Popular Post dasari4kntr Posted March 10, 2021 Popular Post Report Posted March 10, 2021 గురువారం ఉదయం 11:30 Z.P Boys High school… సైన్స్ టీచర్ సుబ్రమణ్యం బోర్డు పైన ఎదో ఐన్స్టీన్ E=mc2 సాపేక్ష సిద్ధాంతం అంటూ తన ధోరణి లో ఎదో చెప్పుకుంటూ పోతున్నాడు… స్కూల్ అటెండెంట్ ఎదో పేపర్ పట్టుకుని 10వ తరగతి A సెక్షన్ గుమ్మం దెగ్గర నిలుచున్నాడు … అంతలో “సారు…” అంటూ కేకవేసాడు ఆ అటెండెంట్ .. “ఓహ్ సర్కులర్ ఆ..” అంటూ…అది తీసుకుని పైనుంచి కిందవరకూ చదివేసి….పిల్లల వైపుతిరిగి… “చూడండి…మన స్కూల్ లో…వచ్చేవారం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ఎగ్హిబిషన్… డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని ఊర్ల నుంచు వేరే స్కూల్ పిల్లలు కూడా వస్తారు.. అందుకని… సోమవారం, మంగళవారం మీకు స్కూల్ లేదు…” పిల్లల మొహాల్లో ఆనందం ఒక మెరుపులా మెరిసింది … “ఇంకొక విషయం…మన స్కూల్ నుంచి కూడా.. ఈ సైన్స్ ఫెయిర్ కి పార్టిసిపేట్ చెయ్యాలి … ఎవరికి ఆసక్తి ఉందొ వాళ్ళు చేతులు ఎత్తండి … ఇద్దరు కావాలి” ఒక్క చెయ్యి కూడా పైకి లేవలేదు… ఆ టీచర్ … ముందు బెంచీలో ఉన్న శ్రీధర్ వైపు అలానే చూస్తున్నాడు … ఇంకా తప్పదు అన్నట్టు శ్రీధర్ చెయ్యత్తాడు.. “శ్రీధర్ .. నీకు జత గా ఎవరు కావాలో వాళ్ళ పేరు నువ్వే చెప్పు … “ శ్రీధర్ .. వెనక్కి తిరిగి ఎవరి పేరు చెప్దామా అని అందరి ముఖాలు చూస్తున్నాడు … పిల్లలంతా … నన్నొదిలే మహాప్రభో … అన్నట్లు దిక్కులు చూస్తున్నారు … ఓక నిర్ణయానికి వచ్చినోడిలా … “కిరణ్” సర్ అన్నాడు … “వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా..” అంటూ టీచర్ .. “అరె కిరణ్ లోపలికి రా ..” అని ఒక కేక వేసాడు .. అప్పటివరకు … గది బయట మోకాళ్ళ పైన నిల్చుని … చిరంజీవి సినిమాలో సీన్స్ ని నెమరేసుకుంటూ ఉన్న..కిరణ్ ఒక్క సారిగా ఉలిక్కిపడి…లోపలికి వచ్చి… “yes సార్” అన్నాడు… శ్రీధరూ, నువ్వు..వచ్చే వారం సైన్స్ ఫెయిర్ ఎక్సిబిషన్ లో పాల్గొంటున్నారు … మీరిద్దరూ ఈ రోజు స్కూల్ అయిపోయాక ఇక్కడే ఉండండి … నేను మీకు ఏమి చెయ్యాలో చెప్తాను … వచ్చే సోమవారం , మంగళవారం స్కూల్ కి సెలవు…కానీ మీ ఇద్దరు స్కూల్ కి రావాలి” అని..ఆ సర్కులర్ పేపర్ లో…వీళ్ళ ఇద్దరి పేర్లు రాసేసి అటెండర్ ని పంపించేశాడు… అంతలో hour bell కూడా మోగడం తో… “సాయంత్రం కలుద్దాం” అని వెళ్ళిపోయాడు.. కిరణ్ అప్పుడే తేరుకుని శ్రీధర్ వైపు చూస్తూ… “ఛీ వెధవ…అంత మంది ఉండగా…నా పేరే ఎందుకు చెప్పావు రా…” “నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పారా…” “నీ తలకాయ్…రేపు చిరంజీవి మాస్టర్ సినిమా రిలీజ్..నేను రేపు స్కూల్ ఎగొట్టి వెళదాం అనుకున్న…చెడగొట్టావ్.. దానికితోడు …అందరికి మూడురోజులు శెలవు…మనకి తప్ప…అంతా నీవల్లే… ఆ సుబ్రహ్మణ్యం సార్ కి…పెళ్లి అయి ఉన్నా బాగుణ్ణు..ఇలా సాయంత్రం ప్రాజెక్టులు అంటూ మన ప్రాణం తీయకుండా…” “అది కాదురా …” “ఛీ నోర్ముయ్…రెండు రోజుల క్రితమే .. కడుపు నొప్పి అని స్కూల్ కి ఎగనామం పెట్టా… ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఇంకోసారి కడుపు నొప్పి అంటే నా అయ్య .. మక్కెలు ఇరగొడతాడు …” “అది కాదురా .. నీకు తెలుసు కదా నాకు కొంచెం బిడియం అని … నువ్వు ఉంటే కొంచెం ధైర్యం గా ఉంటుందని… అందులోను చాలా మంది వస్తున్నారు అని చెప్పారు ..” “అరేయ్ శ్రీధర్ … అసలు ఆ ఎక్సిబిషన్ ఏంటి? అక్కడ ఏమి చేస్తారో కూడా నాకు తెలియకుండా … నేనయినా ఏమిచేస్తాను … అక్కడ కొంపతీసి ఎవరన్నా నీకు సైన్స్ లో మార్కులు ఎంత అని అడిగితే.. నా పరిస్థితి ఏంటి…” “అలా ఏమి ఉండదు లేరా కిరణ్ …” “నీకేం .. అలానే చెప్తావ్.. ఫస్ట్ ర్యాంకర్ వి కాబట్టి..” అంతలో.. లెక్కల మాస్టారు క్లాసులోకి అడుబెట్టాడు … ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ స్కూల్ బల్లల దెగ్గరికి వచ్చి కూర్చున్నారు … 1 3 Quote
Popular Post dasari4kntr Posted March 10, 2021 Author Popular Post Report Posted March 10, 2021 సాయంత్రం 5:00 ఆఖరి స్కూల్ గంట కొట్టారు… ఎవరికి వాళ్లు బాగ్ సర్దుకుని… బయటికి నడిచారు … చివరికి … శ్రీధర్ , కిరణ్ … మిగిలారు ఆ గది లో … ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ … ఒక పదినిమిషాల తర్వాత .. సుబ్రమణ్యం క్లాస్ లోకి వచ్చాడు … “ఎరా… రెడీ నా మీరిద్దరూ …” ఇద్దరు ముఖాల్లో అస్పష్ఠథ … “రెడీ నే ..సర్ .. కానీ అసలు ఏమి చెయ్యాలి ..?” “సరే ..మీకు వివరంగా చెప్తాను వినండి ..” మనం రేపు, ఎల్లుండి..