Undilaemanchikalam Posted 2 hours ago Report Posted 2 hours ago పాపం.. ప్రొడ్యూసర్లు..! ఫేక్ మెట్ల మీద ఎక్కే శిఖరాలు, గాలి బుడగల మీద చేసే సవారీలు సినిమా ఇండస్ట్రీలో చాలా మామూలు అయిపోయాయి. భారం మాత్రం నిర్మాతకే పడుతుంటుంది. Greatandhra ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ అంతర్జాతీయ సంచలనాలే! అన్నీ పాన్ వరల్డ్ సినిమాలే..! ‘థింక్ బిగ్’ అనే జీవన వేదాన్ని అబ్దుల్ కలాం లాంటి పెద్దలు ఏ ఉద్దేశంతో మనకు ప్రబోధించారో గానీ.. సినిమా మేకర్స్ అందరూ ఊహల్లో కూడా దిమ్మతిరిగేంత ‘బిగ్’ రేంజిలో ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా మెట్లు ఎక్కుతూ శిఖరాల మీదికి వెళ్లాలి.. నిజమే. కానీ.. తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్నది ఏంటంటే.. హీరోలు, డైరక్టర్లు మెట్లు ఎక్కి శిఖరాలు చేరడానికి.. నిర్మాతలను మెట్లుగా మార్చేస్తున్నారు. ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘పాపం.. ప్రొడ్యూసర్లు’! ‘బ్యాలెన్స్’ ఎవ్వరైనా సరే ఎదిగే క్రమంలో ఈ పదం చాలా ముఖ్యం. బ్యాలెన్స్ తప్పితే అడుగు తడబడుతుంది. కింద పడిపోవచ్చు. గాయపడవచ్చు. బ్యాలెన్స్ పాటిస్తూ.. తడబాటు లేకుండా స్థిరంగా ఎదగడం అనేది చాలా ముఖ్యం. సినిమాల మేకింగ్ పరంగా కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. బ్యాలెన్స్‌డ్ గా సినిమాలు చేసే కల్చర్ ఇదివరలో ఉండేది. హీరోలు ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తే.. ఆ వెంటనే కంటెంట్ ప్రధానమైన ఒక లోబడ్జెట్ సినిమా తీసేవారు. దీనివలన బ్యాలెన్స్ మెయింటైన్ అయ్యేది. ఒక భారీ బడ్జెట్ చిత్రం విజయవంతం అయిన తర్వాత.. ప్రేక్షకులు అభిమానుల్లో.. ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. పద్ధతీ పాడూ లేకుండా పెరిగిపోయే ఇలాంటి అంచనాలే సినిమాను ముంచేస్తుంటాయి. అందువల్ల.. భారీ హిట్ తర్వాత పెరిగే అంచనాలను కొంచెం కిందికి దించడానికి ఒక సరదా, లో బడ్జెట్ సినిమా తీయడం అనేది ఒక సూత్రంగా గతంలో ఉండేది. ప్రధానంగా హీరోలకు, దర్శకులకు ఇది వర్తిస్తుంది. పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్ ల తర్వాత స్వయంకృషి, మాస్ మసాలా సినిమాలు వరుసపెట్టి తీస్తుండగా మధ్యలో ఆరాధన, రుద్రవీణ వంటి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కు ఇలాంటి రిలీఫ్ ఇచ్చిన సినిమాలే. దర్శకుడు రాజమౌళి కూడా ఇదివరలో ఈ సూత్రం పాటిస్తుండేవారు. సింహాద్రి తర్వాత చిన్న హీరోలతో సై తీసినా.. ఛత్రతపతి తర్వాత అంచనాలు భారీగా మారకుండా రవితేజతో విక్రమార్కుడు తీసినా.. యమదొంగ, మగధీర లాంటి భారీ సినిమాల తర్వాత మర్యాదరామన్న, ఈగ తీసినా.. అదంతా కూడా ఈ బ్యాలెన్స్ పాటించే ప్రయత్నాల్లో భాగాలే. కానీ ఆ జాగ్రత్తను ఇప్పుడు అందరూ మరచిపోతున్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమాకు కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెంచేసుకుంటూ ఒక బుడగలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ బుడగ ఎప్పుడు పేలిపోతుందో కూడా తెలియని పరిస్థితి. సినిమా సినిమాకు ఓ వంద కోట్లు పెంచేసుకుంటూ పోతున్నారిప్పుడు. అంతకంటె టూమచ్ ఏంటంటే.. