Jump to content

ee week eenadu sunday magazine story tho manchi thriller movie teeyachu


Recommended Posts

Posted

@dasari4kntr

 

‘‘మళ్లీ పెళ్లిచూపులా... ఈ నెల్లో ఇది మూడోది నాన్నా... ఇన్ని సంబంధాలు ఎవరికీ చూడలేదని కన్సల్టెన్సీ వాళ్లు కూడా ఇన్సల్ట్‌ చేస్తున్నారు’’ మళ్లీ పెళ్లిచూపులనగానే అదిరిపడుతూ చెప్పాడు ఆదిత్య. కూల్‌గా పేపర్‌ చదువుతూ కూర్చున్న నాన్న వైపు చూస్తూ అరిచాడు..‘‘నాకు ఆఫీసులో లీవ్‌ ఇవ్వరూ...’’ అని. ‘‘అందుకే సండే ఏర్పాటు చేశాను’’ తల న్యూస్‌ పేపర్‌లోంచి బయటకు తియ్యకుండా చెప్పాడు తండ్రి.

‘‘సండే క్లయింట్‌తో అపాయింట్‌మెంట్‌ ఉంది...’’ఇంకా గట్టిగా అరిచాడు.

‘‘బ్రేక్‌ఫాస్ట్‌ చేసి బయలుదేరితే లంచ్‌ టైమ్‌కి వచ్చేయొచ్చు’’ అంటూ విసుగ్గా పేపర్‌ పెట్టేసి లోపలికి వెళ్లిపోయాడు తండ్రి.

ఆయన శివగామికి మేల్‌ వెర్షన్‌. ఆయన మాటే శాసనం... ‘‘అబ్బా, ఈ పెళ్లిచూపులూ పెళ్లిళ్లూ అంత ఈజీకాదమ్మా’’ వంటింట్లో ఉన్న అమ్మవైపు చూస్తూ అరిచాడు. అక్కడి నుంచి కూడా సపోర్ట్‌ రాకపోయేసరికి ‘ఈ సండే మండిపోక తప్పదన్నమాట’ అనుకుంటూ నిట్టూర్చాడు.

ఆలోచిస్తూ ఉండగానే అన్‌ అవాయిడబుల్‌ సండే వచ్చేసింది. పెళ్లిచూపులు జరుగుతూ ఉన్నాయి.

పట్టుచీరలో మెరిసిపోతూ కనిపించింది అపర్ణ. బంగారు ఛాయ అవ్వటంతో నగలతో పని లేకుండా పోయింది. తెలుగింటి సంప్రదాయానికి చీర కట్టి తీసుకొచ్చినట్లు ఉంది. సిగ్గుతో కందిన చెంపలు లిప్‌స్టిక్‌ వేసిన పెదవులతో పోటీ పడుతూ ఉన్నాయ్‌.

అపర్ణ ఎమ్మెస్సీ చేసి టీచర్‌గా పని చేస్తోంది. ‘పర్లేదు, తలెత్తి అబ్బాయిని చూడమ్మా’ అనడంతో భారంగా కనురెప్పలు ఎత్తింది. బ్లూషర్ట్‌లో కనిపించాడు ఆదిత్య. అది ఆమె ఫేవరెట్‌ కలర్‌.

లోపలి నుంచి గట్టిగా ఏదో అలికిడి వినిపిస్తూ ఉండటంతో అందరి దృష్టీ అటువైపు మళ్లింది. ‘‘మా రెండో అమ్మాయ్‌... అమృత’’ అడగకపోయినా చెప్పింది అపర్ణ తల్లి లీలావతి.

అపర్ణ ఫోన్‌ రింగయ్యింది. ‘‘నా చార్జర్‌ కనిపించటం లేదు. నువ్వు తీశావా’’ ఫోన్లో అయినా చుట్టూ అందరికీ వినిపిస్తున్నాయి ఆ అరుపులు...

‘‘నా చార్జర్‌ పని చెయ్యకపోతే నీ చార్జర్‌ తీశానే అమ్మూ. నా రూమ్‌లో ఉంది తర్వాత ఇస్తా. అరవకూ...’’ సౌమ్యంగా నచ్చచెప్పింది అపర్ణ.