ఇంకా అవసరం అయితే ఆదివారం కూడా…కష్టపడి…ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం…దాన్ని సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించ బోతున్నాం …దాని గురించి అక్కడికి వచ్చే వాళ్ళకి … మనం వివరంగా డెమో (demo) చేసి చూపించాల్సి ఉంటుంది … మనకి ఒక స్టాల్ ఇస్తారు అక్కడికి వచ్చిన జనాలకి మన ప్రాజెక్ట్ డెమో ఇవ్వాలి…అలాగే మన లాగ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్ ఉంటుంది… “ఏంటి స్టూల్ మీద చెప్పాలా?” అన్నాడు కిరణ్ “స్టూల్ కాదురా వెదవ … స్టాల్” అని కసురుకున్నాడు సుబ్రహ్మణ్యం ఇంక మారు మాట్లాడలేదు కిరణ్ … తనకు అదేంటో అర్థం కాకపోయినా.. సుబ్రహ్మణ్యం చెప్పడం కొనసాగించాడు … అక్కడికి మొదటిరోజు కొంతమంది గవర్నమెంట్ ఇంజనీర్స్, జనవిజ్ఞానవేదిక నుంచి కొంత మంది వస్తారు … వాళ్ళకి మనం ప్రెసెంటేషన్ ఇవ్వాలి … రెండో రోజు లోకల్ MLA, జిల్లా కలెక్టర్ వస్తారు … వాళ్ళకి కూడా మన ప్రెసెంటేషన్ ఇవ్వాలి … వీళ్లతో పాటు కొంత మంది పత్రికా విలేకరులు కూడా వస్తారు కెమెరా పట్టుకుని … మనలా వచ్చిన వాళ్ళందరూ నుంచి …ప్రాజెక్ట్ & ప్రెసెంటేషన్ ఆధారంగా కొంత మందిని సెలెక్ట్ చేసి.. అవార్డ్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు … అంతే కాదు తర్వాత జరగబోయే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి పంపుతారు … “దాని వల్ల ఉపయోగం ఏంది సార్” అన్నాడు కిరణ్ … సుబ్రహ్మణ్యం .. చిరాకుగా “బాగుపడాలనుకునే వాడికి ఉపయోగం రా … నీలా చెడిపోయేవాళ్ళకి ఎలాంటి ఉపాయాగం లేదు” కిరణ్ పైకి భయం తో కూడిన గౌరవాన్ని నటిస్తూ … “సరే సార్ …” అని పైకి అని .. మనసులో “జీతం సరిపొవట్లేదేమో ఈ మధ్య కోపంగా ఉంటున్నాడు “ అనుకున్నాడు … ఇంతలో శ్రీధర్, “దేని గురించి చేద్దాం సార్ ప్రాజెక్ట్?” పక్కనుంచి …కిరణ్ “ఆదిత్య 369 లాంటిదా సార్ ?” “శ్రీధర్, ఈ వాగుడుకాయ తప్ప నీకెవరు దొరకలేదా క్లాసులో” అన్నాడు సుబ్రహ్మణ్యం ఇంత గొప్ప ఐడియా ఇస్తే ఎందుకిలా అంటున్నారు అని చిన్నబుచ్చుకున్నాడు కిరణ్ మనసులో .. “అరె శ్రీధర్…నీకు దేని గురించి చెయ్యాలని వుంది…? ఏదయినా మనసులో ఉంటే చెప్పు…నాకు తెలిసిన పరిజ్ఞానం లో దాన్ని ఎలా చేయాలో చెప్తాను…” అన్నాడు సుబ్రమణ్యం… దానికి బదులుగా శ్రీధర్ “క్రిందటి సంవత్సరం మన పక్క జిల్లా లో రాళ్ళపాడు రిజర్వాయర్ గేట్లు తెగి ఎంతో ప్రాణ నష్టం జరిగింది కదా .. మనం దాని మీద ప్రాజెక్ట్ చేద్దాం సార్” అన్నాడు.. “సరే…నేను వార్తల్లో చదివినదానికి కొంత నా సైన్స్ పరిజ్ఞానమ్ జతకలిపి .. అలాంటి విపత్తు ని ఎలా నివారించాలో అని ఒక మోడల్ తయారుచేస్తాను … మీరు ఈ రెండు రోజులు నేను చెప్పినట్టు చెయ్యాలి … ఆ తర్వాత దీనిని ఎలా ప్రెసెంటేషన్ చేయాలో నేర్పుతాను … సరేనా” అన్నాడు సుబ్రమణ్యం .. సరే అని తల ఊపారు ఇద్దరూ … “సార్.. మరి ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే …?” అని అడిగాడు శ్రీధర్ … “నువ్వు సరిగ్గా ఈ ప్రాజెక్ట్ మోడల్ ని అర్థం చేసుకుంటే … నువ్వు కచ్చితంగా చెప్పగలవు శ్రీధర్ “ అన్నాడు సుబ్రహ్మణ్యం “మరి ఎవరైనా .. అధిక ప్రశ్నలు అడిగితే …?” అన్నాడు కిరణ్ … “అధిక ప్రసంగివి నువ్వు ఉన్నావు కదా … ఆ మాత్రం చూసుకోలేవూ” అని ఠక్కున బదులిచ్చాడు సుబ్రహ్మణ్యం ఇక ముగ్గురూ కలిసి ఆ మూడు రోజులు కష్టపడి …తమ ప్రాజెక్ట్ రెడీ చేశారు … 3 Quote
Popular Post dasari4kntr Posted March 10, 2021 Author Popular Post Report Posted March 10, 2021 సోమవారం ఉదయం 8:00 శ్రీధర్, కిరణ్ తమ ప్రాజెక్ట్ మోడల్ పట్టుకుని … స్కూల్ తరగతులన్నీ తిరుగుతున్నారు… ప్రతి గదిలో .. వరుసగా బల్లలు పరిచి ఉన్నాయి … ప్రతి బల్ల పైన .. ఎవరివో పేర్లు వ్రాసివున్నాయి … వీళ్ళ పేర్లు … ఎక్కడా కనపడలేదు … వాళ్ళ మాస్టారు సుబ్రహ్మణ్యం లాగ … చివరికి … ఒక గది బయట “Agriculture & Water resources” అని ఎదో అంటించి ఉంది … “ఇది ఖచ్చితంగా మనం చేసిన ప్రాజెక్ట్ కి సంబంధించింది కాదు పద ఇంకో వైపు వెతుకుదాం” అన్నాడు శ్రీధర్ … “సరే కానీ ..ముందు ఈ బరువుని ఎక్కడన్న దించి… ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకుందాం … పద అంటూ ఆ గదిలోకి వెళ్ళి ఒక బల్ల మీద తమ సామాను పెట్టి… హమ్మయ్య అనుకున్నారు”… కిరణ్ అక్కడే నేల మీద కూలబడ్డాడు … శ్రీధర్ ఆ బల్ల వెనకాల ఉన్న కుర్చీ లో కూర్చున్నాడు … కొంచెం సేపు సేద తీరాక … శ్రీధర్ తన ముందు ఉన్న బల్ల పైన బోర్లా పడి ఉన్న పేపర్ ని అందుకున్నాడు … ఆ పేపర్ లో శ్రీధర్ , కిరణ్ Z.P Boys High School అని వ్రాసి ఉంది … “అరేయ్ కిరణ్…” అని గట్టిగా కేక వేసాడు శ్రీధర్ … “మన స్టాల్ ఇదేరా” అంటూ .. “ఇదేంట్రా శ్రీధర్…ఒక బల్ల వేసి..దానికి స్టాల్ అంటారు…ఇది టేబుల్ కదా…” “ఏదోకటి..ముందు..సహాయం చెయ్యి…ఈ ప్రాజెక్ట్ అసెంబుల్ చేయడానికి… ” ఇద్దరు కలిసి 10 నిమిషాల్లో ఆ పరికరాన్ని బిగించి … బయటికి వెళ్లారు .. ఆ జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి అనేక బస్సులు … అందులోంచి ఒక్కొక్కరు చేతుల్లో ఏవేవో పరికరాలని మోసుకుని దిగుతున్నారు… కిరణ్ కి ఇదేమి పట్టట్లేదు…కానీ శ్రీధర్ లో ఎక్కడో కొంత బెరుకుతనం మొదలైంది ఆ హడావిడి చూసి .. “ఏమయిందిరా .. అలా బిగుసుకుపోయి చూస్తున్నావ్ “ అన్నాడు కిరణ్… “ఈ హడావిడి అంతా చూస్తుంటే … కొంచెం భయంగా ఉందిరా …” “సైన్స్ లో మార్కులు అడగరు అంటే అదే చాలు రా… అంతకు మించి నాకే భయం లేదు … అయినా బాగా చదివే నువ్వు భయపడి…ఏమి రాని నేను భయపడి … ఇంకెందుకురా ఈ చదువులూ ..? సర్లే.. పద లోపలికి వెళదాం … ఈ జనాలని చూస్తుంటే అలాగే ఉంటది …” అని ఇద్దరు లోపలికి ..