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేదు. సినిమా ఫ్లాప్ అయినా కూడా.. ఆ తర్వాతి సినిమాకు మరింతగా బడ్జెట్ పెంచేయడం అనేది నిత్యకృత్యంగా మారుతోంది. హీరోల మధ్య, దర్శకుల మధ్య అనివార్యమైన, అనుచితమైన అతి దరిద్రమైన పోటీ ఏర్పడుతోంది. ఒకిరిని మించి మరొకరు చేయాలని అనుకుంటున్నారు. పోటీ తత్వం అంటే అదే కదా.. స్పర్ధయా వర్ధతే విద్యా అన్నట్టుగా అలాంటి పోటీతత్వం ఉంటేనే కదా.. మంచి సినిమాలు వస్తాయి.. అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ.. ఒకరిని మించి మరొకరు తీయాలనుకోవడం- ‘మంచిసినిమా’ అనే డెఫినిషన్ ప్రకారం కాదు. ‘భారీ సినిమా’ అనే డెఫినిషన్ ప్రకారం మాత్రమే. అదే అత్యంత ప్రమాదకరమైన పోకడగా మారుతోంది. ఈ పోటీ హీరోలకు, దర్శకులకు మాత్రమే. హీరోలు- దర్శకులు ఒక రకమైన సిండికేట్లుగా తయారవుతున్నారు. ఇద్దరూ కలిసి.. ఒక బకరాను వెతికి పట్టుకుంటారు. నిజానికి ఆ హీరోల డేట్ల కోసం, ఆ దర్శకులతో సినిమా చేయడం కోసం తపించిపోతూ అనేక బకరాలు కొన్నేళ్లుగా వెంపర్లాడుతూ వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాంటి అనేకానేక బకరాల్లో ఒక బకరాను ఎంచుకుంటారు. తమతో సినిమా చేసే మహదవకాశాన్ని సదరు ప్రొడ్యూసర్ కు ప్రసాదిస్తారు. అక్కడినుంచి డ్రామా షురూ అవుతుంది. వీరిద్దరూ మెట్లు ఎక్కడానికి కోట్లకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ.. ఆస్తులు తాకట్టు పెడుతూ, అమ్ముతూ, ఫైనాన్స్ లు తెస్తూ.. సదరు నిర్మాత సాంతం చితికిపోతాడు. అంతా పూర్తయిన తర్వాత.. ఆ సినిమా ఆడితే సంతోషం. ఏదో పెట్టిన డబ్బుకు కొంత మేరకు లాభాలైనా కళ్లజూడవచ్చు. కనీసం ఫైనాన్స్ లు ఇచ్చిన వాళ్లకి లోటులేకుండా వడ్డీలు కట్టేసి.. ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ బాక్సాఫీసు వద్ద ఏ కొంచెం తేడా కొట్టినా.. అప్పుడు అసలు సినిమా కనిపించేది నిర్మాతకు మాత్రమే. సర్వనాశనం అయిపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు మెట్లెక్కి పైపైకి పోవడానికి, శిథిలమైపోయేది నిర్మాత మాత్రమే. రెమ్యునరేషన్లు తీసుకుంటున్న వాళ్లందరూ బాగానే సేఫ్ జోన్ లో ఉండిపోతారు. కానీ నిర్మాత ఒక్కడే చితికిపోతాడు. సినిమా తేడా కొడితే.. తాము తీసుకునే రెమ్యునరేషన్లలో కొంత వెనక్కి తిరిగి ఇచ్చినట్టుగా, కొంత తగ్గించినట్టుగా ప్రచారం చేసుకుని హీరోలు, దర్శకులు