Jump to content

Recommended Posts

Posted

Chandrababu: లోక్ సభలో గల్లా జయదేవ్, మిథున్ రెడ్డి మధ్య మాటల యుద్ధం 

18-09-2023 Mon 17:27 | Andhra
  • పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
  • చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్
  • చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడి 
  • రాజకీయ కక్షలు ఆపేందుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • గల్లా జయదేవ్ ఆరోపణలు ఖండించిన మిథున్ రెడ్డి
  • అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని స్పష్టీకరణ
 
War of words between Galla Jaydev and Mithun Reddy in Lok Sabha

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంపై లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. గల్లా జయదేవ్ ప్రసంగిస్తూ, తమ నేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోయిందని అన్నారు. 

చంద్రబాబు అనేక సంస్కరణలతో ప్రగతి సారథిగా నిలిచారని కొనియాడారు. ఐటీని విశేషంగా ప్రోత్సహించడం ద్వారా చంద్రబాబు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ కోసం చట్టాలను తుంగలో తొక్కిన తీరును ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువస్తున్నానని గల్లా జయదేవ్ వివరించారు. 

చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకు చవకబారు ఎత్తుగడలు వేశారని విమర్శించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపేలా ప్రధాని చర్యలు తీసుకోవాలని, చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు.

అయితే, గల్లా జయదేవ్ ఆరోపణలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో కుంభకోణం జరిగిందని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని, టీడీపీ అధినేత అరెస్టులో ఎలాంటి కక్ష సాధింపు లేదని వెల్లడించారు. గల్లా జయదేవ్ ఆరోపణలపై మరింత వివరణ ఇస్తానని మిథున్ రెడ్డి తెలిపారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నకిలీ జీవోల సాయంతో రూ.371 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో నగదు ఎక్కడికి వెళ్లిందో ఈడీ స్పష్టం చేసిందని, ఇంకేం ఆధారాలు కావాలని అన్నారు. పైగా, చంద్రబాబు పీఏ దేశం విడిచి పారిపోయారని మిథున్ రెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఉద్ఘాటించారు.

Posted

Ganta Srinivasa Rao: దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసమే పార్లమెంటు వద్ద నిరసన చేపట్టాం: గంటా 

18-09-2023 Mon 14:55 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
  • ఢిల్లీలో టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి పార్లమెంటు వద్ద లోకేశ్ ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న గంటా, కాల్వ శ్రీనివాసులు
 
Ganta said TDP has taken protest at Parliament to get nation wide attention on Chandrababu arrest

ఢిల్లీలో ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్ పై దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే పార్లమెంటు భవనం వద్ద ధర్నా చేపట్టామని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ రాక్షస క్రీడలో ఓ భాగమని విమర్శించారు. గతంలో చంద్రబాబుపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక విచారణలు జరిపారని, కానీ, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని అన్నారు. 

కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఏపీ పరిస్థితే అందుకు ఉదాహరణ అని అన్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్  చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, ఏపీలో జరుగుతున్న విధ్వంసక పాలనపై కేంద్రం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Posted

TDP MPs: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల ధర్నా 

18-09-2023 Mon 12:06 | Andhra
  • పార్టీ ఎంపీలతో కలిసి పాల్గొన్న నారా లోకేశ్
  • ప్లకార్డులతో గాంధీ విగ్రహం ముందు ఆందోళన
  • ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు
 
TDP MPs Dharna At Parliment Premises

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై సోమవారం పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ కు చేరుకుని ఎంపీలతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎంపీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాత్ముడి విగ్రహం ముందు పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తున్నారో దేశం మొత్తానికీ తెలియజెప్పేందుకే ఈ ధర్నా చేపట్టామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నట్లు ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.

