Navyandhra Posted March 20, 2018 Report Posted March 20, 2018 చంద్రగిరి దాహార్తిని తీర్చేందుకు ప్రణాళికలు రూ.44 కోట్లతో పనులు నెలాఖరుకు టెండరు ప్రక్రియ తిరుపతి: జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి జీవధారగా భావిస్తున్న హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు మరింత విస్తరించనున్నారు. ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో.. మరింత ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లెతో పాటు చంద్రగిరి మండలానికి సాగు, తాగు నీటి ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మండలంలోని మూలపల్లితో పాటు మరో నాలుగు చెరువులకు బ్రాంచి కాలువ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.44 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. నెలాఖరులోగా టెండరు ప్రక్రియ చేపట్టి త్వరితగతంగా పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లాలోని కరవును పారదోలేందుకు సీఎం ఇప్పటికే పలు పెండింగ్ ప్రాజెక్టుల్లో కదలిక తెప్పించారు. తూర్పున గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచగా.. పశ్చిమ ప్రాంతానికి కీలకమైన హంద్రీ నీవా కాలువల పనులు తుది దశకు చేరాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో పొలాలకు సాగు నీరు, ప్రజలకు తాగునీటిని ఈ వేసవి నుంచే అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే.. సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గానికీ విస్తరించాలని జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. హంద్రీనీవా కాలువ నుంచి వచ్చే నీటిని పాకాల మండలం దామలచెరువు మీదుగా.. చంద్రగిరి మండలంలోని చెరువులకు తరలించాలన్నది ప్రణాళిక. తద్వారా ఈ ప్రాంతంలో సాగు, తాగు నీటి ఇక్కట్లను అధిగించనున్నారు. ఇదీ ఆకృతి.. హంద్రీనీవా ప్రధాన కాలువ జిల్లాలోని తంబళ్లపల్లి, పెద్దమండ్యం, మదనపల్లి ప్రాంతాల మీదుగా సాగుతుంది. ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని గొల్లపల్లి, మరల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాల్లో నిల్వ చేయనున్నారు. చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో.. పీలేరు సమీపంలోని అడవిపల్లి జలాశయాన్ని సుమారు 1.418 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇక్కడికి చేరిన నీటిని నీవా బ్రాంచి కాలువ ద్వారా వివిధ ప్రాంతాలకు మళ్లించనున్నారు. అడవిపల్లి నుంచి బంగారుపాళెంకు తరలించే బ్రాంచి కాలువపై దామలచెరువు ప్రాంతం వద్ద నుంచి నీటిని తీసుకురానున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెలోని మూలపల్లి చెరువుకు తరలిస్తారు. మూలపల్లి చెరువుకు అనుసంధానంగా ఉన్న కనిటిమడుగు, కొండారెడ్డి కండ్రిగ, నాగపట్ల, వెంకటరాయ చెరువులకు సరఫరా చేస్తారు. చంద్రగిరి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందిని తొలగించడంతోపాటు 154 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం రూ.44 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. పనులు చేపట్టేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర వచ్చిన వెంటనే నెలాఖరులోగా టెండరు ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నీవా నుంచి నీటిని పైప్‌లైన్ల ద్వారా తరలించాలని భావిస్తున్నారు. కాలువ ద్వారా మూలపల్లి చెరువుకు నీటిని తరలించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందన్నది అధికారుల అంచనాగా ఉంది. భూసేకరణ కూడా అంత సులువు కాదని చెబుతున్నారు. ఇప్పటికే అంచానలను ప్రభుత్వానికి నివేదించిన అధికారులు నెలాఖరులోగా టెండరు ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా పనులను వేగవంతం చేసి ప్రాధాన్యత క్రమంలో నీటి కష్టాలు తీర్చనున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.