‘‘నా వస్తువులు తియ్యొద్దు అంటే ఎందుకు తీస్తావ్‌. నాకు నచ్చదు. నాది అంటే అది నాదే’’ అని అరుస్తూ ఉండగా అపర్ణ చేతిలో నుంచి ఫోన్‌ లాక్కుని ‘‘ఈ పిల్ల అసలూ...’’ అని విసుక్కుంటూ అమృత గదిలోకి వెళ్లింది లీలావతి.

‘‘నాకు స్వీట్స్‌ అంటే ఇష్టమని తెలుసుకదా... ఒక్కటి కూడా నాకు ఉంచకుండా వాళ్లకే పెట్టేశావ్‌. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా కాఫీ నా మొహాన కొట్టావు. నాకు ఇష్టమైంది వదులుకోను, ఇష్టంలేనిది ముట్టుకోను’’ అమృత గొంతు గట్టిగా వినిపించేసరికి చేతిలో ఉన్న లడ్డూని ప్లేట్‌లో పెట్టేశాడు ఆదిత్య.

ఆదిత్య కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు కనిపించటంతో... పర్సనల్‌గా మాట్లాడుకోమని పక్కగదిలోకి పంపించారు అపర్ణ తండ్రి శ్రీధర్‌.

అలా బాల్కనీ దగ్గరకి వెళ్లారు ఇద్దరూ. కనీసం తలెత్తి కూడా చూడకుండా మొహమాట పడుతున్నాడు ఆదిత్య. ‘ఈ రోజుల్లో ఇంత మొహమాటపడే అబ్బాయా’ అనుకుంది అపర్ణ.

‘‘ఇవాళ మీకు మౌనవ్రతమా...’’ అడుగుతూ సైలెన్స్‌ని బ్రేక్‌ చేసింది. చిన్నగా నవ్వాడు ఆ మాటకి. ‘‘అబ్బే లేదండీ’’ అంటూ మీరెవరినైనా లవ్‌ చేశారా... చెప్పండి అలా అయితే నేను డ్రాప్‌ అయిపోతా’’ అన్నాడు ఇంతకు ముందు పెళ్లిచూపుల అనుభవాలు చెబుతూ.

తన రూమ్‌ కిటికీలో నుంచి అపర్ణనీ ఆదిత్యనీ చూస్తూ పెన్సిల్‌తో ఆదిత్య పోర్ట్రెయిట్‌ గీస్తూ ఉంది అమృత. మనసుకి నచ్చితే ఏ రూపాన్నైనా ఇట్టే గీసేయగలదు. ‘హీ ఈజ్‌ మైన్‌’ అనే క్యాప్షన్‌తో బొమ్మ ముగించింది.

‘‘అలాంటి లవ్‌స్టోరీస్‌ ఏం లేవు నాకు. ఉంటే చెప్పేసే ఫ్రీడమ్‌ ఉంది’’ నవ్వుతూ చెప్పింది అపర్ణ.

‘‘అలా అయితే నాకు ఓకే’’ అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. అసలు విషయం చెబుదామనుకునేలోపు వెళ్లిపోయాడు.

అపర్ణ తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలే. కొడుకు ఉండి ఉంటే జాబ్‌ చేసి వాళ్లని చూసుకునేవాడు. ఆ లోటు తెలియకుండా పెళ్లి తర్వాత కూడా జాబ్‌ చేస్తూ శాలరీని వాళ్లకి ఇచ్చేయాలన్నది ఆమె కోరిక. ఆ కోరిక నచ్చకే ముందు వచ్చిన రెండు సంబంధాలు వెళ్లిపోయాయి.

ఇతనైనా ఒప్పుకుంటాడో లేదో అనుకుంటూ లోపలికి వస్తుండగానే పెళ్లి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆదిత్య ఏం ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చాడో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్‌ పెట్టుకోవడానికి రెండు వైపుల వాళ్లూ ఒప్పేసుకున్నారు.

వారం తిరగే లోపు ఎంగేజ్మెంట్‌ కూడా అయిపోయింది. కనీసం ఆ రోజైనా మనసులో మాట చెబుదామనుకుంటే ఛాన్స్‌ ఇవ్వలేదు ఆదిత్య.

ఫోన్‌ చేసి ఎక్కడైనా కలుద్దామంటే ఏమనుకుంటాడో అన్న ఆలోచనల్లో ఉండగా ఫోన్‌ వచ్చింది.

