Jump to content

HBD Pawan Kalyan


Recommended Posts

Posted

HBD Pawan Kalyan: అదే నా చివరి సినిమా కావాలని బలంగా కోరుకున్నా: పవన్‌ కల్యాణ్‌

310822-power11.jpg

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అంటే పవర్‌. ఆ పేరే ఒక హోరు. భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కళ్లు చెదిరే డ్యాన్స్‌లు చేయకపోయినా.. కేవలం ఆయన కటౌట్‌ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉర్రూతలూగుతారు. థియేటర్లలో పండగ చేసుకుంటారు. తెరపై అంత హంగామా చేసే పవన్‌ తెర వెనక సాదాసీదాగా ఉంటారు. అందుకే సగటు సినీ అభిమానితోపాటు ప్రముఖులూ ఆయన్ను ఇష్టపడతారు. పవన్‌ క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఓవర్‌నైట్‌లో జరిగిందేమీ కాదు. మరి, పవన్‌ ఎలాంటి స్థితి నుంచి ఇంతటి స్థాయికి వచ్చారో ఓ సందర్భంలో వివరించారు. ఆ ప్రయాణ వివరాలు ఆయన మాటల్లోనే... (నేడు పవన్‌ పుట్టినరోజు)  (Happy Birthday Power Star)

వాటిని చదువుతూ పెరిగా..

‘‘నాకు ఊహ తెలిసేనాటికే అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) డిగ్రీ విద్యార్థి. తను వేరే ఊళ్లో చదువుకుంటూ సెలవులకు ఇంటికి వచ్చేవాడు. అన్నయ్య ఉంటే నాకు పండగే. తను కాలేజీకి వెళ్లిపోగానే.. మళ్లీ ఎప్పుడొస్తాడా? అని ఎదురు చూస్తుండేవాణ్ని. అన్నయ్యతో మా ఊరు వీధుల్లో బైక్‌పై తిరిగిన క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగబాబు అన్నయ్య దగ్గర నాకు బాగా చనువు ఉండేది. ఏం అడగాలన్నా తననే అడిగేవాణ్ని. నాన్న విషయానికొస్తే ఆయన ముక్కుసూటి మనిషి, నిజాయతీపరుడు. దాంతో ఉద్యోగంలో ఒడిదొడుకులు వచ్చాయి. ఆయన కొన్నాళ్లు సెలవులోనే ఉండటంతో జీతం రాక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. ఈ విషయాలన్నీ నాకు అర్థం అవుతూనే ఉండేవి. కానీ, ఏం చేయలేని పరిస్థితి. అమ్మ ప్రతి విషయాన్నీ వాస్తవిక దృక్పథంతో ఆలోచించేది. దాన్ని నేనూ అలవరచుకున్నా. అప్పట్లో, వారపత్రికల్లో సీరియల్స్‌ వచ్చేవి. అమ్మ వాటిని కత్తిరించి, బైండింగ్‌ చేసి పెట్టేది. వాటిని చదువుతూ పెరిగాన్నేను’’ అని పవన్‌ గుర్తు చేసుకున్నారు.

310822-child.jpg

ఆత్మహత్యకు ప్రయత్నించా!

‘‘బాల్యంలో నాకెప్పుడూ అనారోగ్యమే. ఆస్తమా ఉండేది. దాంతో ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసేవాణ్ని కాదు. పెద్దగా స్నేహితులూ ఉండేవారు కాదు. తెలిసిన ఒకరిద్దరితో ముచ్చట్లు పెడదామన్నా నా ఆలోచనలకు, వారి అభిప్రాయాలకూ పొంతన ఉండేది కాదు. నేను ఇంటర్‌లో చేరే సమయానికి అన్నయ్య (చిరంజీవి) చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఎనిమిదో తరగతి నుంచీ పరీక్షల్లో తప్పడం నాకు అలవాటే కాబట్టి ఇంటర్‌ ఫెయిలైనా నిరుత్సాహపడలేదు. మరోసారి, సెప్టెంబరులో ప్రయత్నించా. అప్పుడు పాస్‌ కావడం అసాధ్యమని అర్థమైంది. ఇంత జరుగుతున్నా అమ్మానాన్నా నన్ను ఒక్క మాట అనేవారు కాదు. కానీ, నాలో ఏదో అపరాధభావం. ‘స్నేహితులంతా జీవితంలో ముందుకెళ్లిపోతున్నారు. మనం మాత్రం ఉన్న చోటే ఉంటున్నాం. ఎందుకిలా అవుతోంది’ అన్న నిస్పృహ వెంటాడేది. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యకు ప్రయత్నించా. కుటుంబ సభ్యులు చూడటం వల్ల బతికి బయటపడ్డా. ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలు, సురేఖ వదిన అండగా నిలిచారు. ‘నువ్వు చదివినా చదవక పోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో’ అని సలహా ఇచ్చారు’’

310822-family.jpg

అది గొప్ప మార్పు..

