JANASENA Posted June 21, 2018 Report Posted June 21, 2018 చెన్నై: మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ముగ్గురికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అమ్మ గోరుముద్దలు తినిపించి అల్లారు ముద్దుగా పెంచగా, నాన్న భుజాన ఎత్తుకొని బాధ్యతగా ముందుండి నడిపిస్తాడు. కనిపెంచడం వీరి బాధ్యత కాగా, ఓనమాలు నేర్పించి మన జీవితానికి ఓ బాట చూపించేది గురువు మాత్రమే. అమ్మలా లాలిస్తూ.. నాన్నలా దండిస్తూ.. విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని సక్రమ మార్గంలో నడిపించేది కచ్చితంగా గురువే. ప్రతి వ్యక్తికి పాఠశాల స్థాయిలో గురువులతో అవినాభావ సంబంధం ఉంటుంది. అతి తక్కువ కాలంలోనే వారు మనలో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి గురువులు ఒక్కసారిగా పాఠశాల వదిలి దూరమైతే తట్టుకోలేకపోయేవాళ్లం. వెళ్లకుండా ఎంతో బతిమాలే వాళ్లం. అవసరమైతే ఏడ్చే వాళ్లం కూడా. అంతలా వాళ్లు మన మీద ప్రభావం చూపించారు కాబట్టే వాళ్లంటే ఆ రోజుల్లో అంత అప్యాయత ఉండేది. ఈ రోజుల్లోనూ ఇలాంటి సందర్భాలూ చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళనాడులోని తిరువళ్లూరులోని ఓ ఉపాధ్యాయుడికి ఇలాగే జరిగింది. అక్కడి వలైగారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భగవాన్(28) అనే ఆంగ్ల ఉపాధ్యాయుడికి ఇటీవల రాష్ట్రప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా వేరే పాఠశాలకు బదిలీ అయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయనను వెళ్లొద్దంటూ బతిమాలుకున్నారు. మరికొంతమైతే ఏకంగా గట్టిగా కౌగలించుకొని ఏడ్వసాగారు. భగవాన్ వారికి ఎంత నచ్చచెప్పినా వినకుండా అదే తరహాలో ఆయనను పాఠశాల నుంచి వెళ్లనీయలేదు. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానంటూ చెప్పడంతో అప్పటికీగానీ విద్యార్థులు వదల్లేదు. దీనిపై భగవాన్ స్పందిస్తూ.. ‘నాకు 2014లో ఈ ఉద్యోగం వచ్చింది. తొలి పొస్టింగ్ కూడా ఇక్కడే. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఆంగ్లం బోధిస్తాను. అయితే మొదటి నుంచి విద్యార్థులతో ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా, ఒక అన్నలా, స్నేహితుడిలా.. వారితో ప్రత్యేక అనుబంధం ఉంది. కథలు చెప్పడం, వారి భవిష్యత్తు గురించి మాట్లాడటం, కొత్త విషయాల గురించి సాంకేతికతను ఉపయోగించి మరీ చెప్పడంతో వారు నాకు మరింత దగ్గరయ్యారు. కేవలం పాఠాలు మాత్రమే చెప్పకుండా వారి కుటుంబ సమస్యలను కూడా చర్చించడంతోనే ఇంతగా వారు ప్రేమ చూపిస్తున్నారని’ చెప్పుకొచ్చారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.