హలో... హలో... అని అరుస్తున్నా అటు నుంచి మాట రాకపోవటంతో ‘‘ఫోన్‌ చేసి మాట్లాడరేంటి... మీరు ఖాళీగా ఉన్నారేమో నేను కాదు’’ అని విసుక్కుంటూ ఉండగా వినిపించింది. ‘‘హలో... అదీ... నేనూ...’’ అని మొహమాటంగా ఒక గొంతు.

‘‘ఓహ్‌ ఆదిత్యగారూ మీరా...’’ గుర్తు పట్టేసింది. ‘‘ప్రపంచంలో ఇంతగా మొహమాటపడేవాళ్లు ఎవరుంటారు మీరు తప్ప’’ అంది నవ్వుతూ. అపర్ణ మనసు చదివినట్టే ‘‘ఎక్కడైనా కలుద్దామా కాస్త మాట్లాడాలి’’ అన్నాడు ఆదిత్య.

ఆ మాట కోసమే వెయిట్‌ చేస్తున్నట్టు ‘‘ష్యూర్‌... ఎప్పుడు, ఎక్కడ’’ అడిగింది ఎగ్జయిటింగ్‌గా.

ఏదో చెప్పడానికి మొహమాట పడుతూనే చెప్పాడు... ‘‘మా నాన్నకు తెలిస్తే ఒప్పుకోరు... సో, మీ నాన్నకి కూడా చెప్పకుండా రండి.’’

‘మొహమాటమే అనుకున్నా, భయం కూడా ఉందా’ అనుకుంటూ ‘సరే’ అని మాటిచ్చింది అపర్ణ.

తమ స్కూల్‌ వెనకున్న ఒక కాఫీషాప్‌లో కలుసుకున్నారు. చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసి ఆదిత్య రెస్పాన్స్‌ కోసం వెయిట్‌ చేస్తూ ఉంది.

‘మీ అమ్మానాన్నల్ని చూసుకోవాలి అనుకోవటం మంచి విషయమే. మీమీద రెస్పెక్ట్‌ పెరిగింద’ని ఆదిత్య అనటంతో రెక్కలొచ్చినట్టు అనిపించింది అపర్ణకి. కాఫీ ఆర్డరిచ్చి బిల్‌ పే చేసేలోపు మీరు అనే గౌరవం నుంచి నువ్వు అనే చనువుకి వచ్చేశారు. వెళ్లబోతూ వెనక్కి తిరిగి ‘‘లవ్‌యూ ఆదిత్యా’’ అనేసి రివ్వున పరిగెత్తింది.

పెళ్లి పనులు ఆఘమేఘాల మీద జరుగుతూ ఉన్నాయి. చివరిసారిగా ఎంజాయ్‌ చేయటానికి బ్యాచిలర్‌ పార్టీ కూడా అరేంజ్‌ చేశాడు ఆదిత్య.

‘‘రేయ్‌ నాకొద్దురా... అప్పూకి డ్రింకింగ్‌ ఇష్టం లేదు’’ చెప్పాడు చేతికిస్తున్న గ్లాస్‌ తోసేస్తూ.

‘విస్కీ అలవాటైన తర్వాత బీర్‌ని పక్కన పెట్టేసినట్టు... అమ్మాయి రాగానే ఫ్రెండ్స్‌ని పక్కన పెట్టేస్తార్రా’ అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్‌.

311021KADHA1b.jpg

అప్పుడే ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు... త్వరగా రా’’ అనటంతో పార్టీ సగంలో వదిలి కంగారుగా బయలుదేరాడు.

అపర్ణ వాళ్ల ఇంట్లోకి అడుగుపెడుతూ ఉండగానే బంధు జనమంతా ఏవో గుసగుసలు... ఏడుస్తూ అపర్ణ అమ్మానాన్నలు... ఫ్యాన్‌గాలికి రెపరెపలాడుతూ టేబుల్‌మీద ఒక లెటర్‌... ‘మీరు కుదిర్చిన పెళ్లి నాకిష్టం లేదు... కాబట్టి మిమ్మల్ని కష్టపెట్టక తప్పట్లేదు...’
వాళ్లని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు.

