BaabuBangaram Posted June 22, 2017 Report Posted June 22, 2017 inka neeku pelli ayinatte అబ్బాయి పెళ్లి.. గుండెలమీద కుంపటి అమ్మాయిల కొరతతో పెరుగుతున్న బ్రహ్మచారులు వ్యవసాయదారులకు పిల్లనిచ్చేందుకు ససేమిరా కొన్ని సామాజిక వర్గాల్లో సమస్య మరింత తీవ్రం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లి పెళ్లిళ్లు కులం, కట్నం ప్రసక్తి లేదు ఎదురు కట్నం ఇచ్చేందుకూ సిద్ధం ఈనాడు అమరావతి ఇంట్లో ఆడపిల్ల ఉందంటే గుండెల మీద కుంపటి అనుకునే రోజులు పోయాయి..! ఇప్పుడు అబ్బాయిలకు పెళ్లి చేయడమెలాగో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మాయిలకు సంబంధం వెతకాలంటే తల్లిదండ్రులు కాళ్లరిగేలా తిరగాలనేవారు. కానీ, ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రులకు అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే.. కులంతో పనిలేదు, ప్రాంతాల పట్టింపూ లేదు, చదువు సమస్యేకాదు, వరకట్నం వూసే లేదు... అవసరమైతే అబ్బాయిలే ఎదురు కట్నం ఇస్తున్నారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరికితే చాలు... అపారమైన నిధి దొరికినంత సంబరపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో, మరీ ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల నుంచి తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మారుమూల, వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అమ్మాయి నచ్చితే చాలు... తమ కులం కాకపోయినా పెళ్లికి సరేనంటున్నారు. పేదరికం, కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేయలేని పరిస్థితుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఇందుకు అంగీకరిస్తున్నారు. ఏడెనిమిదేళ్ల నుంచి ఈ ధోరణి బాగా పెరిగింది. ఒకప్పుడు ఈ జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వ్యవసాయమో, వ్యాపార నిమిత్తమో వెళ్లి స్థిరపడినవారు.. తమ బంధువుల పిల్లల కోసం ఇలాంటి సంబంధాలు కుదిర్చేవారు. కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా పెళ్లి సంబంధాలు చూసే సంస్థలు, మధ్యవర్తులు కూడా ఉన్నారు. ఒక్కో సంబంధం చూసిపెట్టినందుకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వధువుల కొరత వెనుక సామాజిక, ఆర్థిక కారణాలతో పాటు, ప్రపంచీకరణ, విద్య, ఉద్యోగపరమైన అంతరాలు వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బ్రహ్మచారులే..! ఒకప్పుడు అబ్బాయిలు నాలుగైదు పెళ్లి సంబంధాలు చూసి, అమ్మాయి అందచందాలు, చదువు, కుటుంబ పరిస్థితులు, కట్నం, ఆర్థిక స్థితిగతులు అన్నీ చూసుకుని నచ్చితేనే వివాహం చేసకునేవారు. కానీ, ఇప్పుడది మారిపోయింది. అమ్మాయి తరఫువారు అంగీకరిస్తే చాలు పెళ్లికి సిద్ధమంటున్నారు. డిగ్రీ మాత్రమే చదువుకున్నవారిని, సాదాసీదా ఉద్యోగాలు చేస్తున్నవారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. రూ.లక్షల విలువ చేసే పొలాలు, ఆస్తులున్నా కూడా పిల్లనివ్వడానికి ఏ తల్లిదండ్రులూ ముందుకు రావడం లేదు. వ్యవసాయ వృత్తిలో ఉన్న యువకులకైతే మరింత కష్టమవుతోంది. దీంతో చాలా గ్రామాల్లో వయసు మీద పడుతున్నా పెళ్లి కాని కుర్రాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. * కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన నవీన్ ముంబయిలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.50 వేల జీతం వస్తోంది. అందంగా కూడా ఉంటాడు, అయినా