Jump to content

Recommended Posts

Posted

మొట్టమొదటి సెల్ ఫోన్ 1973 లో మోటోరోలా కంపెనీ కనిపెట్టినప్పటికీ 1995 వరకు కూడా అమెరికా వంటి అగ్రదేశాలలో కూడా సెల్ ఫోన్లు అంత ప్రాచుర్యం పొందలేదు. 1995 నుంచి అమెరికా మొదలు ప్రపంచవ్యాప్తంగా ఆ రంగంలో రివల్యూషన్ రావటానికి కారణం "నేను" కాదు, ఎవ్వరూ కాదు మారిన టెక్నాలజీ.

1జి - మొదటి జెనరేషన్ (మొదటి తరం) సెల్ ఫోన్ టెక్నాలజీ. 1980 లో వచ్చిన ఈ టెక్నాలజీలో సిగ్నల్స్ అనలాగ్ లో ఉంటాయి. అంటే మనం మాట్లాడిన మాటలు అనలాగ్ తరంగాలుగా మారి గమ్యం చేరతాయి అన్నమాట.

ఈ రంగాన్ని పూర్తిగా మార్చేసింది 1991 లో ఫిన్లాండ్ కంపెనీ "రేడియోలింజ" తెచ్చిన 2జి (రెండవ తరం) టెక్నాలజీ. దీనిలో అనలాగ్ బదులు డిజిటల్ సిగ్నల్స్ గా encrypt అవుతాయి. దీనివలన ధ్వని తరంగాలలో వేగం పెరగటంతో పాటు ఎక్కువ దూరం మరింత అక్యురేట్ గా చేరతాయి. సెక్యూరిటీ పెరుగుతుంది. దీనితో SMS టెక్స్ట్ మెసేజులు, డేటా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ 2జి టెక్నాలజీతో నోకియా ఫోన్లు తయారు చెయ్యటంతో సెల్ ఫోన్ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.

ఇండియాలో టెలికాం సర్వీసెస్ ని విస్తరించటానికి, ప్రజలందరికి చేరటానికి 1994 లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం "నేషనల్ టెలికం పాలసీ, 1994" ని తీసుకువచ్చింది. ఈ NTP, 1994 పాలసీ రాకముందు ప్రపంచం సగటు వందకి 10 అయితే, ఇండియాలో ప్రతి 105 మందికి ఒక ఫోన్ ఉండేది, దానిని సరి చెయ్యటమే కాకుండా 1997 కల్లా ప్రతి గ్రామంలో టెలిఫోన్ సర్వీసుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో విదేశీ కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టటానికి అనువుగా చేసిన చట్టం అది. దీనిలో భాగంగా ఏ ఒక్క కంపెనీకి గుత్తాధిపత్యం దక్కకూడదని 8 కంపెనీలకి లైసెన్స్ ఇచ్చారు. 1985 లో రాజీవ్ గాంధీ DoT అని మొదలుపెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి టెలికాం సెక్టార్ కి ఒక రూపు ఇస్తే, పదేళ్ల తర్వాత పి.వి. ప్రభుత్వం ప్రైవేటు రంగానికి, విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరవటంతో ఇండియాలో టెలికం సేవల విస్తరణ వేగం అందుకొంది.

2000 వ సంవత్సరంలో వాజపేయి ప్రభుత్వం ఈ రంగాన్ని మరింత విస్తరించటానికి ఈ పాలసికి మరిన్ని మార్పులు చేసింది. గతంలో ఉన్న విదేశీ పెట్టుబడుల్ని 49% నుంచి 74% నికి పెంచి, లైసెన్స్ ఫీజు భారీగా తగ్గించింది. దీనివలన కంపెనీల మీద భారం తగ్గి ప్రజలకు మరింత అందుబాటు ధరలకు ఫోను సర్వీసులు వచ్చాయి. అంతే కాదు, గతంలో వేలంలో ఎక్కువ ధరకు బిడ్ చేసినవారికి స్పెక్ట్రమ్ ఇస్తుంటే, దానిని మార్చి first come, first serve ఆధారంగా, వేలంలో వచ్చిన కంపెనీలలో బాగా పని చేస్తారని తాను నమ్మిన కంపెనీలకు ధరలతో సంబంధం లేకుండా స్పెక్ట్రమ్ ని కేటాయించవచ్చని 2001 లో చట్టం మార్చింది. 2జి లో స్కాము అంటూ జరిగి ఉంటే, దానికి మూలం ఈ చట్ట సవరణ.

2008 లో 2జి సర్వీసెస్ ని ప్రపంచ ప్రఖ్యాత కంపనీ "NM Rothschild & Sons" ఆధ్వర్యంలో ఈ-వేలం వెయ్యటం జరిగింది. ఇక్కడ కొత్త చట్టాలు చేసింది లేదు. 2001 లో వాజపేయి ప్రభుత్వం వేలం వెయ్యటానికి పెట్టిన రూల్స్ ప్రకారమే ఆక్షన్ వెయ్యటం జరిగింది.

అప్పటి కాగ్ లో టెలికాం విభాగం చూసే R.P.సింగ్ షుమారు 2,645 కోట్లు ప్రభుత్వానికి ఎక్కువ వచ్చేవేమో అని నివేదిక కాగ్ కి ఇస్తే దానిని అటు మార్చి ఇటు మార్చి ఆఖరకు చట్టాలను ఇలా మార్చి అలా చేసి ఉంటే అంటూ తన పరిధిలోకి రాని, వింత వాదనలతో దానిని వినోద్ రేయ్ 1,76,000 కోట్లు ఎక్కువ వచ్చేవని అని ఫైనల్ రిపోర్టులో పెట్టారు. ఆ నెంబర్ కి ఎలా వచ్చారు అనేదానికి ఈ రోజుకి సరైన సమాధానం లేదు. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేదేమో అన్న పదాన్ని పట్టుకొని రెండు లక్షల కోట్లు తినేశారని గత ఐదారేళ్ళగా అంటున్న వారెవరైనా ఆ నెంబర్ కి ఎలా వచ్చారో వివరిస్తే బాగుంటుంది. అసలు 2010 లో జరిగిన 3జి వేలంతో 2008 లో జరిగిన 2జి వేలాన్ని పోల్చటమే తప్పు.