‘‘దించిన తల ఎత్తేది కాదు... ఇది అసలు నమ్మలేకపోతున్నాం’’ గుసగుసలు వినిపించాయ్‌ వెనక నుంచి.

‘‘రెండ్రోజుల ముందు ఫ్రెండ్‌ని కలవాలని వెళ్లింది... అంతే, తిరిగి రాలేదు. పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాం. ఇప్పుడీ లెటర్‌ పోస్ట్‌లో వచ్చింది. నాలుగు రోజుల్లో పెళ్లి... ఇంతలో ఇలా... అందరికీ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో... ఇంటి పరువు...’’ తల పట్టుకున్నాడు అపర్ణ తండ్రి శ్రీధర్‌.

లెటర్‌ చూసిన ఆదిత్య తండ్రి ‘‘ఈ లెటర్‌ చేత్తో రాసింది కాదు బావగారూ, టైప్‌ చేసింది. నాకేదో అనుమానంగా ఉంది. పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దాం. దీని వెనక ఏదో ఉందనిపిస్తోంది’’ చెప్పాడు.

పెన్సిల్‌తో గీసిన ఆదిత్య పోర్ట్రెయిట్‌ని చేత్తో పట్టుకుని కూర్చున్న అమృత రూమ్‌నుంచి బయటకొచ్చి ‘‘నాన్నా, పోలీస్‌ కంప్లైంట్‌ లాంటివి ఏం వద్దు. మనింటి పరువు ఎక్కడికీ పోదు. నేనున్నాను, అక్క చేసిన తప్పుని నేను దిద్దుతాను. ఆదిత్యకి ఇష్టమైతే నేను పెళ్లికి రెడీ’’ అంది.

ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దం. కూతురు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేకపోయారు. అపర్ణ కంటే అందమైనదీ, అపర్ణ కంటే బాగా చదువుకున్నదీ కావటంతో ఆదిత్య అమ్మానాన్నలు కూడా కాదనలేకపోయారు.

నవ్వులు వాడిపోయిన ఇంట్లో మళ్లీ నవ్వులు చిగురించాయి. పెళ్లి పనులు మళ్లీ మొదలయ్యాయి. కానీ ఆదిత్య మొహంలో మాత్రం ఏదో అసంతృప్తి.

అది గమనించి అమృతే ఆదిత్యకి ఫోన్‌ చేసి కలుద్దామని చెప్పింది. అపర్ణ- ఆదిత్యలు కలుసుకున్న అదే కాఫీషాప్‌లో కూర్చున్నారు.

ఆదిత్య చెయ్యి పట్టుకుని చెప్పింది. ‘‘భార్యగా మా అక్కని ఊహించుకున్న మీ మనసు నన్ను అంగీకరించడానికి టైం పడుతుందని నాకు తెలుసు. కానీ ఇది మన నిర్ణయం కాదు, దేవుడి నిర్ణయం... మీకు ఇష్టమైతేనే మన పెళ్లి.

వెళ్లిపోబోతున్న అమృతని ఆపి... ‘‘నేనొక చోటుకి తీసుకువెళ్తాను వస్తావా’’ అని అడిగాడు ఆదిత్య.

బైక్‌మీద ఎక్కించుకుని సిటీకి దూరంగా ఉన్న ఒక ప్లేస్‌కి తీసుకెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ స్థలం చూస్తే బెదురు మొదలైంది అమృత మనసులో.

దట్టమైన చెట్లతో అడవిలా ఉంది. చిన్న చిన్న మొక్కల్ని దాటుకుంటూ ఆదిత్య అడుగుల్లో అడుగులు వేసింది. బట్టలకి అంటుకున్న ముళ్లని విదిలించుకుంటూ... ‘‘ఆదిత్యా, ఇక్కడికెందుకు వచ్చాం...’’ అంది స్పీడ్‌గా వెళ్లిపోతున్న ఆదిత్యతో.

ఒక పాడు పడిపోయిన బావి దగ్గరికొచ్చి ఆగాడు. ‘‘ఇక్కడికి ఎందుకొచ్చాం...’’ అడిగింది అలసిపోయి రొప్పుతూ.

‘‘మీ అక్కని నేను చివరిగా చూసింది ఇక్కడే. తను ఎవరితోనూ వెళ్లిపోలేదు. ఈ బావిలోనే ఉంది’’ చెప్పాడు బావివైపు చూపిస్తూ.