ఆయనకు పెళ్లి మాత్రం కావడం లేదు. ఇప్పటికి 10 సంబంధాలు చూసినా ఒక్కరూ ఆసక్తి చూపించలేదు. రెండు ఎకరాల పొలం, ఇల్లు ఉన్నా ఈ రోజుల్లో ఆమాత్రం చాలదంటూ నవీన్‌కు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. * రాజధాని అమరావతి ప్రాంతంలోను ఇదే పరిస్థితి. రాజధాని ప్రకటన తర్వాత ఇక్కడి భూముల ధరలు అనూహ్యంగా పెరిగినా, అబ్బాయిలకు సంబంధాలు దొరకడం మాత్రం కష్టమవుతోంది. తుళ్లూరులో మూడంతస్తుల భవనం, మందడం గ్రామంలో మూడెకరాల పొలం(ఎకరం సుమారు రూ.2 కోట్లు) ఉన్న ఓ యువకుడు వివాహం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. నెలకు రూ.25 వేల జీతానికి ప్రైవేటు ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయినా, మంచి ఉద్యోగం లేదంటూ ఎవరూ పిల్లనివ్వడం లేదు. * రాజధాని ప్రాంతంలోనే మరో గ్రామానికి చెందిన ఒక యువకుడు పశ్చిమగోదావరి, ఇంకో యువకుడు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి కులాంతర వివాహాలు చేసుకున్నారు. అలా అని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ అబ్బాయిలకు అంత తేలిగ్గా ఏమీ సంబంధాలు కుదరడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలో పిల్లనివ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి, లేదంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరైనా కావాలి. సాఫ్ట్‌వేర్ కొలువుంటే సరే.. సాఫ్ట్‌వేర్ కొలువులు వచ్చిన తర్వాత సమాజంలో ఒక స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. ఇంజినీరింగ్ చదివి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నవారంతా ఒక కేటగిరీగా, సాదాసీదా డిగ్రీలు, పీజీలతో ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారంతా మరో వర్గంగా మారిపోయారు. పెళ్లి సంబంధాల్లో మొదటి వర్గానికే ప్రాధాన్యం దక్కుతోంది. ఆడపిల్లలు కేవలం పదో తరగతే చదివినా... సామాన్య, మధ్య తరగతి, వ్యవసాయ కుటుంబానికి చెందినా కూడా... వ్యవసాయం చేసేవారిని, సాదాసీదా డిగ్రీలు చదివిన వారిని చేసుకోవడానికి ముందుకు రావడంలేదు. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అదీ... ఏడాదికి రూ.8-10 లక్షలు ప్యాకేజీ దాటితేనే ఆలోచిస్తున్నారు. ఎంత దూరమైనా వెళ్దాం కోస్తాలో ప్రతి జిల్లాలోను డెల్టా, మెట్ట ప్రాంతాలున్నాయి. వీటిమధ్య ఆర్థిక అసమానతలు ఉంటాయి. ఒకే కులానికి చెందినవారిలోనూ డెల్టా, మెట్ట ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు తక్కువగా ఉండేవి. ఆడపిల్లలు దొరకని నేపథ్యంలో పరిస్థితి మారింది. మెట్టప్రాంతాలకు వెళ్లి కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం, అవసరమైతే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవడం మొదలైంది. అప్పటికీ అమ్మాయిలు దొరక్క పోవడంతో వేరే కులాల వారిని చేసుకోవడం ప్రారంభించారు. అలా కూడా సాధ్యం కాకపోతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వంటి జిల్లాలకు వెళ్లి అక్కడి మారుమూల ప్రాంతాల యువతులను వివాహమాడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, మార్కాపురం డివిజన్లు, కృష్ణా జిల్లాలోని పశ్చిమ కృష్ణా ప్రాంతం, గుంటూరు జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట డివిజన్ల నుంచి ఎక్కువగా ఉత్తరాంధ్ర వెళ్లి వివాహాలు చేసుకుంటున్నారు. మధ్యవర్తుల పంట పండుతోంది కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం విశాఖ జిల్లా