తమ స్టాల్ దెగ్గరికి నడిచారు … కొంత దూరం లో ఉన్నారు తమ స్టాల్ చేరుకోడానికి … అంతలో ఎదో లీలగా… రెండు యూనిఫార్మ్స్ వేసుకున్న వ్యక్తులు తమ స్టాల్ దెగ్గర తచ్చారుడుతూ ఎదో కదిలిస్తున్నారు … శ్రీధర్ అది దూరం నుంచే చూసి … కిరణ్ కి చెప్పాడు … ఇద్దరు అరుచుకుంటూ తమ స్టాల్ దగ్గరకు చేరుకున్నారు … అది ఇద్దరు అమ్మాయలు … తెలుపు బులుగు యూనిఫార్మ్ వేసుకుని…షూస్, బెల్ట్, బ్యాడ్జి, రిబ్బన్ తో కట్టిన రెండు జడలు లాంటి హంగామాతో సిటీ కాన్వెంట్ పిల్లల్లా కనిపిస్తున్నారు … పైగా అందులో ఒక అమ్మాయికి … కళ్ళజోడు … “మా స్టాల్ దగ్గర ఎం చేస్తున్నారు ..” అంటూ లేని గంభీరత్వంతో అడిగాడు కిరణ్ … దానికి బదులుగా ఆ కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయి .. “actually my project needed electricity, there is only one socket here, so i am looking for another way…” అంటూ ఇంగ్లీష్ లో గడగడా పద్యం పాడేసింది … శ్రీధర్, కిరణ్ లు ఇద్దరు తెల్లమొఖాలేసుకుని చూస్తున్నారు… అసలుకే కొంత బెరుకుతనం తో శ్రీధర్ … ఆ ఇంగ్లీష్ ప్రవాహానికి … ఇంకా ఆత్మనూన్యతా భావం లోకి వెళ్ళిపోయాడు … కొంత తేరుకున్న కిరణ్ … “ఇది తెలుగు మీడియం స్కూల్ … ఈ కాంపౌండ్ లో తెలుగులోనే మాట్లాడాలని మా తెలుగు సార్ స్ట్రిక్ట్ గా చెప్పాడు …ఇంతకీ మీరెవరు ..?” అని గాంభీర్యం నటిస్తూ అన్నాడు .. దానికి… ఆ కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయి కొంచెం వెటకారం గా నవ్వి … “నా పేరు K.S. లక్ష్మి … ఇది నా ఫ్రెండ్ తస్లీమా …మాది సిటీలో ఉన్న Masters Techno School…మాది మీ పక్కనే వున్న స్టాల్…ఇక్కడ ఎలక్ట్రిక్ సాకెట్ ఒక్కటే ఉంది…కాబట్టి ఇద్దరం షేర్ చేసుకోవాలి….” తానూ అంత ఆత్మవిస్వాసం తో హెచ్చరించినట్లు మాట్లాడేసరికి…శ్రీధర్ , కిరణ్ తల ఆడించడం తప్ప మారు మాట్లాడలేదు … ఇంతలో…ఒక పక్క నుంచి సుబ్రహ్మణ్యం…మరోపక్క నుంచి ఆ కాన్వెంట్ అమ్మాయిల టీచర్ నిర్మల…రావడం తో..ఎవరి స్టాల్ల్స్ లోకి వాళ్ళు వెళ్లారు… తరువాత భాగం త్వరలో 4 Quote
dasari4kntr Posted March 10, 2021 Author Report Posted March 10, 2021 corrected... few mistakes and typos.... Quote
kalaa_pipaasi Posted March 11, 2021 Report Posted March 11, 2021 chinnapudu emina chesava kaka isuvantivi projects school lo..dheeni meedaki ela drusti mallindi neeku Quote
dasari4kntr Posted March 11, 2021 Author Report Posted March 11, 2021 Just now, kalaa_pipaasi said: chinnapudu emina chesava kaka isuvantivi projects school lo..dheeni meedaki ela drusti mallindi neeku bit of a personal experience...with some fiction.... 2 Quote
kalaa_pipaasi Posted March 11, 2021 Report Posted March 11, 2021 1 minute ago, dasari4kntr said: bit of a personal experience...with some fiction.... okay. Quote
Ara_Tenkai Posted March 11, 2021 Report Posted March 11, 2021 22 minutes ago, dasari4kntr said: bit of a personal experience...with some fiction.... Bro migathadi eppudu rastav!! Post chesinaopudu nannu tag cheyava...naku chadavalani undi...intha manchiga telugu lo rastunnav hatsoff!! 1 Quote
dasari4kntr Posted March 11, 2021 Author Report Posted March 11, 2021 2 hours ago, Ara_Tenkai said: Bro migathadi eppudu rastav!! Post chesinaopudu nannu tag cheyava...naku chadavalani undi...intha manchiga telugu lo rastunnav hatsoff!! sure..bro... Quote
Popular Post dasari4kntr Posted March 16, 2021 Author Popular Post Report Posted March 16, 2021 అప్పుడే వచ్చిన సుబ్రమణ్యం … “ఎరా !! అంతా సరిగానే ఉందా..” అని అడిగాడు … “అంతా ఒకే సార్…” అని బదులు ఇచ్చాడు శ్రీధర్… తనకేమి పట్టనట్టు దిక్కులు చూస్తున్నాడు కిరణ్… ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ నీళ్ల టబ్… ఒక పక్క కొంత వరకు కోసేసి … తాము కృత్రిమంగా అమర్చిన ఒక గేట్ ని పెట్టారు , ఒక వాటర్ రిజర్వాయర్ ని తలపించే విధంగా. ఆ గేటు ని ఎత్తడానికి ఒక చిన్న మోటార్ ని పెట్టి, ఆ మోటార్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయడానికి నీళ్లలో, గాలితో నింపిన ఒక చిన్న ప్లాస్టిక్ బాల్ ని ఉంచి, ఆ బాల్ ఆ నీళ్ల టబ్ లో ఎంత ఎత్తులో ఉంటే దానికి అనుగుణంగా గేట్ తెరుచుకునేలా ఒక పరికరాన్ని రూపొందించారు. ఆ పరికరం డిజైన్ చేయడంలో, సుబ్రహ్మణ్యం కష్టం ఎంత ఉందొ శ్రీధర్ కష్టం కూడా అంతే ఉంది. కిరణ్ కొంత వరకు పెద్దగా మెదడు పెట్టాల్సిన అవసరం లేని పనుల్లో సహాయపడ్డాడు… అదే సమయంలో అప్పుడే వచ్చిన ఉన్న నిర్మల టీచర్ … “is everything ok?” అని అడిగింది ఆ కాన్వెంట్ ఆడపిల్లలని.. “everything ok mam” అని నిలకడగా సమాధానం ఇచ్చారు ఆ ఇద్దరు ఆడపిల్లలు… ఆ ఇద్దరు ఆడపిల్లలు, చదువులలో ఒకరికి ఒకరు పోటీ. K.S. లక్ష్మి కొంత గడసరి మాటకారి, తస్లీమా కొంత నెమ్మదస్తురాలు… వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్, పంటలకు శాస్త్రీయ పద్దతిలో నీటి పారుదల సంబంధించింది. అది శ్రీధర్ టీం లాగ కొత్త పరికరాన్ని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కాకపోయినా, ఒక నాలుగు చిన్న చిన్న