Posted

Daggubati Purandeswari: చంద్రబాబు అరెస్ట్‌పై మరోసారి స్పందించిన పురందేశ్వరి 

18-09-2023 Mon 15:41 | Andhra
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరు అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్య
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను అధికారులు సందర్శించారా? అని నిలదీత
  • మద్య నిషేధమని చెప్పి ఇప్పుడు కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం
  • మహిళల పుస్తెలు తెంపి శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని విమర్శ
  • రూ.15కు తయారు చేసే మద్యం రూ.600 నుంచి రూ.800కు అమ్ముతున్నారని ఆరోపణ
 
Purandeswari question about liquor scam and Chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. కేసు విచారణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఒక్కటైనా అధికారులు సందర్శించారా? అని ప్రశ్నించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణను, అవసరమైన సౌకర్యాలను స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లుగా తమ పరిశీలనలో ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరును ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

మద్యం విక్రయంపై పురందేశ్వరి ఆగ్రహం

సీఎం జగన్ పైనా పురందేశ్వరి నిప్పులు చెరిగారు. మద్య నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ ఇప్పుడు మద్యాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి చాలా గొప్పగా చెప్పారని, ఇప్పుడు మహిళల పుస్తెలు తెంపి శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారన్నారు. మద్యం తయారీపై గుత్తాధిపత్యం ప్రభుత్వానిదేనని అన్నారు. మద్యం కంపెనీలు తయారు చేసిన మద్యంపై కొంత మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు సమర్పించుకోవాల్సి ఉంటోందన్నారు.

క్రిసిల్ అంచనాల ప్రకారం ఏపీలో 35 శాతం మంది మద్యం తాగుతారని, అలాగే కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 15 శాతం మద్యం తాగుతారని, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 80 లక్షల మంది మద్యం సేవిస్తున్నారని, దీని ప్రకారం రోజుకు వచ్చే ఆదాయం రూ.160 కోట్లు, నెలకు రూ.4,800 కోట్లు, ఏడాదికి 57,600 కోట్లుగా ఉంటోందన్నారు. కానీ బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.20వేల కోట్ల ఆదాయం మాత్రమే చూపిస్తున్నారని, మిగతా మొత్తం ఏమవుతుందని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిని బట్టి అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అర్థమవుతోందన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు కూడా అమ్ముతున్నారన్నారు.

రూ.15కే లీటర్ మద్యం తయారు చేసి రూ.600 నుంచి రూ.800కు అమ్ముతున్నారన్నారు. మద్యం విషయంలో వైసీపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రమాదకర రసాయనాలతో మద్యం తయారు చేస్తున్నారు. ఇదో పెద్ద కుంభకోణమని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. 2019లో మద్యంపై ఏపీకి వచ్చే ఆదాయం రూ.18వేల కోట్ల నుండి రూ.20వేల కోట్లు మాత్రమేనని, కానీ ఇప్పుడు రూ.32వేల కోట్లు వస్తోందన్నారు. ఓటు బ్యాంకు పదిలపరుచుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు.

Posted

Yanamala: పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారు: యనమల 

18-09-2023 Mon 13:46 | Andhra
  • జైలులో బంధించినా కార్యకర్తల బాగోగుల గురించి ఆలోచిస్తున్నారని వెల్లడి
  • ప్రభుత్వం వారిపై చాలా తప్పుడు కేసులు పెట్టిందని ఆవేదన చెందుతున్నారు
  • ఏసీ పెట్టించకుండా చంద్రబాబును వేధిస్తున్నారని మండిపడ్డ యనమల
 
yanamala ramakrishnudu press Meet

అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం జైలులో వేసినా పార్టీ కార్యకర్తలు, నాయకుల బాగోగుల కోసమే చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన యనమల.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విజనరీ నేత అని, తాను ఇబ్బంది పడుతున్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా పార్టీ కార్యకర్తల క్షేమం గురించి ఆరా తీశారని చెప్పారు. తనను చూడగానే పార్టీ కార్యకర్తలు, నాయకులపై ప్రభుత్వం చాలా తప్పుడు కేసులు పెట్టింది, కార్యకర్తలు ఎలా ఉన్నారని అడిగినట్లు పేర్కొన్నారు.

జాతీయ స్థాయి నేతను ప్రభుత్వం అమానుషంగా ట్రీట్ చేస్తోందని యనమల మండిపడ్డారు. అక్రమ కేసులతో జైలు పాలు చేసిన ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపునకు పాల్పడుతోందని విమర్శించారు. జైలుకు చేరుకున్న తొలి రోజుల్లో దోమల కారణంగా ఆయన ఇబ్బంది పడ్డా పట్టించుకోలేదని ఆరోపించారు. తాము ప్రశ్నించిన తర్వాతే జైలు అధికారులు ఆయనకు దోమ తెరతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పించారని యనమల వివరించారు. ఇప్పటికీ చంద్రబాబు ఉంటున్న సెల్ లో ఏసీ లేదని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను కోరినా సరిగా స్పందించలేదన్నారు.

