Jump to content

No unity among t-leaders


Recommended Posts

Posted

లక్ష్య సాధన కోసం మీడియా ముందు ప్రగల్భాలు పలికే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు.. తెరవెనుక మాత్రం ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటారు. మాటలను తూటాలుగా పేల్చుకుంటారు. ఒకరు మూర ముందుకు పోతే... మరొకరు బార వెనక్కి లాగుతారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల రాజకీయ నేతల మధ్యనే కాదు చివరకు ఒకే పార్టీకి చెందిన నేతల్లోనూ ఐకమత్యం శూన్యం.

ఒకరు ముందుకు పోదామంటే.. మరొకరు వెనక్కి వెళదామంటారు. ఆది నుంచి ఇదే పరిస్థితి. ఫలితంగా తెలంగాణ ఉద్యమం ఎపుడు తెరైపేకి వచ్చినా.. నీటి మీద బుడగలా మారిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి సీమాంధ్ర పెట్టుబడిదారులే అని పదేపదే ఆరోపించే తెలంగాణ రాజకీయ నేతలు.. తమలోని లోపాలను సరిదిద్దుకున్న పాపాన పోవడం లేదు.

వైఎస్ జీవించి ఉండగా... తెలంగాణ ఏకైక శత్రువు వైఎస్ అని చాటింపు వేశారు. ఆయన పరమపదించిన తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రాష్ట్ర ఏర్పాటుకు మోకాలడ్డుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి ఆ ప్రాంత విద్యార్థులు కూడా వంతపాడుతున్నారు. రాజకీయ నేతలు చేసే ఆరోపణలను ప్రజలు పట్టించుకోక పోవచ్చు. కానీ.. యూజీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసే, చేసిన విద్యార్థులు కూడా ఏమాత్రం వెనుకాముందు ఆలోచన లేకుండా మాట్లాడటం చాలా బాధకలించేలా వుంది.

అమ్మ పెట్టదు.. అడుక్కోనీయదన్న సామెతకు అద్దం పట్టేలా వీరి వ్యవహారశైలి ఉంది. తెలంగాణ నేతల్లో ఐకమత్యం, పోరాట యోగ్యత, సమర్థత, పదునైన వ్యూహాలు, న్యాయపరమైన వాదన, లక్ష్య సాధన కోసం ఉండాల్సిన బలమైన ఆకాంక్ష ఉండివుంటే ఈ పాటికి తెలంగాణ ఎపుడో వచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అలాగే, లక్ష్యసాధన పరుగు పందెం(తెలంగాణ)లో గెలుపోటములు సహజం. ఆటలో ఓడిపోయినంత మాత్రాన ఆటనే రద్దు చేసి తమను విజేతగా ప్రకటించాలన్న వాదనే అర్థరహితంగా ఉంటుంది.

స్వయం పాలన, ఆత్మగౌరవం కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దేశ సమగ్రతకు, సమైక్యతకు హాని కలుగుతుందని తెలిసినా.. వారు చేస్తున్న వితండవాదన ఆశ్చర్యం కలిగించేలా వుంది. ఇలా డిమాండ్ చేసే రాజకీయ నేతలే.. సమయం సందర్భం లేకుండా తెలంగాణ ద్రోహి నువ్వంటే.. కాదు నువ్వంటూ ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటారు. తిట్టుకుంటారు. వీరిలోనే ఐకమత్యం లేనపుడు తెలంగాణ రాష్ట్రం ఎలా వస్తుంది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏళ్ళతరబడి పోరాటం చేస్తున్న ఆ ప్రాంత నేతలు ఎపుడైనా ఒక్కతాటిపైకి వచ్చి తామంతా ఐకమత్యంగా ఉండాలని చాటి చెప్పారా?

తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచన చేయకుండా లక్ష్య సాధన కోసం కృషి చేసివుంటే వారు అనుకున్నది ఈపాటికి ఎపుడో సాధించి ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న వాంఛ అందరిలోనూ ఉంది. అదేసమయంలో అందరికీ పదవులు కావాలి. కానీ, నిబద్ధతతో చిత్తశుద్ధితో లక్ష్యం కోసం ప్రయత్నించిన నేతలను వేళ్ళమీద లెక్కించవచ్చు. అందుకే ద్వంద్వ వైఖరితో రాజకీయాలు చేస్తూ కాలం సాగదీస్తున్నంత కాలం తెలంగాణ రావడం పక్కన పెడితే.. ఆ ప్రాంత అభివృద్ధి కూడా సమాధానం లేని ప్రశ్నలాగే మిగిలిపోవడం ఖాయం. ఈ విషయాన్ని పట్టాలు పుచ్చుకున్న విద్యార్థి నేతలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

×
×
  • Create New...