చదరపు టబ్ ల్లో నిజమైన మట్టి , వరి వంగడాలను ఉంచి వాటికి నీరు అందేలా కొంత నీటి కనెక్షన్స్ ఉన్నాయి…వాళ్ళ వెనకాల…పెద్ద పెద్ద ఛార్ట్స్ పైన ఏవో కొన్ని స్కెచ్స్ ఉన్నాయి డెమో ఇవ్వడం కోసం… కనీసం రెండు అడుగులు దూరం కూడా లేని పక్కపక్క స్టాల్స్ అవ్వడం వల్ల…సుబ్రమణ్యం, నిర్మలా ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పలేదు… “హలో సార్..how are you…” అంటూ సుబ్రహ్మణ్యం ని పలకరించింది నిర్మల కొంత కృత్రిమమైన నవ్వుతో… “..fine..” అంటూ బదులిచ్చాడు సుబ్రమణ్యం…చిక్కని నవ్వుతో…పళ్ళ వరస అంతా కనిపించేలా… “నాది పేరు నిర్మల…” అంటూ చేయ్యి చాపింది .. హ్యాండ్ షేక్ కోసం… “నేను సుబ్రహ్మణ్యం” అంటూ తన రెండు చేతులతో చటుక్కున తన చెయ్యి అందుకుని …తెగ ఊపేస్తున్నాడు చేతిని సుబ్రహ్మణ్యం.. “మీ పిల్లలా ..?” అని అడిగింది నిర్మల … “కాదు మేడం .. నా స్టూడెంట్స్…, వీడు శ్రీధర్,వాడు కిరణ్ … నాకు ఇంకా పెళ్లి కాలేదు ..” అన్నాడు సిగ్గుపడుతూ ఆమె చెయ్యి వదిలేస్తూ .. దానికి నిర్మల “ohh sorry…I meant, are they your students..?.” అని పక్కున నవ్వేసి… “నాది తెలుగు very bad…కేరళ ముంచి వచ్చాను…కొంచెం కొంచెం తిప్పలు ఉన్నాయి…by the way వీళ్ళు నాది స్టూడెంట్స్ కొండా సుబ్బ లక్ష్మి , తస్లీమా ఖాన్..” అంది.. కొంత క్షణాల తర్వాత ఆమె ఏమి చెప్తుందో అర్థం చేసుకుని… “పర్లేదు మేడం … పక్కనే ఉంటారుగా… రెండు రోజుల్లో నేర్పించేస్తాను…” అంటూ కని కనిపించని మెలికలు తిరుగుతున్నాడు సుబ్రమణ్యం.. “thank you…సిటీ లో అందరూ నాది లాగానే మాట్లాడుతుంది..i will be happy if you teach me proper telugu…”… అంది నిర్మల తనకు వచ్చిన తెలుగులో నిజాయతీగా… “ఖచ్చితంగా…నేను పని చేసేది ఇక్కడే… govt టీచర్ ని” అంటూ కొంత గర్వం ప్రదర్శిస్తూ … “పదండి మేడం… మనం తెలుగులో మాట్లాడుకుంటూ..మా తెలుగు స్కూల్ ని చూపిస్తాను అంటూ”… ఆమెను ఆహ్వానించాడు … “తిప్పకుండా…” అంది నిర్మల … అది “తప్పకుండా..” అని అర్థం చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం … ఇద్దరూ వాళ్ళ స్టూడెంట్స్ ని అక్కడ వదిలేసి … బయలుదేరారు … ఈ సంభాషణ అంతా చూస్తున్నారు శ్రీధర్ , కిరణ్ , సుబ్బలక్ష్మి , తస్లీమా… “అసలేం జరుగుతుంది రా ఇక్కడ… నేను నిన్న చూసినా మెగాస్టార్ మాస్టర్ సినిమా మించిన సినిమా చూపించాడు మన సుబ్రమణ్యం మాస్టరు …” అన్నాడు కిరణ్ … చిన్నగా నవ్వాడు శ్రీధర్ … అటు పక్క.. ఆ ఇద్దరు అమ్మాయిలు ఏదో చెవులు కొరుక్కుని … పక పకా నవ్వుతున్నారు… ఇంతలో..కిరణ్ కి ఎదో గుర్తుకొచ్చింది…అసలే కొన్ని నిమిషాల క్రితం…ఇంగ్లీష్ లో పద్యం పాడి వెటకారంగా సమాధానం ఇచ్చిన K.S. లక్ష్మీ గుర్తుకొచ్చింది… తన అసలు పేరు కొండా సుబ్బలక్ష్మి అని … తనకి ఆలా పిలిపించుకోవడం ఇష్టం లేకనే తన పేరు K.S. లక్ష్మీ గా చెప్పుకుందని తన సినిమా తెలివితేటలతో గ్రహించాడు… ఇక ఇదే అదనుగా…తనని పదే పదే “కొండా సుబ్బలక్ష్మి గారు” అని పిలిచి ఆటపట్టించడం మొదలుపెట్టాడు… కొంత అసహనం తో…కక్కలేక..మింగలేక ఉన్న సుబ్బలక్ష్మి…తిరిగి ఏడిపించడానికి సమయం కోసం వేచి చూస్తుంది… 3 Quote
Popular Post dasari4kntr Posted March 16, 2021 Author Popular Post Report Posted March 16, 2021 మధ్యాహ్నం 3:00 PM… అప్పటివరకు ఎవరో పిల్లలు, కొంతమంది స్కూల్ టీచర్స్ వచ్చి చూసి పోతున్నారు తప్పా…వీళ్ళ స్టాల్ల్స్ దెగ్గరికి ఎవరూ వచ్చి .. ఇది ఏమి ప్రాజెక్ట్ ..? ప్రెసెంటేషన్..? అన్న పాపాన పోలేదు … అందరూ సైన్స్ ఔత్సాహికులు … పక్క గదిలో ఉన్న కంప్యూటర్ జ్యోతిష్యం దగ్గర గుమిగూడి ఉన్నారు… సైన్స్ ఫెయిర్ లో.. జ్యోతిష్యం ఏంటో అని… నవ్వుకున్నాడు శ్రీధర్… “అది కూడా సైన్స్ రా… ” అని తన విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టాడు కిరణ్… “అక్కడితో ఆపేసేయ్…రా బాబు” అని చేతులు జోడించాడు శ్రీధర్… తనలో పొంగిపొరలుతున్న …జోతిష్య సైన్స్ ప్రవాహానికి ఆనకట్టలు వేశాడు కిరణ్…కానీ “కొండా సుబ్బలక్ష్మి గారు” అంటూ టీజ్ చేసే పని మటుకు ఆపలేదు… మరోపక్క… శ్రీధర్ ఓరకంట తో గమనిస్తున్నాడు తస్లిమా ని… తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అయిన శ్రీధర్, అప్పుడప్పుడే యవ్వనం లో ప్రవేశిస్తున్న వయస్సు. ఇంత కాలం కో-ఎడ్యుకేషన్ లేని బాయ్స్ హై స్కూల్ లో చదవడం వలన, తనకి రెండు అడుగుల దూరంలో అమ్మాయిలు మసలడం అంతనికి కొత్త అనుభూతి లా ఉంది. ప్రత్యేకించి తస్లీమా పట్ల కొంత ఆకర్షితుడు అయ్యాడు. అంతలో… కొంతమంది జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రవేశించారు వీళ్ళు ఉన్న తరగతి గది లోకి … మొదటగా… తస్లీమా, సుబ్బలక్ష్మి ఉన్న స్టాల్స్ దగ్గర ఆగి.. “hi..can you explain your project..” అన్నారు… ముందుగా వాళ్లిద్దరూ వచ్చిన వాళ్ళని పలకరించి , తమ పేర్లను పరిచయం చేసి…ఆ తర్వాత తడుముకోకుండా, గుక్కతిప్పుకోకుండా ఒక 15 నిమిషాలు…ఒక ఇంగ్లీష్ పద్యం పాడినట్టు పడేసారు…మధ్యమధ్యలో చేతులు తిప్పుతూ హావభావాలు ప్రదర్శిస్తూ వాళ్ళు ప్రెసెంటేషన్ ఇస్తున్న తీరు చాలా చూడ ముచ్చటగా ఉంది చూసే వాళ్ళకి … పక్కనే ఉండి చూస్తున్నాడు శ్రీధర్…వాళ్ళ ఇంగ్లీష్ ప్రవాహం, వాళ్ళ కాన్ఫిడెన్స్ ను చూసి, తనని తాను తక్కువగా చూసుకున్నాడు. తనలో కొంత సేపటి క్రితం మొదలైన ఆత్మనూన్యతా భావం ఇప్పుడు తార స్థాయికి చేరుకుంది. “well done” అంటూ ఆ వచ్చిన సభ్యులు ఆ ఇద్దరి అమ్మాయిలని మెచ్చుకుని, నిజమైన వరి చేను పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందించారు.. ఆ తర్వాత రెండు అడుగులు ముందుకేసి శ్రీధర్ కిరణ్ ఉన్న స్టాల్ దెగ్గరికి వచ్చి ఆగి… “మీ ప్రాజెక్ట్ ని explain చెయ్యండి…” అని అడిగాడు శ్రీధర్ గుండె వేగం పెరిగింది…నోట్లోంచి మాట పెగలట్లేదు. తాను చుట్టూ జనాలు మూగి తననే చూస్తుండే సరికి ఒక రకమైన Scoptophobia కి గురి అయ్యాడు. వళ్ళంతా చెమటలు పట్టి భారంగా పీలుస్తున్నాడు గాలిని.. పక్కనుంచి కిరణ్ చిన్నగా “చెప్పారా, మాట్లాడు…” అంటూ చిన్నగా బతిమాలి నట్టు చెప్తున్నాడు.. అందరూ ఎదురుచూస్తున్నారు శ్రీధర్ ఏదో చెప్తాడని…కానీ ఎంతసేపటికీ శ్రీధర్ నోటి నుంచి మాట రాకుండా విగ్రహం రాయి లా బిగుసుకు పోయాడు … “పోనీ నువ్వు చెప్పు బాబు…” అని కిరణ్ ని అడిగాడు ఇంకో సభ్యుడు.. “ఊహించని మలుపుకి…” షాక్ తిన్నాడు కిరణ్… దిక్కులు చూసాడు సుబ్రమణ్యం మాస్టారు ఎక్కడ ఉన్నాడా అని… కిటికీ లోంచి దూరంగా కనపడ్డాడు చెట్టు కింద సైన్స్ మాస్టర్ సుబ్రమణ్యం తెలుగు పాఠం చెపుతూ నిర్మలా మేడం కి… ఇక తప్పదన్నట్టు…”ఇది రిజర్వాయర్ … ఇది గేటు…ఇది నీళ్ల పైన తేలాడే ఒక బాల్… ఈ రిజర్వాయర్ లో నీళ్లు పెరిగితే గేట్లు తెరుచుకుంటాయి.. నీళ్లు తగ్గితే గేట్లు మూసుకుంటాయి…” అని కట్టే.. కొట్టే…తెచ్చే తరహాలో తన ప్రెసెంటేషన్ ఇచ్చేసాడు కిరణ్ … అంతలో వాళ్లలో లో ఉన్న ఒక సభ్యుడు ఒక ప్రశ్న అడిగాడు..దానికి మల్లి ఆవు కథ లాగ…”ఇది రిజర్వాయర్ … ఇది గేటు…ఇది నీళ్ల పైన తేలాడే ఒక బాల్… ఈ రిజర్వాయర్ లో నీళ్లు పెరిగితే గేట్లు తెరుచుకుంటాయి.. నీళ్లు తగ్గితే గేట్లు మూసుకుంటాయి…” అని సమాధానం చెప్పేసాడు … చేసేదేమి లేక … శ్రీధర్ కొంత తేరుకుంటున్నాడు…కానీ అప్పటికే జరగాల్సిన పరాభవం జరిగిపోతుంది.. ఆ సభ్యులు కొంత నిరుత్సాహంతో కనుబొమలు చిట్లించుకుని… అటుపక్క గా ఉన్న ఇంకో స్టాల్ వైపు అడుగులు వేస్తున్నారు … “హమ్మయ్య..” అని అనుకున్నాడు కిరణ్… ఇంతలో ఒక సభ్యుడు మల్లి వెనక్కి తిరిగి… “బాబు మీకు సైన్స్ లో మార్కులు ఎన్ని..?” అని అడిగాడు… అప్పటికి కొంచెం తేరుకున్న శ్రీధర్ “నాకు 99… వీడికి 36” అని కిరణ్ చూపిస్తూ ఠక్కున జవాబు చెప్పేసాడు అనాలోచితంగా… ఒక్క సారిగా …పెద్దగా బిగ్గరగా ఒక నవ్వు వినపడింది కిరణ్ చెవిలో … ఆ వెటకారపు నవ్వు సుబ్బలక్ష్మి ది అని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు కిరణ్ కి… తానూ ఏ ప్రమాదం ఐతే జరగకూడదు అనుకున్నాడో … అదే ప్రమాదం తాను ఊహించనంత గోరంగా జరిగిపోయింది … “ఛీ వెదవ… ఇందాకటి వరకు బెల్లం కొట్టిన రాయి లా ఉన్నోడివి … మార్కులు అనగానే నోరెందుకు తెరిచావ్” … అని కసిరాడు శ్రీధర్ ని … ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తూ… “అయినా నీ మార్కులు నువ్వు చెప్పుకోక .. నా మార్కులు కూడా ఎందుకు చెప్పావు రా… కనీసం అబద్దం చెప్పే సమయం కూడా ఇవ్వలేదు..” అండ్ తన తిట్ల పురాణం ని కొనసాగించాడు కిరణ్… తస్లీమా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుండిపోయింది…సుబ్బలక్ష్మి మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో తన నవ్వు ని కొనసాగించింది … ఉదయం అంత … “కొండా సుబ్బలక్ష్మీ గారు… కొండా సుబ్బలక్ష్మీ గారు…” అని ఆటపట్టించిన కిరణ్ ని తిరిగి .. “36.. 36.. మా ఇంటి నెంబర్ 36… నా రోల్ నెంబర్ 36… మా క్లాసులో స్టూడెంట్ 36…” ఆటపట్టించడం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మీ… ఒక రెండు గంటల తర్వాత..రెండు రోజుల సైన్స్ ఫెయిర్ లో మొదటి రోజు ముగిసింది … ఎవరికి వారు వాళ్ళ స్టాల్స్ ని అలానే వదిలేసి, స్కూల్ ని విడిచి బయటకు నడిచారు … శ్రీధర్ , కిరణ్ , సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్లారు… సిటీ నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి , తస్లీమా , నిర్మల… గెస్ట్ హౌస్ కి వెళ్లారు … 1 2 Quote
dasari4kntr Posted March 16, 2021 Author Report Posted March 16, 2021 మంగళవారం తెల్లవారుజాము 4:00 AM స్కూల్ రెండో రోజు సైన్స్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తోంది ఒంటరిగా… ఊరు మొత్తం గాఢ నిద్ర లో ఉంది… సుబ్రహ్మణ్యం కలలో… నిర్మల మేడం ప్రేమ దేవతలా… శ్రీధర్ కలలో .. తస్లీమా చిరునవ్వు నవ్వుతూ…. కిరణ్ కలలో …సుబ్బలక్ష్మి వికటాట్టహాసం చేస్తూ …కనిపించారు… పీడకల వచ్చిన వాడిలా … ఉలిక్కిపడి లేచాడు కిరణ్ … దాణ వీర శూర కర్ణ సినిమాలో NTR దుర్యోధనుడు లా తెగ మదనపడిపోతున్నాడు… కిరణ్… ఏదోకటి చెయ్యాలి అని నిశ్చయించుకొని…ఎదో ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, ఇంట్లో ఉన్న నాలుగు ఖాళీ అగ్గిపెట్టలు తీసుకుని… బయటకు బయలుదేరాడు… ఊరి చివర ఉన్న వరి చేను లోకి వెళ్లి … కష్టపడి కొన్ని పొలానికి పట్టే పురుగులని, కొన్ని మిడతలని వేటాడి…వాటిని ఆ ఖాలీ అగ్గిపెట్టెల్లో బందించి … తన స్కూల్ వైపు బయలుదేరాడు… ఇంకా