kakatiya Posted March 25, 2018 Report Posted March 25, 2018 అడ్డంగా దొరికిన ఆసీస్ బాన్‌క్రాఫ్ట్ బాల్‌టాంపరింగ్ బంతి ఆకారం దెబ్బ తీసే ప్రయత్నం కెమెరాకు చిక్కిన బాగోతం అందరం కలిసే చేశామన్న స్మిత్ జెంటిల్మన్ ఆటలో మరో నీచ కృత్యం! గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో మరోసారి విలువల పతనం! వివాదాల నిలయంగా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో పెద్ద కలకలం! ఆటలో వెనుకబడ్డ ఆస్ట్రేలియా.. వక్ర మార్గంలో దక్షిణాఫ్రికాను దెబ్బ తీసేందుకు ప్రయత్నించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ జట్టు ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు! తప్పు చేసి దొరికింది బాన్‌క్రాఫ్టే కానీ.. బాధ్యుడు అతనొక్కడే కాదు. ఇది ఆస్ట్రేలియా జట్టంతా కలిసి పన్నిన వ్యూహంలో భాగమని తేలిపోయింది. బుకాయింపులకు అవకాశమే లేకపోవడంతో కెప్టెన్ స్మిత్ మీడియా ముందుకొచ్చి తప్పు ఒప్పేసుకున్నాడు. తామంతా కలిసే ఈ బాగోతానికి వ్యూహ రచన చేశామన్నాడు. ఇకపై ఇలా జరగదని హామీ ఇచ్చాడు. ఈ ఉదంతంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో.. కంగారూ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కేప్‌టౌన్ ఒకప్పుడు విజయం కోసం తన తమ్ముడు ఇయాన్ చాపెల్‌తో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయించి క్రీడా స్ఫూర్తిని మంటగలిపాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు మరోసారి అదే స్థాయిలో క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యకు పాల్పడింది. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగుతున్న టెస్టు సిరీస్‌లో పైచేయి సాధించేందుకు ఆ జట్టు దొడ్డిదారిని వెతుక్కుంది. తమ జట్టుకు ఎదురుగాలులు వీస్తున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం బాల్ టాంపరింగ్‌కు పాల్పడింది. ఆ జట్టు ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ రెండో సెషన్లో బంతి ఆకారం దెబ్బ తీసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అతను పసుపు రంగులో ఉన్న చిన్న ప్లాస్టిక్ ముక్క లాంటి దాన్ని వేళ్ల మధ్య ఉంచుకుని బంతిని గోకడం కనిపించింది. బంతిని రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మార్చేందుకు అతడిలా చేశాడు. ఎలా దొరికాడు?: బాన్‌క్రాఫ్ట్ అనుమానాస్పదంగా ఏదో చేస్తున్న విషయం టీవీ కెమెరాలు పసిగట్టేశాయి. ఆ దృశ్యాలు ప్రసారం కావడంతో అంపైర్లకు అనుమానం వచ్చింది. అతడిని పిలిచి ప్రశ్నించారు. జేబుల్లో చేతులు పెట్టుకుని ఏమీ తెలియని అమాయకుడిలా వారి వద్దకు వెళ్లాడు బాన్‌క్రాఫ్ట్. జేబులో ఏముందో చూపించమని అంటే అతను కళ్లద్దాల సంచిని తీసి చూపించాడు. అది తప్ప అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కానీ అసలు విషయం ఏంటంటే.. బాన్‌క్రాఫ్ట్ అంతకుముందే అప్రమత్తం అయ్యాడు. అతను బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు డ్రెస్సింగ్ రూమ్‌లోని టీవీలో చూసిన కోచ్ లీమన్ కంగారు పడ్డాడు. వెంటనే డగౌట్ దగ్గర ఉన్న సబ్‌స్టిట్యూట్ ఆటగాడు హాండ్స్‌కాంబ్‌తో వాకీటాకీలో మాట్లాడాడు. వెంటనే అతను మైదానంలోకి నీళ్లు తీసుకొని వెళ్లాడు. అయితే అప్పటికే మైదానంలో ఉన్న టీవీ స్క్రీన్‌లో ఆ దృశ్యాలు చూసిన బాన్‌క్రాఫ్ట్ జాగ్రత్త పడ్డాడు. అతను వెంటనే జేబులో ఉన్న ఆ పరికరాన్ని తీసి ప్యాంటు లోపల వేసుకున్నాడు. అయితే ఆ దృశ్యాలు కూడా కెమెరాలకు దొరికిపోయాయి. ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. ఆట ముగిసేలోపే ఆస్ట్రేలియా జట్టు బాగోతం గురించి పెద్ద చర్చ నడిచింది. ఆస్ట్రేలియాకే చెందిన దిగ్గజ ఆటగాళ్లు అలన్ బోర్డర్, షేన్ వార్న్‌లతో పాటు గ్రేమ్ స్మిత్ తదితరులు బాన్‌క్రాఫ్ట్ చర్యను ఎండగట్టారు. దీని వెనుక జట్టు వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో ఆట అయ్యాక బాన్‌క్రాఫ్ట్‌తో పాటు స్మిత్ విలేకరుల సమావేశానికి వచ్చాడు. బుకాయించేందుకు వీల్లేని రీతిలో దొరికిపోవడంతో ఇద్దరూ తప్పిదాన్ని అంగీకరించారు. ఇంతకీ ఏంటది?: రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు ఆటగాళ్లు రకరకాల మార్గాల్ని అనుసరిస్తుంటారు. బంతికి ఒకవైపు మెరుపు పోగొట్టడం కోసం చూయింగ్ గమ్ లేదా జెల్లీ ఉమ్మును రాసి ప్యాంటుకు రుద్దడం మామూలే. అయితే కొందరు ఆటగాళ్లు బంతిలో సత్వర మార్పు కోసం వక్ర మార్గాలూ అనుసరిస్తుంటారు. గోళ్లతో గీకడం, మరేదైనా వస్తువు ఉపయోగించి బంతి మెరుపు పోగొట్టే ప్రయత్నం చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు ఓ వినూత్న ఆలోచన చేసింది. పసుపు రంగు టేప్ తీసుకుని దాన్ని నేలకు రుద్దడం ద్వారా ఇసుక రేణువులు అంటిస్తే.. అది గరుకుగా మారి బంతి ఆకారం దెబ్బ తీసేందుకు ఉపయోగపడుతుందని.. తద్వారా బంతి రివర్స్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని భావించింది. సీనియర్ ఆటగాళ్లపై కెమెరాల దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతను ఏడు టెస్టులే ఆడిన యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌కు అప్పగించారు. అతను అనుకోకుండా కెమెరాలకు దొరికిపోయాడు. ముందు అతడి చేతిలో ఉన్నదేంటో ఎవరికీ అంతుబట్టలేదు. అది ప్లాస్టిక్ ముక్క అని.. ఉప్పు కాగితం అని ప్రచారాలు జరిగాయి. అయితే అసలు అదేంటో తర్వాత విలేకరుల సమావేశంలో బాన్‌క్రాఫ్టే వెల్లడించాడు. ‘‘లంచ్ విరామంలో మేం దీని గురించి చర్చించాం. టేప్‌కు పిచ్ వద్ద ఉన్న ఇసుక రేణువులు అంటించి దాని ద్వారా బంతి ఆకారం మార్చేందుకు మంచి అవకాశం ఉందని భావించా. కానీ అదేమీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అందుకే అంపైర్లు బంతిని కూడా మార్చలేదు. నేను బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన వీడియో స్క్రీన్ మీద కనిపించేసరికి ఆ టేపును నా ప్యాంటు లోపలికి వేసేశాను’’ - బాన్‌క్రాఫ్ట్ ‘‘నాయకత్వ బృందానికి ఈ సంగతి తెలుసు. లంచ్ విరామ సమయంలో దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం నా సమగ్రతను.. జట్టు, నాయకత్వ బృందం సమగ్రతను ప్రశ్నార్థకం చేసేదే. ఈ మ్యాచ్‌ను చాలా కీలకమైందిగా భావించాం. ఈ సిరీస్ అంతా బంతి రివర్స్ స్వింగ్ అవుతోంది. కానీ మూడో రోజు బంతి అలా స్వింగయ్యేలా కనిపించలేదు. ఐతే మేం ఎంచుకున్న ఆలోచన చాలా పేలవమైంది. పెద్ద తప్పు చేశాం. మా చర్యలపై ఎంతో చింతిస్తున్నాం. ఆ ఆలోచన నాయకత్వ బృందానిది. ఇందులో కోచ్‌ల పాత్ర ఏమీ లేదు. నా నాయకత్వంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇలాంటిది ఇంకెప్పుడూ జరగదని హామీ ఇస్తున్నా. జరిగిన దానిపై నేనేమీ గర్వించట్లేదు. నాతో పాటు జట్టంతా సిగ్గుపడుతోంది. కెప్టెన్‌గా నేను క్షమాపణ కోరుతున్నా. మా తప్పు బయటపడకపోయినా మేం దీనిపై చింతించేవాళ్లం. ఐతే కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఆలోచనేమీ నాకు లేదు. ఇప్పటికే ఈ బాధ్యతకు నేనే సరైనవాడిని అనుకుంటున్నా. ఈ ఉదంతం నుంచి చేర్చుకుని మెరుగయ్యే ప్రయత్నం చేస్తా’’ - స్టీవెన్ స్మిత్ ఎప్పట్నుంచి చేస్తున్నారో? ‘‘నా నాయకత్వంలో ఇలా జరగడం ఇదే తొలిసారి..’’ అంటూ విలేకరుల సమావేశంలో నొక్కి వక్కాణించాడు ఆసీస్ కెప్టెన్ స్మిత్. కానీ కంగారూ జట్టు బుద్ధి ఎరిగిన వాళ్లు మాత్రం ఇదే తొలిసారని నమ్మే పరిస్థితి లేదు. పోయినేడాది ఇదే సమయంలో భారత్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇదే స్మిత్ డీఆర్‌ఎస్ అడిగే విషయంలో డ్రెస్సింగ్ రూం వైపు చూస్తూ సంజ్ఞ చేయడం వివాదానికి దారి తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో మతి చెడి అలా చేశానని స్మిత్ అన్నాడు కానీ.. ఎప్పట్నుంచో అలవాటుంటే తప్ప అలా ఎందుకు చేస్తాడు? ఇప్పుడు బాల్‌టాంపరింగ్ విషయంలోనూ ఆస్ట్రేలియా ఇలాంటి వక్రమార్గాలు ముందు నుంచే అనుసరించకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. దక్షిణాఫ్రికా పరిస్థితులు రివర్స్ స్వింగ్‌కు ఏమంత అనుకూలంగా ఉండవు. అయినా ఈ సిరీస్ అంతటా బంతి రివర్స్ స్వింగ్ అవుతూనే ఉంది. దీనిపై ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ కోచ్ లీమన్ మాట్లాడుతూ.. ‘‘రెండు జట్లూ వర్స్ స్వింగ్ కోసం రకరకాల పద్ధతులు అనుసరిస్తాయి. దాంతో ఇబ్బందేముంది’’ అనడం గమనార్హం. బాన్‌క్రాఫ్ట్ ఉదంతం బయటికి రాగానే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్సన్ స్పందిస్తూ.. ఇందులో లీమన్ పాత్ర కచ్చితంగా ఉంటుందని, అతడికిలాంటివి అలవాటే అనడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆస్ట్రేలియా ముందు నుంచే టాంపరింగ్ కోసం ఇలాంటి వక్ర మార్గాలు అనుసరిస్తూనే ఉండాలి. ‘‘చేసిన తప్పును అంగీకరించినందుకు బాన్‌క్రాఫ్ట్, స్మిత్‌లను అభినందించాలి. ఇలాంటి సందర్భాల్లో చాలామంది బుకాయించేందుకే ప్రయత్నిస్తారు. అయితే తప్పు ఒప్పుకున్నంత మాత్రాన దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. పరిణామాలు తీవ్రంగానే ఉండాలి’’ - మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చర్యలేంటి? తప్పు చేశారు.. దాన్ని అంగీకరించారు కూడా. వీడియో సాక్ష్యాలూ స్పష్టంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఐసీసీ ఏం చేస్తుంది.. మ్యాచ్ రిఫరీ బాన్‌క్రాఫ్ట్, స్మిత్, ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఏం చర్యలు తీసుకుంటాడు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుంది.. తమ ఆటగాళ్లపై సొంతంగా ఏం చర్యలు చేపడుతుందన్నదీ ఆసక్తికరమే. 17 ఏళ్ల కిందట దక్షిణాఫ్రికాలోనే జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో సచిన్ మీద బాల్ టాంపరింగ్ ఆరోపణలు రావడం తెలిసిందే. సచిన్ బంతికి అంటిని మట్టిని వేలితో తీసే ప్రయత్నం చేయగా.. దాన్ని టాంపరింగ్‌గా పేర్కొంటూ అతడిపై ఒక మ్యాచ్‌పై నిషేధం వేసేశాడు రిఫరీ. ఐతే తర్వాత దీనిపై దుమారం రేగడంతో సచిన్‌పై నిషేధాన్ని ఎత్తేసింది ఐసీసీ. ఇలాంటివి ఆటలో చోటు చేసుకోకూడదు. ఒక పరికరంతో బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. బాన్‌క్రాఫ్ట్ చేసింది ఆమోదయోగ్యం కాదు. - షేన్ వార్న్ బాన్‌క్రాఫ్ట్ చేసింది చాలా అనుమానాస్పదంగా ఉంది. తప్పు చేసినట్లు తేలితే అందుకు ఫలితం అనుభవించాల్సిందే. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.