Jump to content

Recommended Posts

Posted
చేయి దాటితే.. చెప్పలేం? 
ఆందోళనకర స్థితిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 
భారీగా పెరుగుతున్న మొండి బాకీలు 
ప్రభుత్వ మూలధన సాయమూ కేటాయింపులకే! 
19busi2a.jpg
ఊహించినట్లే 2017-18లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడమే కాకుండా కొన్ని బ్యాంకుల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఆ ఆర్థిక సంవత్సరాన్ని దేశ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అత్యంత సంక్షోభ భరిత సంవత్సరంగా చెప్పుకోవచ్చు.  ఇప్పటిదాకా 2017-18 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికానికి బ్యాంకులు ప్రకటించిన ఫలితాలను విశ్లేషిస్తే పలు బ్యాంకులు మొండిబకాయిల సునామీలో కొట్టుకుపోయి భారీ నష్టాలతో అతలాకుతలమైనట్లు అవగతమవుతుంది. దాదాపు 12 ప్రభ్వుత్వ  బ్యాంకులు ఆర్థిక ఫలితాలను ప్రకటించగా.. వాటిలో 10 బ్యాంకులు భారీ నష్టాలను నమోదుచేశాయి. కొన్ని బ్యాంకులు ఆర్థికంగా తిరిగి కోలుకోలేనంత సంక్షోభంలో చిక్కుకున్నాయి.

బ్యాంకుల ఆస్తి అప్పుల పట్టీలను ప్రక్షాళన చేసే చర్యలో  భాగంగా గత ఫిబ్రవరిలో రిజర్వు బ్యాంకు నిరర్థక ఆస్తుల వర్గీకరణ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీంతోపాటు పలు రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాలను నిలిపివేయడంతో బ్యాంకుల మొండిబాకీల భారం నాలుగో త్రైమాసికంలో భారీగా పెరిగింది. తత్ఫలితంగా ఈ మొండి బాకీలపై బ్యాంకులకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాల్సి వచ్చింది. దీంతో ఒకటి రెండు స మినహా మిగిలిన బ్యాంకులన్నీ నష్టాల ఊబిలో కూరుకుపోయాయి.

నిధులిచ్చి ఏం ప్రయోజనం 
ఒక వైపేమో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీల) రుణ వితరణ సామర్థ్యాన్ని పెంచి బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దే దిశలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు మూలధనాన్ని సమకూరుస్తోంది. మరోవైపు అంచనాలకు మించి పెరుగుతున్న మొండి బాకీల కారణంగా మూలధనమంతా తుడిచిపెట్టుకుపోయి మళ్లీ యథాస్థితికి చేరుతున్నాయి. గత ఏడాది పీఎస్‌బీలకు ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్ల భారీ మూలధన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని అంచెలంచెలుగా అమలుచేసి పీఎస్‌బీల మూలధన అవసరాలను తీర్చి వాటిని ఆదుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ బ్యాంకుల మొండి బాకీలు అనూహ్యంగా పెరగడంతో భవిష్యత్‌లో మరింత మూలధనం అవసరమవుతుంది. అయితే ప్రభుత్వం ఇంకా ఎంతో కాలం పీఎస్‌బీలకు మూలధనాన్ని సమకూర్చడం సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించాలి..

రూ.2.11 లక్షల కోట్లు 
2017లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన మూలధన ప్యాకేజీ

విశ్వసనీయతకు ముప్పు 
ఒకవైపు మొండి బకాయిలు మరోవైపు కుంభకోణాలతో కొన్ని పీఎస్‌బీలు వాటి విశ్వసనీయతను కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. అంతేకాక దాదాపు సగానికి పైగా పీఎస్‌బీలు రిజర్వ్‌ బ్యాంకు నిర్దేశించిన ‘తక్షణ దిద్దుబాటు చర్య’ (పీసీఏ- ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌) జాబితాలో చేరాయి. పీసీఏ ముద్రపడిన బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ కొన్ని ఆర్థికపరమైన నిర్వహణపరమైన ఆంక్షలను విధిస్తుంది. భారీ నష్టాలతో పాటు నీరవ్‌ మోదీ కుంభకోణంతో అతలాకుతలమైన పీఎన్‌బీపై కూడా పీసీఏ ముద్రపడే అవకాశం లేకపోలేదు. అంతేగాక గడిచిన ఆర్థిక సంవత్సర ఫలితాల ప్రకటన అనంతరం మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరే ప్రమాదముంది.

రూ.7.70 లక్షల కోట్లు 
2017 డిసెంబరు 31కి పీఎస్‌బీల మొండి బకాయిలు. మార్చి 31కి ఈ విలువ రూ.8 లక్షల కోట్లను మించనుంది.