తెల్లవారుజాము చీకటి అలానే ఉండడం తో … ఆ చీకట్లోనే స్కూల్ గేట్ దూకి…చిన్నగా నక్కి నక్కి నడుచుకుంటూ తమ స్టాల్స్ ఉన్న తరగతి వద్దకు వెళ్లి …ఆ అగ్గిపెట్టెలు తెరిచి ఆ పురుగులని కిటికీల లోంచి ఆ గదిలోకి వదిలేశాడు… ఆ తరగతి గది లో…ఆ పురుగులకి కావల్సిన పత్రహరితం ఉన్నది ఒక్క సుబ్బలక్ష్మి , తస్లీమా స్టాల్ లోనే… మిగిలిన అందరివి ప్లాస్టిక్ పరికరాలు… తిరిగి అదే గెట్ ను ఎక్కి .. స్కూల్ నుంచి బయటపడి .. తన ఇంటికి చేరుకొని తన మిగతా నిద్ర కొనసాగించాడు… ఉదయం 9:00 PM… అందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు తమ స్టాల్స్ దగ్గరికి… కిరణ్ , శ్రీధర్ కూడా చేరుకున్నారు… కిరణ్ దూరం నుంచి పక్కన ఉన్న స్టాల్ ని గమనిస్తున్నాడు … తనకి ఆ వరి మొక్కల్లో ఎలాంటి పురుగు పుట్రా ఆనవాళ్ళు కనిపించలేదు … “ఛా… నా ప్లాన్ పనిచెయ్యలేదే..” అని నొచ్చుకున్నాడు కిరణ్ … శ్రీధర్ ముందు రోజు జరిగిన పరాభవం ని తలుచుకుని ఇంకా మదనపడుతున్నాడు… అంతలో…సుబ్రహ్మణ్యం వచ్చి … “నిన్న జరిగిన దాని గురించి బాధపడకుండా దానిని మర్చిపోండి…ఈ రోజు చాలా కీలకం.. నిన్న రావలిసిన ప్రభుత్వ ఇంజనీర్స్ కూడా ఈ రోజు MLA, కలెక్టర్ గారితో కలిసి వస్తున్నారు…మనం మన ప్రెసెంటేషన్ తో కాన్వెంట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసిపోము అని నిరూపించాలి …” అని చెప్తూ… పక్క స్టాల్ లో ఎవరినో కళ్లతో వెతుకుతున్నాడు తెలుగు పాఠం చెప్పడానికి… “సరే..” అంటూ తల ఊపారు శ్రీధర్ , కిరణ్ .. తమ దగ్గర వేరే సమాధానం లేక … అలా మాట్లాడుతూనే అటుపక్కగా …స్కూల్ ఆవరణ లో నిర్మల మేడం నడుస్తుండడం గమనించి … అటు పక్కకి అయస్కాంతం ఆకర్షించినట్టు వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం… సుబ్బలక్ష్మి ఈ రోజు కూడా తన 36 వెక్కిరింత 36 సార్లు పాడేసింది తనకు ఏమి తోచనప్పుడల్లా …. కిక్కురుమనలేదు కిరణ్… అంతలో…ఆ వరి మొక్కల్లో ఏదో పాకుతున్నట్టు కనిపించింది… పెద్ద కేక పెట్టింది సుబ్బలక్ష్మి …ఆ పాకుడు పురుగు ని చూసి … ఆ అరుపుకి … రెండు మిడతలు …ఆ వారి మొక్కల్లో నుంచి హెలికాఫ్టర్ లేచినట్టు లేచి …సుబ్బలక్ష్మి తలపైన, తస్లీమా చెంపల పైన వాలాయి … తస్లీమా నెమ్మదిగానే వదిలించుకుంటున్నా… సుబ్బలక్ష్మి చిందులు తొక్కుతూ గోల గోల చేస్తుంది … ఆ గది కూడా సుబ్బలక్ష్మి అరుపులకి రీసౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తూ బాగా సందడి చేస్తుంది… సుబ్బలక్ష్మి చిందులు తొక్కుతూనే అప్రయత్నం గా తస్లీమా తోసేసి .. బయటికి పరిగెత్తింది … సుబ్బలక్ష్మి చిందులు చూడాలనే ఉత్సాహం లో కిరణ్ కూడా ఆమె వెంట నవ్వుతూ పరిగెత్తాడు … ముఖంలో ఎలాంటి భావం లేకుండా చోద్యం చూస్తున్న శ్రీధర్ పైన …తస్లీమా వచ్చి పడింది సుబ్బలక్ష్మి తోసిన తోపు వలన … శ్రీధర్ , తస్లీమా ఇద్దరు కలిసి వెల్లకిలా కింద పడ్డారు…శ్రీధర్ పైన తస్లీమా పడి ఉంది… తస్లీమా బుగ్గ పైన ఇంకా ఆ మిడత అంటిపెట్టుకోనుంది … ఆ క్షణంలో హఠాత్తుగా … ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బోదురు కప్ప చటుక్కున ఎగిరి వాలింది కింద పడి ఉన్న తస్లీమా పైన కొంచెం మెడకి దెగర్లో … మరు క్షణం లో ఆ కప్ప నోరు తెరిచి … నాలుక బారుగా చాపి…తస్లీమా బుగ్గపైన అంటిపెట్టుకున్న మిడతని లాగి మింగేసి … చివరగా థాంక్స్ అన్నట్లు “బేక్ బేక్ …” అనేసి గెంతుకుంటూ వెళ్ళిపోయింది … ఒక్కసారిగా చుట్టూ ఉన్న పిల్లలు గొల్లుమని పెద్దగా నవ్వారు … లేచి నిలబడ్డారు తస్లీమా శ్రీధర్ … తస్లీమా కంటినిండా నీళ్లు పెల్లుబికాయి…అలా నిదానంగానే నడుచుకుంటూ , కళ్లు తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది … శ్రీధర్ కి ఒక్కసారిగా తస్లీమా పట్ల జాలి, నవ్విన వాళ్ల మీద కోపం ఒకేసారి కలిగాయి … తస్లీమా వెళ్లిన వైపు అతను కూడా బయలుదేరాడు … మరోపక్క …సుబ్బలక్ష్మి ని తల పైన పడిన మిడత ఎగిరిపోయింది, కానీ తాను దానినే తలుచుకుని తలుచుకుని భయపడుతూ ఏడుస్తుంది… ఆ ఏడుపు చూసి… అప్పటి వరకు నవ్వుకున్న కిరణ్ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది … తాను ఎంత పెద్ద తప్పు చేసానో అని తనని తాను నిందించుకున్నాడు … దెగ్గరికి వెళ్లి …సారీ చెపుదాం అనుకుని … ఇప్పుడు సారీ చెప్పడం వల్ల తానే చేసాడని ఒప్పుకుంటే … గొడవ పెద్దదవుతుంది కానీ తగ్గదు అని గ్రహించి .. మనసులో దేవుడిని క్షమించమని కోరుకున్నాడు … ఒక గ్లాసుతో నీళ్లు తీసుకుని వెళ్లి సుబ్బలక్ష్మి కి అందించి తనకి తెలిసిన సినిమా కామెడీ డైలోగ్స్ లాంటివి చెప్తూ తనని నవ్వించడానికి ప్రయత్నించాడు … సుబ్బలక్ష్మి కూడా …ఎలాంటి వెక్కిరింతలకి పోకుండా … కిరణ్ తో ఫ్రెండ్లీ గా మాట్లాడి… కొంత కుదుటపడింది … ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ తమ స్టాల్స్ వద్దకి వెళ్లారు … స్టాల్ల్స్ దగ్గర శ్రీధర్, తస్లీమా కనిపించలేదు… కిరణ్ పక్కన ఉన్న కిటికీ లోంచి చూస్తూ…సుబ్బ లక్ష్మి ని పిలిచి చూపిస్తూ .. “అదిగో అక్కడ చూడు… ఆ చెట్టు కింద కొంత దూరం లో సుబ్రహ్మణ్యం మాస్టర్ , నిర్మల్ మేడం… తెలుగు పాఠం చెప్పుకుంటున్నారు …” అన్నాడు … ఇద్దరు నవ్వుకుని … తమ తమ స్టాల్స్ లో చేరి కబుర్లలో మునిగిపోయారు… 1 Quote