‘‘నాకు అనేక రంగాల మీద పట్టు సాధించాలని ఉండేది. ప్రతి వృత్తిపైనా ఆసక్తి చూపేవాణ్ని. కానీ, ఎందులోనూ పట్టు సాధించలేకపోయా. పలు విషయాలపై దృష్టిపెట్టడం వల్ల అయోమయంలో పడ్డా. దాన్నుంచి బయటపడేందుకు రోజంతా సినిమాలు చూసేవాణ్ని. ‘నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వేం చేయట్లేదు. సరే.. అన్ని వదిలేసి సినిమాల్లో ప్రయత్నించు’ అని అన్నయ్య చిరంజీవి ఓ రోజు చెప్పారు.  అలా సత్యానంద్‌ గారి దగ్గరికి శిక్షణకు వెళ్లా. నటన సంగతి తర్వాత.. ముందు నాలోని బిడియాన్ని పోగొట్టడం చాలా అవసరమని ఆయనకు అర్థమైంది. ఆ శిక్షణా కాలంలోనే నా సిగ్గు, మొహమాటాల గోడలు బద్దలు కొట్టా. నా బతుకు నేను బతకగలననే ధైర్యం వచ్చింది. అది నాలో నేను చూసిన గొప్ప మార్పు’’

310822-form.jpg

నర్సరీ పెట్టాలనుకున్నా.. 

‘‘కొన్నాళ్లకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ, సుమారు మూడు సంవత్సరాలు గడిచినా ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభంకాలేదు. ‘ఇప్పుడు నేనేం చేయాలి’ అనే బాధ మళ్లీ మొదలైంది. దాని కోసం ఎదురుచూసే ఓపిక లేక ‘బెంగళూరులో నర్సరీ పెడతా. నాకు తెలిసిన పని అదొక్కటే’ అని అమ్మకు చెప్పేశా. అదే రోజు సాయంత్రం ఆ చిత్రం పట్టాలెక్కుతుందనే తీపి కబురు వినిపించింది. ఏదో నటించేశా. అసందర్భమైన డ్యాన్సులు, కృతకమైన డ్రెస్సులు ఎబ్బెట్టుగా అనిపించేవి. అందుకే నా తొలి సినిమానే చివరి సినిమా కావాలని బలంగా కోరుకున్నా. రెండో సినిమా మొహమాటం కొద్దీ ఒప్పుకోవాల్సివచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సినీ వాతావరణం అలవాటైంది. ఏ సినిమా అయినా కష్టపడికాదు ఇష్టపడి చేయాలని నిర్ణయించుకున్నా. ఫలితాలు కాదు నాకు ప్రయాణం ముఖ్యం. గెలుపైనా ఓటమైనా అందులో భాగమే. ఎంత నాకు నేను సర్దిచెప్పుకున్నా మనసు వినేది కాదు. ‘జాని’ తర్వాత కూడా సినిమాలు మానేద్దామనుకున్నా. కానీ, సాధ్యపడలేదు. ‘ఈ ఒక్క సినిమా చేసేయ్‌’ అంటూ ఫ్యామిలీ ముందుకు నెడుతూ వచ్చింది. అలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే వచ్చా’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

310822-jonny.jpg

కల్యాణ్‌గా పరిచయమై..

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమాతో 1996లో పవన్‌ కల్యాణ్‌ నటుడిగా మారారు. అందులో ఆయన ముళ్లపూడి కల్యాణ్ అనే పాత్ర పోషించారు. ఆ తర్వాత, ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’.. ఇలా విభిన్న కథలతో ఆయన నెలకొల్పిన రికార్డులు గురించి చెప్పేదేముంది. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’తో సందడి చేసిన ఆయన ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, సుముద్రఖని దర్శకత్వంలో నటించనున్నారు.

310822-mother_1.jpg

మీకు తెలుసా..?

పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ మూడు సినిమాలొచ్చాయి. ‘జల్సా’తోనే వీరి ప్రయాణం మొదలైందని చాలామంది అనుకుంటారు. కానీ, 90ల్లోనే ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాకి పనిచేశారు. అదే ‘గోకులంలో సీత’. ఈ చిత్రానికి నటుడు పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు. అప్పట్లో త్రివిక్రమ్‌ ఈయన అసిస్టెంట్‌గా పనిచేశారు. అలా.. ఆ చిత్రం కోసం త్రివిక్రమ్‌ రాసిన ‘ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుడగకు మూలం’ అనే డైలాగ్‌ పవన్‌కు బాగా నచ్చిందట. అయితే, అప్పట్లో త్రివిక్రమ్‌ ఎవరో పవన్‌కు తెలియదు. 

310822-harhra.jpg

ఫిన్‌లాండ్‌లో చదువుకునే తన మిత్రుడు సెలవుల్లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడని తెలియడంతో పవన్‌ కూడా అలానే చేయాలనుకున్నారు. అలా ఆయన ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు. అన్ని రంగాల మీద పట్టు సాధించాలనుకునే క్రమంలో.. పారా గ్లైడింగ్ నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం పొందారు. వయొలిన్‌ సాధన చేశారు. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సులో చేరారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ గురించి కొంత తెలుసుకున్నారు. బొమ్మలు గీయాలని, విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశారు.

Loading video
Posted

HBD Pawan Kalyan: పాటగాడు పవన్‌.. ఒక్కో పాట సూపర్‌హిట్‌!

pawan600.jpg

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్‌ కల్యాణ్‌... కుర్రకారు అభిమానించే కథానాయకుడు. ఇదేదో కేవలం నటనను చూసి మాత్రమే అతణ్ని ఇష్టపడుతున్నారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పవన్‌లో నటన మాత్రమే కాకుండా చాలా కళలు దాగున్నాయి. అందులో గానం ఒకటి.  పవన్‌ ఇప్పటివరకు పాడిన పాటలన్నీ హిట్టే. ఈ రోజు పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘పాటగాడు పవన్‌’ గురించి ఓసారి చూద్దామా!