బహుముఖ వ్యూహం 
నానాటికి దిగజారుతున్న పీఎస్‌బీల ఆర్థిక పరిస్థితి, అనూహ్యంగా పెరుగుతున్న మొండి బాకీలు, పెరుగుతున్న పీసీఏ బ్యాంకుల జాబితా అటు ప్రభుత్వాన్ని, ఇటు ఆర్‌బీఐని కలవరపరుస్తున్నాయి. పీఎస్‌బీల మొండి బాకీలను తగ్గించే దిశలో గతంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఆర్‌బీఐ నిరంతరం బ్యాంకుల మొండి బాకీలను పర్యవేక్షిస్తూ కఠిన చర్యలు చేపడుతూనే ఉంది. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోగా సమస్య మరింత జఠిలమవుతోంది. పరిస్థితి చేయిదాటక ముందే ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో కొన్ని ఇవి. 
* పీఎస్‌బీల యాజమాన్యాలు సమర్థంగా పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. 
* బ్యాంకుల పర్యవేక్షణ విధానంలో కీలక మార్పులు చేయాలి. 
* పీఎస్‌బీల స్థిరీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. 
* పీఎస్‌బీల అధినేతల ఎంపికలో ప్రతిభకే ప్రాధాన్యం ఇచ్చి రాజకీయాలకు తావీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రక్రియలో బ్యాంక్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) కీలక పాత్ర పోషించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. 
* పీఎస్‌బీల బ్యాలెన్స్‌ షీట్ల ప్రక్షాళన మరో రెండు త్రైమాసికాల్లో పూర్తి కానున్న నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకుల మధ్య విలీనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 
మొత్తం మీద పీఎస్‌బీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యల నుంచి బయటపడి తిరిగి ఆర్థికంగా కోలుకోవాలంటే కనీసం మరో రెండు మూడు త్రైమాసికాలు వేచిచూడాల్సిందే.

19busi2b.jpg
తక్షణ దిద్దుబాటు చర్యలు
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత శాతం కంటే మూలధన నిష్పత్తి (సీఏఆర్‌) తక్కువగా ఉండి, మొండి బాకీలు మొత్తం రుణాల్లో 10 శాతం పైగా ఉండి, వరుసగా రెండేళ్లకు పైగా ప్రతికూల ఆర్‌ఓఐ (రిటర్న్‌ఆన్‌ అసెట్‌) నమోదైన బలహీన బ్యాంకులను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ‘తక్షణ దిద్దుబాటు చర్యలు’ (పీసీఏ) తీసుకోవాల్సిన బ్యాంకుల జాబితాలో చేర్చుతుంది. ఈ చర్యల్లో భాగంగా పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా బ్యాంకులపై రుణ వితరణ, శాఖల విస్తరణ, డిపాజిట్ల సేకరణ, సిబ్బంది నియామకం, పదోన్నతి వంటి వాటిపై ఆర్‌బీఐ ఆంక్షలు విధిస్తుంది.  
పీఏసీ జాబితాలో బ్యాంకులు: అలహాబాద్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐఓబీ, ఓబీసీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, దేనా బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంకు.

విలీనాలకు వీల్లేదా.. 
గతంలో పీఎస్‌బీల మధ్య విలీన ప్రతిపాదనకు ప్రభుత్వం సుముఖంగానే ఉన్నప్పటికీ బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్ల ప్రక్షాళన అనంతరం ఈ ప్రక్రియను చేపట్టాలని భావించింది. బ్యాంకుల విలీన సాధ్యాసాధ్యాలను, విధివిధానాలను రూపొందించే దిశగా గతంలో బ్యాంక్‌ బోర్డ్‌ బ్యూరో కొంత కసరత్తు చేసింది. అయితే గత రెండేళ్లుగా దాదాపు దేశంలో ఉన్న దిగ్గజ పీఎస్‌బీలన్నీ మొండి బాకీల భారంతో నష్టాలబాట పట్టడంతో ప్రాధాన్యాలు మారిపోయాయి.ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల విలీనాలను చేపట్టడం సాధ్యంకాదన్నది గమనార్హం. పీఎన్‌బీ ప్రస్తుతం మొండిబాకీల విషవలయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. అదేవిధంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరాబ్యాంక్‌లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకొని ఇప్పుడిప్పుడే విలీనానంతర సమస్యల నుంచి కోలుకుంటోంది. ఈ తరుణంలో మరిన్ని విలీనాలు చేపట్టడం ఎస్‌బీఐకి తలకి మించిన భారమవుతుంది. ఏదేమైనా దేనా బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వంటి అత్యంత బలహీన, చిన్న బ్యాంకుల పరిస్థితి మరింత దిగజారకముందే వీటిని ఇతర పెద్ద పీఎస్‌బీలలో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి..

Posted

People withdrawing deposits and not depositing money in banks , on top of it bad loans. Bad time ahead for Indian banks and economy. 

