Jump to content

Recommended Posts

Posted

జ్యేష్ఠశుద్ధ దశమి (12/06/2019) దశపాపహరాదశమి, గంగావిర్భావదినం.

ఈరోజు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.

నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!!
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాత నాశనమ్!!

ఈ పన్నెండు నామాలతో గంగను స్మరించితే పాప హరణం.

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానామ్ శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపానే మహాపుణ్య తరంగిణి!!
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్!!
అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి!!
త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే!!
యోsసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!

 

61858053_2106641519385235_53288394110376!

  • Like 2
Posted

61604175_2103169206399133_87626335605248గంగావతరణం

శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సామానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి. 

సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేలమంది బూదికుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు ‘ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమిమీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చేయకు.’ అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటె అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.

భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు ‘ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్చిన్నముగ వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు’ అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది “నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను’ అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీదనుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులోగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.
వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని ‘భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. . అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో గంగ పాయను పాతాళమునాకు తెచ్చావు గనుక ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియకకానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకుపూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్టానం కలిగి వేరోకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమయినది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...