  • యువ కథానాయకుడి నుంచి స్టార్‌ హీరోగా పవన్‌ అడుగులు వేస్తున్న తొలి రోజులవి. సినిమాల ఎంపికతో మెస్మరైజ్‌ చేస్తున్న పవన్‌ ‘తమ్ముడు’లో రెండు పాటలు పాడాడు. అవి పూర్తిస్థాయి పాటలు కాకపోయినా.. ఆ సినిమా పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేస్తాయి. మల్లికార్జునరావును ఆటపట్టిస్తూ పాడే ‘తాటి చెట్టు ఎక్కలేవు...’ ఎంత హుషారుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మరో బిట్‌ సాంగ్‌ ‘ఏం పిల్లా మాట్లాడవా’  అదిరిపోతుంది.
  • పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ‘ఖుషీ’ ఒకటి. ఆ సినిమాలోనూ పవన్‌ ఓ పాట పాడాడు. ఏంటీ.. గుర్తొచ్చేసిందా? ఆఁ.. మీరనుకున్నపాటే... ‘బై బయ్యే బంగారు రమణమ్మ..’. అలీ వచ్చి.. మీ నాన్న పాట.. సీకాకుళం పాట అనగానే పవన్‌ అందుకుంటాడు. గుడుంబా మత్తులో పవన్‌ వేసే సరదా స్టెప్పులు, ఆ తర్వాత మధుమిత అలియాస్‌ భూమిక పోస్టర్‌ దగ్గర చేసే రచ్చ వేరే లెవల్‌. ఆ సీన్‌ అంతగా హైలోకి వెళ్లిందంటే ఈ పాటదీ ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు.
  • పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే... అతడి ఫిలాసఫీ, ఆలోచన విధానం గురించి ఎక్కడో ఓ చోట కచ్చితంగా చెబుతాడు అంటుంటారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రయత్నాలు చేశాడు పవన్‌. దర్శకుడిగా మారి ‘జానీ’ చేశాడు. అందులో ఒక బిట్‌ సాంగ్‌, ఒక ఫుల్‌ సాంగ్‌ ఆలపించాడు. ఎమ్మెస్‌ నారాయణ తాగుడు గురించి పవన్‌ సెటైరికల్‌గా పాడే పాట ‘నువ్వు సారా తాగకు..’ పాటకు ఆ రోజుల్లో సూపర్‌ రియాక్షన్‌ వచ్చింది. అదే సినిమాలో సమాజంలోని కొంతమంది మోసగాళ్ల మీద సెటైర్లతో పాడిన పాట ‘రావోయి మా ఇంటికి...’ పాట కూడా బాగుంటుంది.
  • బిట్‌ సాంగ్స్‌, సందేశం ఇచ్చే సాంగ్సేనా పవన్‌ పాడింది అంటే... కాదనే చెప్పాలి. ఎందుకంటే ‘గుడుంబా శంకర్‌’లో పవన్‌ ఓ ఐటమ్‌ సాంగ్‌ పాడాడు. ‘కిల్లీ కిల్లీ..’ అంటూ పవన్‌ గొంతెత్తితే ఫ్యాన్స్‌ ఊగిపోయారంతే. పవన్‌ గొంతు, స్టెప్పులు కలసి పాట ఫుల్‌ జోష్‌లో ఉంటుంది.
  • వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ వచ్చిన పవన్‌.. ‘గుడుంబా శంకర్‌’ తర్వాత చాలా సినిమాల్లో పాడలేదు. మళ్లీ ‘పంజా’తో గొంతు సవరించుకున్నాడు. ఈసారి ‘పాపా రాయుడు...’ అంటూ బ్రహ్మానందాన్ని పవన్‌ పొగుడుతూ తిట్టే పాట అది. ఫుల్‌మాస్‌ బీట్‌లో సాగే ఈ పాట చాలా రోజులు రిపీట్‌ మోడ్‌లో వినేసి సంతోషించారు అభిమానులు. 
  • పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన.. ‘అత్తారింటికి దారేది’లోనూ పవన్‌ గానం వినిపిస్తుంది. ‘కాటమ రాయుడా కదిరి నరసింహుడా...’ అంటూ పవన్‌ మళ్లీ బద్దం భాస్కర్‌ అలియాస్‌ బ్రహ్మానందం భరతం పట్టేలా ఆ పాటను రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్‌, పవన్‌ గొంతు పాటకు ఓ డిఫరెంట్‌ స్టైల్‌ని ఇచ్చాయి.
  • సహచర నటుణ్ని ఆటపట్టించే పాటలు పాడటం అంటే.. పవన్‌ కల్యాణ్‌కు కొట్టినపిండి. ఆయన పాడిన పాటలు చాలావరకు అలానే ఉంటాయి. ఇదే కోవలో ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్‌ ఓ పాట పాడాడు. రఘుబాబును ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ పవన్‌ గొంతెత్తితే.. యూట్యూబ్‌లో వ్యూస్‌ రికార్డులు మారిపోయాయి. ఇక థియేటర్లలో ఫ్యాన్స్‌ జోష్‌ అయితే అదిరిపోయింది. 

పవన్‌ నటనతోనే కాదు, గొంతుతోనూ మాయ చేయగలడు అని ఈ పాటలు చెప్పకనే చెబుతాయి. అందుకే పవన్‌ నటుడిగానే కాకుండా.. ‘పాటగాడి’గానూ ఫ్యాన్స్‌కు బాగా ఇష్టం.

Loading video
Loading video
Loading video
Posted

Pawan Kalyan: పుస్తక పఠనం.. మారిన జీవితం.. పవన్‌ కల్యాణ్‌ ఏమంటారంటే?

310822-pkbook-IN.jpg

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటులను ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో చూస్తుంటారు. ‘రంగుల ప్రపంచంలో బతికేవారు కదా ఖాళీ సమయంలో ఏ పబ్‌కో, పార్టీకో వెళ్తుంటారు’, ‘బాగా డబ్బుంటుంది కదా విదేశాలు చుట్టొస్తుంటారు’ అని అనుకుంటుంటారు. కానీ, వంటింట్లో అమ్మకు సాయపడేవారు.. సేవా కార్యక్రమాలు చేసేవారు.. పుస్తకాలు చదివే స్టార్‌లూ ఉన్నారు. టాలీవుడ్‌ హీరోల్లో పుస్తకాలు చదివే విషయంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందుంటారు. సెప్టెంబరు 2న పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ప్రభావితం చేసిన, ఆయన చదవమని సూచించిన కొన్ని పుస్తకాలేంటో ఓ సారి చూద్దాం.. (HBD Pawan Kalyan)