భవిష్యత్ గురించి ఆలోచించే వ్యక్తి ఇప్పుడు జైలులో ఉండగా భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి నేడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని యనమల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏమైపోతుందోనని తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. తన అరెస్టుపై స్పందించిన రాష్ట్ర, జాతీయ నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేయాలని కోరారని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఖండించిన ప్రతీ ఒక్కరికీ ఆయన తరఫున మీడియా ముఖంగా ధన్యవాదాలు చెబుతున్నామని యనమల తెలిపారు. ప్రభుత్వం ఇకముందు కూడా కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించిన యనమల.. ఎన్ని కేసులు పెట్టి వేధించినా ప్రజల సంక్షేమం కోసం పార్టీ చేస్తున్న పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు. జైలు గదిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచించే గొప్ప నేత చంద్రబాబు అని యనమల వివరించారు.

Posted

Nara Bhuvaneswari: చంద్రబాబు ఆరోగ్యం కోసం నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు 

18-09-2023 Mon 13:15 | Andhra
  • రాజమండ్రిలో వినాయకుడి ఆలయానికి వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలీ
  • ఆమె వెంట బాలకృష్ణ సతీమణి వసుందర ఇతర కుటుంబ సభ్యులు
  • పూజలు పూర్తయ్యాక క్యాంప్ సైట్ కు తిరిగి వెళ్లిన నారా భువనేశ్వరి
 
Nara Bhuvaneswari special prayers in Rajamundri Temple

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాజమండ్రిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భువనేశ్వరి వెంట సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఉన్నారు.

ఆలయంలో పూజల అనంతరం వారు తిరిగి క్యాంప్ సైట్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలతో పాటు ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో భేటీ కోసం సెంట్రల్ జైలుకు వెళ్లారు. మిలాఖత్ లో ఈ ముగ్గురూ చంద్రబాబును కలుసుకుని మాట్లాడారు.

Posted

Nara Lokesh: కళ్లు ఉండీ చూడలేకపోతున్నారంటూ నారా బ్రాహ్మణి ట్వీట్ 

18-09-2023 Mon 12:20 | Andhra
  • చంద్రబాబు అరెస్టును ఖండించిన బ్రాహ్మణి
  • రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఫైర్
 
Nara Brahmani Tweet

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. కళ్లు ఉండి కూడా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను చూడలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, సీఐడీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు, ఆరోపణలను సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ నివృత్తి చేసేలా ఆదివారం పూర్తి వివరణ ఇచ్చారని బ్రాహ్మణి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని, వైసీపీ నేతల తీరు అసమర్థులని మండిపడ్డారు.

ఈమేరకు సోమవారం నారా బ్రాహ్మణి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు మల్టినేషనల్ కంపెనీలనూ వైసీపీ అపహాస్యం చేస్తోందని బ్రాహ్మణి విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు తీరును బ్రాహ్మణి తీవ్రంగా తప్పుబట్టారు.

Posted

Chandrababu: అమెరికా పార్లమెంటు ఎదుట చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శన 

18-09-2023 Mon 17:50 | Andhra
  • స్కిల్ కేసులో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
  • టీడీపీ అధినేతకు మద్దతుగా విదేశాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు
  • వాషింగ్టన్ డీసీలో ప్లకార్డులు చేతబూనిన ప్రవాసాంధ్రులు
 
Rally at US Parliament building in support for Chandrababu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్కిల్ కేసులో ఈ నెల 9న అరెస్టయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

కాగా, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదిస్తూ ప్రపంచ దేశాల్లో  తెలుగువారు గళమెత్తుతున్నారు. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి అనేక దేశాల్లో  ఆయనకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోనూ ప్రవాసాంధ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 'వాషింగ్టన్ డీసీ ఎన్నారై టీడీపీ' ఆధ్వర్యంలో అమెరికా పార్లమెంటు ఎదుట ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. 

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని పార్లమెంటు భవనం వద్దకు ఏపీ ఎన్నారైలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిలో పలువురు జనసేన మద్దతుదారులు కూడా ఉన్నారు. 'బాబుతో నేను' అనే ప్లకార్డులను ప్రదర్శించారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...