‘ఏం మాట్లాడుతున్నావు’’ అన్నట్టు చూస్తూ ‘‘ఈ బావిలోనా, అది నీకెలా తెలుసు...’’ అంటూ బావి దగ్గరికి నడిచి బావిలోకి చూసింది.

ఉన్నట్టుండి కాళ్లు గాల్లోకి తేలాయి. జుట్టు పట్టుకుని ఎవరో పైకి లేపి బావిలోకి విసిరేస్తున్నట్టు అనిపించింది. గాల్లో కాళ్లు కొట్టుకున్నాయి.

చేతులు విడిపించుకుంటూ ‘‘నాకూ అదే అనిపించింది ఆదిత్యా... అందుకే ఇంత డ్రామా చేయాల్సివచ్చింది. చుట్టూ చూడు...’’ అంది అమృత.

ఆ ఒక్క మాటతో చెమటలు పట్టేశాయి ఆదిత్యకి. ఉలికిపాటుతో చుట్టూ చూసిన ఆదిత్యకి పోలీసులు కనిపించారు.

ఆదిత్య మీద అనుమానం ఉందని ముందే పోలీసులకి ఇన్‌ఫార్మ్‌ చేసింది అమృత. ఒక చోటుకి తీసుకెళ్తా అన్నప్పుడు అనుమానం బలపడింది. బైక్‌ వెనక కూర్చున్న అమృత పోలీసులకి మెసేజ్‌ చేసింది. అమృత ఫోన్‌ సిగ్నల్స్‌ని ట్రేస్‌ చేస్తూ అక్కడికి చేరుకున్నారు.

అపర్ణని తానే బావిలోకి తోసేశానని స్వయంగా చెప్పటంతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికేశాడు. చేతికి సంకెళ్లు పడ్డాయి.

‘‘అసలు నామీద అనుమానం ఎలా వచ్చింది’’ అడిగాడు.

ఎక్కడైనా కలుద్దామా అంటూ ఆదిత్య అపర్ణకి ఫోన్‌ చేసినప్పుడు అమృత పక్కనే ఉంది. ‘‘దానికెందుకే అప్పూ అంత ఆలోచన. పర్సనల్‌గా కలిసి అనుకున్నది చెప్పేసేయ్‌. అతని సైకాలజీ చూస్తుంటే చాలా సీక్రెట్స్‌ ఉన్నట్టు ఉంది. మొత్తం బయటకి లాగేయ్‌... ఆల్‌ ద బెస్ట్‌’’ అంటూ తను గీసిన పోర్ట్రెయిట్‌ని ఇచ్చింది. ‘‘పెళ్లయ్యేవరకూ ఇందులోనే బావగారిని చూసుకో... ఆ క్యాప్షన్‌ చూశావా నీ మనసు లోని మాట...’’ అనగానే ‘హీ ఈజ్‌ మైన్‌’ అనే అక్షరాల మీద వాలాయి అపర్ణ చూపులు.

‘‘అమ్మ చెప్పింది కరెక్టేనే అమ్మూ. నువ్వు అక్కలా నేను చెల్లెల్లా పుట్టాల్సింది. ప్రాబ్లమ్‌ ఏదైనా సరే సొల్యూషన్‌ని జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటావు’’ చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకుంది అపర్ణ.

వంటింట్లో నుంచి తల్లి అరుపులు వినిపించాయి. ‘‘ఇంత వయసొచ్చినా ఒక్క పనిలో కూడా సహాయం చెయ్యటం రాదు’’ అంటూ విసుక్కుంటోంది.

కోపాన్ని అణచుకుంటూ ‘‘అమ్మా నేనొచ్చానంటేనా’’ అంటున్న అమృతతో... ‘‘అమ్మూ... ఏంటే అమ్మతో గొడవ’’ కోప్పడింది అపర్ణ.

311021KADHA1c.jpg

‘‘మరి లేకపోతే నీకు పెళ్లి చూపులైతే నేను హాల్లోకి రాకూడదట. రూమ్‌లోనే కూర్చోవాలట. పాతకాలం నాటి పద్ధతుల్ని పెంచి పోషిస్తుంది.’’ బుంగమూతితో చెప్పింది అమృత.