ఉదారస్వభావులుగా, సౌహార్ద రూపులుగా, మహానుభావులుగా కీర్తి గడిస్తారు. అయితే.. తీసుకున్నది ఎంత.. తిరిగిచ్చినది ఎంత.. ఈలోగా నిర్మాత మునిగిపోయినది ఎంత అనే లెక్కలు మాత్రం ఎవ్వరూ చెప్పరు. గ్రాస్ ఇంత.. షేర్ ఇంత.. ఇన్ని వందల వేల కోట్లు మా సినిమా వసూలు చేసింది.. అంటూ అబద్ధపు లెక్కలు మాత్రం వల్లిస్తారు. అదే నిర్మాత మునిగిపోతున్నప్పుడు.. ఎంత మునిగిపోయిందీ ఎవ్వరూ గమనించరు.. చెప్పరు, ఆదుకోరు! ఫేక్ మెట్ల మీద ఎక్కే శిఖరాలు, గాలి బుడగల మీద చేసే సవారీలు సినిమా ఇండస్ట్రీలో చాలా మామూలు అయిపోయాయి. భారం మాత్రం నిర్మాతకే పడుతుంటుంది. ‘నేనింతే’ సినిమాలో నిర్మాతగా షాయాజీ షిండే పలికే డైలాగుల్లో చాలా సత్యాలు ఉంటాయి. చాలా కఠినంగా ఉండే వాస్తవాలు చాలా చెప్తారు. సెటైరికల్ గా చెప్పినా.. ‘టేబుల్ ప్రాఫిట్ అంటే అర్థం.. సినిమా ఆఫీసులో టేబుల్ మాత్రమే మిగిలింది’ అనే మాట కూడా సత్యమే. అలా చితికిపోతున్నవారు కూడా ఉన్నారు. అఖండ ఒక తాజా ఎగ్జాంపుల్ కదా.. నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ 1, 2, రూలర్ లాంటి ఘోరమైన ఫ్లాప్ ల తర్వాత అఖండ వచ్చింది. హిట్ అయింది. 133 కోట్ల గ్రాస్, 75 కోట్ల పైగా షేర్ అన్నారు. తర్వాత అడుగుల్లో ఎక్కడా బ్యాలెన్స్ అనే వ్యూహాన్ని ఎవ్వరూ అనుసరించలేదు. భారీ సినిమాలే చేశారు. మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయినా సరే.. అఖండ 2 ను ఇంచుమించుగా రెండువందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ప్రతి సినిమాలో హీరోను మించి తన ఎలివేషన్ కు తపన పడుతూ ఉండే బోయపాటి కెరీర్ లో అతి భారీ బడ్జెట్ మూవీగా ఈ అఖండ 2 ముద్రపడింది. తీరా ఏమైంది? మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు పడాల్సి ఉండగా… ఎక్కడెక్కడినుంచే బాలయ్య అభిమానులు ప్రీమియర్ షోల కోసం తరలివచ్చేసిన తర్వాత సినిమా విడుదల వాయిదా పడింది. ఫైనాన్సియర్లకు డబ్బు చెల్లించకపోవడం వల్లనే సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య కూడా తన రెమ్యునరేషన్ కొంత తగ్గించుకుని వెనక్కు ఇవ్వదలచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ.. చూడబోతే.. ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు గట్టున పడేయలేనంత పెద్ద సంక్షోభంలో అఖండ 2 ఉన్నట్టుగా కనిపిస్తోంది. పైన చెప్పుకున్న సిద్ధాంతానికి, అతికి ఈ సినిమా అత్యంత తాజా ఉదాహరణ. బొడ్డూడని పిలగాళ్లు కూడా.. ఒక ఉదాహరణ చూద్దాం. ఓ కుర్రాడు నగరానికి వచ్చాడు. అతడేమీ.. సినిమా వ్యామోహం, వ్యక్తుల ప్రాతినిధ్యం భారీగా ఉండే గోదావరి జిల్లాలకు చెందిన వాడు కూడా కాదు. కడప జిల్లాకు చెందిన వాడు. అతని తల్లి ఒక కుగ్రామంలో వితంతువు అయిన వ్యవసాయ కూలీ. అతి కష్టమ్మీద కొడుకును ఇంజినీరింగ్ చదివించింది. అతడు మాత్రం ఇంజినీరింగ్ పూర్తి కాగానే సినిమాలు చేయడానికి హైదరాబాదు వచ్చాడు. అప్పటిదాకా అతనికి తమ పల్లెకు సమీపంలో ఉన్న టవున్లో సినిమాలు చూడడం తప్ప.. ఇండస్ట్రీ గురించి ఎలాంటి పరిచయం, పనిలో అనుభవం లేవు. దర్శకుడు కావాలనే కోరిక మాత్రం ఉంది. లక్కీగా ఒకరిద్దరు నిర్మాతలను కలిసే అవకాశం కూడా దొరికింది. సాధారణంగా ఈ అవకాశం కూడా కొన్ని వందల మందికి కూడా దొరకదు. ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడా? కథ చెప్పాడు. నిర్మాతకు ఓ మోస్తరుగా నచ్చింది కూడా. కానీ కుర్రాడు తనే డైరక్షన్ చేస్తానంటాడు. నిజానికి అది కూడా సమస్య కాదు. ఎందుకంటే.. ఏదో డైరక్షన్ అవకాశం ఇచ్చేసినా.. అతడికంటె సమర్థులైన టీమ్ ను ఏర్పాటుచేస్తే నడిచిపోతుంది. కానీ.. నిర్మాత భయపడడానికి అసలు కారణం వేరే. ఆ సినిమా బడ్జెట్ యాభై కోట్లు! ఒక బొడ్డూడని కుర్రవాడు, దర్శకుడు అయిపోతానని కలలు కంటూ.. మెగాఫోన్ జ్ఞానం కూడా లేకుండా యాభై వంద కోట్ల బడ్జెట్ ‘తనను నమ్మి’ పెట్టాలని అంటే నిర్మాత భయపడడం సహజమే కదా. ఇంతకీ చెప్పొచ్చేదంటంటే.. కొత్తగా అడుగుపెట్టాలని అనుకుంటున్న ఏ ఒక్కరూ కూడా.. ఒకటిరెండు- నాలుగైదు కోట్ల బడ్జెట్ కథలు తయారు చేయడం లేదు. గ్రాఫిక్స్ లేకుండా ఎవ్వరూ కథల్ని ఊహించడం లేదు. యాభై వంద కోట్ల మార్కు దగ్గరే ఆగిపోతున్నారు. ఇలా తయారు కావడానికి తెలుగులో కేవలం భారీ చిత్రాలు మాత్రమే తయారు అవుతుండడం పెద్దకారణం. పైగా ఆ భారీ చిత్రాలలో చాలా వరకు నిర్మాతల్ని డమ్మీలుగా మార్చేసి ఆడిస్తున్నవే. నిర్మాతల కష్టాలు.. కొన్ని ఏళ్ల కిందట ఉదాహరణ ఇది. వందల కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా రూపొందుతోంది. అప్పటికే ఏడాదిన్నరకు పైగా షూటింగ్ అయింది. ఎప్పటికి పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆ పరిస్థితుల్లో ఓ సందర్భంలో నిర్మాతకు సినిమా జర్నలిస్టు తారసపడ్డాడు. ‘ఏంటి సార్ అప్డేట్.. ఎప్పటికి వస్తుంది సినిమా’ అని అడిగాడు. ఆ నిర్మాత గాల్లోకి చేతులు జోడించి.. ‘ఏమోసార్.. ఇంత డబ్బు కావాలి- అంటారు. నేను ఏర్పాటు చేయాలి అంతే.. మిగిలిన విషయాలన్నీ దర్శకుడే చూసుకుంటున్నారు.. నాకేమీ తెలియదు సార్’ అని జవాబిచ్చాడు. ఇది జోకు కాదు- వాస్తవమే. నిర్మాతను డబ్బులు సప్లయి చేసే క్యాషియర్ గా మార్చేస్తున్న ఇండస్ట్రీ ప్రస్తుతం వర్ధిల్లుతోంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. సినిమాలు తీయడంలో ప్రొఫెషనల్ ఎప్రోచ్ కు పేరుమోసిన ఒక నిర్మాత వద్దకు ఒకటి రెండు చిన్న సినిమాలు చేసిన దర్శకుడు వచ్చాడు. బడ్జెట్ మరీ భయపెట్టే స్థాయిలో ఏమీ లేదు. కానీ.. వేరే కండిషన్ ఉంది. సినిమా మేకింగ్ వ్యవహారాన్ని నిర్మాత- సదరు దర్శకుడికి ఒక ప్యాకేజీ కింద అప్పజెప్పాలట. అనగా.. కథ ఓకే అయిన తర్వాత సంభాషణలు, డైరక్షన్ డిపార్టుమెంట్, సంగీతం, కెమెరామెన్, పాటల రచయితలు, ఎడిటర్.. ఈ క్రాఫ్ట్ లు అన్నీ కూడా అతడికి ఒక ప్యాకేజీకింద ఇవ్వాలి. ఆ క్రాఫ్ట్ ల టెక్నీషియన్లని నిర్మాత సజెస్ట్ చేయడానికి లేదు. దర్శకుడు తనకి నచ్చిన వారిని తెచ్చుకుంటాడు. అందరికీ సంబంధించిన రెమ్యునరేషన్ ఒకటే ప్యాకేజీగా దర్శకుడికి ఇస్తే.. అతను తను పెట్టుకున్న వాళ్లకి తానే ఇచ్చుకుంటాడు.. ఇలాంటి ప్రపోజల్ తో వచ్చాడు. ఆ నిర్మాతకు ఒళ్లు మండింది. ‘నిర్మాతగా నేను డబ్బులన్నీ నీ చేతిలో పోసేసి.. నువ్వు ఎవడిని పెట్టుకుంటే వాడిని భరిస్తూ.. సినిమా మేకింగ్ లో ఇన్వాల్వ్ మెంట్ లేకుండా గోళ్లు గిల్లుకుంటూ కూచోవాలా..’ అని ఆగ్రహించి.. అంతకుమించిన స్థాయిలో బూతులు తిట్టి.. ఆ దర్శకుడిని పంపేశాడు. ఇది చాలాకాలం కిందటి సంగతి. కానీ.. ఇప్పుడు జరుగుతున్నది అదే. డబ్బు సంచులు దర్శకుడికి అప్పగించేసి, క్యాషియర్ లాగా మారిపోయి.. గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్న నిర్మాతలే తయారవుతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో.. కరోనా తర్వాత ఓటీటీ రేట్లు పెరిగాయి. అప్పుడు అందరూ కొండెక్కి కూర్చున్నారు. కాలక్రమంలో ఇప్పుడు ఓటీటీ రేట్లు తగ్గాయి. కొండదిగాలనే స్పృహ ఎవ్వరికీ లేదు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ భారీగా పెంచేసి.. అదో సరదా అనుకుంటున్నారు. క్వాలిటీలో రాజీపడ్డం లేదు అంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. వీఎఫ్ఎక్స్ అంటూ దర్శకుడికి కూడా అర్థంకాని బ్రహ్మపదార్థంతో ముడిపెడుతున్నారు. తక్కువ రోజుల్లో, గ్రాఫిక్స్ జోలికెళ్లకుండా తీసిని సినిమాలు బాక్సాఫీసు వద్ద గట్టెక్కుతున్నాయి. ఆర్భాటాల జోలికి వెళ్లినవి మునుగుతున్నాయి. కొత్త కొత్త ప్రొడ్యూసర్లు రకరకాల ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఒకటిరెండు సినిమాలు తీసి.. ఆ దెబ్బకు అదృశ్యం అయిపోతున్నారు. ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్లు ఇప్పుడున్న అవాంఛనీయ పరిస్థితుల్లో అసలు సినిమా జోలికే వెళ్లకుండా పరిణామాల పట్ల సైలెంట్ ప్రేక్షకుల్లా ఉంటున్నారు. అనేక దుర్మార్గపు పోకడలు, అనుచిత వ్యవహారాలు ఇండస్ట్రీని ఇవాళ్టి పతనావస్థకు చేరుస్తున్నాయి. ఇండస్ట్రీని కాపాడాలి.. అనే నినాదాలు తరచూ వింటూ ఉంటాం. ఇండస్ట్రీని కాపాడడం అంటే.. ముందుగా నిర్మాతను కాపాడుకోవడం అని గుర్తించాలి. నిర్మాత క్షేమంగా నవ్వుతూ ఉంటేనే.. ఇండస్ట్రీ బాగుంటుందని తెలుసుకోవాలి. నిర్మాతల్ని కరివేపాకులాగా.. తమ మెహర్బానీ కోసం, తమ కీర్తి కోసం, తమ సంపాదన కోంస.. తమ హంగూ ఆర్భాటాల కోసం వాడుకుని వదిలేయాలని అనుకుంటే.. ఆ దెబ్బ యావత్ పరిశ్రమనే ముంచుతుందని గ్రహించాలి. .. ఎల్. విజయలక్ష్మి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.