లో ఓ మ్యాచ్‌లో కుడిచేయి బొటనవేలు చీరుకుపోయినా మునిపంటితో నొప్పిని భరిస్తూ శతకం బాది మరీ బెంగళూరును గెలిపించిన అతడి శూరత్వాన్ని ప్రశంసించని క్రికెట్ మేధావి లేనే లేడు. క్రీజులో కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడం కన్నుల పండువగా ఉంటుందని చెప్పే వారి జాబితా సచిన్, గంగూలీ, ద్రవిడ్, గావస్కర్, కుంబ్లే, కపిల్‌దేవ్ వంటి దిగ్గజాలతో నిండిపోతుంది. పరుగుల యంత్రం.. అపజయాల అడ్డుగోడ విరాట్‌కోహ్లీకి అపజయాలంటే అస్సలు ఇష్టముండదు. అందుకే వాటికి అడ్డుగోడగా నిలుస్తాడు. వికెట్లు పడుతున్నా, ప్రత్యర్థి ఒత్తిడి పెంచుతున్నా, స్లెడ్జింగ్‌కు గురువుతున్నా... మైదానంలో ఎదురయ్యే అన్ని ఆటుపోట్లను గెలుపు మెట్లుగా మారుస్తాడు. విజయంపై అభిరుచితో పరుగుల వరద పారిస్తాడు. ఇంకా చెప్పాలంటే గెలవడానికే ఆడతాడు. సారథిగా 2008లో మలేసియాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను సాధించడంతో కోహ్లీ అందరి దృష్టినీ ఆకర్షించి అదే ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2009లో వన్‌డౌన్‌లో స్థానం పదిలం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000, 3000, 4000 చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ బ్యాటింగ్ మాటల్లో చెప్పలేనంత కళాత్మకంగా సాగుతుంది. విరాట్ బ్యాట్‌తో ఆడని షాట్ లేదు. వేగంగా సింగిల్స్ దొంగిలించగలడు. అంతే వేగంగా రెండు, మూడు పరుగులు రాబట్టగలడు. కళాత్మక డ్రైవ్‌లు, కట్‌లతో అలరించగలడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని స్లాగ్ చేస్తూ సిక్సర్‌గా మలచగలడు. బౌలర్ నేర్పుగా వేసే యార్కర్‌ను షార్ట్ థర్డ్‌మాన్ కళ్లుగప్పి బౌండరీకి తరలించగలడు. కావాలనుకున్నప్పుడు స్ట్రైక్‌రేట్ పెంచుకోగలడు. బ్యాటింగ్ చేసేప్పుడు బాటమ్‌హ్యాండ్‌ని ఉపయోగించే తీరు అద్భుతం. స్పిన్నర్ బౌలింగ్‌లో బంతిని లెగ్‌సైడ్‌కు తరలించి పరుగులు రాబట్టే విధానాన్ని ప్రశంసించకుండా ఉండలేం. ఫామ్ కోల్పోయినప్పుడు కాకుండా బాగా ఆడుతున్నప్పుడే ఇంకా ప్రయత్నించడం విరాట్ నైజం. వంద పరుగులు పూర్తి చేశాక నిర్లక్ష్యంగా వికెట్ ఇచ్చేసుకునే చాలామంది క్రికెటర్ల తీరుకి అతను భిన్నం. టీ20ల్లో ‘నెంబర్‌వన్’ ఫార్మాట్ ఏదైనా అలవోకగా ఆడే విరాట్ ఇక టీ20లకొస్తే రారాజు. భారత్‌లో 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడి ఆట నిరుపమానం. 5 మ్యాచ్‌లు.. 273 పరుగులు.. 136.5 సగటు.. 146.77 స్ట్రైక్‌రేట్.. 3 అర్ధశతకాలు.. 3 నాటౌట్‌లు.. ఎంత గొప్ప బ్యాట్స్‌మన్ అయినా ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం నమ్మశక్యం కాదు. ఇక 2014 టీ20 ప్రపంచకప్‌లోనూ కోహ్లీనే అత్యధిక పరుగులు చేశాడు. 319 పరుగులు, 4 అర్ధశతకాలతో మరెవరికీ లేని రికార్డు సాధించాడు. ఐపీఎల్-16లో కోహ్లీ వీరబాదుడు చూసి బెదరని బౌలర్, జట్టూ లేదు. మొత్తం 16 మ్యాచుల్లో 974 పరుగులు.. 