Popular Post dasari4kntr Posted March 16, 2021 Author Popular Post Report Posted March 16, 2021 ఒంటరిగా స్కూల్ ఆవరణ లో ఉన్న బెంచ్ పైన కూర్చొని ఉంది తస్లీమా… అప్పుడప్పుడే కొంత కోలుకొని సాధారణ స్థితికి వస్తుంది… ఇంతలో..ఆమె వెనుకగా వచ్చి నిలబడ్డాడు శ్రీధర్ … కొంచెం వణుకుతున్న స్వరం తో …తస్లీమా అని పిలిచాడు అస్పష్టంగా…అ పిలుపు తస్లీమా చెవుల వరకు చేరలేదు … మల్లి కొంచెం స్వరం పెంచి .. తస్లీమా అని పిలిచాడు… వెనక్కి తిరిగి చూసింది శ్రీధర్ ని… ఆమె కంట్లో నీళ్లు లేకపోవడంతో కొంత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు… తస్లీమా ఆ బెంచ్ పైన కొంచెం పక్కకి జరిగి, శ్రీధర్ ని వచ్చి కూర్చోమని చెప్తున్నట్టు బెంచ్ పైన తడుతూ .. సైగ చేసింది. అసలే ఆ బెంచ్ చాలా చిన్నదిగా ఉండడం తో …శ్రీధర్ నెమ్మదిగా గా వెళ్లి బెంచు అంచున అది కూడా సగం సగం గా కూర్చున్నాడు … “పడిపోతావు శ్రీధర్ … కొంచెం లోపలికి జరిగి సరిగ్గా కూర్చో…భయపడకు… ” అని హెచ్చరించింది తస్లిమా… సరే అన్నట్టు… కొంచెం లోపలికి జరిగి కూర్చున్నాడు … భుజం భుజం రాసుకుంటూ కూర్చున్నారు.. తనంత వయస్సు ఉన్న ఒక అమ్మాయికి దగ్గరగా పక్కపక్కన అలా కూర్చోవడం అదే మొదటి సారి శ్రీధర్ కు… “మీకు ఏమి దెబ్బలు తగలలేదు కదా…ఇందాక కింద పడినప్పుడు…” అని అడిగాడు శ్రీధర్ … తస్లీమా చిన్నగా నవ్వి … “లేదు …ఆ కప్పని అంత దగ్గరగా చూసేసరికి కొంచెం భయం వేసింది …అంతే… దానికి తోడు అందరూ నవ్వే సరికి కొంచెం బాధగా అనిపించి కళ్ళలో నీళ్లు తిరిగాయి… ఐనా అది ఒక చిన్న ఆక్సిడెంట్ …దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి అని అనుకోవట్లేదు”… “నిజమే…కొన్ని చేదు విషయాలు అలా మర్చిపోతేనే మంచిది … కానీ నాకు జరిగిన పరాభవాన్నిఎంత మర్చిపోదామనుకున్నా… ఆ జ్ఞాపకాలు అలా వెంటాడుతూనే ఉన్నాయి…” అన్నాడు శ్రీధర్ … “శ్రీధర్…మీరు ఏమి అనుకోనంటే అసలు మీకు నిన్న ఏమైంది? … ఎందుకలా మౌనంగా ఉండిపోయారు ప్రెసెంటేషన్ లో…?” “ఏమో తెలియదు … అలా అందరూ నన్ను చుట్టుముట్టి నన్నే చూస్తుంటే నాకు నోటి మాట రాలేదు … పైగా … మీ ఇంగ్లీష్ ఉచ్చారణ మీరు ప్రజెంట్ చేసిన విధానం చూసాక … నేను అలా చేయగలనో లేదో అని… నాలో అంతటి సామర్థ్యం ఉందొ లేదో అనే ఒక తక్కువ భావం కలిగింది …” అన్నాడు శ్రీధర్… దానికి బదులుగా తస్లిమా … “ఎవరి సామర్థ్యం ఎక్కువ కాదు … తక్కువ కాదు. మనం మన జీవితాన్ని, మన సామర్థ్యాన్ని ఇంకొకరితో పోల్చు కోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు…అలా ఇంకొకరితో మనల్ని మనం పోల్చుకుంటున్నాం అంటే … మనమే మన సామర్ధ్యాన్ని అవమానిస్తున్నాం అని అర్థం…మనకున్న మన జీవితం ఇతరులని మెప్పించడానికి కాదు…మనకూ, మన మనస్సుకు నచ్చేలా మనమేం చేయగలం అని… మీకు ఉన్న ఈ ఫోబియా కి మూలకారణం మీరు ఇంకొకరిలా ప్రజెంట్ చేయలేకపోతున్నా, ఇంకొకరిలా జీవించలేకపోతున్న అన్న ఆలోచనే మీ మనసులో ఎక్కడో భయం గా నాటుకుపోవడం… మీరు ఆ భయాన్ని పూర్తిగా వదిలేయండి అది మీలో ఎన్నో మార్పులు తీసుకు రాగలదు. మీ సామర్ధ్యాన్ని మీరే తక్కువ చేసుకోకండి. నేను ఏదైనా చనువుకు మించి ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి”…అంది తస్లిమా … ఆ మాటలు విన్నాక కొంత ఆలోచనలో పడ్డాడు శ్రీధర్…కొంత ఎదో తేలిక భావం ఏర్పడింది మనసులో… అంతలో దూరం నుంచి కిరణ్ పిలుస్తున్నాడు … “ఒరేయ్ శ్రీధర్ … సుబ్రమణ్యం సార్ పిలుస్తున్నారు … అని…” వస్తున్నా అని చెయ్యి ఊపి…తిరిగి తస్లీమా తో మాటలలో పడిపోయాడు… ఏ క్షణమైనా సార్ పిలుస్తున్నాడు అంటే చటుక్కున భయం తో పరిగెత్తే శ్రీధర్… మొదటిసారి వస్తున్నా అంటూనే తస్లీమాతో కబుర్లలో పడిపోయాడు …తస్లీమా చెప్పిన “మనసుకు నచ్చిన పని చెయ్యి” అనే సిద్ధాంతాన్ని పాటించడం అక్కడినుంచే మొదలుపెట్టాడు … క్రమక్రమంగా శ్రీధర్ తన బిడియాన్ని , భయాన్ని మర్చిపోతూ … తస్లిమా తో నవ్వుతూ జోక్స్ వేస్తూ…కొంత సమయం ఆమెతోనే గడిపాడు.. తర్వాత ఇద్దరు కలిసి …నడుచుకుంటూ తమతమ స్టాల్ దగ్గరికి వెళ్లారు.. వాళ్ల రాక కోసమే ఎదురు చూస్తున్నారు కిరణ్ , సుబ్బలక్ష్మి, సుబ్రమణ్యం, నిర్మల… వీళ్ళు వెళ్లిన 10 నిమిషాలకు , చివరి ఘట్టం మొదలైంది… స్కూల్ ఆవరణలో కొంత సందడి…ఇద్దరు గన్ మేన్స్ తో MLA, కలెక్టర్ వీళ్ళు ఉన్న తరగతి గది లోకి ప్రవేశించారు…వాళ్లతో పాటు ఇద్దరు గవర్నమెంట్ ఇంజనీర్స్ మరికొంతమంది పత్రికా విలేకరులు కెమెరా పట్టుకుని వచ్చారు… ముందుగా వాళ్ళు…తస్లీమా, సుబ్బలక్ష్మి ఉన్న స్టాల్ ముందు ఆగారు… ఎప్పటిలాగానే…తస్లిమా, సుబ్బలక్ష్మి తమ ప్రెసెంటేషన్ తో అబ్బురపరిచారు…అక్కడ ఉన్న ఇంజనీర్స్…కొన్నిప్రశ్నలు అడగగా..