తర్వాత సి.బి.ఐ తన విచారణలో 30,000 కోట్లు ఎక్కువ వచ్చేవని తేలిందని ఒక రిపోర్ట్ ఫైల్ చేసింది. అంటే కాగ్ చెప్పిన 1,76,000 కోట్ల అంకె తప్పని అది కేవలం 30,000 కోట్లని సి బి ఐ తేల్చింది. 2008 లో వేలంలో కొన్ని సెక్టార్స్ ని పొందిన కంపెనీలు తర్వాత తమ వాటాని వేరే కంపెనీలకు సెకండరీ మార్కెట్లో అమ్ముకున్న ధరల ఆధారంగా ఈ అంచనా వేశామని సి.బి.ఐ కోర్టుకి తెలిపింది. అంటే, ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ పొందిన ఎవరైనా ఒక కాంట్రాక్టర్, లైసెన్స్ పొందిన ఏదైనా కంపెనీ తర్వాత దాని వాటాని అమ్ముకుంటే, ప్రభుత్వమే అలా వాటాలు అమ్మవచ్చుగా అనే వాదన ఇది. ఇందులో పాయింట్ ఉందని నేనైతే అనుకోను. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా?

అప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం (9,200 కోట్లు) 2010 లో 3జి సర్వీసెస్ ఆక్షన్ వేసినప్పుడు వచ్చిన ఆదాయం (షుమారు 15,000 కోట్లు) చాలా తక్కువని 2010 నవంబర్ లో వినోద్ రాయ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొంతమంది కోర్టులో పిల్ వెయ్యటంతో 2012 లో సుప్రీమ్ కోర్టు 2008 లో ఇచ్చిన 122 లైసెన్సులను రద్దు చేసింది. వేలంలో తప్పు లేదు కానీ, వేలంలో పాల్గోవటానికి గడువు చట్టంలో ఉండాల్సిన దానికంటే తగ్గించారు కాబట్టి, ఇది కేవలం కొన్ని కంపెనీలకు (545 కంపెనీలు పాల్గొన్నాయి, వాటిలో 122 మందికి లైసెన్స్ ఇవ్వటం జరిగింది) లాభం కలిగించటానికి చేసిన చర్యగా భావించింది. వారు చెప్పిన ప్రకారం మళ్ళీ జరిగిన వేలంలో ప్రభుత్వానికి గతం కన్నా తక్కువగా షుమారు 6000 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎప్పుడైతే మొత్తం టెండర్లు రద్దు చేసి మళ్ళీ వేలం వేసారో, అక్కడితోనే ఈ కేసులో అధికభాగం పూర్తయినట్లే. ఇక మిగిలింది ఆ 122 కంపెనీలలో ఒక కంపెనీ అప్పటి టెలికం మంత్రి పార్టీకి సంబందించిన టి వి కంపెనీలో 200 కోట్లు పెట్టుబడి పెట్టింది కాబట్టి అది క్విడ్ ప్రో కో కేసు కింద విచారణ.

జరిగిన వేలం చట్ట ప్రకారం జరిగిందా లేదా అంతవరకే పరిమితమవ్వాల్సిన కేసులు, వేలంలో గెలిచిన కంపెనీలు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఇది ఆ రోజు వేలంలో గెలవటం వల్లే అని అందర్నీ కోర్టుకీడ్చారు. కానీ, చివరకు ఈ కంపెనీల పెట్టుబడులకు, వేలంలో వారు పొందిన లైసెన్సులకు సంబంధం ఉందని నిరూపించలేకపోవటంతో కేసు కొట్టేశారు.

సి బి ఐ జడ్జ్ O.P.Saini, "నేను గత 7 ఏళ్లగా ఎవరో ఒకరు వచ్చి సాక్ష్యం ఇస్తారని వేసవి సెలవులు కూడా తీసుకోకుండా ఎదురు చూస్తూ గడిపాను, పేపర్లలో ప్రకటనలు తప్ప ఎవ్వరూ కోర్టు ముందు సాక్ష్యాలు ఇవ్వలేదు. ఇది కేవలం పుకార్లు, అపోహలు, ఊహాగానాల ఆధారంగా వేసిన కేసుగా భావిస్తున్నాను. ప్రజల ఆలోచనల్లో వాటికి తావుంటుందేమో కానీ, కోర్టుల్లో వాటికి తావులేదు" అంటూ కేసు కొట్టివేశారు.

ఇదీ స్థూలంగా 2జి కధ, ఇక్కడ చట్టబద్ధ అవినీతి జరిగిందా అంటే జరిగింది అని కోర్టు కొట్టేశాక కూడా వాదించటం అనవసరం. ఇక నైతికంగా చట్ట పరిధిలోకి రాకుండా అవినీతి జరిగిందా అంటే జరిగే ఉండవచ్చు. ఎందుకంటే వేల కోట్ల కాంట్రక్టులు ఇస్తున్నప్పుడు రాజకీయనాయకుడు ఏదో ఒక లాభం చూసుకోకుండా ఉంటాడా అన్న సంశయం అది. అది అన్ని రాజకీయ పార్టీలకు, అందరి నాయకులకు, ప్రతి పనిలోనూ వర్తిస్తుంది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...