kakatiya Posted November 12, 2018 Report Posted November 12, 2018 పెరుగుతున్న సైబర్ స్టాకింగ్ పోకిరీలు.. ఆకతాయిల కొత్తపంథా ఈనాడు, హైదరాబాద్ ‘సర్.. నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాను. కొద్దిరోజుల నుంచి నా ఫేస్‌బుక్ ఖాతాలో అసభ్యకరమైన ఫొటోలొస్తున్నాయి. అశ్లీల వీడియోలు పంపుతున్నారు. ఇవి ఎవరు పంపుతున్నారో తెలియదు. నీ ఫేస్‌బుక్‌లో ఎందుకు ఇలాంటి అసభ్యకరమైన అంశాలున్నాయంటూ స్నేహితులు తిడుతున్నారు. మూడురోజుల క్రితం ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆ ఫొటోలు తానే పెడుతున్నానని, తనను ప్రేమించకపోతే అశ్లీల వీడియోలు మరిన్ని పోస్ట్‌చేస్తానని బెదిరించాడు. ప్రతి అరగంటకోసారి ఫోన్ చేసి ఫేస్‌బుక్ చూసుకో అని వేధిస్తున్నాడు. భయపడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నా. మళ్లీ బెదిరిస్తాడేమోనని భయంగా ఉంది. ఎలాగైనా నన్ను రక్షించండి’ - ‘షి’బృందం కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఓ విద్యార్థిని ఆవేదన భరిత ఫిర్యాదు ఇది. చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ తదితర నగరాల్లో కొనసాగుతున్న సైబర్ స్టాకింగ్(సామాజిక మాధ్యమాలు, చరవాణుల్లో వేధింపులు) హైదరాబాద్‌లోనూ తీవ్రమవుతోందని సదరు విద్యార్థిని ఉదంతమే నిదర్శనం. వేధింపులు... ఈవ్‌టీజింగ్‌లతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్న పోకిరీలు.. ఆకతాయిలు.. విద్యార్థినులు, యువతులు, బోటిక్ నిర్వాహకులు, వెబ్‌సైట్లలో ప్రచారాలు నిర్వహించే వారి నంబర్లను సేకరించి అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా ఫోన్లు చేస్తున్నారు. సైకో మనస్తత్వం ఉన్న మరికొందరు నేరగాళ్లు వాట్సప్‌లలో అశ్లీల వీడియోలు, అసభ్యకరమైన సందేశాలను పంపుతున్నారు. పోకిరీలు, ఆకతాయిల చిత్రహింసలు భరించలేక కొందరు బాధితులు ‘షి’బృందాలకు ఫిర్యాదు చేయడంతో సైబర్‌స్టాకింగ్ వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన ‘షి’బృందాలు నిందితులను అరెస్ట్‌చేస్తున్నాయి. చరవాణి నంబర్‌తో వేధింపులు విద్యార్థులు, యువతులు, అంతర్జాలంలో ప్రచారం నిర్వహించుకుంటున్న బోటిక్‌లు, చరవాణుల నంబర్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను పోకిరీలు తెలివిగా సంపాదిస్తున్నారు. అంతర్జాలంలో ప్రకటనలు, ప్రముఖప్రాంతాలో బోటిక్‌లు, విద్యార్థినుల స్నేహితులతో ఫోన్‌నంబర్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు ఈవ్‌టీజర్లు బ్యూటీక్లినిక్ వద్దకు వెళ్లి నామఫలకాలపై ఉన్న చరవాణుల నంబర్లను రాసుకుని వెళ్తున్నారు. కొద్దిరోజుల తర్వాత ఒకటి, రెండు కొత్త సిమ్‌కార్డులను కొనుగోలు చేసి ఫోన్‌నంబర్ల ఆధారంగా వారితో అసభ్యంగా మాట్లాడుతున్నారు. బాధితులు ఫోన్ కట్ చేస్తే... మరో నంబరు నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. స్నేహితులు.. అపరిచితులూ ఒక్కటే.. గుర్తుతెలియని వ్యక్తులు వేధిస్తున్నారంటూ ఇద్దరు యువతులు కొద్దిరోజుల క్రితం ‘షి’బృందానికి ఫోన్‌చేశారు. పోలీసులకు వివరాలన్నీ వెల్లడించారు. వెంటనే ఆ ఇద్దరికి వచ్చిన సందేశాలను పరిశీలించి రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. వారిని పట్టుకునేందుకు బృందాలు నగరంలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి సమాచారం సేకరిస్తుండగా.. మరో ముగ్గురు విద్యార్థినులు కూడా వేధిస్తున్నారంటూ ‘షి’ బృందాలను ఆశ్రయించారు. ఈ కేసులను పర్యవేక్షిస్తున్న క్రమంలో 15రోజుల వ్యవధిలో 40మంది బాధితులు తమకు వేధింపులు తీవ్రమయ్యాయని, మాటలతో చిత్రహింసలు పెడుతున్నారని పోలీసు అధికారులకు తెలిపారు. ఈ వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించిన ‘షి’బృందం ఈవ్‌టీజర్లు, పోకిరీలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారంటూ గుర్తించింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫోన్లు చేసి వేధిస్తున్న వారిని పోలీసులు పట్టుకుంటున్నారు. మార్పులు చేసుకోండి.. * ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో ఉంచే ఫొటోలు ఖాతాలకు సంబంధించిన వారిలో నేరగాళ్లు 30శాతంమంది ఉన్నారు. వీరు తప్పుడు వివరాలతో ఖాతాలను ప్రారంభించి ఆకర్షించి నేరాలకు పాల్పడుతున్నారు. * వాట్సాప్, ట్విట్టర్‌లో మీకు తెలియనివారు సందేశాలు పంపినా స్పందించకండి. ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అనుంటే పూర్తిగా తెలిసిన వారైతేనే ఆహ్వానించండి. * ఫేస్‌బుక్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ అనే చోటకు వెళ్లండి అక్కడ మీ స్నేహితులు, సన్నిహితుల జాబితాను మాత్రమే నమోదుచేయండి. అపరిచితులు, పోకిరీలు మీ వ్యక్తిగత ఖాతాను దుర్వినియోగం చేసే అవకాశాలు తక్కువ. * మీ పాస్‌వర్డ్‌ను తరచూ మారుస్తుంటే నేరగాళ్లు, అపరిచితులు, ఈవ్‌టీజర్లు దుర్వినియోగం చేసేందుకు వీలుండదు. * సామాజిక మాధ్యమాలు వినియోగించే విద్యార్థినులు, యువతులు వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ గుర్తుతెలియని వారితో పంచుకోకండి. అలాగే వ్యక్తిగతంగా ఏకాంతంగా తీసుకున్న చిత్రాలను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్‌చేయకండి. * బహిరంగ ప్రదేశాలు, షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌లు, హోటల్స్ వంటి చోట్ల వై-ఫై అందుబాటులో ఉంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను తెరవకండి. * నిందితుల్లో 80శాతం మంది 18ఏళ్ల నుంచి 25 ఏళ్ల వారున్నారు. * 60శాతం మంది బాధితులకు పరిచితులు, స్నేహితులు.. 10శాతం ప్రైవేటు ఉద్యోగులు..30శాతం మంది విద్యార్థులు . * 15శాతం మంది నిందితుల్లో పైశాచిక ప్రవృత్తి ఉందని పోలీసులు గుర్తించారు. మీరు స్పందిస్తే.. మేం చూసుకుంటాం: సి.నర్మద, ‘షి’బృందం బాధ్యురాలు విద్యార్థినులు, యువతులు, బోటిక్‌ల యజమానులు సౌందర్యపోషక శిక్షకుల్లో బాధితులెవరైనా సరే.. వెంటనే స్పందించండి. అపరిచిత వ్యక్తులు అసభ్యంగా సందేశాలు పంపినా, అశ్లీల చిత్రాలను వాట్సప్‌లో పంపించినా వెంటనే ‘షి’బృందాలకు సమాచారం ఇవ్వండి. ఈవ్‌టీజర్లు, సైబర్‌నేరగాళ్లకు కఠినం శిక్షలు పడితే అలా చేసేవారు భయపడతారు. డయల్ 100 ద్వారా లేదా ‘షి’బృందాలకు వాట్సప్ 9490616555 ద్వారా ఫిర్యాదు చేస్తే మిగిలినదంతా మేం చూసుకుంటాం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.