అవేంటో తెలుసుకునే ముందు, పుస్తకాల గురించి పవన్‌ ఏమన్నారో తెలుసుకుందాం. ‘‘పుస్తకాలు నా స్నేహితులు. జీవితం గురించి అవి విపులీకరించి చెప్పాయి. నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ‘అతడు అడవిని జయించాడు’ ఒకటి.  జీవనాధారం కోల్పోయినప్పుడు మనిషి పడే ఆవేదనను కళ్లకు కట్టారు రచయిత కేశవరెడ్డి. దానికి ప్రభావితమయ్యాను కాబట్టే రైతులు, చేనేత కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులు నా సాయం కోరగానే స్పందించా’’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

310822-book11.jpg

పవన్‌ చిన్నప్పుడు బడికి వెళ్తుంటే ఓ గోడ మీద ‘తాకట్టులో భారతదేశం’ అనే టైటిల్‌ కనిపించిందట. అప్పుడే దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. ఇంటర్‌లో ఉండగా వాళ్ల నాన్న దగ్గర నుంచి ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకాన్ని తీసుకొని చదివారు. ఆ పుస్తకంలో చర్చించిన అంశాలు, అందులోని సారాంశం తనపై చాలా ప్రభావం చూపిందని చెబుతుంటారు పవన్‌. ఈ సమాజాన్ని ఆ పుస్తక రచయిత తరిమెల నాగిరెడ్డి విశ్లేషించిన తీరు ఆలోచింపజేసిందని చెప్పారు. అందులో చర్చించిన అంశాలు ఈనాటికీ వర్తిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

310822-book22.jpg

జపాన్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త మసనోబు ఫుకుఓకా. పురుగుల మందులు, రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేయడం కన్నా సహజ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించొచ్చని నిరూపించారాయన. ఆయన చేసిన పరిశోధనలు, అభిప్రాయాలను ‘గడ్డి పరకతో విప్లవం’ అనే పుస్తకంలో వెల్లడించారు. ఇది కూడా పవన్‌కు ఇష్టమైన పుస్తకమే. అందుకే ఈ పుస్తకాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

310822-book33.jpg

స్వేచ్ఛ కోసం 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు నెల్సన్‌ మండేలా. ఆయన రాసిన ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌’.. పవన్‌ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ‘బద్రి’ సమయంలో మండేలా జైలు శిక్ష అనుభవించిన గదిని పవన్‌ స్వయంగా వెళ్లి చూశారు. మండేలా పోరాట పటిమ తనలో స్ఫూర్తి నింపిందంటుంటారు పవన్‌.

310822-book44.jpg

అవి ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రీకరణ జరుపుకొంటున్న రోజులు. ‘వనవాసి’ పుస్తకం చదవాలని పవన్‌కు ఆసక్తి కలిగింది. కానీ, వెతికితే ఆ పుస్తకం దొరకలేదు. ఈ విషయాన్ని తనికెళ్ల భరణికి చెప్పారు. చివరకు ఆ బుక్‌ పవన్‌ చేతుల్లోకి చేరింది. గబ్బర్‌ సింగ్‌.. సాధించిన విజయం కన్నా ‘వనవాసి’ పుస్తకం చేతుల్లోకి తీసుకున్న క్షణాల్లోనే ఎక్కువ ఆనందం పొందానని ఓ సందర్భంలో పవన్‌ చెప్పారు. 

310822-book55.jpg

అందరూ తప్పకుండా చదవాల్సిన వాటిలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పుస్తకాలు కూడా ఉన్నాయంటారు. 

310822-book66.jpg

ఒక విధంగా నేటి యువతకు గుంటూరు శేషంద్ర శర్మను పరిచయం చేసింది పవన్‌ కళ్యాణ్‌ అని చెప్పొచ్చు. ఆయన ఉపన్యాసాల్లో తరచూ వినిపించే కవిత్వం శేషేంద్రశర్మదే. ఆధునిక మహాభారతం, జనవంశం పుస్తకాలు పట్టుకుని పవన్‌ కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన కుమారుడి కోరిక మేరకు కొన్ని పుస్తకాలను మళ్లీ ముద్రించేందుకు పూనుకొని శేషేంద్రపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్‌.

