Ara_Tenkai Posted January 31, 2018 Report Posted January 31, 2018 కర్కశంగా కడతేర్చారు ఇద్దరు మహిళల హత్య హైదరాబాద్‌లో రెండు దారుణహత్యలు చోటుచేసుకున్నాయి. కొండాపూర్‌లో గుర్తుతెలియని ఎనిమిది నెలల నిండు చూలాలిని తీవ్రంగా కొట్టి దారుణంగా హతమార్చి.. ముక్కలుగా నరికి సంచుల్లో మూటకట్టి రోడ్డు పక్కన పారేశారు. హయత్‌నగర్ మిధానికాలనీలో మంగళవారం పాతికేళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. పెళ్లి నిశ్చయమై.. కొద్దిరోజుల్లో ఆ వేడుక జరగాల్సి ఉండగా.. కాబోయే భర్త రమ్మనడంతో హైదరాబాద్‌కు వచ్చిన ఆ యువతి అక్కాబావల ఇంట్లో విగతజీవిగా మారిపోయింది. హైదరాబాద్‌లో దేవరకొండ యువతి హత్య వచ్చే నెలలో వివాహానికి ఏర్పాట్లు కాబోయే భర్త పిలవడంతో నగరానికి రాక సోదరి ఇంట్లో దారుణం హయత్‌నగర్, న్యూస్‌టుడే: ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం నగరానికి వచ్చిన యువతి దారుణహత్యకు గురైంది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజనగర్ తండాకు చెందిన నేనావత్ అనూష(25) బీటెక్ పూర్తిచేసింది. హయత్‌నగర్ మిథాని కాలనీలో ఉంటున్న అక్కా, బావల వద్ద ఉంటూ పోలీసు కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షకోసం శిక్షణ తీసుకుంటోంది. ఆమెకు నాలుగు నెలల క్రితం శంషాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న మోతీలాల్‌తో వివాహం నిశ్చయమైంది. ఆమె స్వగ్రామంలో ఉండగా ఈనెల 25న మోతీలాల్ ఒక ఇంటర్వ్యూ కోసం నగరానికి రావాలని ఫోన్ చేసి చెప్పాడు. హయత్‌నగర్‌లోని అక్క, బావలు స్వగ్రామంలోనే ఉండడంతో ఆమె ఒక్కటే వారి ఇంటికి వచ్చింది. నాలుగైదు రోజులుగా ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంది. ఫోన్ పాడైపోవడంతో 26న హైదరాబాద్‌లోనే ఉంటున్న తన సోదరుడికి బయటినుంచి ఫోన్‌చేసి నగరానికి వచ్చిన విషయాన్ని తెలియజేసింది. అనూష నుంచి సమాచారం లేకపోవడంతో ఆమె అక్క మంగళవారం ఉదయం తమ పక్కింటి వారికి ఫోన్‌చేసి ఆమెను పిలవమని కోరారు. వారు వచ్చి చూసేసరికి అనూష రక్తపు మడుగులో విగతురాలై పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బండరాయితో బాదడం వల్ల ఆమె మృతిచెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటర్వ్యూ కోసం రమ్మన్న మోతీలాల్ ఒకరోజు అక్కడకు వచ్చిపోయినట్లుగా స్థానికులు చెబుతుండగా, అతడి సెల్‌ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో అనూష కుటుంబ సభ్యులు అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎందుకు ఈ ఘోరానికి ఒడిగట్టారో అర్థంకాక కన్నీరుమున్నీరవుతున్నారు. వచ్చేనెలలోనే పెళ్లి.. అంతలోనే ఘోరం దేవరకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అనూష నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించింది. నేనావత్ కోట్య-రూప్లి దంపతులకు ఆమె నాలుగో సంతానం. మూడేళ్ల వయసులోనే తండ్రి కోట్య మృతిచెందాడు. తల్లి రూప్లి రెక్కలు ముక్కలు చేసుకొని నలుగురు పిల్లలను పెంచింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిచేసింది. చిన్నప్పటి నుంచి అనూష చదువులో చురుగ్గా ఉండటంతో తల్లి రూప్లితోపాటు అన్న శ్రీకాంత్ ఆమెను ప్రోత్సహించి బీటెక్ వరకు చదివించారు. రూప్లి దేవరకొండ పట్టణంలో బండిపై జొన్నరొట్టెలు తయారు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కొడుకు శ్రీకాంత్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. పోలీస్ కావాలన్న లక్ష్యంతో శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్క ఇంట్లో ఉండేది. నాలుగు నెలల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా కిష్టరాంపల్లితండాకు చెందిన మోతీలాల్‌తో అనూష వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఫిబ్రవరిలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటి పనులు మొదలుపెట్టారు. ఇద్దరి కూతుళ్లలాగా వివాహం చేసి అనూషను అత్తారింటికి పంపిద్దామనుకున్న తల్లి ఆశలు ఆడియాశలయ్యాయి. అక్క, బావ ఇద్దరూ ఇరవైరోజుల క్రితం తండాకు వచ్చారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగానికి మౌఖిక పరీక్ష ఉంది.. హైదరాబాద్‌కు రావాలంటూ మోతీలాల్ ఫోన్ చేస్తేనే అనూష హైదరాబాద్‌కు వెళ్లిందని తండావాసులు చెబుతున్నారు. కాగా మోతీలాల్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. ఎనిమిది నెలల గర్భిణి దారుణ హత్య ముక్కలుగా నరికి.. సంచుల్లో మూట కట్టి.. కడుపులో పిండం ఛిద్రమైపోయిన వైనం హైదరాబాద్ కొండాపూర్‌లో కలకలం ఈనాడు, హైదరాబాద్: హైటెక్‌సిటీ ప్రాంతం.. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు అది. కొండాపూర్ బొటానికల్‌గార్డెన్ నుంచి మసీద్‌బండకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే రెండు సంచుల మూటలు పడి ఉన్నాయి. వాటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని పారిశుద్ధ్య సిబ్బంది గమనించి పోలీసులకు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాటిని పరిశీలించగా ఒక సంచిలో తల, కాళ్లు, చేతుల ముక్కలు ఉండగా మరో గోనె సంచిలో మొండెం ఉన్నాయి. పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. పోలీసులు వాటిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యులతో శవపరీక్ష చేయించగా కళ్లు చెమర్చే విషయాలు వెలుగు చూశాయి. ఆ మహిళను తీవ్రంగా కొట్టి చంపి.. తర్వాత ముక్కలుగా నరికినట్లు తేలింది. మొత్తం 8 ముక్కలు చేయగా అనేక ప్రాంతంలో ఎముకలను విరిగినట్లు గుర్తించారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి కాగా కడుపులో మగ శిశవు పిండం పూర్తిగా ఛిద్రమైన స్థితిలో కనిపించింది. ఆమెకు 30 సంవత్సరాల వయసు ఉండొచ్చని, మెరూన్ రంగు టాప్, ఎరుపు రంగు కుర్తా పైజామా ధరించి ఉందని పోలీసులు తెలిపారు. చేతులకు గాజులు, కాళ్లకు మెట్టలు ఉన్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ కారు అక్కడ చాలాసేపు ఆగి ఉన్నట్లు గుర్తించారు. దానిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.