southyx Posted November 24, 2022 Report Posted November 24, 2022 పెన్నాను పంచేసుకున్నారు ఎవరైనా ఇంటికి ప్రహరీ కట్టుకుంటారు.. పొలానికి కంచె వేసుకుంటారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు ఏకంగా పెన్నా నదిని వాటాలు వేసి పంచేసుకున్నారు. Published : 24 Nov 2022 05:40 IST ఇసుక కోసం వాటాలేసుకున్న వైకాపా నాయకులు నదికి వెళ్లే దారిలో అడ్డుగా గేట్ల ఏర్పాటు తాడిపత్రిలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా స్థానిక ప్రజాప్రతినిధికి కప్పం కట్టి దందా! ఈనాడు డిజిటల్- అనంతపురం, న్యూస్‌టుడే- పెద్దపప్పూరు: ఎవరైనా ఇంటికి ప్రహరీ కట్టుకుంటారు.. పొలానికి కంచె వేసుకుంటారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు ఏకంగా పెన్నా నదిని వాటాలు వేసి పంచేసుకున్నారు. అక్కడికి వెళ్లే దారులను మూసేసి గేట్లు పెట్టుకుని, తాళాలేసుకున్నారు. హద్దులు ఏర్పాటు చేసుకుని ‘పద్ధతిగా’ ఇసుక దోచుకుంటున్నారు. నాయకులకు కప్పం కట్టిన ఇసుక ట్రాక్టర్లనే నదిలోకి అనుమతిస్తున్నారు. ఒకరి పరిధిలోకి మరొకరు రావడానికి వీలులేదు. ఈ తతంగం ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందనుకుంటే పొరపాటే. తాడిపత్రి పట్టణానికి ఆనుకుని బహిరంగంగానే సాగుతున్న ఈ అక్రమ రవాణాను పోలీసులుగానీ, ఇసుక అక్రమాలను అరికట్టాల్సిన సెబ్ అధికారులుగానీ కన్నెత్తి చూడటం లేదు. తాడిపత్రి సమీపంలోని పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా వెనుక మొత్తం 10 మంది వైకాపా నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నదిలో నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను 10 భాగాలుగా విభజించి పంచుకున్నారు. నదిలోకి వెళ్లడానికి గ్రానైట్ వ్యర్థాలతో ప్రత్యేక దారులు వేసుకున్నారు. చెక్‌పోస్టు తరహాలో ఇనుప గేట్లు పెట్టి, తాళాలు వేస్తున్నారు. తమ పేర్లతోనే రీచులు ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక నాణ్యతను బట్టి ఒక్కో రీచులో ఒక్కో ధర నిర్ణయించారు. కొన్ని నెలలుగా నిత్యం వందల ట్రాక్టర్లలో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. అలా తవ్వగా ఏర్పడిన గుంతలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఒక్కో గుంత 20 అడుగుల లోతున, కనీసం 100 అడుగుల వెడల్పున ఉన్నాయంటే అక్రమ రవాణా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 6 నుంచి 11 వరకు.. కొన్ని నెలలుగా రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తారు. ఇసుక నింపడానికి బయట కూలీలనే రప్పించుకుంటున్నారు. కూలీలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు రూ.వెయ్యి చెల్లిస్తారు. 11 గంటల తర్వాత ఎవరి గేట్లకు వారు తాళాలు వేసుకుని వెళ్లిపోతారు. ఇలా రోజుకు ఒక్కో ప్రాంతంలో 50 - 100 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. తాడిపత్రి పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు అయితే ట్రాక్టరుకు రూ.2 వేల నుంచి 4 వేల వరకు ధర నిర్ణయించారు. కొందరు నంద్యాల జిల్లాలోని అవుకు, బనగానపల్లికి ట్రాక్టరు ఇసుక రూ.10 వేల చొప్పున తరలిస్తున్నారు. భూగర్భ జలాలపై ప్రభావం ఆక్రమణలతో పెన్నా నది ఇప్పటికే చిక్కిపోయింది. విచ్చలవిడిగా ఇసుకను తరలించడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి నదీ స్వరూపం కోల్పోయింది. ఇది భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి పెన్నా నదిలోని బోర్ల ద్వారానే తాగునీరు సరఫరా చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాడిపత్రి పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నదిలో 20 అడుగుల లోతున తవ్వడంతో సమాచార వ్యవస్థకు సంబంధించిన కేబుళ్లు, తాగునీటి పైపులైన్లు ధ్వంసమవుతున్నాయి. నెలకు రూ.3 లక్షల ముడుపు ఈ దందాకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో ఇసుక తవ్వుకునే 10 మంది వైకాపా నాయకులు ఒక్కొక్కరూ నెలకు రూ.3 లక్షల కప్పం కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రి గ్రామీణ పోలీసులకు అందరూ కలిపి నెలకు రూ.10 లక్షలు ముడుపులు సమర్పించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదులు వచ్చినప్పుడు కొన్ని ట్రాక్టర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిమిషాల్లోనే విడిచిపెట్టేస్తున్నారని.. ఆ డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారి అండతోనే ఇసుక దందా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కేసులు నమోదు చేస్తున్నాం - రామ్మోహన్‌రావు, సెబ్ అదనపు ఎస్పీ అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారనడం అవాస్తవం. తాడిపత్రి పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. తరచూ తనిఖీలు చేస్తుండటంతో అక్రమ రవాణా చాలావరకు తగ్గింది. ఇటీవలే కొన్ని ట్రాక్టర్లను పట్టుకుని రూ.2.50 లక్షల జరిమానా విధించాం. పెన్నా నదిలో గేట్లు పెట్టినట్లు మా దృష్టికి రాలేదు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.