Posted

ఎనిమిది బ్యాంకుల నష్టాలు  రూ. 39,803 కోట్లు 

ప్రభుత్వమిచ్చిన మూలధనంలో సగానికి సమానం 

ఈసారి మరో రూ. 1 లక్ష కోట్లు సమకూర్చాల్సిన పరిస్థితి 

ముంబై: మొండిబాకీలు, స్కాములతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా ఫలితాలు ప్రకటించిన పది బ్యాంకుల్లో రెండింటిని మినహాయిస్తే.. మిగతావాటన్నింటి పరిస్థితీ ఇదే. మొత్తం ఎనిమిది నష్టాలు ఏకంగా రూ. 39,803 కోట్ల మేర ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిధుల కొరత నుంచి గట్టెక్కించడానికి కేంద్రం గత ఆర్థిక సంవత్సరం ఆఖర్లో అందించిన రూ. 80 వేల కోట్ల అదనపు మూలధనంలో ఇది సగానికి సమానం కావడం గమనార్హం. ఈ గణాంకాలు కేవలం ఎనిమిది బ్యాంకులవి మాత్రమే... ఇంకా పలు బ్యాంకులు ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 12,282 కోట్లు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ రూ. 5,871 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. విజయ బ్యాంక్‌ (రూ. 727 కోట్లు), ఇండియన్‌ బ్యాంక్‌ (రూ. 1,258 కోట్లు) మాత్రమే వార్షిక లాభాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం కనీసం రూ. లక్ష కోట్లయినా సమకూర్చాల్సి రావొచ్చనేది విశ్లేషకుల అంచనా.  

బ్యాంకులకు పీసీఏ చిక్కులు .. 
ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొదలైనవి ఇంకా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ బ్యాంకులు ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులు.. మొండిబాకీల ప్రొవిజనింగ్‌పై ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో మరిన్ని నష్టాలు ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా. దీంతో కేంద్రం సమకూర్చిన అదనపు మూలధనంలో ఏకంగా 75–85 శాతం వాటా హరించుకుపోవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం 11 పీఎస్‌యూ బ్యాంకులు పీసీఏ కింద ఉన్నాయి. వరుసగా రెండేళ్ల పాటు నష్టాలు ప్రకటించి, మొత్తం మొండిబాకీలు పది శాతం దాటేసిన పక్షంలో రిజర్వ్‌ బ్యాంక్‌ పీసీఏ అమలు చేయాలని ఆదేశిస్తుంది. పీసీఏ విధించిన పక్షంలో ఆయా బ్యాంకులు కొత్తగా మరిన్ని శాఖలు తెరవడంపైనా, సిబ్బందిని తీసుకోవడంపైనా, రిస్కు ఎక్కువగా ఉండే రుణగ్రహీతలకు రుణాలివ్వడంపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి.  

ద్వితీయార్థంలో మెరుగ్గా పరిస్థితులు.. 
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులు మరో రెండు త్రైమాసికాలకు మాత్రమే పరిమితం కావొచ్చని, ఆ తర్వాత నుంచి పనితీరు మెరుగుపడొచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. బినాని సిమెంట్, ఎస్సార్‌ స్టీల్, భూషణ్‌ స్టీల్‌ మొదలైన వాటి దివాలా ప్రక్రియలు మొదటి లేదా రెండో త్రైమాసికాల్లో పూర్తయిపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి నుంచి రావాల్సినది ఎంతో కొంత వచ్చినా... ఆదాయాలు మెరుగుపడటానికి ఉపయోగపడొచ్చని వారంటున్నారు.

 

బ్యాంకులపై నేడు కేంద్రం సమీక్ష

న్యూఢిల్లీ: మొండిబాకీల ప్రక్షాళన తదితర అంశాలకు సంబంధించి సత్వర దిద్దుబాటు చర్యలు(పీసీఏ) అమలవుతున్న 11 ప్రభుత్వ  బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ గురువారం సమీక్ష నిర్వహించనుంది. వాచ్‌ లిస్ట్‌ నుంచి బయటపడేందుకు ఆయా బ్యాంకుల చర్యలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులపై పలు నియంత్రణలుంటాయి. శాఖల విస్తరణ, రుణాల మంజూరు, సిబ్బంది నియామకాలు మొదలైన విషయాల్లో ఆంక్షలు వర్తిస్తాయి. ప్రస్తుతం కార్పొరేషన్‌ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో  తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.  

తాజా ఏడాది కనిష్టానికి 9 బ్యాంక్‌ షేర్లు..
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించడం, తాజా రుణాలు జారీ చేయకుండా  ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో 9 ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు బుధవారం తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఈ షేర్లన్నీ చివరకు 2–12 శాతం నష్టాలతో ముగిశాయి. అలహాబాద్‌ బ్యాంక్‌(రూ.38.80 ముగింపు ధర),  ఓబీసీ (రూ.78.85), పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (రూ32.10), పీఎన్‌బీ (రూ.75.55),  దేనా బ్యాంక్‌ (రూ.16.25), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష ్ట్ర(రూ.13.12), కార్పొరేషన్‌  బ్యాంక్‌ (రూ.26), సిండికేట్‌ బ్యాంక్‌ (రూ.43.85), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు  (రూ.11.02) ఈ జాబితాలో ఉన్నాయి. 

Untitled-3_8.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...