Posted

Pawan Kalyan: కల్యాణ్‌ బాబు.. నీ ఆశలన్నీ నెరవేరాలి: చిరంజీవి

పవర్‌స్టార్‌కు సెలబ్రిటీల విషెస్‌

brk-Pawan_7.jpg

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రంగాల్లో ఆయన విజయం సాధించాలని కోరుకున్నారు. పవన్‌తో తాము దిగిన పలు ఫొటోలను పంచుకుంటున్నారు. తమ అభిమాన నటుడి పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులు సైతం నెట్టింట సందడి చేస్తున్నారు. #HBDJanasenani, #HBDPawankalyan అనే ట్యాగ్‌లు జత చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక, తన తమ్ముడి పుట్టినరోజుని పురస్కరించుకుని నాగబాబు ఓ స్పెషల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ సాగే ఈ పాట జనసైనికుల్ని ఆకర్షిస్తోంది.

brk-Pawan3_1.jpg

‘‘తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయతీ, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కల్యాణ్ బాబుకి  పుట్టినరోజు శుభాకాంక్షలు’’ - చిరంజీవి

brk-Pawan2_3.jpg

‘‘నా గురువు, ధైర్యం పవన్‌ కల్యాణ్‌ మామకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా’’ - సాయిధరమ్‌ తేజ్‌

‘‘మంచితనం, మానవత్వం, సత్యం, ధర్మం, విలువలు.. వీటిని మించిన హీరోయిజం లేదని ఆచరణలో పాటిస్తూ అనుసరణీయ మార్గాన్ని చూపిస్తూ సాగిపోతోన్న కర్మయోగి పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు’’ - రామజోగయ్య శాస్త్రి

‘‘మంచితనానికి మారుపేరు, మంచి మనసుకి నిర్వచనం, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం కలబోస్తే పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌. పుట్టినరోజు శుభాకాంక్షలు’’ - పరుచూరి గోపాలకృష్ణ

‘‘ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, పవన్ ఈశ్వరుడు ఒక్కడే. మా దేవరకు జన్మదిన శుభాకాంక్షలు’’ - బండ్ల గణేశ్‌

‘‘భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరైన పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ - బీవీఎస్‌ రవి

Loading video







Posted

pspk-birthday-special.webp

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 1996లో వచ్చిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ గా ఎదగడానికి ఎంతో సమయం పట్టలేదు. తనదైన స్క్రీన్ ప్రజెన్స్, బాడీ ల్యాంగ్వేజ్ తో యూత్ ని కట్టిపడేశాడు. అద్భుతమైన స్క్రిప్ట్ సెలక్షన్ తో కెరీర్ స్టార్టింగ్ లోనే డబుల్ హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. 'గోకులంలో సీత', 'సుస్వాగతం', 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' ఇలా వరుస విజయాలతో పవన్ క్రేజ్ ఆకాశాన్నంటింది. ఆయన సాంగ్స్, డైలాగ్స్, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా ఒక్కటేమిటి? అప్పట్లో యూత్ లో ఎక్కడ చూసినా పవన్ మేనియానే కనిపించేది. హీరోగా పరిచయమైన ఆరేళ్లలోనే ఎవరూ కలలో కూడా ఊహించనంత క్రేజ్ ఆయన సొంతమైంది.

 

పవన్ కి కేవలం సినిమాలు చూసే కాకుండా ఆయన మంచితనం, సేవాగుణం చూసి అభిమానులు అయినవాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే ఎన్ని పరాజయాలు వచ్చినా ఆయన క్రేజ్ తగ్గట్లేదు.. తగ్గదు కూడా. ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు' అనే పీరియాడికల్‌ యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు. ఇది ఆయన నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ సినిమాతో పవన్ నేషనల్ వైడ్ గా తన పేరు మారుమోగిపోయేలా చేస్తాడని ఆశిస్తూ 'తెలుగు వన్' తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

(సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు)

For more information visit Teluguone.com official website

Click here to get more details about Power star Pawan Kalyan's life journey details

Posted

hhvm-new-teaser.webp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఈరోజు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పవర్ గ్లాన్స్' పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్.

మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి, మల్ల యోధులను మట్టి కరిపిస్తూ పవర్ ఫుల్ గా దర్శనమిచ్చారు పవర్ స్టార్. ఇక ఆయన తొడగొట్టే షాట్ అయితే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

మొత్తానికి అభిమానులు తమ హీరో పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో విడుదలైన ఈ పవర్ గ్లాన్స్ వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంది. మరి ఈ పవర్ గ్లాన్స్ కి తగ్గట్లే సినిమా కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Hari hara veera mallu Movie

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...