snoww Posted November 15, 2018 Report Posted November 15, 2018 ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు వేల కోట్లు పన్ను తీసుకుంటూ రాజధానికి పైసా ఇవ్వడం లేదు మనకీ మంచి రోజులొస్తాయి అప్పుడు వడ్డీ సహా వసూలు చేస్తాం కేంద్రంపై చంద్రబాబు ధ్వజం విపక్షాలు దివాలాకోరు పార్టీలుగా మారాయని విమర్శ రాజధాని నిర్మాణ పనుల పరిశీలన ఈనాడు - అమరావతి కేంద్ర ప్రభుత్వం మనల్ని బానిసల్లా చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం కంటే కేంద్రానికే పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం వెళుతున్నా... రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఏటా జీఎస్టీ ద్వారా కేంద్రానికి రూ.6 వేల కోట్లు వెళుతోందని చెప్పారు. రాష్ట్రానికి మంచి రోజులొస్తాయని, అప్పుడు కేంద్రం నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తామని పేర్కొన్నారు. రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి బుధవారం స్వయంగా పరిశీలించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్ల నిర్మాణం చేపడుతున్న చోట ఆయన విలేకరులతో మాట్లాడారు. పనులన్నీ సంతృప్తికరంగా సాగుతున్నాయని, ఇన్నాళ్లుగా తాము పడ్డ శ్రమకు ప్రతిఫలం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపైనా, ప్రతిపక్ష పార్టీలపైనా ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని విపక్షాలు దివాలాకోరు పార్టీలుగా మారాయని, రాజధాని నిర్మించడం, రాష్ట్రం అభివృద్ధి చెందడం వాటికి ఇష్టంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధానిలో వైభవాన్ని చూసి అవి ఓర్చుకోలేకపోతున్నాయన్నారు. విజయవాడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలు, ప్రయాణం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులివ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసు కోసం ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాను. కొత్త టర్మినల్ కోసం కేంద్రానికి రూ.వెయ్యి కోట్ల విలువైన భూమి ఇచ్చాం. కేంద్రం మాత్రం సహకరించడం లేదు. విదేశాలకు విమానాలు నడపాలంటే విమానాశ్రయంలో కస్టమ్స్ కేంద్రం ఉండాలి. కానీ నిర్వహణ ఖర్చులన్నీ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీనే ఇవ్వాలని కస్టమ్స్ విభాగం తెలిపింది. దానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాం. ఆ గందరగోళంలో ఒక సీజన్ పోయింది. డిసెంబరుకి రీషెడ్యూల్ చేశారు’’ అని పేర్కొన్నారు. కట్టకపోతే భూములు వెనక్కి...! రాజధానిలో వివిధ ప్రాజెక్టుల కోసం భూములు తీసుకున్న సంస్థలు నిర్మాణాలు చేయకపోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా... ప్రాజెక్టులు మొదలు పెట్టనివారికి భూమి కేటాయింపులు రద్దు చేసి కొత్తవారికి ఇస్తామని తెలిపారు. ఇప్పుడు రాజధానికి రానివాళ్లు భవిష్యత్తులో పశ్చాత్తాప్పడతారని ఆయన వ్యాఖ్యానించారు. అప్పులు ఎలా తీర్చాలో నాకు తెలుసు..! రాజధాని నిర్మాణానికి చేస్తున్న అప్పుల్ని ఎలా తీర్చుతారని కొందరు అడుగుతున్నారని, దానికి తమ వద్ద పరిష్కారాలున్నాయని చంద్రబాబు తెలిపారు. ‘‘నేను ఎకనమిక్స్ స్టూడెంట్‌ని. డబ్బుల్లేవని ఇంట్లో పడుకుంటే పనులు జరగవు. రాజధాని పరిపాలన నగరంలో 400 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిస్తాం. దాని వల్ల ఆదాయం వస్తుంది. సుమారు ఐదారు వేల ఎకరాల్ని రిజర్వుగా ఉంచుకున్నాం. మరోపక్క రాజధానిలో నిర్మాణ కార్యక్రమాల వల్ల పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ వనరులతో అప్పులు తీరుస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు నైపుణ్య శిక్షణనిచ్చి, స్థానికంగా వచ్చే అవకాశాల్ని ఉపయోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆయన ప్రకటించారు. మంచి నగరాన్ని ఇచ్చినందుకు కేసీఆర్ నన్ను తిడుతున్నారు.. అమరావతి భవిష్యత్ తరాలకు గొప్ప ఆస్తి అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. మరో మూడేళ్లలో ఈ నగరం ఎవరూ ఊహించనంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘హైదరాబాద్‌ని బాగా అభివృద్ధి చేశాం. అదిప్పుడు బంగారు బాతు. ఈ రోజు అక్కడున్న పాలకులు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. మంచి నగరాన్ని ప్లాన్ చేసి ఇచ్చినందుకో ఏమో... కేసీఆర్ ఇప్పుడు పదే పదే నన్ను తిడుతున్నారు. హైదరాబాద్‌ని తెలుగువారి కోసం అభివృద్ధి చేశాం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి బ్రహ్మాండమైన రాజధాని నగరం నిర్మిస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాం. కేంద్రం సహకరించకపోగా ప్రజల్ని రెచ్చగొట్టడం, మభ్యపెట్టడం లాంటివి చేస్తోంది’’ అని పేర్కొన్నారు. ఒకాయన రాజధానిలో ఒక్క ఇటుకరాయి కూడా పెట్టలేదని విమర్శిస్తున్నారని, ఇటుకలతో భవనాలు కట్టే రోజులు పోయాయని, ఆధునిక టెక్నాలజీలు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ లెక్కలు రాసుకోవడానికే అలవాటు పడ్డవారికి ఈ విషయాలేమీ బోధపడవన్నారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..! *రాజధానికి రూ.1.09 లక్షల కోట్ల నిధులు కావాలని కేంద్రానికి డీపీఆర్ ఇచ్చాం. *తాత్కాలిక హైకోర్టు భవనాన్ని డిసెంబరు 15కి పూర్తి చేస్తాం. వచ్చే జనవరి 1న ప్రారంభిస్తాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానిస్తాం. *అఖిల భారత సర్వీసుల అధికారులు, ఉద్యోగులు, ఎమ్మెల్యేల కోసం 4 వేల ఫ్లాట్ల నిర్మాణం మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. *ప్రధాన అనుసంధాన రహదారి మధ్యలో... ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతాం. *రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న పనులకు రూ.48,116 కోట్లు ఖర్చవుతుంది. రూ.30,757 కోట్ల పనులు ఇప్పటికే చేపట్టాం. *గుజరాత్ సచివాలయంలోకి పులి వచ్చేసింది. అమరావతిలో సచివాలయం అలా ఉండకూడదన్నదే మా లక్ష్యం. *ముఖ్యమంత్రి రాజధానిలో మొదట ఎన్9 రహదారి పనుల్ని, తర్వాత అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లలో సిద్ధం చేసిన నమూనా ఫ్లాట్‌ని, తాత్కాలిక హైకోర్టు, ఇతర నిర్మాణ పనుల్ని పరిశీలించారు. Quote
snoww Posted November 15, 2018 Author Report Posted November 15, 2018 Quote *గుజరాత్ సచివాలయంలోకి పులి వచ్చేసింది. అమరావతిలో సచివాలయం అలా ఉండకూడదన్నదే మా లక్ష్యం. 😂 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.