snoww Posted May 27, 2019 Report Posted May 27, 2019 మూడు కుటుంబాల కథ 5/27/2019 5:48:37 AM కర్నూలు : జిల్లా రాజకీయాలను ఆ మూడు కుటుంబాలు శాసించాయి. దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించాయి. ఏ పార్టీలో ఉన్నా.. గెలుపోటములను శాసించాయి. తాము గెలవడంతోపాటు.. తమ మద్దతు అడిగినవారినీ గెలిపించే స్థాయి వీరిది. జిల్లావాసులకు పరిచయం అక్కరలేని కోట్ల, కేఈ, భూమా కుటుంబాలు అవి. ఇప్పుడు ఈ కుటుంబాలు వైసీపీ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఒక్కస్థానంలోనూ గెలవలేకపోయాయి. ఇది ఊహించని పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శాసించిన కోట్ల.. కోట్ల కుటుంబానికి జాతీయ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరుండాలో ఒకప్పుడు నిర్ణయించిన కుటుంబం. ఈ కుటుంబం నుంచి 1955లోనే కోట్ల విజయభాస్కర్‌రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగైదు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆరు పర్యాయాలు కర్నూలు ఎంపీగా గెలిచారు. 1971లో తొలిసారిగా కోట్ల కుటుంబానికి చెందిన కోట్ల కోదండ రామిరెడ్డి కర్నూలు ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి పార్లమెంట్ లేదా శాసనసభలో ఆ కుటుంబ సభ్యుల పాత్రినిథ్యం కొనసాగింది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వారసుడిగా 1997లో రాజకీయ అరంగేట్రం చేసి ఎంపీగా గెలిచిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మూడుసార్లు ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ 2004లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన జరగనంతవరకూ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఎదురు లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా కోట్ల పోటీ చేసి 1.15 లక్షల ఓట్లు సాధించి గౌరవం దక్కించుకున్నారే తప్ప గెలవలేకపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యేగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేశారు. వైసీపీ ప్రభంజనానికి ఇద్దరూ ఓడిపోయారు. కేఈ కుటుంబానికి అదే పరిస్థితి: జిల్లాలో కోట్ల తర్వాత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది కేఈ కుటుంబానికే. స్వాతంత్ర్యానికి పూర్వమే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న జిల్లా పరిషత్ మెంబర్‌గా ఎంపికయ్యారు. స్వాతంత్య్రం తర్వాత కేఈ మాదన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయ్యారు. మాదన్న వారసుడిగా 1978లోడోన్ నుంచి కేఈ కృష్ణమూర్తి బరిలో దిగి విజయం సాధించారు. 1983లోనే కాంగ్రెస్‌లో కొనసాగుతూ ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఎదురొడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో టీడీపీలో చేరి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. 1989లో కాంగ్రెస్‌లో చేరి మళ్లీ విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల్లో భాగంగా డోన్ అసెంబ్లీ స్థానాన్ని కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి వదిలారు. 1996 ఉప ఎన్నిక, 1999 ఎన్నికల్లో డోన్ నుంచి కేఈ సోదరుడు కేఈ ప్రభాకర్ విజయం సాధించారు. 2004లో ఓటమి చవి చూసినా.. 2009లో అక్కడి నుంచి కేఈ కృష్ణమూర్తి మరోసారి విజయం అందుకున్నారు. ఆ ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ పత్తికొండ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పత్తికొండ నుంచి విజయం సాధించారు. డోన్ నుంచి పోటీ చేసిన మరో సోదరుడు కేఈ ప్రతాప్ ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా విరామం తీసుకొని పత్తికొండ నుంచి వారసుడు కేఈ శ్యాంబాబును బరిలో దింపారు. డోన్ నుంచి కేఈ ప్రతాప్‌ను పోటీకి పెట్టారు. ఫ్యాన్ గాలికి రెండు చోట్ల కేఈ కుటుంబం తట్టుకోలేకపోయింది. ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. మునుపెన్నడు ఇలాంటి పరిస్థితి ఆ కుటుంబానికి రాలేదు. భూమా కుటుంబానికి తప్పని ఓటమి టీడీపీ ఆవిర్భావంతో భూమా కుటుంబం రాజకీయ అరంగేట్రం చేసింది. జిల్లాలో, ప్రత్యేకంగా నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలో భూమా కుటుంబం రాజకీయాలను శాసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1985లో తొలిసారిగా భూమా కుటుంబానికి చెందిన భూమా వీరశేఖర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. 1989లో గంగుల కుటుంబంపై గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1991లో ఆయన గుండెపోటుతో మరణించడంతో.. ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1992 ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో మరోసారి గెలిచారు. తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. రాష్ట్రస్థాయిలో కీలకంగా వ్యవహరించారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నంద్యాల నుంచి నాటి ప్రధాని పీవీ నరసింహరావుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీవీ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 1996, 1998, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆయన సతీమణి శోభనాగిరెడ్డి 1997 ఎన్నిక, 1999 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా, ఆయన సతీమణి శోభానాగిరెడ్డి నంద్యాల ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2009 ఎన్నికల్లో భూమా దంపతులు ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భూమా నాగిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, అక్కడి నుంచి జగన్‌తో పాటు వైసీపీలో వచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో భూమా దంపతులు నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే.. ఎన్నికల ప్రచార సమయంలోనే శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో భూమా కూతురు అఖిల ప్రియ గెలిచారు. తర్వాత తండ్రి, కూతురు టీడీపీలో చేరారు. భూమా నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. భూమా వీరశేఖర్‌రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో దిగి గెలిచారు. ఇలా ఇప్పటి వరకు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా కుటుంబం నుంచి ఎవరో ఒకరు ప్రాతినిఽథ్యం వహిస్తూ వచ్చారు. జిల్లా రాజకీయాన్ని శాసించారు. ఈ ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి భూమా కుటుంబానికి చెందిన ఇద్దరూ ఓడిపోయారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.