Jump to content

Recommended Posts

Posted

Chandrababu Naidu: నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు

10-09-2025 Wed 18:38 | Andhra
Chandrababu Naidu and Pawan Kalyan share same goal of state reconstruction
  • మనం పాలకులు కాదు, ప్రజలకు సేవకులం
  • సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్
  • అహంకారం, అవినీతి, అలసత్వం దరికి రానివ్వొద్దు
  • నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే
  • రాష్ట్రానికి ప్రధాని మోదీ అన్ని విధాలా అండగా ఉన్నారు
  • సంక్షేమం, అభివృద్ధి రెండూ సూపర్ హిట్ చేస్తాం
  • 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' సభలో చంద్రబాబు
"మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దర్జాలు, ఆర్భాటాలు ప్రదర్శించడం కుదరదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అహంకారం, అవినీతి, అలసత్వం వంటివి దరిచేరనివ్వొద్దని గట్టిగా సూచించారు.

బుధవారం అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' సభలో ఆయన మాట్లాడుతూ, తన ఆలోచన, మిత్రపక్ష నేత పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటేనని, రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రజలకు న్యాయం చేయడమే తమ ఏకైక ధ్యేయమని స్పష్టం చేశారు. "మాకు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం" అని ఆయన అన్నారు. ఒక ఎమ్మెల్యే, కార్యకర్త లేదా అధికారి తప్పు చేసినా, ఆ చెడ్డపేరు ప్రభుత్వానికే వస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రానికి మంచి చేయాలనే తమ సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ సహకారానికి ప్రధానమంత్రి మోదీకి ఆయన వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. మూడు పార్టీల కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలన అందిస్తామని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఐకమత్యంతో కలిసికట్టుగా ఉంటేనే బలం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

పేదరికం లేని సమాజం కోసం తన శక్తిమేర శ్రమిస్తానని, 'హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్' సాధనే తన లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సూపర్ హిట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. "వైకుంఠపాళి ఆట వద్దు. నిరంతర పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.

తాను 47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు అన్నారు. రామరాజ్యం లాంటి పాలన ఇచ్చే బాధ్యత తనది, పవన్ కల్యాణ్‌ది అన్నారు. ప్రజల కోసం పని చేస్తున్నామని, అన్నీ చేస్తామని, సహకారం కావాలని కోరారు. కలిసి పోటీ చేశాం.. కలిసి గెలిచాం.. కలిసి పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతోని అన్నారు.
Posted

Chandrababu Naidu: 'రప్పా రప్పా' అంటే.. ఇక్కడ ఉన్నది ఎన్సీబీ, పవన్ కల్యాణ్: చంద్రబాబు

10-09-2025 Wed 17:35 | Andhra
Chandrababu Naidu Slams YSRCP Rappa Rappa Tactics
  • అనంతపురం సభలో మాజీ సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
  • 'రప్పా రప్పా' అంటూ రంకెలేస్తే చూస్తూ ఊరుకోబోమని ఘాటు హెచ్చరిక
  • రాష్ట్రంలో హింసా రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
''గతంలో సిద్ధం.. సిద్ధం.. అన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?'' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్‌కు సూటిగా సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతోందని, అందుకే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి రాకుండా 'రప్పా.. రప్పా..' అంటూ బయట రంకెలేస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడరని... ఇక్కడున్నది ఎన్సీబీ, పవన్ కల్యాణ్ అని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో హింసా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ''గుర్తుంచుకోండి.. ఇక్కడ ఉన్నది నేను, పవన్ కల్యాణ్. హింసను ప్రేరేపించేవారు ఎక్కడున్నా వదిలిపెట్టం'' అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, తాము కాదని హితవు పలికారు. వైసీపీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఒంటిమిట్ట, పులివెందులలోనే ప్రజలు వైసీపీ బెండు తీశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

మెడికల్ కాలేజీల అంశంపై జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ''అసలు మెడికల్ కాలేజీ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి వాటి గురించి మాట్లాడుతున్నారు. కేవలం భూమి కేటాయించి, పునాది రాయి వేయగానే అది మెడికల్ కాలేజీ అయిపోదు'' అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి వదిలేస్తే, వాటిలో ఒక్కటి మాత్రమే పూర్తయిందని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చకు వస్తే ఎవరేం చేశారో ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు.
Posted

Chandrababu Naidu: అనంతపురం సభ... జగన్ పై చంద్రబాబు సెటైర్లు... కూటమి ఐక్యంగా ఉంటుందన్న పవన్

10-09-2025 Wed 17:09 | Andhra
Chandrababu Naidu Slams Jagan at Anantapur Meeting
  • అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ
  • 15 నెలల్లోనే హామీలు నెరవేర్చామన్న చంద్రబాబు
  • మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు అంటూ జగన్ పై సెటైర్లు
  • ప్రజా శ్రేయస్సు కోసం ఐక్యంగా పని చేస్తామన్న పవన్
  • రాయలసీమ రతనాలసీమగా మారతోందన్న పరిటాల సునీత
తాము నిర్వహించింది రాజకీయ సభ కాదని, 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలను మార్చే ప్రభుత్వమని, సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, అదొక బాధ్యత అని అన్నారు.

గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, పెట్టుబడులను తరిమేసిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని తెలిపారు. "నాడు పెన్షన్ల పెంపు అసాధ్యమన్నారు, తల్లికి వందనం పథకాన్ని ట్రోల్ చేశారు, ఉచిత బస్సు ప్రయాణం అసాధ్యమని హేళన చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సుసాధ్యం చేసి చూపించింది" అని ఆయన గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం, అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి అన్నారు. "ప్రధాని మోదీ దసరాకు కానుక ఇస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. ధరలను తగ్గిస్తున్నారు. పన్నులను తగ్గించడం వంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అభినందించాలి. యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చాం. దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయి" అని చెప్పారు.

"మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు... నేనేదో పొడిచేశానని మాట్లాడుతున్నాడు" అంటూ జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. భూమి ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీ అయిపోదని... రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. ఫౌండేషన్ వేసి, రిబ్బన్ కట్  చేసి, ఏదో చేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రండి... మెడికల్ కాలేజీలపై చర్చిద్దామని సవాల్ విసిరారు.

ఇదే సమయంలో, నేపాల్‌లో ఆందోళనల కారణంగా చిక్కుకుపోయిన 200 మంది తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి నారా లోకేశ్ కు అప్పగించినట్లు సీఎం వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

కూటమి ఐక్యంగా పనిచేస్తుంది: పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందని అన్నారు. రాయలసీమలో కరవును పారదోలి అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తుచేశారు. రాయలసీమకు 200 టీఎంసీల నీటి హామీని త్వరలోనే అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతన్నలకు భరోసా లభించిందని, ‘అన్నదాత సుఖీభవ’ కింద తొలి విడత సాయం అందించామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకాలతో మహిళలకు అండగా నిలిచారని, చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ 'రతనాల సీమ'గా మారుతోందని ఆమె అన్నారు.
Posted

 

Chandrababu Naidu: ధృతరాష్ట్ర కౌగిలి నుంచి 2024లో విముక్తి లభించింది: వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు

10-09-2025 Wed 18:48 | Andhra
Chandrababu Naidu Slams YSRCP Rule Calls it Dhritarashtra Embrace
  • రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • గత వైసీపీ పాలనను ధృతరాష్ట్ర కౌగిలితో పోల్చిన ముఖ్యమంత్రి
  • 100 రోజుల పాలనలోనే కుప్పానికి కృష్ణా జలాలను అందించామని వెల్లడి
  • సీమలో డిఫెన్స్, సెమీ కండక్టర్, ఏరోస్పేస్ వంటి భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక
  • ఎన్నికల్లో 45 సీట్లు గెలిపించి ప్రజలు తమపై నమ్మకం ఉంచారని వ్యాఖ్య
  • ఎవరు అడ్డుపడినా రాయలసీమ అభివృద్ధి ఆగదని స్పష్టం
రాయలసీమను 'రాళ్ల సీమ' నుంచి 'రతనాల సీమ'గా మార్చి, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' సభలో ఆయన మాట్లాడుతూ, సీమ అభివృద్ధికి తమ వద్ద స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉందని, దానిని అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వారి పాలనను 'ధృతరాష్ట్ర కౌగిలి'గా అభివర్ణించిన ఆయన, ఆ కౌగిలిలో చిక్కుకున్న ప్రజలకు 2024 ఎన్నికల్లో విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ.3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకువచ్చి, గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని పనిని చేసి చూపించామని తెలిపారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ సీమలోని అన్ని చెరువులను నింపుతున్నామని వివరించారు.

రాయలసీమ అభివృద్ధి ప్రణాళికను వివరిస్తూ, ఈ ప్రాంతంలో డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి భారీ పరిశ్రమలను స్థాపించనున్నట్లు ప్రకటించారు. సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే లైన్ల నిర్మాణంతో సీమ రూపురేఖలు మారుస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే రాయలసీమ అభివృద్ధికి పాటుపడిందని, ఎన్టీఆర్ హయాంలోనే హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను 45 చోట్ల కూటమిని గెలిపించి ప్రజలు తమపై అపారమైన నమ్మకం ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, భవిష్యత్తులో 52కి 52 స్థానాలు గెలిచేలా పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాయలసీమ అభివృద్ధి ఆగదని, ఇది తన హామీ అని ఆయన స్పష్టం చేశారు.

ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. వైసీపీ క్రమంగా ఉనికిని కోల్పోతోందని అన్నారు. పార్టీ కార్యాలయాలు మూసుకొని సామాజిక మాధ్యమ కార్యాలయాలు తెరిచారని ఎద్దేవా చేశారు. రఫా రఫా అంటూ రంకెలు వేస్తున్నారని.. అలా అంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రతిపక్ష హోదా అడుగుతోందని, కానీ ఆ హోదా ఇచ్చేది ప్రజలు అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక్కడ ఉన్నది సీబీఎన్ అని, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడితే 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని ఆయన అన్నారు.

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...