4 నాటౌట్‌లు.. సగటు 81.08, స్ట్రైక్‌రేట్ 152.03, 4 శతకాలు.. అత్యధిక స్కోరు 113, ఫోర్లు 83, సిక్సర్లు 38.. ఈ గణాంకాలు తిరగరాయడం సాధ్యమేనా..! అని ఆలోచనలో పడ్డారు క్రికెట్ పండితులు. 2014లో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టెస్టు క్రికెట్ సారథ్యం అందుకొన్న కోహ్లీ వరుసగా దక్షిణాఫ్రికా (భారత్‌లో), శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ (భారత్‌లో), ఇంగ్లాండ్ (భారత్) సిరీస్‌లను గెలిపించాడు. చివరి మూడు సిరీసుల్లో వరుసగా మూడు ద్విశతకాలు బాదాడు. భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు 235 (ఇంగ్లాండ్ సిరీస్) చేసిన సారథిగా రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 53 టెస్టులు, 179 వన్డేలు ఆడిన కోహ్లీ మొత్తం 42 (15+27) శతకాలు బాదాడు. టెస్టుల్లో 4,209, వన్డేల్లో 7,755, ఐపీఎల్ సహా మొత్తం 206 టీ20 మ్యాచ్‌లు ఆడి 4 శతకాలతో 6,461 పరుగులు సాధించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. నయా ‘బిజినెస్ మ్యాన్!’ క్రికెటర్‌గా కెరీర్ 10-13 ఏళ్ల వరకే అని విరాట్‌కు తెలుసు. అందుకే ‘నయా బిజినెస్ మ్యాన్’ అవతారం ఎత్తాడు. వ్యాపార సంస్థలతో ఒప్పందాల్లో విరాట్ కోహ్లీ భారత్‌లో అందర్నీ మించిపోయాడు. 2015 ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతడి ఏడాది ఆదాయం రూ.104.78 కోట్లు. ఇందులో మ్యాచ్‌ఫీజు, వాణిజ్య సంస్థలతో ఒప్పందాలు, ఐపీఎల్, బీసీసీఐతో కాంట్రాక్టులు ఉన్నాయి. తన ఆదాయాన్ని స్థిరాస్తి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సురక్షితమైన ఈక్విటీలో మదుపు చేస్తాడు. ఇక క్రీడా సంబంధిత వ్యాపారాల్లోనూ కోహ్లీది అందెవేసిన చేయి. ఫుట్‌బాల్ (ఎఫ్‌సీ గోవా), టెన్నిస్ (యూఏఈ రాయల్స్), రెజ్లింగ్ (బెంగళూరు యోధాస్), ఫ్యాషన్ (వ్రాన్), జిమ్ బిజినెస్ (చిసెల్) టెక్ స్టార్టప్ (స్పోర్ట్స్ కన్వో)లో కోహ్లీ సహ భాగస్వామి. ఎఫ్‌సీ గోవాలో అతడు బయటకు వెల్లడించని మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. వీటి ద్వారా వచ్చే ఐదేళ్లలో కోహ్లీకి రూ.30 కోట్లకు పైగా ఆదాయం ఉంటుందని అంచనా. కొసరు.. * మెచ్చే సినిమాలు : త్రీ ఇడియట్స్, రాకీ 4 * నచ్చే విహారం : ఆస్ట్రేలియా * ఇష్టపడే వంటలు: జపనీస్ * వస్త్రధారణ: ట్రాక్‌ప్యాంట్స్, టీ షర్ట్స్, స్నీకర్స్ * స్టైల్ ఐకాన్: జస్టిన్ టింబర్‌లేక్ * సంగీతం: ఉత్తర భారత సంగీతం. ఎక్కువగా పంజాబీ పాటలు * గాయకుడు: అస్రార్ * స్కూల్లో సబ్జెక్ట్: చరిత్ర, గణితమంటే అయిష్టం * వంట వచ్చా: సలాడ్స్ చేయడం వచ్చు * టాటూ: సమురాయ్ * ఐపీఎల్ సహచరులు: క్రిస్‌గేల్, ఏబీ డివిలియర్స్ * ఫేస్‌బుక్, ట్విట్టర్: యమా యాక్టివ్ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.