SonyKongara Posted March 12, 2018 Report Posted March 12, 2018 ఇవ్వలేదని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల బుకాయింపు.. అధికారుల పర్యటనతో తప్పు అని తేలిన వైనం అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడున్నా పర్వాలేదు. మనవాడు కానప్పుడు ఎక్కడ కూర్చొన్నా ఏమీ రావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. రాజధాని నిర్మాణ పనులకు భారీగా డబ్బులు ఇచ్చాం. వాటిని వినియోగించినట్టు సర్టిఫికెట్లు(యూసీలు) రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు బుకాయిస్తుండగా..కేంద్ర అధికారులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా స్పందించారు. గత నెల 20, 21 తేదీల్లో అమరావతిలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం..రాజధాని నగర నిర్మాణ పనులపట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. యూసీలు ఇచ్చారంటూ లిఖిత పూర్వకంగానూ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ ప నులు పూర్తి పారదర్శకంగా జరిగాయని..రాజధాని నగరాభివృద్ధి సంస్థ చేసిన వ్యయాల నివేదికను ఆన్‌లైన్‌లో ప్రజలందరూ చూసేలా ఉంచిందని ధృవీకరించినట్లు సమాచారం. ఇదేసమయంలో..తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు కేంద్రంఇచ్చిన నిధులు రూ.1,500 కాకుండా..అదనంగా మరో రూ. 650 కోట్లు ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి ఈ బృందం సిఫారసు చేసిందని అంటున్నారు. ఆటంకాలు తొలగాలి రాజధాని ప్రాంత పరిధిలో చేపడుతున్న మురుగునీటి నియంత్రణ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని ఈ బృందం పేర్కొంది. అయితే..ఇందుకు కారణాలనూ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ పనులకు ఆక్రమణలను తొలగించడం పెద్ద సమస్యగా మారిందని బృందం పేర్కొంది. ట్రాఫిక్ అవరోధాలనూ గుర్తించింది. పనుల్లో వేగం పెరగాలంటే.. ఆక్రమణలు తొలగించడం..ట్రాఫిక్ నియంత్రణ ప్రధానమైనవిగా సూచించినట్లు తెలుస్తోంది. రాజధాని నగరాభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన రూ.2,500 కోట్ల పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించిన కేంద్ర కమిటీ ఆ పనుల తీరుపట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిందని చెబుతున్నారు. నివేదికలో వాస్తవాలు అమరావతి పరిధిలో పనులను పర్యవేక్షించిన తర్వాత కేంద్ర బృందం ఇచ్చిన నివేదికలో అనేక కీలకాంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. విజయవాడలో మురుగు నీటి పారుదలకు, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు కేంద్రం రూ.1,000 కోట్లు కేటాయించింది. శాసనసభ, శాసనమండలి, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సిబ్బందికి నివాస భవనాలు నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో విజయవాడలో మురుగునీటి వ్యవస్థ కోసం రూ.460 కోట్లను, గుంటూరులో భూగర్భ డ్రైనేజీకి రూ.540 కోట్లు ఇచ్చారు. ఇందులో విజయవాడలో పనులకు రూ.425.52 కోట్లు, గుంటూరులో రూ.344.82 కోట్లు..మొత్తం రూ.770.34 కోట్లు ఖర్చు చేశారు. పైగా మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన రూ.34.88 కోట్లకు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు చెందిన రూ.195.18 కోట్లకు వినియోగ పత్రాలను కూడా కేంద్రానికి అందజేసింది. ఇందులో రూ.132.20 కోట్ల రూపాయలకు సంబంఽధించిన బిల్లులను పరిశీలిస్తున్నారని కేంద్ర బృందం తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే..ఈ పనుల కోసం అదనంగా మరో రూ.115 కోట్లు చెల్లించాలని కేంద్రానికి ఈ బృందం సిఫారసు చేయడం విశేషం. జాప్యానికి కేంద్రమే కారణం! డ్రైనేజీ నిర్మాణ పనుల్లో 17 నెలల జాప్యానికి కేంద్రం నుంచి నిధులు విడుదల ఆలస్యం కావడమే ప్రధాన కారణంగా కేంద్ర బృందం అంగీకరించినట్లు తెలుస్తోంది. 48 శాతం దాకా పనులు జరిగాయని..మరో 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని వివరించింది. పనులకు ట్రాఫిక్ సమస్య అడ్డుగా ఉండటంతో స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని కేంద్ర బృందం సూచించింది. ఈ పనులపై థర్డ్‌పార్టీతో నాణ్యతా పరీక్షలు చేయిస్తే బాగుంటుందని, వీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచలేదని అసంతృప్తిని వ్యక్తం చేసిందని తెలుస్తోంది. కోర్ సిటీ ప్రాంతంలో పనుల ప్రగతి నెమ్మదించిందని, కేవలం 3.47 శాతమే జరుగుతోందని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇంకా రూ.765 కోట్లు ఇవ్వండి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు, వాటికి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సిబ్బంది నివాస భవన సముదాయాల కోసం కేటాయించిన రూ.1,500 కోట్లలో రూ.1,084 కోట్లకు సీఆర్‌డీఏ వినియోగ పత్రాలు సమర్పించింది. ఇందులో రూ.441.96 కోట్లకు సంబంధించిన బిల్లులు కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. మరో రూ.623.98 కోట్లకు సంబంధించి బిల్లులు కేంద్రానికి రావాల్సి ఉందని కేంద్ర బృందం పేర్కొంది. ఆలిండియా సర్వీసు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ సిబ్బంది నివాస భవనాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నాటికి పూర్తి కావాల్సి ఉందని కేంద్ర బృందం నిర్ధారించింది. ఇందుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన రూ.1,500 కోట్లకు అదనంగా రూ.650 కోట్లు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ బృందం సిఫారసు చేయడం గమనార్హం. ఆయా పనుల కోసం దాదాపు రూ.765 కోట్లను అదనంగా కేంద్రం చెల్లించాలని బృందం అభిప్రాయపడిందంటున్నారు. వాస్తవాలు ఇలాఉంటే..కేంద్రం విడుదల చేసిన రూ.2,500 కోట్లకు ఇప్పటిదాకా యూసీలు ఇవ్వలేదంటూ.. కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం..రాజకీయంగా చర్చనీయాంశమైంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.