కొన్నిటికి మాత్రం కొంతసమాధానం చెప్పి…మిగిలినవాటికి…తెలియదన్నట్లు తమ పద్దతిలో గౌరవంగా చెప్పారు… వాళ్ళు కొంత మెచ్చుకోలుగా … “గుడ్ జాబ్..” అని చెప్పి… పక్కన ఉన్న శ్రీధర్, కిరణ్ స్టాల్ వద్దకు కదిలారు… ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ధోరణిలో…ఫ్లాష్ కొడుతూ ఫొటోస్ తీసుకుంటున్నారు…ప్రతి ఫ్రేమ్ లో…MLA కనిపించేలా… కిరణ్, సుబ్రమణ్యం మనస్సులో ఆందోళన మొదలైంది… శ్రీధర్ ప్రశాంతంగా చెప్పడం మొదలుపెట్టాడు… “నమస్కారం సార్…నా పేరు శ్రీధర్, నాతో పాటు ఈ ప్రాజెక్ట్ కి పనిచేసిన వారు, నా క్లాసుమేట్ కిరణ్ మరియు మా సైన్స్ మాస్టర్ సుబ్రమణ్యం…ఈ ప్రాజెక్ట్ పేరు ఆటోమేటిక్ ఫ్లడ్ వాటర్ డిస్పోజల్… గత సంవత్సరం… మన పక్క జిల్లా ప్రకాశం లో, భారీ వర్షాల వలన వరద నీరు ఎక్కువగా చేరి రాళ్ళపాడు రిసర్వాయర్ గేట్లు కూలిపోయి ఎంతో ప్రాణనష్టం ఆస్తి నష్టం జరిగిని సంగతి అందరికి తెలిసిందే … గేట్లు తెరవటానికి ఒక ఆటోమేటిక్ వ్యవస్థ లేకపోవడం, గాలి వాన తుఫాన్ వంటి సమయాల్లో గేట్లు తెరవడానికి మనుషులు సకాలంలో అక్కడికి చేరుకోలేకపోవడం లాంటి వలెనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి … అందుకే మనకి ఇలాంటి ఒక ఆటోమేటిక్ వ్యవస్థ ఒకటి ఉండాలి. దాని కోసం మేము ఒక చిన్న నమూనా తయారు చేసాము… ఈ టబ్ ఒక వాటర్ రిసర్వాయర్ అనుకుందాం …దీనికి ఒక వైపుగా అమర్చినవి గేట్లు…దానికి కొంచెం పక్కన వున్నది కంట్రోల్ రూమ్ . ఈ కంట్రోల్ రూమ్ లోంచి వేలాడుతూ ఒక గాలితో నిండిన సిలిండర్ ఈ రిసర్వాయర్ నీళ్ల పైన తేలుతూ ఉంటుంది. ఈ సిలిండర్ ఎంత ఎత్తు లో తేలుతుందో దాన్ని బట్టి గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకునేలా ఈ నమూనా తయారుచేశాము.. ఇది ఎలా వర్క్ అవుతుందో ప్రాక్టికల్ గా చూపిస్తాను …” అంటూ కిరణ్ వైపు చూసాడు శ్రీధర్ .. కిరణ్ ఒక మగ్గు తో నీళ్లు తీసుకుని .. ఆ టబ్ లో పోస్తూ .. వరదనీరు రిసర్వాయర్ లో పెరిగే విధానాన్ని అనుకరించాడు… ఆ నీరు ఒక పరిమితి ని దాటి పెరగగానే … ఒక సైడ్ ఉన్న గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకుని … కొంత నీటిని వదిలేశాక తిరిగి మూతపడ్డాయి … దానికి కొనసాగింపుగా శ్రీధర్ … “ఇలాంటి ఆటోమేటిక్ వ్యవస్థలతో సకాలంలో స్పందించి ప్రాణ నష్టం , ఆస్తి నష్టం తగ్గించవచ్చు” అని తాను చెప్పాలనుకున్నది చెప్పి ముగించాడు … ఒక్క క్షణమ్ నిశ్శబ్దం తర్వాత … వాళ్లలో ఒక ఇంజనీర్ ముందుకు వచ్చి … “మీరు తయారు చేసిన ఈ నమూనా బాగుంది .. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి…ఇది అన్ని వేళలా పనిచేయదు..మీరు చెప్పినంత సులభం కూడా కాదు… కానీ మన సమాజంలో మన చుట్టూ జరిగే కొన్ని విపత్తుల నుంచి దేవుడు రక్షిస్తాడు, దేవుడిపైనే భారం లాంటి ఆలోచనలు కాకుండ మానవులుగా సైన్స్ ని ఉపయోగించి ఎలా ఎదుర్కోగలం అనే ఆలోచన నీకు ఈ చిన్న వయస్సులో రావడం … చాలా అభినందించాల్సిన విషయం…” అంటూ చప్పట్లు చరిచాడు… అతనితో పాటు మిగిలిన వాళ్ళందరూ కరతాళధ్వనులు చేశారు …వారితో పాటు తస్లీమా ,సుబ్బలక్ష్మి ,నిర్మల కూడా చేయి కలిపారు మనస్ఫూర్తిగా … శ్రీధర్ ని ప్రత్యేకంగా అభినందించింది తస్లీమా … సాయంత్రం 6:00 PM.. స్కూల్ గ్రౌండ్ లో సభ జరుగుతుంది … కలెక్టర్ గారు, ఇంజనీర్స్ …విద్యార్థులనుద్దేశించి కొన్ని మంచి మాటలు చెప్తూ ప్రసంగించారు … ఆ తర్వాత … MLA గారు సభా సందర్భం మరిచి రాజకీయ ప్రసంగాలు చేసి తిరిగి ఆశీనులయ్యారు … ఇక బహుమతి ప్రధానం అని వ్యాఖ్యాతగా వ్యవహరించే ఒకతను … ఒక్కొక్క విభాగం లో గెలిచిన వారి పేర్లు చదువుతున్నారు … గెలిచిన వారు స్టేజి మీదకి వెళ్లి… షీల్డ్ సర్టిఫికెట్ MLA చేతుల మీదుగా అందుకుని…ఫొటోలకి ఫోజులు ఇచ్చి వస్తున్నారు … చివరిగా “Agriculture & Water resources” విభాగంలో … సుబ్బలక్ష్మి , తస్లీమా పేర్లు వినిపించాయి…వాళ్లిద్దరూ స్టేజి పైకి వెళ్లి సర్టిఫికెట్ అందుకుని వచ్చారు… “ఎరా!! మనకి రాలేదని బాధ గా ఉందా” అన్నాడు సుబ్రమణ్యం శ్రీధర్, కిరణ్ లని ఉద్దేశించి … “అల్లరి చిల్లరగా ఉన్న నాకు…చదువుకుంటే ఒక గౌరవం వస్తుందని అర్థమైంది … అది చాలు నాకు” అన్నాడు..కిరణ్ “నేను నన్ను గెలుచుకున్నాను … నా భయాన్ని బిడియాన్ని గెలిచాను ..అదే నాకు పెద్ద బహుమతి”… అన్నాడు శ్రీధర్ కళ్ళలో ఒక సంతృప్తితో … తన స్టూడెంట్స్ లో వచ్చిన మార్పుకి సంతోషపడ్డాడు సుబ్రమణ్యం… స్టేజ్ పైన … అన్ని విభాగాల్లో బహుమతి ప్రదానం అయిపోయింది … చివరిగా .. చిన్న అనౌన్స్మెంట్ అంటూ … స్టేజ్ పైకి వచ్చాడు వ్యాఖ్యాతగా వ్యవహరించే వ్యక్తి … “శ్రీధర్, కిరణ్… వీరు చేసిన ప్రాజెక్ట్ పొరపాటున Agriculture & Water resources విభాగం లో ఉంచడం జరిగింది … కానీ వాళ్ళు వుండవలిసినది Distater management విభాగంలో…దురదృష్టవశాత్తు అలాంటి విభాగాన్ని ఈవెంట్ మేనేజర్స్ చేర్చలేదు కనుక.. శ్రీధర్, కిరణ్ లని కూడా స్పెషల్ కేటగిరీ కింద విజేతలుగా ప్రకటిస్తున్నాం… ఈ రోజు గెలిచిన వారందరు వచ్చే నెల హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు పాల్గొనవలసి ఉంటుంది …మిగిలిన వివరాలు మీ స్కూల్స్ కి అందుతాయి” అని ముగించాడు … శ్రీధర్, కిరణ్ ,సుబ్రమణ్యం లకి… గెలిచాం అనే ఆనందం కన్నా … వచ్చే నెలలో మల్లి తస్లీమా, సుబ్బలక్ష్మి , నిర్మల ని మల్లి కలుస్తారు అనే ఆలోచనే ఇంకా ఆనందాన్ని ఇచ్చింది … ఒక్కకోరు గా బస్సులు ఎక్కి వాళ్ళ ప్రాంతాలకి బయలుదేరుతున్నారు … తస్లీమా, సుబ్బలక్ష్మి , నిర్మల బస్సు ఎక్కి … కిటికీ లోంచి చెయ్యి ఊపుతున్నారు … వాళ్ళకి వీడ్కోలు చెప్తూ … శ్రీధర్, కిరణ్ ,సుబ్రమణ్యం చెయ్యి ఊపారు … సమాప్తం 1 8 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.