‘‘ఓహో... ఆ ఫ్రస్టేషన్‌తోనేనా ఆరోజు- అదే, పెళ్లిచూపులప్పుడు- సైకోలా బిహేవ్‌ చేశావు’’ అన్న అపర్ణతో ‘‘ఎంతైనా అల్లరిపిల్లని కదా... ఆమాత్రం ఉండద్దూ’’ అంది అమృత అల్లరిగా నవ్వుతూ.

అపర్ణ గుర్తుకు రాగానే కన్నీళ్లు ధారలు కట్టాయి. ‘‘అమ్మాయిలం, తాళి మెడన పడగానే మిమ్మల్ని నమ్మి అన్నీ వదిలి వచ్చేస్తాం. కానీ అప్పూ తాళి మెడలో పడకముందే నిన్ను నమ్మింది. ‘హి ఈజ్‌ మైన్‌’ అనుకుంది. దాన్నెలా చంపాలని పించింది...’’ చొక్కా పట్టుకుని నిలదీసింది.

ఆదిత్యని ఇంటరాగేషన్‌ చేస్తున్నారు. ఆ ఇంటరాగేషన్‌లో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. ఆ సమాచారంతో బావిని పూర్తిగా వెతికించారు. అపర్ణ డెడ్‌బాడీతో పాటు మరో ఐదుగురి డెడ్‌బాడీస్‌ కూడా దొరికాయి. గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి.

‘‘ఇన్ని మర్డర్స్‌ ఎందుకు చేశావ్‌?’’ ఆదిత్య చెప్పబోయే సమాధానాన్ని రికార్డ్‌ చేయటానికి సిద్ధపడుతూ అడిగాడు ఎస్‌.ఐ.

‘‘నేను నపుంసకుణ్ణి. దాంపత్య జీవితానికి పనికిరాను. నేను చేసిన మొదటి హత్య నా క్లాస్‌మేట్‌ లావణ్య... ఏకాంతంగా కలుద్దామని ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో రమ్మంది. అప్పుడే నా లోపం నాకు అర్థమైంది. హేళన చేసింది... బయటకి తోసేసింది...’’ ఆదిత్య మొహం రౌద్రంగా మారిపోయింది. ‘‘జుట్టు పట్టుకుని లాక్కెళ్లి ఇంటి వెనకున్న పాడుబడ్డ బావిలోకి తోసేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటి నుంచీ ఆ బావి నాకు స్నేహితుడి కంటే ఎక్కువైంది.

పెళ్లిచూపుల్లో నాకు ఓకే చెప్పిన ప్రతీ వాళ్లనీ అలాగే చేశా... మాలతి, రాగిణి, దివ్య, గ్రీష్మ... అయినా సంబంధాలు చూస్తూనే ఉన్నారు. అందుకే ఈసారి ఎంగేజ్మెంట్‌ అయ్యాక మర్డర్‌కి ప్లాన్‌ చేశా. ఆ బాధలో కనీసం ఆర్నెల్లు అయినా గ్యాప్‌ ఇస్తారనుకున్నా, కానీ అమృత సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది... నాకు ట్విస్ట్‌ ఇచ్చింది...’’ కొంచెం కూడా పశ్చాత్తాపం కనపడలేదు అతని మొహంలో.

‘‘నీ లోపం దాచుకోవటానికి అంత మందిని చంపావా..?’’

‘‘లోపాన్ని మోయటం, దాయటం అంత ఈజీ కాదు సార్‌’’ అరుస్తున్నట్లు చెప్పాడు ఆదిత్య.

‘‘నేరాన్ని దాయటం కూడా అంత ఈజీ కాదు మిస్టర్‌’’ వెళ్లబోతూ చెప్పాడు

ఆ ఎస్‌.ఐ.అనుకున్నట్టుగానే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ఒక సైకోని పట్టించినందుకు- సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న అమృతని న్యాయస్థానం ప్రశంసించింది.

  • Upvote 2
Posted
2 minutes ago, dasari4kntr said:

Baagundi bro..story..

yeah , script sariga develop chesthy manchi movie teeyachu .... small story kabbati , author ki scope lekundee anipinchindi .... eeven vipula novel ayinaaa bagundedhi emo 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...