చోడవరం వెళ్లి స్థిరపడ్డారు. ఐదేళ్ల క్రితం తమ బంధువుల అబ్బాయికి స్థానికంగా పెళ్లి కుదిర్చారు. ఆ తరువాత అదే ప్రవృత్తిగా మార్చుకున్నారు. గత ఐదేళ్లలో కులాంతర వివాహాలు 30 వరకు కుదిర్చినట్టు ఆయన తెలిపారు. ‘‘అబ్బాయిలకు సంబంధాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. నందిగామ సమీపంలో ఒకబ్బాయికి 10 ఎకరాల భూమి ఉంది. ఎకరం ఇప్పుడు కోటి రూపాయాలు పలుకుతోంది. రూ.30 లక్షలు విలువ చేసే ఇల్లుంది. అయినా పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక్కడికి వచ్చి ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు’’ అని ఆయన వివరించారు. ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి మధ్యవర్తులున్నారు. ఎదురు కట్నం ఇవ్వాల్సిందే..! ఇలాంటి వివాహాల్లో చాలా సందర్భాల్లో అబ్బాయిలే మొత్తం పెళ్లి ఖర్చులు భరించి, అవసరమైతే ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. వధువు తల్లిదండ్రులు కూడా అబ్బాయి సొంతూరికి వెళ్లి, ఆస్తిపాస్తులున్నాయా? కుటుంబ నేపథ్యం ఏంటి? వంటి వివరాలన్నీ ఆరా తీసిన తర్వాతే పెళ్లి చేస్తున్నారు. ఇలాంటి వివాహాల వల్ల కులం అడ్డుగోడలు కొంత తొలగుతున్నాయి. ఆర్థిక, సాంస్కృతిక వైరుధ్యాలూ కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఎవరి కులంలో వారే దక్షిణ కోస్తా జిల్లాల నుంచి వచ్చి అమ్మాయిలను వివాహం చేసుకుంటుండడంతో ఉత్తర కోస్తా జిల్లాల్లోని కొన్ని కులాలవారు అప్రమత్తమవుతున్నారు. ఇదే ధోరణి పెరిగితే తమ కులాల్లోని యువకులకు పెళ్లిళ్లు కష్టమన్న ఆందోళన మొదలైంది. ఇటీవల కొన్ని చోట్ల కొన్ని సామాజికవర్గాల పెద్దలు సమావేశమై అమ్మాయిల తల్లిదండ్రులంతా తమ కుమార్తెలకు సొంత సామాజికవర్గానికి చెందినవారితోనే పెళ్లి చేయాలని తీర్మానిస్తున్నారు. ఇవీ కారణాలు * అమ్మాయిల కొరతకు లింగవివక్ష ఓ కారణం. కొన్ని తరాలుగా అమ్మాయిలంటే చిన్నచూపు, అబ్బాయిలే వంశోద్ధారకులన్న భావన వల్ల సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం ఏర్పడింది. * గతంతో పోలిస్తే ఆడపిల్లల దృక్పథం మారింది. తల్లిదండ్రులు ఎంపిక చేసిన వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుని, వంటింటికే పరిమితమయ్యేందుకు సిద్ధంగా లేరు. తమ ప్రాధమ్యాలకు తగినవారనుకుంటేనే పెళ్లికి సిద్ధమవుతున్నారు. * జాతకాలపై నమ్మకం కూడా బాగా పెరిగింది. జాతకాలు కుదరకపోయినా పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు ముందుకు వస్తున్నారే తప్ప, అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం రాజీపడటంలేదు. * విడాకులు తీసుకున్న వారిలో అమ్మాయికి సులభంగా మరో సంబంధం కుదురుతోంది కానీ అబ్బాయికి అంత సులభంగా సాధ్యం కావడం లేదు. * అనంతపురం వంటి చోట్ల 100 ఎకరాల పొలమున్నా వ్యవసాయం చేసే అబ్బాయికి పిల్లనివ్వడం లేదు. కేవలం పెళ్లి కోసమే యువకులు సమీపంలోని పట్టణాలకు వెళ్లి ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు. * తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని సామాజిక వర్గాల్లో భారీగా ఆస్తిపాస్తులున్నా ఉద్యోగం లేకపోతే పిల్లనివ్వడం లేదు. కేవలం పెళ్లికోసమే కొన్నాళ్లు ఉద్యోగాలు చేసేవారూ కనిపిస్తున్నారు. వివాహ పరిచయవేదికల్లో కొన్ని కులాలకు సంబంధించి అబ్బాయిలు 100 మంది వస్తే, అమ్మాయిలు 20 మందే వస్తున్నారు. సమస్య తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.